“ఇంటింటి కథల సమాహారం”
అద్భుతమైన ముఖచిత్రంతో ముస్తాబైన “నవ మల్లెతీగ” జన్మదిన ప్రత్యేక సంచికలో విశేషాలు క్లుప్తంగా…
తన పద్దెనిమిదేళ్ళ సాహిత్య పత్రిక నడకలోని మలుపులను, అడ్డంకులను, మానసిక ఒత్తిళ్లను వివరిస్తూ తన మానసపుత్రిక నవ మల్లెతీగను ఎలా మన ముందుకు తెస్తున్నారో క్లుప్తంగా చెప్పినా మనసులను తాకేటట్లు చెప్పిన కలిమిశ్రీ గారి సంపాదకీయంతో మెుదలై, “గీత”చిత్రకారులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ వారికి కృతజ్ఞత చెప్పడంలోనే కలిమిశ్రీ గారి బాధ్యత మనకు కనబడుతుంది.
ఇక కథల విషయానికి వస్తే..
“బ్రతుకు చదువు” విహారి గారి కథ మన చుట్టూ వున్న మనదైన ఎందరో మధ్యతరగతి జీవితాల అప్పుల గొప్పల తిప్పల కథనమే. ఆపకుండా చదివించేసింది. ఈ కథతో పాటుగా
చక్రవర్తి, ఎస్ వి రమణ గార్ల చక్కని కార్టూన్లు బోనస్.
రసరాజు గారి “దేవుణ్ణి దీవించిన పూజారి” కథలోని మానవత్వం, మాధవసేవ కన్నా మానవత్వమే మిన్న అని చెబుతుంది. చిన్న కథే అయినా చిక్కని చక్కని కథ.
చకిలం కొండల నాగేశ్వరరావు గారి నేను నిత్య సంఘర్షిని కవితలో నేటి నిజాల కాలనాళికను సంపూర్ణంగా రాయడం బావుంది.
పి చంద్రశేఖర ఆజాద్ గారి అంతులేని కథలో బతకడానికి, బతికించడానికి తేడా, ప్రకృతి నుండి, విపత్తుల నుండి పక్షుల నుండి ఇలా జీవితంలో మనం దేనికోసం వెదుకుతున్నామో తెలుసుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు, కరోనా మనకు నేర్పిన పాఠాలు ఇంకా చాలా కనిపిస్తాయి ఈ “అంతులేని కథ”లో.
ఆకలి, ఆవిడ, అమాయకత్వం మీద ఆదినారాయణ గారి సెటైరికల్ కార్టూన్లు బావున్నాయి.
జాన్సన్ చోరగుడి గారి క్రాస్ రోడ్స్ కథ వ్యవస్థ లోటుపాట్లను, అధికార హోదాల అనధికారాన్ని బాగా చూపించారు.
విల్సన్ రావు గారి అన్నుంటే బాగుండేది కవితలో డబ్బు పంట గురించి చెప్పడం బావుంది.
షేక్ ఇస్లాం షరీఫ్ గారి డబ్బుల్లేవని..జోక్ బావుంది. కె లక్ష్మీదీపక్ గారి కుండలో నీళ్ళు జోక్ భలేవుంది.
గీతాసారాన్ని జీవితానుభవాలతో రంగరించి చక్కని జీవన సత్యాన్ని, తాత్వికజ్ఞానాన్ని అందించిన సలీం గారి కథ “గీతాబాయి”.
పైడిపాల గారి “స్మార్ట్ స్టార్” కథ ఆనాటి నుండి ఈనాటి వరకు సినిమా హీరోల ప్రేమలో పడే ఎందరో సినీ అభిమానులకు చక్కని మార్గనిర్దేశం.
మనిషికి మనిషి తోడన్న ధైర్యాన్ని నింపే నమ్మకం దిష్టి గురించి చక్కగా చెప్పిన సమ్మెట ఉమాదేవి గారి “జిట్టి” సామాజిక స్పృహ వున్న కథ.
“అమ్మకి అన్నానికి దూరంగా” ..బులుసు వెంకటేశ్వర్లు గారి “గ్రద్దలు” కథలోని ఈ చివరి వాక్యం మన సమాజపు పోకడను తెలుపుతుంది. హృదయ విదారకమైన బాధ కలగక మానదు ఈ కథ చదివినప్పుడు.
టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి గారి ”చలనం” కథ మనిషిలోని మరో మనిషిని వెలికితీయడానికి ఓ చిన్న మాట ఎలా తోడ్పడుతుందో చెప్తుంది, దానగుణం గొప్పదనాన్ని తెలిపి, మానవత్వాన్ని చాటుతుంది.
మన సమాజంలో నిత్యమూ జరిగే సంఘటనల సంఘర్షణే శ్రీకంఠస్పూర్తి గారి “హింసాత్మకం” కథ.
నల్లబాటి రాఘవేంద్రరావు గారి “అదిగో నవోదయం” కథ రచయిత కావడానికి పడే కష్టనష్టాలను ఒకింత హాస్యంగా చెప్పినా, నిఘూడంగా బాధ కనిపిస్తుంది.
మన్నవ నాగలలిత శ్రీదేవి గారి మధ్యతరగతి జీవితాల “కోరిక” బావుంది.
పి. శ్రీనివాస్ గౌడ్ గారి “చంద్రుని చీకటి” కథ చక్కని సందేశాత్మక కథ.
జ్యోతి మువ్వల గారి “ నాన్న కోసం ఓ లేఖ” కథ ఉత్తరాల మనసుని తెలుపుతుంది. “మాటకు పదునెక్కువ, అక్షరాలకు ఆలోచనెక్కువ” అన్న మాట అక్షరసత్యమని ఈ కథ తెలుపుతుంది.
విజయ్ కుమార్ ఘంటా గారి “జిహ్వ కు ప్రియం విజయవాడ వంటకం” వ్యాసం, గాల్ బ్లాడర్స్ గురించి డాక్టర్ మళ్ళ నవ్యతేజ గారి వ్యాసం చాలా బావున్నాయి.
డాక్టర్ వల్లూరి రామారావు గారి”పెద్దబాలశిక్ష కథ బాధ్యత లేని కొడుకు, బంధాలక్కర్లేని కోడలు..చదువుతుంటే మనసు కలత చెందింది.
డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి “నినాద విధానం” కథ నేటి రాజకీయ నాయకుల మనస్తత్వాలను “ రాజకీయాల్లో నినాదాలే వుంటాయి. విధానాలు వుండవు” అని బాహాటంగా చెప్పడం బాగా నచ్చింది.
“అశోకుడు చెట్లు నాటించెను” కాని ఆధునికుడు చెట్లు నరికించెను అంటూ “పల్లెటూరి మనిషి నగర రోడ్డున పడ్డాడు” అన్న వార్తతో చక్కని సందేశాన్ని ఈ కథలో సింహప్రసాద్ గారు అందించారు.
మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సాధించిన లంకా వారికి అభినందనలు.
ఉండవల్లి వారి “ఫ్లిప్” కథ ఈనాటి ఆన్ లైన్ చాటింగ్లు, డేటింగ్ల సాధకబాధకాలు తెలుపుతుంది.
హరి వెంకట రమణ గారి “శాంపిలు” కథలో కాలంతో పాటుగా పరుగు పెట్టడం, లేదా పరుగు ఆపిన వాడి పరిస్థితి, ప్రపంచీకరణ అంటే ఏంటనేది చాలా చక్కగా తెలుస్తుంది.
మనల్ని ఎవరు పట్టించుకోకున్నా మనలో మనం ఎవరెవరికి ఏం చెప్పాలో, మననం చేసుకోవడం ప్రతి ఇల్లాలికి సహజమే. “రోజంతా” అందరి గురించి అన్నీ చేసే ఇంటావిడ మనోగతాన్ని పాలపర్తి జోతిష్మతి గారు బాగా చెప్పారు.
యేమినేని వెంకటరమణ గారి భారతరత్నకి వీళ్లు అర్హులు కారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.
ఎం సుగుణారావు గారి “దేశమంటే మనుషులోయ్” కథ చక్కని సందేశాత్మక కథ.
బి. ప్రసాదమూర్తి గారి “పక్షి హృదయం” కథ సమాజం ఎంత ముందుకి పోతున్నా కులమతాల మధ్య సామరస్యాన్ని, మన చుట్టూ వున్న మనుషులే చూడలేరన్న నిజం చెబుతుంది.
సర్వజిత్ గారి “కొత్తదారి” కథ జీవితంలో మోసపోయిన, లేదా తప్పుటడుగులు వేసిన ఎంతోమందికి ధైర్యాన్నిస్తూ, తాము బతకడమే కాకుండా మరో పదిమందికి దారి చూపే సరికొత్త నిర్ణయాన్ని తెలిపిన కథ.
పొన్నాడ సత్యప్రకాశరావు గారి “ చావలేనివాడు” కథ సరదాగా వున్నా అంతర్లీనంగా చావడానికి, బతకడానికి వున్న తేడాని తెలుపుతూ, గొప్ప సందేశాన్ని అందించిన చక్కని కథ.
డాక్టర్ ఐజక్ గుండె గారు రాసిన కథ “తీర్పు”లో రాజకీయ నాయకుల తీర్పు తమ ఇంటి సమస్యకు, ప్రజల సమస్యకు ఎలా వుంటుందన్నది చక్కగా చెప్పారు.
రావుల కిరణ్మయి గారి “బరాతు” కథ తెలంగాణా మాండలికంలో సాగినా చక్కని ఇతివృత్తం వున్న కథ. మానవత్వం, మంచితనం ఎలా వుంటాయో తెలిపిన కథ.
“దీపధారి” కథలో చావుపుట్టుకలు సహజమేనని చెప్తూ, స్థితప్రజ్ఞుడైన వ్యక్తి ఆలోచనలను నలుగురికి పరిచయం చేసారు రచయిత కొయిలాడ రామ్మోహన్ రావు గారు.
అనేక చోట్ల మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, అవమానాలకు చక్కని పరిష్కారం చూపిన విడదల సాంబశివరావు గారి కథ “ ఇంకా ఎన్నాళ్ళీ మౌనం?” చాలా బావుంది.
డాక్టర్ కె.జి. వేణు గారి “శ్రీ శ్రీ కళ్లతో నేరుగా” చిరు కవిత బావుంది.
ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారి “కన్యాకుమారి-కుంభమేళా” కథ మోనాలిసా పూసల ఇతివృత్తం ఆధారంగా తీసుకుని సరదాగా సాగింది.
బి. నర్సన్ గారి “ స్నేహితులు” కథ ముగింపుకు మన మనసు చెమరించినా, స్నేహం చేసిన అద్భుతాన్ని అందరు తప్పక చదవాల్సిన కథ. గొప్ప కథకు అభినందనలు.
ఎస్.వి.ఎమ్. నాగగాయిత్రి గారు రాసిన “ సముద్ర రాక్షసి” కథ ప్రకృతి విపత్తులకు కారణం మనం చేస్తున్న ప్రకృతి వినాశనమే కారణమని చక్కగా తెలియజేసింది.
కళ్యాణదుర్గం స్వర్ణలత గారి కథ “బోగస్ విలియా” ఈనాటి కార్పొరేట్ కాలేజీల తీరుతెన్నులు, తల్లిదండ్రుల, పిల్లల, కాలేజ్ లో అందరి మనోగతాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
కాజులూరి ఆదినారాయణరావు గారి “అందరు బాగుండాలి” కథ బాధ్యత నెరిగిన పెద్దరికం చేసిన నలుగురు మెచ్చుకున్న మంచిపనిని చెప్పడం ద్వారా ఈ సమాజంలో కాస్తయినా విలువలు నిలబడాలన్న తపన కనబడుతుంది.
సుధామురళి గారి “తడి ఆరని వాక్యమెుకటి” పుస్తకానికి చిన్ని నారాయణరావు గారి సమీక్ష బావుంది.
ఇష్టమైన ప్రేమ దూరమై, అనుకోకుండా కలిస్తే ఆ పాత జ్ఞాపకాల మైమరపును ఆస్వాదిస్తూ, కలవలేని దూరాన్ని భరించడం ఎంత కష్టమో తెలిపే కథ ఎ.వి.బి.ఎస్.ఆనంద్ గారి “ కాఫీ విత్ లవ్”.
“చీమ-దోమ” కథ సరదాగా సాగినా చక్కని సందేశాన్ని అందించింది. పెళ్లి కార్యక్రమాన్ని హాస్యంతో నింపి మంచి మాట చెప్పారు పుప్పాల సూర్యకుమారి గారు.
రావులపాటి వెంకట రామారావు గారి “రాజు-బూజు” కథ ఇప్పటి రోజుల్లో ప్రతి ఇంటి కథే ఇది. అమెరికా ప్రయాణం గురించి బాగా చెప్పారు.
హైమవతీ సత్య గారి కథ “చేజారాక” వ్యసనాలకు బానిసై, బలహీనతలను వదులుకోలేని మధ్యతరగతి బతుకుల జీవితాల ముగింపు గురించి బాగా చెప్పారు.
“మురుగు నీటి అల” వడలి రాధాకృష్ణ గారి కథ. ఈ కథలో ఎందరో అభాగ్యుల జీవితాలు కనిపిస్తాయి. ఓ మనిషి నిస్సహాయతను తమ అవసరాలకు వాడుకునే సగటు మనిషి కనిపిస్తాడు.
విజయ గోలి గారి “మన ఇల్లు” కథ చాలా బావుంది. స్వేచ్ఛగా మనకు నచ్చిన పని మనం చేయడానికి ఎక్కడ అనువుగా వుంటే అక్కడే మన ఆనందం అన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు.
పైడిపాల గారు సినిమాల గురించి రాసిన వ్యాసం బావుంది. డాక్టర్ వి. శ్రీదేవి గారు ఊబకాయానికి ఇచ్చిన సలహాలు, సూచనలు బావున్నాయి. ఇంకా చక్కని కవితలు, కార్టూన్లు, చిన్న చిన్న జోకులతో, కథలకు తగ్గట్టుగా అందమైన బొమ్మలతో మెదటి పేజీ నుండి చివరి పేజీ వరకు వదలకుండా చదివించే జన్మదిన ప్రత్యేక కథల సంచిక “ నవ మల్లెతీగ” ప్రతి ఇంటిలో ఉండాల్సిన పుస్తకం.
పుస్తకం కావాల్సిన వారు 9246415150 నెంబరులో కలిమిశ్రీ గారిని సంప్రదించగలరు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి