11, డిసెంబర్ 2014, గురువారం

నువ్వు అదే నిజమని చెప్పవూ....!!

నేస్తం...
       రోజు ఒకేలా ఉండకుండా ప్రతి రోజు ఓ వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది.. మన ఆలోచనల్లో మనసు నలుగుతూ... ఒక్కొరోజు భావాలు వెల్లువలా ప్రవహిస్తాయి.. ఎన్ని కబుర్లు  చెప్పినా ఇంకా మిగిలిపోతూనే.. మరోరోజు ఎందుకో అక్షరాలు కూడా నామీద కినుక వహించి అందకుండా పారిపోతూ ఉంటాయి... అలా పారిపోతున్న ఈ రోజు ఎలా అయినా వాటితో పోటి పడి అందుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నా... మనసు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నీకు, నీతో స్నేహం చేస్తున్న ఈ నా అక్షరాలకు భలే తెలిసిపోతుంది... దాకున్నా పక్కనే ఉంటాయి నన్నే చూస్తూ... నేను గెలుస్తానా లేదా అని వాటికి ఎంత ఆత్రమో చూసావా... నువ్వు నా గెలుపే చూడాలని అనుకుంటావనుకో... పొద్దు వాలిపోతున్నా ఆ పొద్దులో ఎన్ని అందాలో చూసే కళ్ళకు తెలుస్తుంది.... రెప్ప పడే ఈ జీవితానికి రెప్ప వెనుక స్వప్నాలు ఎంత బావుంటాయో ఎప్పుడైనా చూసావా నీ మనసుతో... మౌనాలు ఎన్ని దాచినా ఆ మౌన గీతాలు ఎందుకంటావ్ మనసుని దోచేస్తూ ఉంటాయి... సడి చెయ్యని మదిని తట్టిలేపే కొన్ని బంధాలు ఎందుకో ఆరాట పెడుతూ ఆశలు పెంచుతాయి జీవితం మీద... మరుక్షణంలోనే నిరాశను మిగిల్చి జీవితాన్ని లేకుండా చేస్తాయి... ఈ ఆశ నిరాశల ఆరాటంలో మన జీవిత పోరాటం ఓ కొలిక్కి వస్తుంది ఎప్పుడో ఒకసారి... మనం ఓడినా గెల్చినా పెద్దగా తేడా ఏం ఉండదు.. ఎందుకంటే అప్పటికి జీవితంలో అన్ని చూసేసి ఉంటాము కదా.... కాక పొతే కాస్త ముందు వెనుకా అంతే... మృత్యువు కూడా కొందరినే అదృష్ట దేవతలా వరిస్తుంది... దానికి కినుకే జీవితంలో ఓడిన వాళ్ళంటే... ప్రతి ఒక్కరు గెలవాలనుకునే ఈ జీవితపు ఆటలో నేను ఓడిపోయానేమో అని అనుమానం... కాదు కాదు అదే నిజం.... నువ్వు అదే నిజమని చెప్పవూ.... ఉండనా మరి..
నీ నెచ్చెలి...

ఏక్ తారలు...!!


10/12/14
1. నేనే నువ్వయ్యానుగా_నీ నా ఎందుకింక
2. నీలోనే చేరిన నేను_నా కోసం నేనుగా మిగలని క్షణాలు
3. వేల జన్మలకైనా వేచి ఉంటా_ఓ క్షణం నీ చెలిమి కోసం
4. నిశిని చుట్టేసిన వెన్నెల_నీ రాకను నాకు తెలియచేస్తూ
5. జ్ఞాపకాల గతాలు అలిగి వెళ్ళిపోయాయి_వాటికి నువ్వు అందలేదని
6. ఓ క్షణం ఆదమరచా_అక్షరాలు అటు ఇటు వెళ్లి పోయాయి
7. నీ గుండె గూడు ఇరుకుగా ఉంది_నా జ్ఞాపకాల పేజీలు ఎక్కువై
8. విరహంలో అన్ని నా గురుతులేగా_ నిను వదిలింది ఎక్కడ
9. చుక్కల పక్కన చోటిస్తా_మబ్బుల దుప్పటి దాచేసి నీతో ఉండనిస్తావా
10. ఆలశ్యమెందుకు_వెనక్కు చూడకుండా వచ్చేయ్
11. కలువలకు దూరం ఎక్కువే_చెంతనే తారలుండగా చూపులు మరలునా
12. తారల మెరుపుల ముందు దిగదుడుపే_కలువల అందం ఎంతున్నా
13. తప్పడం లేదు మరి_కాంతలకు దాసోహం అనక

నిలకడగా... !!

మొహం చాటేసిన మనసుని
గువ్వలా పట్టి తేవాలనుంది
రాలి పడిన జ్ఞాపకాన్ని నీ చేతులతో
సున్నితంగా అందుకోవాలనుంది
ముగ్ధంగా ముడుచుకున్న మొగ్గలో
నీ ప్రతిబింబాన్ని చూడాలనుంది
రేపు లేని ఈ రోజే శాశ్వతంగా
నిలిచిపొతే బావుండని ఉంది
క్షణాల క్షణికం ఆశగా చూసే
ఆరాటాన్ని దాచుకోవాలని ఉంది
అసంకల్పితంగా అన్ని దాటిపోయాను
విచలిత చలనాన్ని వదిలేసి ఎక్కడికో
తెలుస్తున్నా తెలియని రహదారి ఇది
వెనక్కి రాలేని బాటలో ముందుకే
నా పయన నిర్దేశం నిలకడగా... !!

10, డిసెంబర్ 2014, బుధవారం

ఇలా ఉండమంది...!!

నమ్మకం మోసపోయి
నిశబ్దంగా చూస్తోంది
ఏడు జన్మాల ఎత్తు
ఏడుస్తూ మిగిలింది

కలసి నడచిన దారిలో
ఓ క్షణమైనా దాయలేక
నేనుగా నిలువక పోయినా
నువ్వుగా ఉండి పోవాలనుకున్నా

గుచ్చిన గులాబి ఇంకా చెమరుస్తూనే ఉంది
తడి లేని కళ్ళలో మిగిలిన పొడి భాష్పం
రాలకుండా జ్ఞాపకాలను చూస్తోంది
ఒక్కటైనా తడిగా తగలక పోతుందా అని ఆశతో

వెన్నెల్లో ఆడుకునే నా అక్షరాలను
వేధిస్తున్నా శరాలను సంధించమని
అలవాటులేదేమో అందకుండా
అటు ఇటు పరుగెత్తుతున్నాయి

విషాదానికి వినయమెక్కువని
సంతోషం సంబరాన్ని పంపేసి
ఏకాంతానికి వనవాసం శిక్షగా వేసి
ఈ జీవితానికి ఇలా ఉండమంది...!!


ఏక్ తారలు.....!!

09/12/14
1. నీ కన్నీటిలో కనుమరుగై పోతానేమో_కాస్త దాచుకోవు జ్ఞాపకంగా
2. నీ ప్రేమకు వేళయిందో ఏమో_సందె పొద్దు సల్లంగా జారుకుంటోంది
3. పేదా గొప్పా తేడా నాకెందుకు_పలకరిస్తే ప్రతి మోమునా విరుస్తూనే ఉంటానుగా
4. పిలిస్తే వచ్చేస్తానుగా_ఓ సారి పిలవరాదూ
5. నాకోసం కూడా మౌన వ్రతాలెందుకు_ఓ సారి నవ్వేయరాదూ
6. మదిలో వింటేనే ఇంత అలజడా_చెంతకు వస్తే ఏమిటో మరి
7. నాది నీది ఒకటే అనుకున్నా_నన్ను మరచి నీతో ఉండి పోయా
6. జతగా వెన్నెలమ్మ వస్తుందిగా_ సందె పొద్దు ఎందుకు
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner