4, ఆగస్టు 2015, మంగళవారం

ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... !!

నేస్తం,
          నువ్వెలా ఉన్నావని అడగబోవడం లేదు కాని నా మనసేం ఆలోచిస్తోందో నీకు చెప్పాలని ఈ లేఖ....
అనగనగా ఓ చిన్నది పెద్దది కాని పాడి పంటలతో కళ కళలాడే పచ్చని పల్లె సీమ ఒకప్పుడు... చదువు గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆ ఊరిలో నూటికి 95మంది విద్యావంతులు అదీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు... ఓ ఏభై ఏళ్ళ నాడే అమెరికా వెళ్ళిన వాళ్ళు కొందరు, వైద్య వృత్తి చేపట్టి ఇప్పటికి తమ ఊరికి సేవలు అందిస్తున్న మంచి మనసున్న వారు మరికొందరు... ఎక్కువమంది పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాద్యాయ వృత్తిలో స్థిరపడి చక్కని సేవలు అందిస్తున్నారు..ఏ చిన్న తప్పు జరిగినా ఊరి పెద్దలు రామాలయం వద్ద తపొప్పుల విచారణ చేసి తప్పుకి శిక్ష వేసేవారు ... ఏది జరిగినా ఊరి లోపలే ఉండేది.. వర్గాలు వేరుగా ఉన్నా అవసరానికి అందరు ఒకటిగా నిలబడేవారు... అప్పట్లో మా ఊరు అంటే చాలా గర్వంగా ఉండేది మా అందరికి ... ఇది మా  చిన్నప్పటి మా ఊరు .... ఇక మా తరం మా తరువాతి  తరం విషయానికి వచ్చే సరికి ఊరిలో సగం ఇళ్ళు ఖాళీ... పోనీ ఉన్న వారు బావున్నారా అంటే చదువుల కోసం వలసలు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలి ఉన్న వారిలో నైతిక విలువలు తగ్గిపోయాయి... హంగులు ఆర్భాటాలు, అహంకారాలు పెరిగి పోయాయి... ఎవరికి వారికి నా పెత్తనం ఉండాలంటే నాది ఉండాలి అన్న పట్టింపు... చదువు విలువ తెలియని నిశానీల చేతుల్లో పడి... తాగుడు, జూదం, పతనమైన జీవితపు విలువలు ఈ రోజు ఆ ఊరిలో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతున్నాయి... ఇంట్లో పెళ్ళాం మాట వదిలేయండి కనీసం పిల్లల పుట్టినరోజులు గుర్తు ఉండవు కాని ఊరిలో వెధవల పుట్టినరోజులకి పుట్టినరోజు కేకులు, బిరియాని పార్టీలు, ఒక్కోడేమో సంవత్సరానికి రెండు మూడు పుట్టినరోజులు చేసుకుంటూ... మూడు బిరియానీలు ఆరు మందు  సీసాలుగా ఉంది ఇప్పుడు... ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... మా ఊరు ఒకప్పుడు చదువులకు పుట్టినిల్లు అని గర్వంగా చెప్పుకున్న మేము ఈ రోజు అదే ఊరు కూడు గుడ్డా ఇవ్వని పనికి మాలిన రాజకీయాలకు అడ్డాగా, ఎయిడ్స్ రోగులకు చిరునామాగా మారిందని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాము... చదువు విలువ తెలియని రోజుల్లోనే సరస్వతి కొలువున్న మా ఊరు ఈ రోజు ఇలా మారడానికి కారణం ఏమిటో...!!
ఓట్ల కోసం రైతు పేరు చెప్పుకుంటూ పల్లెల్లో పాద యాత్రలు చేయడం కాదు, ఏదో కంటి తుడుపు కోసం పల్లెలు దత్తత తీసుకుంటున్నాము అంటే సరి పోదు.. నెలవారీ కోటా సర్కారు ఇస్తోంది.. పెన్షన్లు ఇస్తోంది అని సరిపెట్టుకుంటే చాలదు.ంఉసలి ముతకా ఉంటారు వాళ్ళకి వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎలా వీలౌతుంది... అసలే ఇప్పుడు అంతా కంప్యూటరు మహిమ కదా ఆధునికీకరణ పేరుతో... తెలిసిన వారికి అందుబాటులో ఉంటే అందంగా ఉంటుంది.. తెలియని వారిని చేతి ముద్రలు పడలేదు, వేలి ముద్రలు పడలేదు అని రోజుల తరబడి మీ సర్కారీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటే అది సిగ్గు చేటు... రాజకీయ నాయకుల గెలుపు కోసం డబ్బు, మద్యం వాడకాల మూలంగానే చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి... నాయకులు తీయగా మాట్లాడి గెలిచిన తరువాత వారి స్వలాభాన్నే చూసుకుంటున్నారు తప్ప జనం ఏమై పోయినా వారికి లెక్క లేదు.. మళ్ళి ఐదు ఏళ్ళకు మనకు కనిపిస్తారు నాగలి పట్టి నేను రైతు కుటుంబంలో నుంచి వఛ్చిన వాడినే అని... మనకు డబ్బు, మందు కావాలి వారికి ఓటు కావాలి ... చరిత్ర ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది ఏళ్ళు గడిచినా మారని బతుకులతో....!!
చూసావా నేస్తం రోజులు ఎలా మారిపోతున్నాయో... జీవితపు విలువలు ఎంతగా దిగజారుతున్నాయో...!!
నీ నేస్తం...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner