4, ఆగస్టు 2021, బుధవారం
సాగుబడి పుస్తక సమీక్ష...!!
స్వచ్ఛమైన మనసు సేద్యమే ఈ అక్షర " సాగుబడి "
ఇంటి బాధ్యతలనే సక్రమంగా నిర్వర్తించలేని మనుష్యులున్న ఈ రోజుల్లో సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా " ప్యూర్ " సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, సాహిత్యంలో సరికొత్త ప్రయెాగంతో మన ముందుకు తీసుకు వచ్చిన సంధ్య గోళ్ళమూడి గారి పుస్తకం " సాగుబడి ". ఆటవెలది పద్య రూపంలో మన నిత్య ఆహార పంటలను, అక్షర పంట రూపంలో మనకందించడం, అదీ రెండు భాషలలో ఏకకాలంలో ఒకే పుస్తకంలో తీసుకురావడమన్న విషయం నిజంగా అందరు అభినందించదగ్గ విషయం.
ముందుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అందరం నమ్ముతాం కనుక వరిపంటను, అది పండించే ప్రదేశాలను, పంటకు అనువైన కాలాలను మెుదలైన విషయాలను చక్కని ఆటవెలదులుగా అందించారు. తరువాత కంది, మినుము, పెసర, మెుక్కజొన్న, పొద్దుతిరుగుడు, పసుపు, చెరకు, పత్తి వంటి నిత్యావసర వాడుక పంటలను వాటి వివరాలను అందించారు. పండ్ల తోటల సాగును వచనంలో వివరించి బత్తాయి, జామ, సీతాఫలం, బొప్పాయి, పనస, సపోటా, మామిడి వగైరా పండ్ల పంటల వివరాలను చక్కని ఆటవెలదుల పద్యాలుగా చెప్పారు. పూల పంటల సాగును వచనంలో వివరిస్తూ గులాబి, బంతి పూల సాగును అందమైన ఆటవెలదులుగా అక్షరాల్లో తీర్చి దిద్దారు. చివరిగా మనిషికి అత్యంత ఉపయెాగకరమైన ఒౌషద వృక్షం వేప గురించి వచనంగాను, పద్యంగాను వివరించి, అన్ని పంటలకు రక్షణ కవచమైన కంచెను గద్యంగా అందించి " సాగుబడి "ని సంపూర్ణం గావించారు.
ఓ పక్క ఆంగ్లం, మరో పక్క తెలుగులో చక్కని తేలిక పదాలతో, అందరికి అర్థమయ్యే భాషలో సాధారణంగా అందరికి తెలిసిన పంటలను, వాటి మూలాలను, ఉపయెాగాలను వివరించడం ఇప్పటికి వరకు ఎవరు చేయని పని. నిరంతరం సేవా కార్యక్రమాలలో, ఓ క్షణం కూడా తీరిక లేకుండా, వయసు, ఆరోగ్యంతో కూడా సంబంధం లేకుండా కాలంతో పోటి పడే " అమ్మ " కు ఇంత అందంగా అక్షర సేద్యం చేయడానికి ఎలా తీరిక చిక్కిందో! నాకైతే పుస్తకం చదువుతున్నంతసేపూ ఆశ్చర్యమే అనిపించింది. ఈ అక్షర వ్యవసాయానికి పాదాభివందనం చెప్పడం తప్ప మరో మాట లేదు. " సాగుబడి "కి సంధ్య గోళ్ళమూడి గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
వర్గము
సమీక్ష
మనిషి - బాధ...!!
నేస్తం,
మనలో బాధ, భయం, అసహనం, కోపం ఇలా ఎన్నో రకాల భావాలుంటాయి. అన్ని చోట్లా అన్నింటిని చూపలేం. ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పుడూ మనమే బాధ పడతాం. మన మూలంగా వారు బాధ పడుతున్నారని తెలిసినా మనమే బాధ పడతాం. దీనంతటికి కారణం మనసు. అది లేకపోతే ఏ గోలా లేదు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా, మన బాధలకూ బోలెడు కారణాలు. మహా భారతంలో శ్రీకృష్ణుడు చాలా తేలికగా బాధను త్యజించమని చెప్తాడు. ఎదుటివారి తప్పులను క్షమించమంటాడు. మనం క్షమించడమే వారి పతనానికి తొలిమెట్టు అని చెప్తాడు. చెప్పినంత సుళువు కాదుగా వదిలేయడం. పడేవాళ్ళకు తెలుస్తుంది. ఒడ్డున ఉండి రాళ్ళేయడమేముంది. పడినవాళ్ళను లేపడమే కష్టం.
సమస్యకు లొంగిపోవడం అనేది మన ఓటమి. గెలుపోటముల సంగతి పక్కనబెట్టి సమస్యతో పోరాడటం మన నైతిక విజయం. బాధ మనకే, శిక్ష మనకే అంటే ఎలా? బాధ పెట్టినవారికి ఆ బాధను తెలియజేయాలి. అంతే కాని మనమే బాధను భరిస్తూ ఉండకూడదు. శాంతి ప్రవచనాలకు, అనుభవాలకు చాలా తేడా ఉంటుంది. బాధ ఏ మనిషికైనా, మనసుకైనా ఒకటేనని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం? మనం వంద మాటలన్నప్పుడు ఎదుటివారు మాట అనగానే మనకు బాధ, కోపం వచ్చినప్పుడు, అదే పరిస్థితి ఎదుటివారికి వస్తుందని మర్చిపోతే ఎలా! వేలెత్తి చూపడం చాలా తేలిక. మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయని మర్చిపోతాం. మనుష్యులం కదా, ఇది మన నైజం. మాట అనే ముందు ఆలోచించాలి. పడతూ ఉన్నారని పదే పదే అంటే...సమాధానం చెప్పడం చేతకాక కాదు, ఎదుటివారు మీకిచ్చిన విలువని గుర్తించండి. అహం, అధికారం మన ఆస్తులనుకుంటే, రేపటి రోజున కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేకుండా పోతుంది. ఇంటివారిని మానసికంగా, శారీరకంగా హింసించి, వారి ఆక్రోశానికి కారణమైన ఎవరూ బాగుపడరు.
" మన ప్రవర్తన గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది. ప్రపంచం ఇచ్చే కితాబులకన్నా ఇంటి మనుష్యులు సంతోష పడితే సిరులన్నీ నీవే."
వర్గము
కబుర్లు
2, ఆగస్టు 2021, సోమవారం
కాలం వెంబడి కలం..65
నేను ఆఫీస్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే హెచ్ ఆర్ మానేజర్ మిలి వెళిపోయింది. జయ హెచ్ ఆర్ మానేజర్ అయ్యింది. రిసెప్షనిస్ట్ జ్యోతి బాగా క్లోజ్ అయ్యింది నాకు. కబుర్లు చెప్పినా వర్క్ చేయిస్తున్నానని నాకు బోలెడు నిక్ నేమ్స్ కూడా పెట్టేసారు. వెనుక తిట్టుకున్నా నాతో అందరు బానే ఉండేవారు. సుబ్బలక్ష్మి బాగా క్లోజ్ గా ఉండేది. ఆఫీస్ రాజకీయాలు షరా మామూలే. అనురాధ నాతో బావుంటూనే తన అవసరం కోసం నామీద చెప్పడం చేసి మెుత్తానికి తన సాలరీ పెంచించుకుంది. నాముందు అరి కేసరి కూడా ఆవిడతో చాలా ఆత్మీయంగా మాట్లాడం చేసేవారు. మా సీనియర్ చెల్లెలు ఈవిడ. అరి కేసరికి గ్రీన్ కార్డ్ రావడం, అది నాకు చూపించడం, CMMi సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు మెుదలు కావడం జరిగాయి. ఓ రెండు రోజులు ట్రైనింగ్ క్లాసులతో మెుదలుబెట్టి ఆ CMMi Level 3 సర్టిఫికేషన్ కోసం టీమ్ ఏర్పాటు చేసి, డాక్యుమెంటేషన్ మెుదలుబెట్టారు. విక్రమ్, ఆనంద్ డాక్యుమెంట్ రైటర్స్ గా వచ్చారు. అప్పుడే వాణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడ బిజినెస్ టీమ్ లో ఉండేవారు. మెుత్తానికి APSPD sale ప్రాజెక్ట్ సంపాదించి, ఆ ప్రాజెక్టు కోసం విజయవాడ నేను, వాణి గారు, విక్రమ్, ఆనంద్ వచ్చాము. నాకు TA, DAల గురించి ఏమి తెలియదు. వాళ్ళు హోటల్ లో ఉన్నారు. నేను సాయంత్రం వరకు అన్ని పనులు చేసి ఇంటికి వచ్చేసాను ఆ రెండు రోజులు. నాకు అప్పగించిన పని నేను కరక్ట్ గానే చేసాను. అందరితో అప్లికేషన్స్ ఫిల్ చేయించి, అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోవడం. అవన్నీ నా వంతు నేను చేసాను. తర్వాత వాళ్ళు లెక్కలేవో చూసుకుని నాకు ఓ 1000 రూపాయలు మాత్రం ఇచ్చినట్టు గుర్తు.
తర్వాత వైజాగ్ EPD sale ISO quality ఇన్స్పెక్షన్ కోసం అనూరాధ, నేను, విక్రమ్, ఆనంద్ వెళ్ళామనుకుంటా. వైజాగ్ నుండి విజయవాడ వరకు చూసుకుంటూ వచ్చాము. విజయవాడలో ఇంటికి తీసుకువచ్చి, ఆవిడని హైదరాబాదు బస్ ఎక్కించాను. ఆ తర్వాత ఆవిడ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకులే అని నేను కాస్త దూరంగా ఉండేదాన్ని. CMMi కోసం నేను, అనూరాధ అన్ని చూసేవాళ్ళం. తర్వాత ప్రాజెక్ట్ మానేజర్ గా దుర్గ గారిని తీసుకున్నారు. మెుత్తానికి కష్టపడి cmmi Level 3 సర్టిఫికేట్ సంపాదించారు. తర్వాత పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీ లో మాకందరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు. అప్పుడు సుబ్బరాజు ఇండియా వచ్చారు. నాకు స్టేజ్ మీద సర్టిఫికేట్ ఇస్తూ, మీతో మాట్లాడాలి తర్వాత కలవండి అని చెప్పారు. తర్వాత మాట్లాడినప్పుడు ఆఫీస్ విషయాలు అడిగితే జరిగిన విషయాలు చెప్పి, మీ జాగ్రత్తలో మీరుండండి అని చెప్పాను. నాకు సాలరీ చాలా తక్కువే ఇచ్చేవారు. సాలరీ విషయం నేను చూసుకుంటాను, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అక్కడి నుండి నేను పంపిస్తాను అని చెప్పారు. కాని ఒక్క రూపాయి కూడా పంపలేదు ఎప్పుడూ.
అమెరికాలో మా ఇంటి పక్కన ఉండే రెడ్డి అంకుల్ ఇండియా వచ్చి, నన్ను కలిసి తన ఇల్లు శ్రీనగర్ కాలనీలో ఉందని, అక్కడికి రమ్మని బలవంత పెట్టి, ఆ భూత్ బంగళాకు నా మకాం మార్చారు. వాణి గారి అపార్ట్మెంట్ కు దగ్గర అది. అప్పుడప్పుడూ నేను, వాణి గారు, జ్యోతి కొత్త సినిమాలకు వెళుతూ ఉండేవాళ్ళం.
అంకుల్ భూత్ బంగళాలో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉండేది. అయినా ఉండటానికి అలవాటు పడ్డాను. తర్వాత తర్వాత అంకుల్ అసలు రూపం తెలిసింది. హంట్స్ విల్ లో అందరు ఈయన గురించి చెప్పినవి నిజమని, ఆంటీ చెప్పిన ప్రతి మాటా నిజమని, ఈయన మూలంగానే ఆవిడ మైండ్ అలా అయ్యిందని, ఈయనే ఆవిడకు ట్రీట్మెంట్ చేయించకుండా అలా చేసారని అర్థం అయ్యింది. నన్ను బాగా ఇబ్బంది పెట్టారు.
పిల్లల అల్లరి తట్టుకోలేక సరదాగా సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ లో స్కేటింగ్ లో జాయిన్ చేస్తే మౌర్య బాగా చేసేవాడు. శౌర్య అల్లరోడుగా, ఆటగా చేసేవాడు. స్కేటింగ్ లో జాయిన్ చేసిన మూడు నెలలకే స్టేట్ కాంపిటీషన్ కి సెలక్ట్ అయ్యాడు మౌర్య. హైదరాబాదు అందరు సరదాగా వచ్చారు. అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళు BHEL దగ్గరలోఉండేవారు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు వీడి స్కేటింగ్ తోనే సరిపోయేది. వెళ్ళడానికి కుదరక తనను రమ్మంటే, తను, వాళ్ళ తోడికోడలు రాధక్క స్టేడియం దగ్గరకు వచ్చారు. దానికి ఆవిడ ఇప్పటికి దెప్పుతూనే ఉంటుంది వాళ్ళింటికి రాలేదని. తర్వాత వెళ్ళలేని పరిస్థితిలో కూడా కొత్తింటి ఫంక్షన్ కి అమ్మమ్మని తీసుకువెళ్ళినా అది గుర్తులేదావిడకు. చెప్తే చాలా ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకోవడమే. మాటల్లో ప్రేమ చూపించడం కాదు చేతల్లో ఉండాలి.
" దూరం అనేది ఎవరికయినా ఒకటే. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన దూరం సమానమే. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
1, ఆగస్టు 2021, ఆదివారం
మాట సమీక్ష
మాటే మనిషికి వరమూ..శాపమూ..!!
మాట రెండు అక్షరాలే కాని ఆ మాటలో దాగున్న జీవిత సత్యాలెన్నో. మన పంచమ వేదమైన మహాభారతంలోని పదునెనిమిది పర్వాలకూ ఉన్న విశిష్టత చిన్ని నారాయణ రావు గారు రాసిన "మాట" దీర్ఘ కవితకు ఉందనడంలో అసత్యమేమీ లేదని ఈ "మాట"ను చదివిన నాకనిపించడంలో విడ్డూరమేమి లేదు. పలుమార్లు సాహితీ వేదికల మీద చిన్ని నారాయణ రావు గారిని చూడటం, నేస్తం వారి మాటలు వినడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు వారి మాటలు ఎందుకు అంత ఆచితూచినట్లుగా ఉంటాయెా. ఈ " మాట " దీర్ఘ కవిత చదివిన తర్వాతే మాటలోని మర్మం తెలిసింది.
మహభారతంలోని ఆది పర్వంలో చెప్పబడినట్లుగానే "మాట" పూర్వాపరాల గురించి, మాట ఔచిత్యం గురించి వివరిస్తూ పలువురు పెద్దలను, న్యాయస్థానములో మాట విలువను సూఛాయగా చెప్పడంతో మాట మెుదటి భాగం మెుదలౌతుంది.
"మౌనం విజయానికి కాబోదు
సంకేతం...
మాటే గురి పెట్టి నడిపే
మహోన్నత మార్గం "
మాట విజయానికి సంకేతంగా మారడాన్ని, కొందరి కంచు కంఠాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతునే ఉన్నాయని, కళారంగంలో మాట ప్రాముఖ్యతను గుర్తు చేసారు. మాటే అన్నింటికి మూలమని మాటలోని గుట్టును కాస్త చెప్పారు.
కాలజ్ఞానం అందరికి చేరినా, మనకు వినోదాన్నిచ్చే చలనచిత్ర, నాటక రంగాలలో మాట వాడి, వేడి గురించి చెప్తూ, మాటలే మనసులను దోచే పాటలుగా మారడం, మాటే మన మిత్రుడు, శత్రువు కూడా అని చెప్తూ, మన తోడూనీడా మాటేనంటారు. మాట భావ ప్రకటన మాత్రమే కాదు మన వ్యక్తిత్వానికి ప్రతీక అంటారు. నిజమే కదా అది. మాట మనసు గాయాలను మాన్పే ఔషదమౌతుంది. కొడిగట్టిన ప్రాణాలను నిల్పే శక్తి మాటకు మాత్రమే ఉందంటూ, బతుకు చిరుగులను దాచే దివ్య ఔషదం మాటనడం చాలా బాగా నచ్చింది.
మాటే లోకం, మాటే మనిషిని నడిపించే యంత్రం, మాటే అన్నింటికి మూలమంటూ, మాటే మనిషిని అందలాలు ఎక్కిస్తుంది. ఆ మాటే మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుందన్న హెచ్చరిక కూడా అంతర్లీనంగా చేస్తారు.
మట్టిభాష నుండి మహాభారతంలోని శ్రీమద్భగవద్గీత వరకు మాట గొప్పదనం గురించి గుర్తు చేస్తారు. అమ్మ మాటలోని ఆనందాన్ని, నాన్న పలుకులోని బాధ్యతను మనకు తెలియజేస్తూ, గురువు నేర్పిన చదువుతో.. బంధాలను, అనుబంధాలను అల్లుకున్న మాట మనిషికి జీవనాడిగా మిగిలిందంటారు.
ప్రేమ, ద్వేషం, బాధ, సంతోషం, కోపం ఇలా ప్రతి దానికి కారణమైన మాట మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. న్యాయాన్యాయాలను బేరీజు వేయడానికి, అమాయకత్వానికి, విరుచుకు పడే కడలి కెరటంలా మారడానికి మాటే కారణమంటారు.
మాట నిలబెట్టుకోవడం, మాట దాటటం వలను కలిగిన ఇబ్బందుల గురించి మనకు మరోమారు శ్రీరాముడి నుండి లక్ష్మణరేఖ దాటిన సీత, తదుపరి పరిస్థితులను ఒక్కమాటలో గుర్తు చేస్తారు.
పురాణ, ఇతిహాసాల నుండి మనిషి మనుగడకు మూలాధారమైన " మాట " ముత్యంలా మెరవాలన్నా, మురికి కూపంలో పడిపోవాలన్నా మాటే కారణమంటారు.
చక్కని అలతి పదాలతో రెండక్షరాల "మాట"ని పదునెనిమిది భాగాలుగా వివరించడం చాలా కష్టమైన పని. ఇంత కష్టమైన పనిని సుళువుగా చేసేసిన చిన్ని నారాయణ రావు గారికి హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
