26, మే 2025, సోమవారం

మనిషే చెట్టైతే..!!

 సమాజంలో మంచిని కాంక్షించే “మనిషే చెట్టైతే”..!


“విశ్వవ్యాప్తమైన ‘అమ్మకు’


  వీధి బ్రతుకు నెలవయింది!”

పాపగా పుట్టి బామ్మగా మారే క్రమంలో ఆడపిల్ల అవతారాలను, అవమానాలను చాలా చక్కగా చెప్పారు.

“ఆశలు కోకొల్లలు..

  ఆశయాలే-

  రాలే ఆకులు-“

జరుగుతున్న చరిత్రలో జారిపోతున్న విలువలను చెప్పిన కవిత “ఆశయాలే..?”

“కలం కదలిక..

 హృదయ చలనం-

 నాలోని రక్తంసిరా..

 కవిత్వ చిత్రాలు-!”

 కవి-చిత్రకారుడు నాణానికి ఒకో పార్శ్వం అంటూ కాలం ఆగినా తన కలం ఆగదని ఘంటాపథంగా చెప్పారు.

“అసలే..

  ప్రమాదాల వళ్ళో ప్రపంచం-

  అనుకున్నా..

  పిలవని అతిథి-!” ఉగాది అంటూ ఉగాది రాకను సరికొత్తగా చెప్పారు.

  “చెడుని ఆస్వాదించి మంచిని, మనిషికి ఆయువవుతుంది!” మంచిని మాత్రమే పంచే చెట్టు మనిషైతే ఎంత బావుండో అన్న ఆశతో ఈ కవితా సంపుటికి “ మనిషే చెట్టైతే” అన్న పేరు సబబుగా వుంది.

అమ్మానాన్నకు లెక్కలు తెలియవంటూ తనకూ లెక్కలు తెలియలేదని, ఎన్ని తప్పులు దిద్దినా ఇంకా లెక్కలు రావడం లేదంటూ చెప్తూ

” లెక్కలు తప్పినప్పుడే కదా

   మనిషి చచ్చిపోయేది

   మనసు లేని 

   ఒక మాంసం ముద్దలుగా  

   మిగిలిపోయేది!”

బాధ్యతల బంధాల గురించి చాలా గొప్పగా “లెక్క(కు)లు రానివాళ్ళు” కవితలో చెప్పారు.

“వలసపక్షి”, “అలుపెరగని ప్రయాణం” కవితలు చాలా బావున్నాయి. 

        తన జ్ఞాపకాలను, మనసు భావాలను, దేశభక్తిని, సమాజ స్థితిగతులను, తాతయ్య జ్ఞాపకాలను, ఊరిని, విశ్వశాంతిని, పోలీసులను, కాలాన్ని ఇలా అన్నింటి గురించిన ఆలోచనలకు చక్కని అక్షర రూపాన్నిచ్చి కవితలుగా మలిచి,  “ మనిషే చెట్టైతే” అన్న కవిత్వ సంపుటిని తీసుకు వచ్చిన “డా. ఫణికుమార్ చకిలం”కు హృదయపూర్వక అభినందనలు.


25, మే 2025, ఆదివారం

అరుదైన సంఘటనలు..!!



 

    నన్ను గుర్తుపట్టావా! అన్న అరుణా టీచర్ గారు, నేను తెలుసా! ఫేస్ బుక్ లో చూస్తుంటాను నీవి అన్న పద్మా టీచర్ గారు , జనని టీచర్ గారు ఇలా మా శిశువిద్యామందిరం అవనిగడ్డ టీచర్లు అందరు మా శ్రీలతా టీచర్ గారి మనుమడి ఉయ్యాల వేడుకలో విజయవాడలో కలవడం చాలా చాలా సంతోషం. నా ఉగాది పురస్కారాన్ని గుర్తు చేస్తూ ఏం చెప్పావు చంద్రబాబుగారి చెవిలో అంటూ..సరదాగా పలకరించిన పలకరింపులు ఈరోజు బోలెడు సంతోషాన్ని పంచాయి.

       ఎప్పుడో చిన్నప్పుడు 2నుండి6 వరకు చదివిన స్కూల్ టీచర్లు మనల్ని గుర్తుంచుకోవడం, అప్పటి అల్లరిని తలుచుకోవడం నిజంగా గొప్ప విషయమే నాకయితే. మనం గుర్తుంచుకోవడం సహజమే..కొన్ని వేల మందికి పాఠాలు చెప్పిన గురువులు మనల్ని ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ అల్లరిని, పరుగులను, నవ్వులను గుర్తు చేయడం అన్నది మరపురాని మధురమైన సందర్భమే నాకు.

23, మే 2025, శుక్రవారం

ఓ అమ్మ కథ

                     అమ్మ కథ

         సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది అమ్మకు మాత్రమే. ఆద్యంతాలను తనలో ఇముడ్చుకున్న ప్రకృతికి సైతం అమ్మకు మరో నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు. “అమ్మంటే అమ్మేమరో మాట లేదు. మన పుట్టుక కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది తల్లి. తల్లి తన రక్తమాంసాలను పాలుగా మార్చి బిడ్డల ఎదుగుదలకు ఊతమౌతుంది. ఉగ్గుపాల నుండి ఊపిరి వదిలే వరకు అమ్మ రక్షణ కవచం ఏదొక సమయంలో మనకు ఆసరా అవుతూనే వుంటుంది. అమ్మ గురించిఎవరు ఎంతగా చెప్పినా, ఇంకా మిగిలున్న కావ్యమే అమ్మ”.

    అమ్మ గురించి సంధ్య రాసిన పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ నాకు అమ్మ ప్రేమే కనిపించింది. అమ్మ ప్రేమకు సాటి ఏది రాదు అన్నది నిర్వివాదాంశం. అమ్మ మీద తనకున్న ప్రేమను, ఆత్మీయతను చెప్పడానికి సంధ్య ఎంచుకున్న దారి కవిత్వం. వస్తువు ఒకటే అయినా ఎవరి పరిధిలో వారు వారికి నచ్చినట్లుగా చెప్తారు. సంధ్య ప్రతి అక్షరాన్ని ఆర్తిగా హత్తుకుంటూ అమ్మకు అంకితం చేసారు. అమ్మతో తనకున్న అనుబంధాన్ని, అమ్మ గొప్పదనాన్ని, మానవత్వాన్ని, మంచి మనసును, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కొన్న వైనాన్ని, బాధను భరించి బాధ్యతలను సంపూర్ణంగా ఎలా తీర్చుకున్నారన్న విషయాలను చాలా హృద్యంగా కవిత్వం చేసారు

     నాకు బాగా నచ్చిన వాక్యాలునీ కథలో నేను పాత్ర/నా కథలో ఆసాంతమూ నీ పాత్రే

ఇంతకన్నా బాగా అమ్మ గురించి ఎవరం చెప్పగలం? ఏం చెప్పగలం? అమ్మ లేని లోటును జ్ఞాపకాలుగా మలచుకుంటూ, నిత్యం అమ్మను అక్షరాల్లో తడుముకుంటున్న సంధ్య రాసిన ప్రతి అక్షరమూ అందరి అమ్మల గురించే. అమ్మకు ఇచ్చిన గొప్ప కానుక అమ్మ మనసున్న ప్రతి ఒక్కరికీ తప్పక చేరుతుందని ఆశిస్తూ.. అమ్మ గురించి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలతో..ఆత్మీయంగా శుభాభినందనలు పుస్తకానికి

మంజు యనమదల

విజయవాడ


15, మే 2025, గురువారం

నిశ్శబ్ద శబ్దఘోష



            మానవత్వపు మనసు ఘోష నిశ్శబ్ద శబ్దఘోష


నేను

కవిని

అనంత కాలాన్ని

 “కాలం తోటలో చల్లిన తన అక్షరాలు మానవాళికి పంచిన బంగారు పక్షులుఅనడంలో ఎంత ఆత్మవిశ్వాసం కనబడుతుందో!

నిజం తప్ప ఏమి చెప్పలేని తను అందరికీ శత్రువునే, అనాధనే అనడంలో మనసును మెలిపెట్టే బాధ కనడుతుంది.   

సదాచారాలను మరువద్దంటూ, అనాచారాలను అణగదొక్కమన్న ఆవేశం కనబడుతుంది కొన్ని కవితల్లో.

కాలాన్ని, కలాన్ని నిద్ర పోనివ్వనంటూనే చరిత్రనూ నిద్ర పోనివ్వనన్న ఆవేశంలో మనకు మహాకవి శ్రీ శ్రీ పోకడలు కనిపిస్తాయి.

కన్నవాళ్ళ గురించి అద్భుతంగా రాసారు.

చౌరస్తా, మూసీ మనోఘోష, శిలా విలాపం, మర్మం, అస్పష్ట దృశ్యాలు, కడుపుకోత వంటి కవితలు సమాజ సజీవ రాజకీయ కథనాలకు సాక్ష్యాలుగా నిలిచాయి

నీడ మాయతనం భలే చెప్పారు

డైరీ, పరామర్శ, కళ్ళు, విలువ, మనుషులం, స్వేచ్ఛ, శవాలను పారేద్దాం, పోస్టుమార్టం రిపోర్టు, నవీన బాలశిక్ష కవితలు నిజాలను వినిపించిన చక్కని చిక్కని కవితలు.

ఎక్కడ 

  ఏం జరుగుతుందో తెలియదు!

  అంతా

  అయోమయపు ప్రశాంతత!”

నిశ్శబ్ద శబ్దఘోషకవితలోని పై భావాలు చాలు పుస్తకానికి కవిత పేరు పెట్టడంలోని అంతరార్థం.

అమ్మ, దేవుడు, తరాలు, యుద్ధాలు, వార్తల కథనాలు, సిగ్నల్ లైట్లు, శిలా శాసనాలు, జ్ఞాపకాలు, మనసు వేదనలు, సంవేదనలు, ఘర్షణలు, సంఘర్షణలు, ఆవేశం, ఆక్రోశం ఇలా తన మనోభావాల సంకేతాలను చాలావరకు సుదీర్ఘ కవితలుగా నిశ్శబ్ద శబ్దఘోషకవితా సంపుటిలో తనదైన శైలిలో అందించారుచకోనాఅనబడేచకిలం కొండల నాగేశ్వరరావు గారు

చక్కని కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు.




14, మే 2025, బుధవారం

కవిగారి అంతరంగాలు సమీక్ష



 “అంతరంగ యుద్ధం ఈ కవిగారి అంతరంగాలు”

         హాలికులు, ఆల్కహాలికులు కలిస్తేనే కవిలోని కవిత్వం జనిస్తుందని“పి.చంద్రశేఖర ఆజాద్” గారు అన్న మాటల్లో నిజం లేదని మనం అనలేం. అలాఅని అందరు కవులు, కళాకారులు ఆల్కహాలికులు కాదు. మత్తు ఏ రకంగానైనాకలగవచ్చని వీరి ఉద్దేశ్యం. అక్షరం మత్తు, మద్యం మత్తుకి ఏదో అవినాభావసంబంధముందని మనం ఊ కొట్టక తప్పదు. “కవిగారి అంతరంగాలు” అనిరాసిన పుస్తకంలో “పి.చంద్రశేఖర ఆజాద్” గారి మానసిక సం’ఘర్షణ తనఅనుభవాల సారాన్ని మెుత్తంగా కాస్త కుదించి ఈ పుస్తకంలో చెప్పినట్టుగాఅనిపించింది.

          నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఏడు పదులవయసులో కూడా తనకు కవిత్వ మూలాలు ఇదమిద్దంగా ఇప్పటికి తెలియదనిచెప్పడంలోనే ఆయన కవిత్వాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో మనకు అర్థంఅవుతోంది. ఏదైనా రాతను కాని, మనిషిని కాని విమర్శించడం క్షణాల్లో పని. కానిఆ విమర్శ సహేతుకమైనదా కాదా అన్నది వారి వారి నైజాలనుబట్టి వుంటుంది. వీరు “కవిగారి అంతరంగాలు” అని రాసినా ఇది అందరూ ఒప్పుకోవాల్సిననిజాయితీ రచన. దీనిలో ప్రతి వాక్యమూ ఆనాటి నుండి ఈనాటి వరకు వాస్తవచరితే.

          అక్షరం మత్తు కొందరిని దిగజారుస్తుంది, మరికొందరిని చరిత్ర పుటల్లోచిరస్థాయిగా నిలుపుతుంది. సామాజిక,ఆర్థిక అసమానతల నుండి, రాజకీయపరపతి, ఇంకా ఇతర వ్యవస్థల్లో పేరుకుపోయిన లోపాలను, వాటి ప్రభావంతోసాహిత్య లోకంలో జరుగుతున్న లొసుగుల ముసుగులను చాలావరకు ఈపుస్తకంలో ప్రస్తావించారు. సమాజంలో కులమతాల కుతంత్రాలను, అవార్డుల, రివార్డుల అభిజాత్యాలను ఎత్తి చూపించారు. సాహిత్య సంస్థలు, సమూహాలు, భజన బృందాలు వగైరా వగైరాలన్నీ మనకు తెలిసినా మనం ఒప్పుకోలేనినిజాలనన్నింటిని ఈ పుస్తకంలో చూపించారు.

      “కవిత్వంలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, జీవితంలో మనం చేసిన తప్పులగురించి, మనం సృష్టించిన సృజన గురించి మాట్లాడుకోవాలి. మరిన్ని తప్పులుచేయకుండా జాగ్రత్త పడాలి.” ఈ మాటలతోనే ఈ కవిగారి అంతరంగం మనకుసుస్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత నిజాయితీగా, ధైర్యంగా జరిగినవి జరిగినట్టుగాప్రతి విషయాన్ని, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా అక్షరాల నక్షత్రాలనుమనసు వెన్నెల్లో మనమూ చదివేటట్లుగా రాసి’పోశారు. ఎవరు ఏది ఎలాఏరుకుంటారో అది మీ ఇష్టం అని మనకే వదిలేసారు. 

         “మన సిద్ధాంతాలకంటే జీవితం శక్తివంతమైనది.

           సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంటుంది.” 

ఈ మాటలు కాదని అనగలమా! సిద్ధాంతమైనా, రాద్ధాంతమైనా అసలుజీవితమంటూ మనకుంటేనే కదా! ఇవన్నీ వచ్చేది. కథలు, నవలలు ఇతరరచనలు ఎక్కువగా రాసినా, తనకు ఇష్టమైన కవిత్వం తక్కువ రాసినా, ఆ కవిత్వంనుండే తాను ప్రేరణ పొందానని సగర్వంగా చెప్పుకున్నారు. తాను ఒకప్పుడుచేయలేని పనిని కూడా నిజాయితీగా ఒప్పుకుంటూ, ఈ రచన వెలువడినప్పుడుకురిసిన విమర్శల వర్షానికి కూడా వినమ్రంగానే సమాధానం చెప్తూ, “మన శత్రువుఎవరో తెలుసుకుంటే ఆ కృషి ఫలవంతమౌతుందని” సోదాహరణంగావివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈరోజుల్లో అవార్డులు రాకపోవడమేఉత్తమ రచనకు తార్కాణం అన్న నిజం మనకు అర్థం అవుతుంది.

           జీవితంలో నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వున్న ప్రతి ఒక్కరూ తప్పకచదవాల్సిన పుస్తకాన్ని తెలుగు సాహిత్యానికి ధైర్యంగా అందించిన “ పి.చంద్రశేఖర్ ఆజాద్” గారికి హృదయపూర్వక అభినందనలు.

8, మే 2025, గురువారం

నువ్వు నేను గోదారి సమీక్ష


 నువ్వు నేను గోదారి..!!


       గోదారేంటోకాని కొందరు మనుష్యులనూ వదలదు. అలా కాకుండా కొన్ని మనసులను పదే పదే స్పృశిస్తూనే వుంటుంది. “అమ్మ, ఆవకాయఎప్పటికీ బోర్ కొట్టనట్టే గోదారిఅంతే స్వచ్ఛంగా, హాయిగా సాగిపోతూ వుంటుంది. కొందరికి కొన్ని కొన్ని ఇష్టాలుంటాయ్, ప్రేమలుంటాయ్, అనుభూతులుంటాయ్, అనుభవాలుంటాయ్..ఇలా కొన్ని కొన్ని తమ మనసులోనే దాగుండి, అప్పుడప్పుడు దొంగల్లా తొంగి చూస్తుంటాయి. భావాలను అక్షరాల్లో అందంగా ఒద్దికగా పొదగడం తెలిసిన కొద్దిమందిలోమాడిశెట్టి శ్రీనివాస్గారు ఒకరు. మెుదటి కవితా సంపుటిగుండెల్లో గోదారిలో తన భావుకత్వాన్ని మనకి పరిచయం చేసి ఇప్పుడునువ్వు నేను గోదారితో మరిన్ని భావాలను గోదారితో పంచుకుంటూ, మనలనూ భావాల అలలజడిలో తేలియాడమంటున్నారు

      “అమ్మంటే అమ్మేఅమ్మకు మరో ప్రత్యామ్నాయం లేదు అన్న విషయాన్ని, అమ్మ దూరమైన బాధను అక్షరాలతో పంచుకున్నారు.

బతుకుపోరులో చివరివరకు 

  తను ఓడిపోతూనే

  నిన్ను గెలిపిస్తాడునాన్న అని అమ్మానాన్నలపై తన ప్రేమను కొసమెరుపుగా చివరిలో చెప్పడం బావుంది.

       అక్షరాల గురించి ఎవరెన్ని రకాలుగా చెప్పినా తన అక్షరాల అమరత్వం గురించి చెప్పడానికి కూడా గోదారిని ఎంచుకున్నారు. విరహాన్ని, వేదనను, ప్రేమను ప్రతి కవితలోనూ హృద్యంగా, భావస్పోరకంగా చెప్పడం చాలా నచ్చింది. భావ కవిత్వం రాయడం అంత సులువేమి కాదు. అందులోనూ 163 పేజీల్లో, ప్రతి పేజీలోనూ భావుకత నింపడం అన్నది అత్యంత కష్టతరమైన పని. దానిని అలవోకగా చేసేసారుమాడిశెట్టి శ్రీనివాస్తననువ్వు నేను గోదారిభావ కవితా సంపుటిలో

         తాను కవిని కాదని భావుకుడిని మాత్రమేనని చెప్పడం ఆయన సున్నితత్వానికి, ఖచ్చితత్వానికి నిదర్శనం. చక్కని, చిక్కని భావాలతో అందమైన, మనసులను తాకే కవితలనునువ్వు నేను గోదారికవితా సంపుటిలో ప్రేమగా అందించారు. మచ్చుకు కొన్ని భావాలను ఇలా..

దేవుడెంత శాడిస్టో కదూ..

   మనుషుల్ని విడదీస్తూ

   మనసుల్ని కలపడంలో..”


ఒకరికొకరమై

  రెండు దేహాల్లోని 

  ఒకే ప్రాణమై..”


బ్రతికుంటే జంటగా..

  మరణిస్తే చితిమంటగా..”


మనసు మూగదై రోదిస్తూ

  మనిషి జ్ఞాపకమై బాధిస్తూ..”


ఎప్పుడొస్తావని కాదు

  అసలొస్తావో రావోనని..”


బ్రతుకంతా నిన్నే చూస్తూ

  బ్రతకలేక కన్నుమూస్తూ..”


నా జీవితంలో నువ్వు..

  ఉప్పెనై వచ్చిన అలవు కాదని 

  ఉసూరనిపించిన కలవని..”


అమ్మేమో గంభీర గోదారి

  తనేమో గలగలా గోదారి..” 


వానొస్తే మనిషి తడి

  నువ్వొస్తే మనసు తడి..”

ఇలాంటి అద్భుతమైన భావాలు ఎన్నో నువ్వు నేను గోదారికవితా సంపుటి నిండా వున్నాయి. భావుకతను ఇష్టపడని మనుష్యులు వుండరన్నది నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే తిలక్ భావుకతను ఆస్వాదించని భావుకులు ఎవరు వుండరన్నదంత నిజం. యండమూరి వీరేంద్రనాథ్ గారివెన్నెల్లో ఆడపిల్లని గోదారి అందాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి పుస్తకం తప్పక నచ్చుతుంది. చాలా అందంగా వేదనను, విరహాన్ని, నిరీక్షణను, ప్రేమను గోదారితో పంచుకున్నమాడిశెట్టి శ్రీనివాస్గారికి హృదయపూర్వక అభినందనలు.


పుస్తకం కావాల్సిన వారు 9849494097 కి కాల్ చేయండి.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner