మానవత్వపు మనసు ఘోష ఈ “నిశ్శబ్ద శబ్దఘోష”
“నేను
కవిని
అనంత కాలాన్ని”
“కాలం తోటలో చల్లిన తన అక్షరాలు ఈ మానవాళికి పంచిన బంగారు పక్షులు” అనడంలో ఎంత ఆత్మవిశ్వాసం కనబడుతుందో!
నిజం తప్ప ఏమి చెప్పలేని తను అందరికీ శత్రువునే, ఓ అనాధనే అనడంలో మనసును మెలిపెట్టే బాధ కనడుతుంది.
సదాచారాలను మరువద్దంటూ, అనాచారాలను అణగదొక్కమన్న ఆవేశం కనబడుతుంది కొన్ని కవితల్లో.
కాలాన్ని, కలాన్ని నిద్ర పోనివ్వనంటూనే చరిత్రనూ నిద్ర పోనివ్వనన్న ఆవేశంలో మనకు మహాకవి శ్రీ శ్రీ పోకడలు కనిపిస్తాయి.
కన్నవాళ్ళ గురించి అద్భుతంగా రాసారు.
చౌరస్తా, మూసీ మనోఘోష, శిలా విలాపం, మర్మం, అస్పష్ట దృశ్యాలు, కడుపుకోత వంటి కవితలు సమాజ సజీవ రాజకీయ కథనాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.
నీడ మాయతనం భలే చెప్పారు.
డైరీ, పరామర్శ, కళ్ళు, విలువ, మనుషులం, స్వేచ్ఛ, శవాలను పారేద్దాం, పోస్టుమార్టం రిపోర్టు, నవీన బాలశిక్ష కవితలు నిజాలను వినిపించిన చక్కని చిక్కని కవితలు.
“ఎక్కడ
ఏం జరుగుతుందో తెలియదు!
అంతా
అయోమయపు ప్రశాంతత!”
“నిశ్శబ్ద శబ్దఘోష” కవితలోని పై భావాలు చాలు ఈ పుస్తకానికి ఈ కవిత పేరు పెట్టడంలోని అంతరార్థం.
అమ్మ, దేవుడు, తరాలు, యుద్ధాలు, వార్తల కథనాలు, సిగ్నల్ లైట్లు, శిలా శాసనాలు, జ్ఞాపకాలు, మనసు వేదనలు, సంవేదనలు, ఘర్షణలు, సంఘర్షణలు, ఆవేశం, ఆక్రోశం ఇలా తన మనోభావాల సంకేతాలను చాలావరకు సుదీర్ఘ కవితలుగా ఈ “నిశ్శబ్ద శబ్దఘోష” కవితా సంపుటిలో తనదైన శైలిలో అందించారు “చకోనా” అనబడే “ చకిలం కొండల నాగేశ్వరరావు గారు”
చక్కని కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు.



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి