“అపర వయసులో అసలైన కథానాయకుడు”
మనం రోజు చాలా కథలు, నవలలు చదువుతూ వుంటాము. కొన్ని మాత్రమే మనసుకు దగ్గరగా వస్తాయి. మరికొన్ని చాలా కాలం వరకు గుర్తుండి పోతాయి. “మంత్రి ప్రగడ మార్కండేయులు” గారు రాసిన “సైకిల్ వీరుడు - హిమగిరి శూరుడు” నవల చక్కని సరికొత్త నేపథ్యంలో రాయబడినది. ఈనాటి ఆధునిక యుగంలో హాస్యాన్ని, సాహసాలను, చతురోక్తులను, చక్కని సన్నివేశాలను ఆద్యంతమూ ఉత్కంఠ రేపే విధంగా సరళమైన భాషలో పిల్లలకు, పెద్దలకు నచ్చే విధంగా రాసిన “మంత్రి ప్రగడ మార్కండేయులు” గారికి హృదయపూర్వక అభినందనలు.
అరవై ఏళ్ళ కథానాయకుడు చేసే సాహస విన్యాసాలు ఎలా వుంటాయో ఈ “సైకిల్ వీరుడు” నవలలో మనం చూడవచ్చు. సైకిల్ వీరుడు “వీరు” తనకు సహాయంగా వుండటానికి పండరినాథ్ ను ఎంచుకోవడంతో కథ మెుదలవుతుంది. క్లబ్ మెంబర్లతో మాటా మాట పెరిగి 30 రోజులలో హైదరాబాద్ నుండి కాట్మండ్ వరకు తన సైకిల్ యాత్రను చేసి దిగ్విజయంగా పూర్తి చేసి తిరిగి రావడంతో మూడు కోట్ల రూపాయల పందెం గెలుస్తాడు.
ఈ ప్రయాణంలో.. ఓ దొంగతనం కేస్ ఛేదించడానికి, వీరిని అనుమానించి డిటెక్టివ్ యుగంధర్ కూడా వెంబడిస్తాడు. దొంగలతో గొడవ, చెడ్డి గ్యాంగ్ తో ఫైటింగ్ అలా అలా వీరి ప్రయాణం సాగుతూ, మధ్యలో గిరిజన వాడలో పంచాయితీ జరుగుతుంది. గిరిజన అమ్మాయిని సజీవ దహనం నుండి రక్షిస్తారు. ఆ అమ్మాయితో పండరినాథ్ ప్రేమలో పడతాడు. మెుత్తానికి పందెం ప్రకారం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాట్మండు లో వివిధ ప్రాంతాల్లో వింతలు, విశేషాలు చూసి, తన సైకిల్ యాత్రను పూర్తి చేసి, పందెం డబ్బులు 3 కోట్లు గెలుచుకుంటాడు సైకిల్ వీరుడు. డిటెక్టివ్ యుగంధర్ మధ్య మధ్య మాయమవుతూ వీళ్ళను ఫాలో అవుతూ, చివరికి సైకిల్ వీరుడు జెంటిల్మన్ అని తెలుసుకుంటాడు.
సైకిల్ వీరుడు తన యాత్రా విశేషాలను డైరీలో రాస్తాడు. ఫోటోలు,బిల్లుల సాక్ష్యాలతో 30వ రోజు తిరిగి హైదరాబాద్ క్లబ్ కి వచ్చి అన్ని విశేషాలను వివరించి పండరినాథ్ ప్రేమించిన గిరిజన యువతి హేమను పరిచయం చేసి వారి పెళ్లి జరిపించి, వారికి ఓ ఇంటిని బహుమతిగా ఇస్తాడు. ఇది క్లుప్తంగా “సైకిల్ వీరుడు- హిమగిరి శూరుడు” నవలలో కథ.
సినిమాకి తగ్గట్టుగా కథను నడిపించి, పాటలు, ఫైటులతో, హాస్యాన్ని రంగరించి, కథానాయకుడు ఉదాత్తమైన మనసు కలవాడని చెప్తూ, సాహసాలకు వయసుతో పనిలేదని నిరూపించారు “మంత్రి ప్రగడ మార్కండేయులు” గారు. చక్కని నవల “సైకిల్ వీరుడు - హిమగిరి శూరుడు” కి హృదయపూర్వక అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి