9, అక్టోబర్ 2019, బుధవారం

బాబోయ్ తెలుగు న్యూస్ ఛానల్స్...!!

మీకో దణ్ణం సామి....పర్యటనకు, వేడుకకు తేడా తెలుసుకుని ఛావండి. పెళ్ళి వేడుకకు వెళ్ళడం, రాజమండ్రి పర్యటనకు వెళ్ళడం ఒకటి కాదురా బాబూ... అధికారానికి కొమ్ము కాయండి తప్పులేదు... కనీసం కాస్త తెలుగు తెలుసుకుని ఏడవండి. ఇంతకు ముందు అంతే... మెాడి, చంద్రబాబు తిరుపతి వెంకన్న గర్భ గుడిలో కింద కూర్చున్నారు, పూజారులు లడ్డు అరిచేతిలో పెట్టారు. పవర్ కళ్యాణ్ రెస్ట్ రూమ్ కి వెళ్ళాడు... ఇవి కాదురా వార్తలంటే...న్యూస్ ఛానల్స్ చూడాలంటే భయమేసేటట్టు చేస్తున్నారుగా.. మరీ ఇంతలా దిగజారిపోవాలా... 
వీటికన్నా తెలుగు సీరియల్స్ ఛానల్సే నయం అనుకుంటా..

7, అక్టోబర్ 2019, సోమవారం

ద్విపదలు...!!

1.   కలమే రాయగలిగే కథనాలెన్నో
కాలంతో సాగే గుండెల్లో దాగిన కల్లోల సంద్రాలను...!!

2.  ఎడబాటే తెలుపుతుంది
ఎదలో దాగిన ఇష్టాన్ని  ఎరుగమంటూ...!!

3.   చూపు లేకున్ననేమి
మనోనేత్రంతో అనుక్షణం నీ దర్శనమే...!!

4.   మౌనంలో ఒలికాయి మాటలు
మనసాక్షరాలను చేరువకు రమ్మంటూ..!!

5.  అల'జడి అల్లంత దూరమే ఎప్పుడు
కన్నీటి కలత కల'వర పెడుతున్నా...!!

6.   అనుబంధపు ఆనవాలది
గతజన్మ బాంధవ్యాన్ని గురుతెరగమని గుర్తుచేస్తూ...!!

7.  అక్షరాలు తెలిపాయి
అద్దమంటి మనసదని..!!

8.  బంధాలకున్న అనుబంధమదేననుకుంటా
తెలియకుండానే మనసుకు చేరువగా వచ్చేస్తాయి...!!

9.    సంకోచ వ్యాకోచాలు అవసరమే
ఎద సవ్వడి తెలియాలంటే...!!

10.   తరిగిపోని అభిమానమిది
కరిగిపోని అనుబంధాలతో...!!

11.  విశ్వంతో పని ఏముంది
ఎద నిండుగా నువ్వుంటే..!!

13.   నక్షత్రాలెందుకు
నీ నవ్వుంటే చాలదూ..!!

14.   కొన్ని మౌనాలంతే
మనసుని మళ్ళిస్తాయి మాటలను వినమంటూ...!!

15.  నీ మనసు మకరందం
మాటల్లో ఒలికి పోతూ...!!

16.   చిరునామా తెలిపిన చెలిమి
గతపు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ..!!

17.  అక్షరాలెన్ని సృష్టించాలో
నీ మౌనాన్ని మాటలుగా పేర్చడానికి...!!

18.   చెలియలి కట్టకు తప్పదు
సంద్రంతో స్నేహం చేయక..!!

19.   అలల ఆరాటమది
ఆగని పోరాటమై అందరికి ఆదర్శమై...!!

20.   రెప్పలిప్పాలని లేదు
కలలోనైనా కనిపిస్తావని..!!

21.   ఎన్ని పున్నముల పెట్టో
నీ నవ్వుల వెలుగులు...!!

22.   అక్షరాలకు అద్దకాలెందుకు
అందమైన భావాలుగా అవి అమరుతుంటే...!!

23.   శృతికి చిక్కిన సాహిత్యమిది
మదికి ఆహ్లాదమిచ్చే మౌనగీతమై...!!

24.  సజీవ చిత్రమే నీవు
స్వప్నం సాకారమైన వేళ...!!

25.   అలరించడం అక్షరాలకు అలవాటే
సాహిత్యపు సుమగంధాల చేరికతో...!!

26.   ఇష్టంగా ఉంది
నీ ఇష్టపదైనందుకేమెా...!!

27.   కాలమెంత తేలికైనదో
అందరి బరువుభారాలు తనపై పడుతున్నా...!!

28.  రంగుల కలే అది
కనుపాపల్లో అనుక్షణం కదలాడుతునే..!!

29.   మాటల విరుపులే
మౌనం వయ్యారాల్లో...!!

30.   అనువదించడం కష్టమే
అక్షరాలకు అలవి కాని మనసును...!!

2, అక్టోబర్ 2019, బుధవారం

ఏక్ తారలు..!!

1.   కన్నీరుని సైతం సిరాగా మార్చేస్తుంది_మనసు చేతిలోని కలమై...!!

2.   గుండె బడబానలంలా మండుతోంది_అనుబంధాల వెన్నుపోట్లకు...!!

3.   అనివార్యమైన అనుబంధమది_నాదైన ఏకాంతపు నేస్తంతో...!!

4.   కన్నీరే నేస్తమయ్యింది_కలికాలం అయినందుకేమెా...!!

5.   ఆగని పరుగు కాలానిదే_ఆనవాళ్ళను భవిష్యత్తుకు అందిస్తూ..!!

6.   స్వప్నంలో జీవితం కనిపించింది_నిశీథిని ఎదిరించే వెలుగుల్లో...!!

7.   ఆధిపత్యమెా జాడ్యం_అహమే అలంకారమనుకుంటూ....!!

8.   తిరస్కరణ మనసుకి చేరదు_చూపులక్కర్లేని ఆరాధన గుండెల్లో చేరితే...!!

9.  అమ్మ నేర్పిన అక్షరాలివి_ఆ ప్రేమంతా ఒలకబోయాలన్న తహతహ వాటికి..!!

10. మనసుదే అంతా_భావాలను హృదయపు సిరల్లో ముంచి రాయడంలో..!!

11.   ఆశ్రయమిచ్చే అక్షరముండగా చింతెందుకు_మది భారాన్ని భావాలకందించడమే...!!

12.   నవ్వులన్నీ నక్షత్రాలే_పసితనపు అమాయకత్వం చేరితే..!!

13.   మౌనానికి మనసయింది_నీ ఊహలతో ఊసులాడాలని...!!

14.   ఏకాంతం ఎదురుదాడి చేసింది_ఊహలు నిండిన మదిని గదమాయించేస్తూ...!!

15.   గమనించే సమయమివ్వనిదే కాలం_తనతోపాటు మనల్ని లాక్కెళుతూ...!!

16.   వెదకడం నీకలవాటేగా_ఎదుటనున్నా గురుతెరగక...!!

17.   తరలిపోనన్నాను_వెదికి నీవలసిపోతావని..!!

18.   వీడ్కోలెరుగని చెలిమి మనది_నీడలా వెన్నంటి ఉంటూ..!!

19.   అక్షరాలు సేదదీరుస్తున్నాయి_మనసు మౌనాన్ని పదాలకందిస్తూ...!!

20.  అవే అక్షరాలు_మనసు మర్మాలను పసిగట్టేస్తూ...!!

21.  వేదనాక్షరాలు కలిపాయి ఇలా_వేసారిన మనసుకు ఓదార్పునిస్తూ..!!

22.   ఊసరవెల్లి మనస్తత్వమది_కారకులెవరన్నది కనిపెట్టలేకున్నా...!!

23.   ఎంత ఆరాధన నింపాలో అక్షరాల్లో_నీ మనసుకు చేరవేయడానికి..!!

24.  నీ మదిలో కాస్త చోటు చాలదూ_అక్షరాలతో నే సేద దీరడానికి...!!

25.   కలలాంటి కథలోనే ఓదార్పు_వెతల సంకలనాల బతుకులకు..!!

26.   ఆలోచనల మార్పది_అక్షరాలవే అయినా..!!

27.    తలపులే శ్వాసగా మార్చేసిన క్షణాలవి_మరెటు మరలనీయని బంధమై...!!

28.   కడలే ఆదర్శమట_మదిలోని బడబానలాన్ని దాచేయడంలో...!!

29.   మౌనంతో సహవాసం చేస్తున్నా_నీ మాటలు ఆలకించాలని...!!

30.   అలసటే తెలియలేదు_మాటల మౌనం మధ్యన రాజ్యమేలుతుంటే..!!

ఒక మెలకువ సమీక్ష...!!

                                              " మనసున్న మనిషికి ప్రతిబింబం ఈ ఒక మెలకువ.."
             ప్రతి భావుకుడు తన పరిశీలనను నలుగురికి అందించే ప్రయత్నంలో సాహిత్యంలో ఏదోవొక మార్గాన్ని ఎంచుకుంటాడు. అలా కవిత్వాన్ని ఎంచుకుని లఘు ప్రక్రియల్లో, కవితలుగా తెలుగు సాహిత్యానికి అక్షర తూణీరాలను అందిస్తున్న ప్రముఖుల్లో పి శ్రీనివాస్ గౌడ్ ఒకరు.
         మనిషిలో మరుగున ఉన్న మరో మనిషిని వెలికితీసే యత్నమే ఈ " ఒక మెలకువ " . జీవితాన్ని ఎంతో కొంత మనం తెలుసుకుని ఎదుటివారికి తెలియజెప్పడం గురించి చక్కగా మొదటి కవిత ఎంతో కొంతలో చెప్తారు. మనసు కదిలిపోయినంత మాత్రాన ఎదుటి మనిషి కన్నీళ్లు  ఆగిపోతాయా? అని బతుకుదెరువు కోసం తోపుడుబండే జీవనాధారమైన వ్యక్తిని కర్కశంగా, పాశవికంగా శిక్షించడాన్ని నిరసిస్తారు ఒక నిప్పురవ్వ కార్చిచ్చు అయ్యే దృశ్యం కవితలో. చెప్పాలంటే చాలా ఉంది ఈ కవితలో చదువుతుంటే దృశ్యాలు అలా కళ్ళ ముందు కదలాడతాయి. కవి చాలా గొప్పగా ఆవిష్కరించారు వాస్తవ సంఘటనను. తర్కం గురించి నువ్వు - నేను ఒకటే కవితలో నాస్తిక, ఆస్తిక వాదాన్ని వినిపిస్తారు బహు లాఘవంగా. బడిలోని అమ్మ ఆయమ్మ గురించి రాసిన కవిత గురించి ఎంత  చెప్పినా తక్కువే. నే చదివిన మొదటి కవిత ఆయమ్మ గురించి, రాసిన మొదటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్.ఇంత వైవిధ్యమైన వస్తువును ఎంచుకున్నందుకు కవికి అభినందనలు. తుపాన్ ముందరి ప్రశాంతత గురించి చెప్పడానికి ఏమి ఉండదు, ఎంతోమందికి అనుభవపూర్వకమే. అది అక్షరాల్లో అద్భుతంగా చెప్పారు. ఆత్మ సౌందర్యాన్ని, మద్యం వలన నష్టాన్ని బాగా చెప్పారు. మగత కళ్ళతో పుస్తకాల్లో నిద్ర పేజీల్ని చింపడంలో చితికిన బాల్యాన్ని, ఆ పసి చేతులు చేస్తున్న కష్టాన్ని, వాడు పడుతున్న ఛీత్కరింపులను చాలా బాగా చెప్పారు అతనికి నిద్ర ఒక కల కవితలో. నది మనసుని అది ప్రవహించినంతమేరా చక్కగా చూపించారు మనకి కూడా. కులమత వర్గ వైషమ్యాలను చెప్తూ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు మన పిల్లలకు ఏ కానుకనిద్దామంటూవాడికి ముఖం లేదు కవితలో. కాసిన్ని అక్షరాల ఆసరాతో, ఒకే ఒక్క వీడలేని చూపుని, ప్రకృతిలో ప్రతి అణువులో నేనుంటానంటూ, అతని సమక్షంలో మరణం లేని జీవితాన్ని, మళ్లీ మళ్లీ అతనే గుర్తుకు రావడాన్ని, విస్తరిస్తున్న శిథిలాల మధ్య అస్తమిస్తున్న వాళ్ళని, వీడని జ్ఞాపకాలను దేదీప్యమానంగా, వాన చుక్కలు వాలడాన్ని ఇలా ప్రతి భావాన్ని చక్కగా అక్షర తూణీరాలుగా మలిచారు. ముంజ కవిత తాటికాయల్లో ఆ ముంజలు ఎలా ఉంటాయో, అబ్బా నిజంగా ఆ ముంజలు తిన్న పసితనాన్ని, ఆ మధురమైన రుచిని మళ్ళీ ఆస్వాదింపజేశారు తన కవితతో. బయటి ప్రయాణం గురించి మన అందరికి తెలిసిందే. లోపలి ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే ఈ కవిత తప్పక అందరు చదవాల్సిందే. రైతు మృత్యుకోత గురించి హృదయవిదారక వేదనను కోత కవిత చెప్తుంది. దృశ్యాలు.. కలలు.. ఆకాంక్షలు.. , పిల్లలు.. దేవుడు.. మరికొన్ని మాటలు.., మాటల్లేని మొండి గోడల మధ్య, వర్షం పడితే, చీకటి.. వెన్నెలా.., మనసు దుమ్మును దూలపమని ఒక మెలకువను, దూరమైనా అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ  ఏకాకి ప్రేలాపనను, తనను తాను తెలుసుకోవడాన్ని నువ్వొక లోయ-నీలమేఘమాయను కవితలుగా చక్కని వాస్తు శిల్పాలతో చెక్కారు. ఆమె.. ఇంకా అక్కడే ఉందా..? కవిత గురించి చెప్పడం చదివితే మీకు మనసు పొరల్లో ఎక్కడో ఓ జ్ఞాపకం మెదలడం ఖాయం. పల్లెకారుల కడగండ్లు, వారి జీవన విధానము కొట్టుబడి కవితలో కనిపిస్తుంది. ప్రకృతి ప్రణయ గీతాలు ఒక ఋతువు నుండి మరొక ఋతువుకి కవితలో వినవస్తాయి. తన అభిమానాన్ని చాటుకుంటూ మర్మయోగి గురించి, అక్షరాలా రెండక్షరాలు చేసే అద్భుతాన్ని, ఆబాలను సబలగా చేసి నలుగురికి ఆకలి తీర్చే అమ్మలా ఆ నలుగురు ఏం చేసారో చెప్తారు. వచ్చే రోజుల్లో, ఒక చావు- మరో అసహనం, ఆమె-నేను-కవిత్వం, దుఃఖం ఒక దూదిపింజ కవితలు చక్కని ప్రేమ, బాధలను చెప్పే కవితలు. మూడో తరం - మరిన్ని ప్రశ్నలు, మరణశయ్య మీద అమ్మకు, కారణ జన్ముడు, పసితనం ఓ వరం కవితలు కవి సున్నిత మనసుకు అడ్డం పడతాయి. వాక్యానికి వేయి ముఖాలు... అంటూ వాక్య పాదాల వద్ద కవితలో వాక్యం విలువను చక్కగా చెప్తారు. మిగిలే ఉంటుంది, జెన్ వచనాలు చక్కని అనువాద కవితలు.

     ఒక మెలకువ కవితా సంపుటిలో కవి పి శ్రీనివాస్ గౌడ్ చక్కని వైవిధ్యమైన వస్తువులతో, అద్భుతమైన భావాలను అందించడంతోపాటుగా, సమాజపు పోకడలను, మనుష్యులలో లోపిస్తున్న మానవతా విలువలను, ప్రకృతి అందాలను అక్కడక్కడా మెరిపిస్తూ, బాల్యాన్ని, కొన్ని జ్ఞాపకాలను, అమ్మను అందరికి గుర్తు చేయడంలో కృతకృత్యులయ్యారు. ఇంత చక్కని వచన కవిత్వాన్ని అందించిన శ్రీనివాస్ గారికి మనఃపూర్వక అభినందనలు. 

అక్షర స(వి)న్యాసం ఆవిష్కరణ..!!

వంకాయలపాటి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా అక్షర స(వి)న్యాసం ఆవిష్కరణ ఒక కవి రెండు కవితలు సభలో ఆహ్లాదంగా జరిగింది. సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు..



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner