8, మే 2019, బుధవారం

ఏక్ తారలు...!!

1.  ఏ రుచి ఎలా ఉండాలన్నది_నిర్ణయించేది కాలమే...!!

2.  రసాస్వాదన రుచులకెరుకే_కాలంతో పోటిగా...!!

3.   నా కన్నుల్లో నీ రూపే_మరో లోకమే లేనట్లుగా...!!

4.  మనసు మాటల్లో వొలికినట్లుంది_అక్షరాల శబ్దానికి అనువుగా...!!

5.  నీ ఊసుల మైమరపది_మనసాక్షరాలను మాయ చేస్తూ..!!

6.   గమనమంతే అప్పుడప్పుడు గతి తప్పుతూ_మది కన్నీళ్ళకు ఓదార్పవుతూ...!!

7.   వెలుగుతోంది మనసు_ఆత్మ జ్ఞానజ్యోతి ప్రకాశంతో..!!

8.   రేపటి స్వప్నాన్ని_నిన్నలను దాటుకుంటూ నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ..!!

9.   సమ్మెాహన రాగమేమెా అది_మౌనరాగానికి మరులు నేర్పుతూ...!!

10.    కనుకొలుకుల్లో చేరిన కన్నీరు_మనసును తేలిక చేస్తూ..!!

11.   ఓదారుస్తోందో అమ్మ_ఏ తల్లి కన్నబిడ్డైనా తనది అమ్మదనమేనంటూ...!!

12.   మది జలపాతమది_కడలిలో కలిసి సాంత్వనందుతూ...!!

13.    తనివి తీరని మమకారమది_మేఘమై మురిసిందిలా

14.    మనసు పరిచయమేనేమెా_గుప్పెడు ఆత్మీయతను గురుతెరిగిన స్నేహానికి...!!

15.   తక్కెడలక్కరలేని నెయ్యమది_కొలమానానికి చిక్కని బంధమై చేరి...!!

16.    కష్టమంటే ఇదేనేమెా_నీవు లేకున్నా నీతోనే ఉన్నట్టుండటం...!!

17.   దూరం కాలేని బంధం మనది_ఇష్టమైనా కష్టమైనా..!!

18.  అక్షరాలు వెలవెలబోతున్నాయి_అర్థంపర్థంలేని రాతల్లో ఇమడలేక..!!

19.    నిదురపోయిన నిజాలెన్నో_కలలో సైతం కలవరపడుతూ...!!

20.    ఆరాధనే ఆలంబన అయ్యింది_బాధల బరువును మెాయడానికి....!!

21.    అణుకువా ఎక్కువే నా అక్షరానికి_ఆత్మాభిమానం అలంకరణగా..!!

22.   సొగసులీనుతున్నాయి_పూలు నేలరాలినా...!!

23.   అమాస అగుపడనే లేదు_నీ నవ్వుల మెరుపు విరుపులను చూడలేకేమెా...!!

24.   మనసుతో వినలేకపోతున్నాం_ఈ అక్షరాల ఆంతర్యాన్ని...!!

25.    అక్షరం వయ్యారాలు బోతోంది_వెక్కిరింతలు తననేం చేయలేవంటూ...!!

26.    మనసుకు తెలుసనుకుంటా_ఆప్యాయంగా ఆదుకునేవి అక్షరాలేనని...!!

27.   అమ్ముడుబోని అక్షరం ఆత్మ విశ్వాసమది_చురకలేయడం తన వంతంటూ...!!

28.   చురకలంటని చర్మమనుకుంటా_తోలు మందమని బుుజువు చేసుకుంటూ..!!

29.   మూల్యం చెల్లించక తప్పదు కదా_మూలాలను వెక్కిరిస్తుంటే. ..!!

30.   అన్యాపదేశం చేయదెప్పుడూ_కర్తవ్యమెరిగిన అక్షరం...!!

6, మే 2019, సోమవారం

ఊ కొడతారా..ఉలిక్కిపడతారా...!!

నేస్తం,
         "కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా..." అంటూ పాట పాడను కాని ఓ విషయం చెప్పేద్దామని రాయడం మొదలెట్టేసాను. అందులోనూ ఏదైనా బుర్రలో చేరి తొలుస్తుంటే అస్సలు చెప్పకుండా ఉండలేని బలహీనత నాదయ్యే. నాకీ బలహీనత ఉన్నట్టే కొందరికి రక్తసంబంధ హీనత బాగా పెరిగిపోయింది. మాకు, మా పిల్లలకు ఉన్న సంస్కారం ఏంటంటే చంపడానికి శత్రువు మా ఇంటికి వచ్చినా పలకరించి మంచినీళ్లు తాగడానికి ఇవ్వడం. ఇది మాకు మా అమ్మానాన్నల నుండి, మేము చదువుకున్న గురువుల నుండి మాకు దక్కిన ఆస్తి. అదే అమ్మానాన్నల రక్తం పంచుకు పుట్టినా కొందరికెందుకో మరి ఈ సంస్కారహీనత.  మమ్మల్ని మా పద్ధతులని అవహేళన చేసిన ఎందరికో ఇది నా మాటగా గర్వంగా చెప్తున్నాను. అమ్మ స్థానంలో, గురువు స్థానంలో  ఉండి అనుబంధాలను, భావి భారత పౌరులను సరైన మార్గంలో పెట్టాల్సిన కొందరు రక్త సంబంధాల మధ్యనే గొడవలు పెడుతూ, విభజించి పాలించడమే తమ ప్రధమ కర్తవ్యంగా చేసుకుని, అబద్దాలు ఇంటిపేరుగా మార్చుకుంటుంటే చూస్తూ ఉండలేక నిజాలు చెప్పాలని ఉంది. ఆ నిజాలు తెలిసినా ఒప్పుకునే ధైర్యం లేక ఆ తప్పు అడుగులకు మడుగులు ఒత్తే నాకు తెలిసిన చాలామంది నా దృష్టిలో బతికున్నశవాలే. ఆపదలో ఓ ఓదార్పు మాట పలకలేని రక్త సంబంధం, అహంకారానికి మాత్రమే చిరునామాగా మారినా, కష్టంలో ఉన్నప్పుడు ఇంటికి రావద్దన్నా, ఆపదలో అవసరానికి కూడా తమ సంబంధాన్ని బయటపెట్టవద్దన్నా ఇలా మానసికమైన చర్యలెన్ని చేసినా తెలిసీ తెలియనట్టుంటూ నోరు విప్పని ఎందరో బంధుజనాలూ మీకు పాదాభివందనాలు. నేనంటూంటే చాలామందికి కోపం వస్తుంది కాని ఇదే నిజం ఏంటంటే.. " ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన ఎందరో ఉపాధ్యాయులు అమ్మానాన్నల పట్ల, తోబుట్టువుల పట్ల చాలా హేయంగా ప్రవర్తిస్తూ నేతిబీరకాయలో నెయ్యి చందాన ఈ సమాజంలో బతికేస్తూ మానవ విలువలను పూడ్చి పెడుతున్నారు." సమాజం మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాని ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కోరుకోరెందుకో...?

జీవన "మంజూ"ష (మే)...!!

 నేస్తం,
         " ఏ ఇంట్లో చూసినా ఏమున్నది గర్వకారణం, మలి వయసు పసితనాన్ని చీదరించుకోవడం తప్ప..." అని అనాలనిపిస్తోంది. శారీరకంగా బాధించి మనుష్యులను చంపడం సహజ లోకరీతి. మానసికంగా ఒక మనిషిని చంపడం సాధ్యమా అని మనకు ఒకింత అనుమానం రావడమూ సహజమే. పుట్టినప్పుడు పసితనం బావుంటుంది కాని అపర వయసులో పసితనం మన కడుపున పుట్టిన బిడ్డలకు కూడా గుదిబండే. పుట్టినప్పటినుండి మనకు చేసిన సేవలు, మన కోసం వాళ్ళు కోల్పోయిన ఎన్నో క్షణాలు ఇవేవీ మనకు గుర్తుకు రాకపోవడం క్షమించరాని నేరమే. కాని ఇలాంటి నేరాలకు ఏ శిక్షలు లేకపోవడం మన దౌర్భాగ్యం. మురికి పట్టిన మన మనస్తత్వాలకు ఎన్ని డిటర్జెంట్ సబ్బులు వేసి తోమినా ఆ మకిలి పోదు. సంస్కారవంతమైన ప్రోడక్ట్లని టి వి లో ప్రకటనలు చూస్తూ మోసపోవడం మనకు అలవాటైపోయింది. 
            సాహిత్యమూ ఈ సంస్కారంలో తీసిపోలేదంటూ తన ఉనికిని చాటుకుంటోంది. కొందరు పరాయి మతాన్ని, కులాన్ని హేళన చేయడం తమ ఉనికిని చాటుకోవడానికి ఒక మార్గంగా సాహిత్యాన్ని ఎంచుకుంటే, ఆ తవికెల్లో అద్భుతమైన శిల్పకళను చూస్తున్న ఎందరో సాహితీ ఉద్దండులు. మరికొందరేమో ఎవరో అసభ్యంగా తిట్టారని, ఘాటు పదజాలంతో గోప్యంగా ఉండాల్సిన అవయవాలను తమ అభ్యంతరకర రాతలతో రాయడం వాటికి వచ్చిన స్పందనలకు ఏదో పురస్కారం వచ్చినంతగా పొంగిపోవడం ఇప్పటి ఫాషన్ ఐపోయింది. 
          సాహిత్యంలో ఎంతగా విషం పేరుకుపోయిందో చెప్పడానికి  ఒక్క సంఘటన చాలు. " కొన్ని బలహీన సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి " అన్న వ్యక్తిని సమర్ధిస్తున్న ఎంతోమంది సాహితీ పెద్దలను ఏమనాలో కూడా తెలియని దుస్థితి ఇప్పుడు మన ముందు ఉన్నది. సాహిత్య అకాడమి అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నంత మాత్రాన సంస్కారం అలవడదని, జన్మతహః సంస్కారం అబ్బాలని తెలుస్తోంది. తప్పు చేసిన వారికన్నా వారిని సమర్ధించేవారు ఎక్కువ తప్పు చేసినట్లు. ముసుగులు తీయనంతవరకు అందరు దొరలే. ఆ వేసుకున్న ముసుగులు ఏదో ఒక రోజు తొలగక మానవు, నిజ స్వరూపాలు బయటపడినా కూడా ఏ మాత్రం భయం, సంకోచం లేకుండా ఈ జాతి మన మధ్యనే రొమ్ము విరుచుకుని షరా మాములుగా సూక్తిసుధలు వల్లెవేస్తూ సంచరిస్తుండటం చూస్తూ, లోపం ఎక్కడుందో తెలియని స్థితిలో అయోమయంలో మనముండిపోతున్నాం నిస్సహాయంగా... 
ఈ ముచ్చట్లకు ఇప్పటికి సశేషం.... 

5, మే 2019, ఆదివారం

అంతర్లోక పయనం...!!

పుట్టినప్పుడే ఖరారైన      
పయనమిది
పురిటినీళ్ళతో మెదలై
పుడకల శయ్యకు వరకు
సాగే కడసారి నీళ్ళ
పూల కాలిబాటలో మెాసిన
కన్నీళ్ళ కావిడికుండలెన్నో
ఓదార్చుకున్న ఏమరుపాటులెన్నో
ఒంటరి యుద్ధంలో గెలుపు నీదైనా
అహంకారపు అనుబంధాల నడుమ
నలిగిన నీ గుండె కార్చిన
రుధిరాశ్రువులకు సాక్ష్యాలెన్నున్నా
నోరు మెదపలేని
సమాజపు ఆనవాళ్ళమైనందుకు
మమ్ము మేము క్షమించుకోలేని
నిస్సహాయులమై
దశదినకర్మలతో
నీ మరో పయనం
ప్రశాంతంగా సాగాలని
ఈ అక్షర వీడ్కోలు....!!

రాజ్యం అక్కా...నువ్వే గెలిచావు..కాకపోతే మాతో చెప్పిన నీ మాట నిలబెట్టుకోలెకపోయావు. ఎప్పుడు బాలేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఇక్కడికే వచ్చేస్తానని చెప్పి మెాసం చేసావు. ఈ నాలుగైదు ఏళ్ళలో మనం పంచుకున్న మనసు మాటలన్నీ అందరికి గొంతు విప్పి చెప్పాలని ఉంది.. నువ్వెలా ఉన్నా, నిన్ను  పట్టించుకోని నీ రక్తసంబంధాలు ఎప్పుడూ బావుండాలని కోరుకునే నీ మంచి మనసు మరి ఎన్ని రోజులు నన్ను ఆపగలదో చూద్దాం...!!

 

4, మే 2019, శనివారం

దూరం - దగ్గర...!!

బతికుండగా ఓ పలకరింపు లేకుండా, పోయాక మాత్రం అపారమైన ప్రేమలు వొలకబోస్తూ దూరాభారాలని వాపోతూ,
తోబుట్టువుల చావులను కూడా తమ దర్పానికి వాడుకుంటూ,  రక్తసంబంధాలను అహం, డబ్బుల మాయలో పడి వదులుకుంటున్న ఈరోజుల్లో....కొద్ది పరిచయంలోనే నా మాటకు విలువిచ్చి తన జీవితాన్ని సంతోషంగా మలచుకున్న నా ఆత్మీయురాలు జ్యోతి  కొన్ని క్షణాలు నాకోసం కేటాయించినందుకు నాకెంత సంతోషమెా.... థాంక్యూ సో మచ్ జ్యోతి.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner