6, ఏప్రిల్ 2023, గురువారం

రెక్కలు

​1.  పదాలు 

కావివి

మనసు

మౌనాలు


పరిచయమున్న

కల’వరింతలు..!!

2.  మరపు

మనసుకి తెలియదు

సంద్రం

దేనిని వద్దనదు


కాలం

నిర్విరామం..!!

3.  పరిచయం 

క్షణకాలమే

బంధం

అచిరకాలం


అక్షరమైత్రి

అజరామరం..!!

4.  తడబడే

అడుగులు

తెలిసిన

గమ్యము


పాదాలెప్పుడూ పసివే 

వయసుడిగినా..!!

5.  చిత్తం

చిత్రమైనదే

అనంతం

అంతుచిక్కనిది


కాలం

చురుకైనది..!!

6. చాటుమాటు

బతుకులు

సన్నాయి

వాయిద్యాలు


మహా గొప్ప

వ్యక్తిత్వం..!!

7.  అబద్ధానికి

అండెక్కువ

నిజమెప్పుడూ

ఒంటరే


కాలమే

తీర్పు..!!

8.  దారులు

బహు విధాలు

రహదారి

ఒక్కటే


ఎంచుకోవడమే

విజ్ఞత..!!

9.  ఒకప్పుడు

నమస్కారం

ఇప్పుడు

కరచాలన ఆలింగనాలు


ఆధునికత

పల్లెల్లోనూ..!!

10.  దయదలిస్తే

ఇంటికూడు

కాదంటే

చిప్పకూడు


మదపుటేనుగైనా

మావిటికి మాలిమే..!!

11.  విజన్

కలిగినోడు

ప్రిజన్ లో

ఉన్నోడు


నాయకుడు

ఎవరు..?

12.  ఏలిముద్రల

ఇలువ

సదూకున్నోడి

సంస్కారం


అధికారానిది

రాజభోగమే..!!

13.  పిల్లలు

తల్లిదండ్రులు

అనాథలు

ఎవరు?


ఆశ్ర(యా)మాలు

అవసరమెవరికి..?

14.  ఎవరు

ఎవరిని పోషించారు

ఎవరిది

ఎవరు తింటున్నారు


పైవాడికన్నీ

ఎరుకే..!!

15.  పెంచుకుంటే

దూరం

పంచుకుంటే

అనుబంధం


నిర్ణయం

మనదే..!!

16.  పెద్ద

కల

చిన్న

ఆశ


అవసరం

మింగేసింది..!!

17.  కూర్పుకు

ఓర్పు

భాషకు

నేర్పు


వాగ్దేవి

వరమే..!!

18.  వరమైన

శాపం

మనసుని

ఓదార్చడం


కాలంతో స్నేహిస్తున్న 

అక్షరాలు..!!

19.  కొన్ని బంధాలకు 

తులసినీళ్ళు వదిలేయడమే

అనుబంధాలను 

సం’బంధాలుగా మార్చేసాక


కాలానికి

అతీతులు కారెవ్వరూ..!!

20.  ఏమున్నది

ఏ బంధంలోనైనా

ధనసం’బంధం

మనదయ్యాక


బుుణపాశాలు

వీగిపోతున్నాయి..!!

21.  ముడుపుల

చెల్లింపు

పాలెస్

ఫ్యూచర్


ఆకాశయానం

ఆంతర్యం..!!

22.  చీమా

పామా

ఏ గుట్టలో

ఏ గుట్టుందో


పెట్టించింది

పైవాడే..!!

23.  వాయిదాలు

వద్దనలేము

తీర్మానాలు

చేయకుండలేము


బతుకు

భయమది..!!

24.  మాజీలు

అవడం

తాజాలు

కావడం


కాలం 

గారడీ..!!

25.  న్యాయానికి

ఒకే దారి

అన్యాయానికి

రాచబాటలు కోకొల్లలు


వ్యవస్థలు

అధికారానివే..!!

26.  అక్రమం

సక్రమం

ఏదైనా 

ఓ క్రమమే


ని’ర్వచనమే

తేడా..!!

27.  దాటించడం

దాటేయడం

సుళువైన 

పనే


కొందరికే అబ్బే

చతురత..!!

28.  దార్శనికత

కనబడుట లేదు

దరిద్రం

వద్దన్నా వెంటబడుతూనే వుంది


కలి

ప్రభావం..!!

29.  సాక్ష్యం

చెల్లదు

అభియోగం

అత్యం బలమైనది


నేటి

వ్యవస్థ..!!

30.  ఏలిముద్రల

ఎకసెక్కాలు

మేధావి

మౌనం


వ్యక్తిత్వం

తేటతెల్లం..!!

5, ఏప్రిల్ 2023, బుధవారం

అవ్యక్తం నవమల్లెతీగలో

​ధన్యవాదాలు కలిమిశ్రీ గారికి



జీవన మంజూష ఏప్రియల్ 23

​నేస్తం,

         బంధాలు, అనుబంధాలు అనేవి మనం పెంచుకునేదాన్ని బట్టి వుంటాయి. వీటికి ప్రాణమున్న జీవులా లేదా వస్తువులా అని వుండదు. ఈ సృష్టిలో బంధాలు సుళువుగానే ఏర్పడతాయి, తెగిపోతాయి. కాని అనుబంధం ఏర్పడితే అంత సుళువుగా తెంచుకోలేము, అది వస్తువయినా, మనిషయినా, జంతువయినా, మెుక్కయినా. దీనికి సమయంతో పని లేదు. క్షణాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి మనం వాటితో గడపనక్కర్లేదు. కొన్ని పరిచయాలు అనుబంధంగా మారడానికి క్షణాల సాహచర్యం సరిపోతుంది. మరికొన్ని బంధాలు సంవత్సరాల తరబడి కలిసున్నా అనుబంధంగా మారలేవు. వీటికి మనసుల మధ్యన ఆంతర్యాలు, అపోహలు కారణాలుగా మిగిలిపోతున్నాయి.

           ఈరోజుల్లో పిల్లలు, పెద్దల మధ్యన దగ్గరతనం అంతగా వుండటం లేదనే చెప్పాలి. ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చి అనుబంధాన్ని తనతోనే తీసుకు వెళిపోతోంది. అమ్మానాన్న లేకున్నా పిల్లలు పట్టించుకోరు కాని, సెల్ ఫోను లేకపోతే వారికి ప్రపంచమే చీకటిగా మారిపోతున్న రోజులివి. అమ్మానాన్న అవసరాలకు మాత్రమే అనుకుంటూ, కాలంతోపాటుగా తామూ పరిగెడుతున్నామని సంబరపడిపోతున్నారు. మనమేమో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకి ఆ కష్టం తెలియకుండా వుండాలని, వారు అడిగినవి సమకూర్చే పనిలో పిల్లలను పట్టించుకోవడం తగ్గించేస్తున్నాం. ఇది ఇలానే జరుగుతూ పోతే మన పిల్లలు కూడా మనల్ని గుర్తించని పరిస్థితి రావచ్చేమో రేపటి రోజున.

           కాలానికి కట్టుబడిపోతూ మనమూ ఆ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. దానినే పురోభివృద్ధి అనుకుంటున్నాం. సాంకేతికంగా ఎదుగుదల మంచిదే కాని మనిషి మనుగడకే ప్రమాదకరమౌతున్న శాస్త్రీయత ఎంతవరకు మంచిది అన్న ఆలోచన కూడా పొడజూపుతోందిప్పుడు. రాతియుగం నుండి నేటి అంతరిక్ష పయనం వరకు చూసుకుంటే మనిషి మేధస్సు ఎంతో అభివృద్ధి చెందింది. మానవ జీవన అవసరాలకు అనుగుణంగా. కాకపోతే ఈ మేధస్సు కొందరి వికృత ఆలోచనలకు పరాకాష్ఠగా ప్రపంచ వినాశనానికి, మానవ మనుగడకు ప్రమాదకారిగా మారుతోంది. 

              ఏదేమైనా అతి అనర్ధదాయకమన్నది మాత్రం నిజం. అది ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. సమాజం బావుండాలంటే సదరు వ్యక్తుల మధ్యన సత్ సంబంధాలు నెలకొనాలి. అది ఇంటా బయటా కూడా వుండాలి. మనం మాత్రమే బావుంటే చాలన్న ఆలోచన నుండి మనతోపాటా మరో నలుగురు కూడా బావుండాలని కోరుకునేంతగా మనం ఎదగాలి. ఆధునికంగా ఎదగడం కాదు అనుబంధాలతో ఎదగడంలోనే అసలైన ఆనందం వుంటుందని మనమెరిగిన నాడు మనిషిగా మనం గెలిచినట్లే..!!






 

చెప్పలేనితనం..!!

​బాధ్యత 

భరించలేనంత

బరువుగా మారుతుందని

బంధానికి తెలియలేదప్పుడు


కష్టాన్ని

ఇష్టంగా మలుచుకుంటే

నష్టపోతున్న కాలం 

మృష్టాన్న భోజనాన్ని తలపిస్తుందేమో


కోపం

శాపంగా మారక మునుపే

శాంతం చుట్టమైతే

భారం మనసు భరించేస్తుందేమో


ముందు తరానికి

మునుముందు వారసత్వానికి

నడుమ మిగిలి నలుగుతూ

నవ్వుల కన్నీరు అలంకారమైందిప్పుడు


వెలుతురు చుక్కలు

రాతిరి రవ్వల రేఖలు

ఏ కాంతి పుంజాలను తలపిస్తాయోనని

ఆశల ఆకాశాన్ని అడిగేయడమే..!!

2, ఏప్రిల్ 2023, ఆదివారం

ఏమో..!!

​ఆంతర్యాన్ని

ప్రతి క్షణమూ

సముదాయిస్తూ

రాసానేమో..


అక్షరాల

సహవాసంతో

శూన్యమూ

చుట్టమై పోయింది..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner