“ ఓ అమ్మ కథ”
ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది అమ్మకు మాత్రమే. ఆద్యంతాలను తనలో ఇముడ్చుకున్న ప్రకృతికి సైతం అమ్మకు మరో నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు. “అమ్మంటే అమ్మే” మరో మాట లేదు. మన పుట్టుక కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లి తన రక్తమాంసాలను పాలుగా మార్చి బిడ్డల ఎదుగుదలకు ఊతమౌతుంది. ఉగ్గుపాల నుండి ఊపిరి వదిలే వరకు అమ్మ రక్షణ కవచం ఏదొక సమయంలో మనకు ఆసరా అవుతూనే వుంటుంది. అమ్మ గురించి “ఎవరు ఎంతగా చెప్పినా, ఇంకా మిగిలున్న కావ్యమే అమ్మ”.
అమ్మ గురించి సంధ్య రాసిన ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ నాకు అమ్మ ప్రేమే కనిపించింది. అమ్మ ప్రేమకు సాటి ఏది రాదు అన్నది నిర్వివాదాంశం. అమ్మ మీద తనకున్న ప్రేమను, ఆత్మీయతను చెప్పడానికి సంధ్య ఎంచుకున్న దారి కవిత్వం. వస్తువు ఒకటే అయినా ఎవరి పరిధిలో వారు వారికి నచ్చినట్లుగా చెప్తారు. సంధ్య ప్రతి అక్షరాన్ని ఆర్తిగా హత్తుకుంటూ అమ్మకు అంకితం చేసారు. అమ్మతో తనకున్న అనుబంధాన్ని, అమ్మ గొప్పదనాన్ని, మానవత్వాన్ని, మంచి మనసును, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కొన్న వైనాన్ని, బాధను భరించి బాధ్యతలను సంపూర్ణంగా ఎలా తీర్చుకున్నారన్న విషయాలను చాలా హృద్యంగా కవిత్వం చేసారు.
నాకు బాగా నచ్చిన వాక్యాలు “ నీ కథలో నేను ఓ పాత్ర/నా కథలో ఆసాంతమూ నీ పాత్రే”
ఇంతకన్నా బాగా అమ్మ గురించి ఎవరం చెప్పగలం? ఏం చెప్పగలం? అమ్మ లేని లోటును జ్ఞాపకాలుగా మలచుకుంటూ, నిత్యం అమ్మను అక్షరాల్లో తడుముకుంటున్న సంధ్య రాసిన ప్రతి అక్షరమూ అందరి అమ్మల గురించే. అమ్మకు ఇచ్చిన ఈ గొప్ప కానుక అమ్మ మనసున్న ప్రతి ఒక్కరికీ తప్పక చేరుతుందని ఆశిస్తూ..ఈ అమ్మ గురించి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలతో..ఆత్మీయంగా శుభాభినందనలు ఈ పుస్తకానికి.
మంజు యనమదల
విజయవాడ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి