4, జనవరి 2019, శుక్రవారం

గత పదేళ్లుగా నేను నా రాతలు...!!

          ఇదంతా చెప్పడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10వ పుట్టినరోజు. 2009 జనవరిలో అంతర్జాలంలో అక్షరాలతో మొదలైన నా రాతల గురించి, నా గురించి కొన్ని కబుర్లు.ఓపిక ఉంటే చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. సద్విమర్శలకు సదా స్వాగతం...
                      నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం లోనికి అడుగు పెట్టింది. 2009 జనవరి నుండి ఇప్పటి వరకు నేను రాసిన పోస్టులు 1700 పై చిలుకే. పోస్ట్ చేసినవి 1643.  బ్లాగు లోకంలో, ముఖ పుస్తకంలో నన్ను నా రాతలను పది సంవత్సరాలుగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

            ఈ మధ్యనే ఓ పేరున్న పత్రిక కోసం నా గురించి రాయమంటే రాసిచ్చాను ఇదంతా. వారి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది, నన్ను అడిగిన ఒకే మాట "ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని. " నేనేం చేయడం లేదని చెప్పాను. మరేం అడగలేదు ఫోన్ పెట్టేసారు. నన్ను రాయమని అడిగిన వారికీ నేను ముందే చెప్పాను, నాకు ఇష్టం ఉండదండి అని. ఇదే పత్రిక వారు మాదాల రంగారావు గారిని 4 గంటలు ఇంటర్వూ చేసి ఆ సమాచారమంతా ఇచ్చినా కూడా వేసుకోలేదు. తర్వాత ఆయన ఈ లోకాన్నే వదిలేసారు. మరి వీరి విలువలు ఏ లెక్క ప్రకారం నడుస్తున్నాయో చెప్పడం మనకు చేతకాదు.


                  మదిని తడిమే మౌనాలెన్నో_అక్షరాలకు ఆయువునిస్తూ..!!
                  అక్షరమే ఆటవిడుపు_అలుపెరుగని జీవితపు ఆటలో....!!
అంటూ అక్షర భావాలతో మనసు మాటలను, మౌన భావాలను, గతపు జ్ఞాపకాలను, గుండె చప్పుళ్లను అక్షరాలతో నింపడంలోనూ, రాహిత్యం నుండి సాహిత్యం జనిస్తుందన్న భావనలు నిజమని నా రాతలకు ఊపిరి పోసిన అక్షరంతో పాటు నాకు అతిశయం కాస్త ఎక్కువే. అమ్మలా అక్కున చేర్చుకున్న అక్షరం నాకిచ్చిన ఊరట, అందించిన అభిమానాలు వెల కట్టలేనివి. తిలక్ అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలైతే నా అక్షరాలు నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు అని నేననుకుంటున్నాను. మాటలు, మౌనాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు ఇలా అన్నింటితో పెనవేసుకున్న మనసాక్షరాలతో చెలిమిని పంచుకున్న భావనలే నా రాతలు. కవితలుగా, కథనాలుగా, వ్యాసాలుగా, పుస్తక సమీక్షలుగా, ఏక వాక్యాలుగా, మాలికలుగా ఇలా విభిన్న ప్రక్రియలలో నా మనసులోని భావాలను వెలువరిస్తూ అనారోగ్యంతో మగతలో పడున్న మెదడుని చేతనావస్థలోనికి తీసుకువచ్చే ప్రయత్నంలో నే సాగిస్తున్న మరణ యుద్ధమే ఈ అక్షర పోరాటం. నాలానే నా అక్షరాలకు అలుపు లేదు. శరీరానికి సాయమందించాల్సిన కణాలే హాని చేస్తుంటే వాటితో నిరంతరం పోరాడుతూ అక్షరాల ఆసరాతో అనునయాలను వెదుక్కుంటూ ఎందరి మనసులనో తడుముతున్న నా అక్షరాలంటే నాకూ అమితమైన ప్రేమే.
             అవరోధం అనేది ఒక మనిషి ఎదుగుదలకు అడ్డంకి కాదని, జీవితంలో గెలుపుకి సోపానమని నేననుకుంటాను. అన్ని సవ్యంగా సాగితే విజయం అందుకోవడం సులభమే. అపసవ్యాలు, అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కుంటూ అంపశయ్య వరకు వచ్చిన జీవితాన్ని అక్షరాలతో గెలవడం అనుకున్నంత సులభమేమి కాదు. ఎర్ర బస్ కూడా లేని ఓ చిన్న మారుమూల పల్లెటూరి నుంచి ఎయిర్ బస్ వరకు సాగిన నా జీవితంలో ఐదు తరాలను చూసిన అనుభవాలు ఇవి.
       నేను ఓ మధ్య తరగతి రైతు కుటుంబం నించి వచ్చిన అతి సామన్యురాలిని. మాది కృష్ణాజిల్లా లోని నరసింహాపురం అనే ఓ చిన్న పల్లెటూరు. పెరిగింది అమ్మమ్మ తాతయ్యల మధ్య అమ్మానాన్నలతో జయపురంలో, విజయనగరంలో కొన్ని రోజులు. తరువాత ఇంజనీరింగ్ చదువు రీత్యా కర్ణాటక లోని బళ్ళారిలో. ఉద్యోగ పరంగా మద్రాస్, అమెరికాలో కొన్ని సంవత్సరాలు. తరువాత కొన్ని రోజులు హైదరాబాద్ లో. ప్రస్తుతం విజయవాడలో నివాసం. 
               నాన్నకు గారాలపట్టిగా అందరికి ఇష్టురాలిగా అమ్మానాన్నలకు ఏకైక సంతానంగా అమ్మమ్మ తాతయ్యలతో, అల్లారుముద్దుగా సాగిన బాల్యం. అవనిగడ్డ శిశువిద్యామందిరంలో 6వ తరగతి వరకు చదువు, తరువాత విజయనగరం జొన్నవలస ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, తరువాత విజయనగరం మహారాజ మహిళా కళాశాలలో ఇంటరు, ఆ తరువాత బళ్లారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువు. మద్రాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అవనిగడ్డ పాలిటెక్నీక్ కాలేజ్ లో లెక్చరర్ గా, తరువాత అమెరికాలో ఏడున్నర్ర సంవత్సరాలు సాఫ్ట్ వేర్, ఇతర  ఉద్యోగాలు. మళ్ళీ స్వదేశానికి వచ్చాక హైదరాబాద్ లో ప్రాజెక్ట్, క్వాలిటీ మేనేజర్ గా పని చేసి, ఇంటి బాధ్యతలతో ఉద్యోగం మానేసి తరువాత కొంత కాలం మళ్ళీ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం అనారోగ్య కారణంగా మానేసిన నా గురించిన వివరాలు ఇవి.
                  చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా ఇష్టమైన అలవాటు. బహుశా నా రెండో తరగతి నుంచి పుస్తకాలు చదవడం అలవాటైందనుకుంటా. ఆ అలవాటే ఏ చిన్న సంఘటన జరిగినా అలాగే పుస్తకాల్లో రాయడం మొదలైంది. కనిపించిన ఏ పుస్తకం కాని, పేపర్ కాని వదలకుండా చదివేయడం, లైబ్రరికి వెళ్ళి అక్కడి పుస్తకాలూ వదలకుండా చదివేయడం ఆదో పెద్ద వ్యాపకమప్పుడు. నాన్నకు నాటక రచయితగా, నటునిగా ప్రవేశం ఉంది. అందుకేనేమో నాకు కాస్త ఈ సాహిత్యం వంటబట్టి ఉంటుంది. స్నేహితులు ఎక్కువగా ఉండటం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా మేము విజయనగరం వెళ్లినా నా చిన్నప్పటి స్నేహితులకు ఉత్తరాలు రాయడంతో మొదలైన నా రాతలు ఇప్పటికి ఇలా సాగుతూనే ఉన్నాయి. ఏదో పుస్తకాలు చదవడం, మనసుకు అనిపించింది రాయడం మాత్రమే తెలిసిన నాకు సాహిత్యపు లక్షణాలు కాని, మూలాలు కాని తెలియదు. రాసినదేది అచ్చులో చూసుకోవాలన్న కోరిక కూడా లేదు. అడపా దడపా పుస్తకాల్లో రాయడమే కాని ఏ పత్రికకు పంపలేదు. ఆహ్వానం అనే సాహితీ మాస పత్రికలో అచ్చులో చూసుకున్న నా మొదటి కవిత "మౌనం".
                  అమెరికా నుండి వచ్చేసాక 11 సంవత్సరాల క్రిందట పిల్లల చదువుకు సాయమందించడానికి ఏర్పడిన మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం బ్లాగు మొదలు పెట్టి, దానితోపాటుగా కబుర్లు కాకరకాయలు అన్న మరో బ్లాగులో నా రాతలు రాయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1600 పై చిలుకు పోస్ట్లు నా బ్లాగులో ఉన్నాయి. ముఖపుస్తకంలో ఎన్నో సమూహాల్లో కో అడ్మిన్ గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం నాకు తోచిన నాలుగు భావాలు పంచుకుంటున్నాను.
               నా రాతలన్నీ ఎక్కువగా ప్రతికూల పరిస్థితుల్లో రాసినవే. మా ఇంట్లో అమ్మా వాళ్లకు ఈ రాతలు రాయడం ఇష్టం ఉండేది కాదు. ఏ కాస్త సమయం దొరికినా ఎవరు చూడకుండా గబగబా రాసేయడం, హమ్మయ్య రాసేసాను అనుకోవడం.20 నిముషాలు  బ్రెయిన్ డెడ్ అయ్యి 3 గంటలు ఏమి తెలియని స్థితి నుంచి బయటపడి కూడా రాయడం మానలేదు. డాక్టర్ ఇంట్లో వాళ్ళకు తన సంతోషానికి తనని వదిలేయండి అని చెప్పాక, నా రాతలను ఇష్టపడుతున్న ఎందరినో చూసాక అప్పుడు నా రాతలకు అడ్డంకి లేకుండా పోయింది. పుస్తకాలు చదివి ఎవరైనా మారతారా అని అనుకుంటాం కానీ నా రాతలకు వచ్చే కొన్ని స్పందనలు ఎంత ఆనందాన్నిస్తాయో మాటల్లో చెప్పడం కష్టం. " మేము అనుకున్నది మీరు రాసారు, మా మనసులో భావాలు ఉన్నదున్నట్టుగా రాసారు", మీ భావాలు  చదివి మేము చాలా మారాము ఇలా ఎంతో మంది పెద్దలు, పిన్నలు చెప్తుంటే ఆ అందానికి కొలమానమేముంటుంది.
             అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు, చెదరని శి(థి)లాక్షరాలు అనే కవితా సంపుటాలు, గుప్పెడు గుండె సవ్వడులు అనే  కవితా సంపుటి నేను, నా నేస్తం వాణి కలిపి వేసిన కవితా సంపుటి.  సడిచేయని (అ)ముద్రితాక్షరాలు అన్న వ్యాస సంపుటి ఇప్పటి వరకు ముద్రితమైన నా పుస్తకాలు. మరో పుస్తకం అంతర్లోచనాలు వ్యాస సంపుటి . నా రాతలకు మెచ్చి  ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు కావ్యశ్రీ పురస్కారాన్ని, సుధీక్షణ్ ఫౌండేషన్ వారు ఉత్తమ కవయిత్రి పురస్కారం అందించారు. మరెన్నో ఆత్మీయ సత్కారాలు నా అక్షరాలకు దక్కాయి.
           నాన్నకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులనెదుర్కుని, అక్షరాల సాహచర్యంతో అలవికాని అనారోగ్యాన్ని(SLE) సైతం ఆటపట్టిస్తూ బతికేస్తున్న నేను అక్షరాల సాక్షిగా గెలిచాననే అనుకుంటున్నా. ఇదండీ ఇప్పటి వరకు నా రాతల ప్రస్థానం.

         

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Ramadevi చెప్పారు...

మీ పోస్ట్స్ బాగుంటాయి... ఏవి ఎంత బాగుంటాయి అని చెప్పలేను..కొందరికి కొన్ని చాలా ఇష్టం నాకు మీ చిన్న కవితల్లాగా....దేవుడు కొందరికి కొన్ని ఇస్తారండి...కొందరు మాత్రమే ఆలోచనలని వడిసిపట్టి ..అందమైన భావాలుగా అలవోకగా అందిచేవారు......వాళ్ళు అది ఎపుడు వదులుకోలేరు ..వదులుకుంటే వాళ్ళు అంటూ ఉండరు కూడా... మీ రాతలు మాకు ఆనందమే ..thanks for your post

చెప్పాలంటే...... చెప్పారు...

మన:పూర్వక ధన్యవాదాలండి మీ అభిమానానికి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner