16, డిసెంబర్ 2010, గురువారం

వందనం అభివందనం!!

నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని.చిన్నప్పుడు కధలు మాత్రమే చదివేదాన్ని. కొంచం పెద్ద అయిన తర్వాత రచయితల, రచయిత్రుల ముఖాముఖి చదువుతూ అబ్బో భలేగా రాస్తున్నారు...పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఎంత బాగా చెప్తున్నారో!! అనుకునేదాన్ని.
ఇప్పుడు మొదట్లో బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పుడు అస్సలు నా బ్లాగు ఎవరైనా చూస్తారా!! చదువుతారా!! అనుకునేదాన్ని. ఏమి రాయాలో కూడా తెలియదు, ఎలా రాయాలో కూడా తెలియకుండా ఏదో రాయడం మొదలు పెట్టేసాను. కొన్ని రోజులు ఐనంక కొన్ని బ్లాగులు చూసి ఎంతమంది బ్లాగు చూసారో అని తెలుసుకునే లెక్కల పట్టిని అమర్చాను. తర్వాత కూడలి లో చేరడం, బ్లాగు మిత్రుల పరిచయం,ఇలా మిగిలినవి ఒక్కొక్కటిగా బ్లాగు మిత్రుల సహాయంతో మార్చుకుంటూ వచ్చానన్న మాట. గూగులమ్మ కుడా బాగా సహాయపడింది ఈ విషయంలో....!!
రాయడం మొదలు పెట్టిన కొత్తలో......ఏమి రాస్తే ఏమంటారో అని భయం!! కొన్ని బ్లాగుల్లో కామెంట్లు చూసి అలా అనిపించేది లెండి. ఇంకేముంది ఏమైతే అది అయ్యింది నాకు అనిపించింది రాస్తే పోలా!! అని అలా రాయడం మొదలయ్యింది....కవితలు, కబుర్లు, నిజాలు, ఇలా ఒకటేమిటి...అనిపించినవి, అనుకున్నవి అక్షర రూపంలో రాయడం వాటికి కామెంట్లు వస్తే బోల్డు సంతోషం తో పొంగిపోవడం...కామెంట్లు రాకపోతే అయ్యో ఈ టపా ఎవరికీ నచ్చలేదేమో!! అని కొద్దిగా బాధ పడటం...కామెంట్లకి సమాధానం రాస్తూ ఓ పేద్ద రచయిత్రిని అయిపోయానని ఇంకా పేద్ద ఫీలింగ్ తో...అప్పటి ముఖాముఖిని గుర్తు చేసుకుంటూ నిజంగా భలే వుంది ఆ అనుభూతి!! నేనూ...ఈ అంతు తెలియని మహాసముద్రంలో ఓ చిన్న నీటి బిందువునైనందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నా ఈ ఆనందానికి కారణమైన.... నన్ను, నా బ్లాగుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనం అభివందనం!!

ఓ మౌనమా!!

మాటలకందని మౌనం...భాషలకందని భావం...
మనసులోని ఊహలకు తెలియని మరో రూపం...
లిపిలేని మౌనాభినయానికి అక్షరరూపం ఇద్దామంటే....
ఓ మౌనమా!! ఇంతకీ...మౌనం అంటే...!!
అంగీకారమా!! అనంగీకారమా!!
అర్ధాంగీకారమా!!

15, డిసెంబర్ 2010, బుధవారం

మరల మరల పలకరించే.....!!



తొలి వలపు తీయదనము
తొలి ముద్దు తీయందనము
మలి పొద్దులో మరల మరల
పలకరించే మధుర జ్ఞాపకమే!!

14, డిసెంబర్ 2010, మంగళవారం

స్వప్నమో కాదో...!!

కలో కలవరమో తెలియని
అయోమయంలో నిదుర కాని
మెలుకువ లోని ఒక స్వప్నం
వేకువలో నిజమయ్యేనా!!
కమ్మని అమ్మ లాలి పాట
నను పరవశింప చేసేనా!!
అమ్మ చల్లని చేతి స్పర్శలోని
వెచ్చదనం నా కందేనా!!
కలైన ఈ కలవరింత లోని
కమ్మదనం, అమ్మదనం అచ్చంగా నాదైతే!!
మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు
వేకువ పొద్దులో నిజమౌతాయి....!!

13, డిసెంబర్ 2010, సోమవారం

తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ కొన్ని కబుర్లు.....

నిన్నటి తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా కలిసిన తెలుగు బ్లాగర్లు కొంతమంది...కిందనుంచి కుడినుంచి భార్గవగారు, శ్రీనివాస్ గారు, తాడేపల్లిగారు, నరసింహంగారు, జ్వాలాముఖిగారు, రావుగారు, జ్వాలాముఖి గారి స్నేహితులు, పైన ఎడమ నుంచి శ్రీనివాసరాజు, రహ్మానుద్దిన్ షేక్ గారు, రవిచంద్రగారు, రవిచంద్ర అర్ధాంగి నీలిమ, మంజు, మాలాకుమార్ గారు, ఉమగారు....ఫోటోలో సుజాత గారు లేరు ఎందుకంటే ఆవిడే ఫోటో తీసారు...-:).
కొద్దిగా అంటే బానే ఆలస్యంగా అందరూ వచ్చారు.ముందుగా నేను లోపలి వెళ్ళేటప్పటికే నరసింహం గారు తెలుగు బ్లాగర్ల కోసమా అని అడిగారు.ముందుగా నాకు ముఖ పరిచయం అయినది నరసింహం గారితోనే. చాలా సేపు ఎదురు చూసిన తరువాత రావు గారు పలకరించారు.ఈ లోపల మాలానే అందరికోసం వెతుక్కుంటున్న మాలాకుమార్ గారు కనిపించారు. మా పరిచయాలయిన తరువాత మిగిలిన వాళ్ళు అందరూ కలిసారు. బ్లాగుల గురించి, ఈ తెలుగు స్టాల్ గురించి చర్చించారు. ఆఖరులో జ్యోతిగారు కుడా వచ్చారు....ఇవండీ కృష్ణకాంత్ పార్కులోని నిన్నటి సాయకాలపు కొన్ని కబుర్లు.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner