15, ఆగస్టు 2015, శనివారం

నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

నేస్తం,
          నీకు తెలుసా.... ఈ రోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజట.. అసలు మనకంటూ ఓ స్వాతంత్ర్యం ఉంటే  కదా మన దేశానికి వచ్చేది... ఆనాడు తెల్లవాడు దేశాన్ని పాలించాడని వాడిని మన దేశం నుంచి వెళ్ళిపొమ్మని మన దేశాన్ని మనకు ఇమ్మని అడిగిన ఎందఱో మహా ధనుల త్యాగ ఫలితం ఈనాటి మన భారత దేశం... కాని వచ్చిన స్వతంత్ర్యాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ...
          ఎలా చూసుకున్నా ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందఱో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు... విశిష్టమైన మన మత గ్రందాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...
         విదేశీ మోజులో పడి వలసలు పోతున్న ఎందఱో... స్వదేశీ మేధావులను అణగదొక్కి విదేశ యంత్రాంగానికి  పట్టం కడుతున్న రోజులు... మన దేశం గుర్తించలేని మన మేధావుల తెలివితేటల్ని ఉపయోగించుకుంటున్న విదేశాలు... ఇవి అన్ని చూస్తూ కూడా మన బానిసత్వపు సంకెళ్ళు తొలగిపోయాయని నమ్ముదామా... మనమూ అందరిలానే మనకు రాని స్వాతంత్ర్యానికి స్వాతంత్ర్య శుభాకాంక్షలు చెప్పుకుందామా నలుగురితో పాటు నారాయణా అంటూ... నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner