6, సెప్టెంబర్ 2026, ఆదివారం

జీవన మంజూష 09/26




 నేస్తం,

           మన ప్రవర్తనకు, మనం ఇతరులకు చెప్పే విషయాలకు అస్సలు పొంతన కుదరకపోతే ఎలా? మనమేంటో ఎదుటివారికి తెలియదు సరే, మనమేంటో మనకి తెలుసు కదా. అయినా ముసుగులో గుద్దులాటలు అవసరమా! మనం బతికే నాలుగు రోజుల భాగోతానికి ఇన్ని నటనలు, నాటకాలు ఎందుకంటావ్? “అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదాఅన్నట్టు మన గురించి మనకు, మనని ఎరిగినవారికి అందరికి బాగా తెలుసు. నటనేదో, నిజాయితీ ఏదో తెలుసుకోలేనంత మాయలో ఈరోజుల్లో జనాలు లేరు. ఒకవేళ అలా అని మనమనుకుంటే అది మన భ్రమే అవుతుంది.మనకు లేని లక్షణాలను వున్నట్లుగా ఊహించుకోవడం అతిశయోక్తి అలంకారాన్ని గుర్తు చేయడమే కదా.

            అమ్మని కూడా అమ్మకానికి పెట్టేంతగా ఎదిగిన మన నైతిక విలువలు.. అవధులు లేని ప్రేమల గురించి, ఆత్మీయతలు, అనుబంధాలు, రక్త సంబంధాల గురించి మాట్లాడటం నిజంగా వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా వుంటుంది. మనం మనలా వుండి, మన అసలైన వాస్తవ రూపాలతో బతికేద్దాం. లేనిపోని రంగులు, హంగులు పులుముకుని నటించినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే మన నైజమేమిటన్నది మనకన్నా వారికే బాగా తెలుసు కాబట్టి. నిజంగా నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. అవధులు లేని ప్రేమ గురించి తెలియడం పక్కనబెడితే అసలు నీకంటూ చేయందించి, నిన్ను స్థాయికి తెచ్చిన చేతికి తిరిగి నీ చిటికెన వ్రేలు కూడా అందించని నువ్వు ఇలా ప్రేమలు, ఆప్యాయతలు అంటూ మాట్లాడటం చూస్తే పగలబడి నవ్వాలనిపిస్తోంది. మరీ ఇంతలా జనాలను నవ్వించడం అవసరమా మనకి?

              సినిమాల్లో నటనలకు ఆస్కార్ అవార్డు అత్యంత గౌరవప్రదమైనది. నిజ జీవితంలో అంతకన్నా బాగా నటించే నటులకు అవార్డులు సరిపోతాయో మరి. మనిషిలో లేని నిజాయితీ, మాటలో వుంటుందని అనుకోవడమంత తెలివితక్కువతనం మరెక్కడా వుండదు. మన బతుకుల్లో లేని నిజాయితీ గురించి మనం పక్కవాళ్ళకు చెప్పడం ఏమైనా బావుంటుందా? మనకు లేనిది కనీసం నేర్చుకోవడానికైనా మన బుద్ధి సహకరించదు కదా! అమ్మాబాబునే అవసరాలకు వాడుకుని వదిలేసే మన బతుకులకు లేనిపోని ప్రేమలు, ఆప్యాయతలు ప్రకృతి నుండి, పశుపక్ష్యాదుల నుండి నేర్చుకుంటే మాత్రం వస్తుందా చెప్పు. దేనికయినా అర్హత అంటూ వుంటుంది కదా

                 మనం మాత్రమే అందలాలు ఎక్కితే సరిపోతుంది. దాని కోసం ఎవరేమైనా పర్లేదు, మనకు కాలం కలిసివస్తే చాలు అని అనుకునే మన నైజానికి ప్రేమలు దోమలు సరిపడవు. మన జ్ఞాపకాలు, గురుతులు అన్నీ ధనపరమైనవే కాని మానవ సంబంధమైనవి కావని నలుగురు గుర్తించే రోజు రాకుండా వుండదు. రోజు మన ముఖాలు చూడటానికి ఎవరూ ఇష్టపడరు కూడా. మనం రోజైతే రాదని ధైర్యంగా, ధీమాగా, నిర్లజ్జగా నైతికతను వదిలేసి బతుకుతున్నామో.. రోజు తప్పక వస్తుంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు, విజ్ఞానశాస్త్ర పరంగాన్యూటన్ మూడవ సిద్ధాంతంఅమలు జరుగుతుంది, కాదు కాదు జరిగితీరుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం..!!

              

                 

                

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner