మనసు
చచ్చిపోయిన క్షణాలు
నాకింకా గుర్తే
ఆంక్షల పర్వానికి
తొలి అడుగు పడినప్పుడు
అర్ధం కాని
ఆ పసితనపు ఛాయలు
ఇంకా కనుల ముందు
కదలాడుతునే ఉన్నాయి
కాలానుగుణంగా
మార్పులు చేర్పులు
అవమానాలు అవహేళనలు
సర్దుబాట్లు దిద్దుబాట్లు
తప్పని జీవితాలై
అలసిన దేహం కోరుకునేది
తన కోసమంటూ
ఆత్మీయతను
అరక్షణమైనా కేటాయించమని
అదే తీరని కోరికగా మిగులుతున్నా
అనునిత్యం అగ్నిహోత్రమై వెలుగుతూ
తను దహించుకుపోతున్నా
నాఅన్న వాళ్ళ కోసం కడవరకు
పరితపించేది నేనని తెలిసినా
నా పతనానికై ఎదురుచూస్తున్న
మీకెందుకు ఈ ఆక్రోశాలు..?
28, జనవరి 2019, సోమవారం
మనసు చచ్చిపోయిన క్షణాలు...!!
ఏక్ తారలు...!!
1. పరిచింది అక్షరాలే_పదాలకు భావాల మత్తు చేరిందనుకుంటా...!!
2. మనసులొకటే మరి_ఆంతర్యాల అంతర్యుద్ధం మౌనంగా చేస్తున్నా ...!!
3. అస్పష్టంగా ఉన్నా స్పష్టమైనవే_మనసు తెలిసిన భావాలవి..!!
4. అలవోకగానే ఈ అద్భుతాలు_మదినలరించే అక్షరాలు చేరికైనప్పుడు...!!
5. అక్షరాల మాయాజాలమదే_అనుభవాల అనుభూతులను అద్దంలా చూపించేస్తూ...!!
6. అలుపెరగని ఆలోచనలే_అడపాదడపా ఆనందాన్నిస్తూ...!!
7. మర్మమెరుగని మనసది_మానసాక్షరాలకు నెలవుగా మారి...!!
8. పసితనంలో నువ్వున్నావని కాబోలు_వయసేదయినా మది పయనం బాల్యానికే...!!
9. కాలం ముదమందుతోంది_అనుబంధాలను అనుసంధానిస్తూ...!!
10. భావాలు అలుగవూ_అక్షరాలన్నింటా నీవేనంటే...!!
11. జ్ఞాపకాలు మురిసిపోతున్నాయి_నీ మౌనానికి తామే హితమైనందుకు...!!
12. దాగలేనంటోంది మది గాయం_అక్షరాల్లో సేదదీరాలనుకుంటూ....!!
13. అనుబంధమేదైనా సరే_మనసు మౌనాన్ని మాయ చేసేది ఈ అక్షరాలే...!!
14. మది రాల్చిన మౌనం_సజీవ అక్షర శిల్పాలుగా....!!
15. నుదుటిరాత అది_గమ్య నిర్దేశానికి గాయాలను రాతలుగా మార్చుతూ....!!
16. సమయం చిక్కనీయని కాలమిది_సోమరితనానికి చోటెక్కడ మరి...!!
17. కథలన్నింటా నువ్వే_పాత్రలతో నీకేలా..!!
18. సంశయానికి చోటెక్కడిది_మనసులొకటైన మన మధ్యన...!!
19. సిందూర మందారాలు సూరీడు నొసటన చుక్కలే_ఆకాశానికి ఆభరణాలై...!!
20. లిపి తెలియని మదికి తెలుసు_గుర్తులను కాగితాలకెలా తెలపాలో...!!
21. స్వరమే అక్షరమైంది_స్నేహరాగాలకు బాణీలు కట్టాలంటూ...!!
22. మది పుస్తకానికి ఎరుకనే_అక్షర స్నేహానికి ఏ రహదారిన వెళ్ళాలో...!!
23. స్నేహ సహవాసం అక్షయపాత్రే_పూరించిన ఖాళీలకు మళ్ళీ చోటిస్తూ...!!
24. స్వరాలు తేనెలొలుకుతున్నాయి_జీవనాదమై అక్షరాలు అమరగా...!!
25. అక్షరాలన్నీ ఇంతే_ఊపిరాడని జీవితాలకు ఆటవిడుపుగా మారుతూ...!!
26. మనసు ఖాళీలు మాట్లాడుతున్నాయి_అక్షరాలను ఆసరా చేసుకుని...!!
27. ఊతమే తానయ్యింది అక్షరం_ఊపిరాడని బతుకు పయనంలో...!!
28. అక్షరాలు అలిగినా అందమే_మౌనానికి మనసుకి బంధం వేస్తూ...!!
29. గురుతెరగని అనుబంధం కాదుగా మనది_జన్మజన్మలుగా కొనసాగుతునే...!!
30. ఊపిరి పోసిన అక్షరాలే అన్నీ_ఊహలకు జీవాన్నిస్తూ...!!
ద్విపదలు...!!
1. పదాల పదబంధం చాలదూ
పేర్చిన అక్షరాలు గాటినబడటానికి...!!
2. అక్షరాలెప్పుడూ అక్షయమే
గుండెగూటిలో నీ జ్ఞాపకాలున్నంత వరకు...!!
3. మలి వయసే ఇప్పుడు
పసితనపు ఛాయలు అద్దుకుంటూ. ..!!
4. అక్షరాల చుట్టూనే అనుబంధం
మనసు పరిమళాన్ని భావాలకద్దేస్తూ...!!
5. వద్దన్నా వెంటబడక మానవు కదా
విడిచి ఉండలేని అనుబంధం మనదైనప్పుడు...!!
6. అక్షరమై అలరిస్తుంటానిలా
ఆదరించి ఆస్వాదించే మనసులు మీవైనప్పుడు...!!
7. కొన్ని మనసాక్షరాలింతే
భావాలకు బాధ్యతలకు మధ్యన నలుగుతూ...!!
8. నా జ్ఞాపకాల్లో నువ్వున్నావుగా
పేలవమైన బ్రతుకులో జీవాన్ని నింపి జీవితాన్ని ఇవ్వడానికి....!!
9. తడబాటుకు స్థానమే లేదు
నా నెలవు నీలోనున్నప్పుడు...!!
10. అక్షరాల్లో పరుస్తుంటానిలా
మనసైన ప్రతిసారి....!!
11. ఆర్తిగా ఆలింగనం చేసుకుంటుంది దుఃఖం
మనసు భారాన్నంతా తానే మెాస్తూ...!!
12. కాలాన్ని కలంతో కలిపేసా
కొత్త కథలు వినిపిస్తుందని..!!
13. దిగులుకు చోటెక్కడా
గమ్యమే నీవైన పయనం నాదైతే...!!
14. తప్పనితనంగా మార్చుకున్న ఆధునికత
అవసరార్ధం అనుబంధాలకు దగ్గరౌతూ....!!
15. కనురెప్పల నీడలో కదలాడుతోంది
కనుమాయమవని నీ జ్ఞాపకమిలా..!!
16. జ్ఞాపకాల ముత్యాలను సేకరిస్తున్నా
మేలిమిసరాలుగా వర్తమానానికి కానుకనీయడానికి...!!
17. మనసుకు మాటిచ్చాను
మరపు దరిజేరదని...!!
18. జ్ఞాపకాలూ అంతే
మనసు పుస్తకంలో చొరబడనిదే ఉండలేవు...!!
19. అద్భుతాన్ని ఆవిష్కరించేది అక్షరాలే
మనోభావనలను చరిత్రపుటల్లో లిఖిస్తూ....!!
20. రెక్కలు తెగిన అక్షరాలవి
ఆకాశవిహంగాలైన భావాలను మెాసినందుకు....!!
21. చెప్పేవరకు వదలని భావాలవి
అక్షరాలకు అనువుగా మసలుతూ..!!
22. కలలకు కొత్తదనం కావాలట
బుజ్జగింపులు వాస్తవాలను మరువనివ్వట్లేదని...!!
23. తానైంది అమ్మ
మనసేదో తెలిసినట్టు మమతేదో పిలిచినట్టు..!!
24. పరిధులే పదాలకన్నీ
అక్షరాలకు పొదుపు అలవాటు చేస్తూ..!!
25. అక్షరమెప్పుడూ అపురూపమే
మనసులను రజింపజేస్తుందని..!!
26. పొరబాటే మనసుది
మరిచిపోవడం తెలియక...!!
27. కొన్ని చేతులంతే
అక్షరాలనలా ఒంపేస్తాయి మాటలకందని భావాలుగా...!!
28. అవధుల్లేని ఆనందమే ఇది
అనిర్వచనీయ ప్రేమకు సాక్ష్యంగా..!!
29. మరపు మౌనమయ్యింది
ప్రేమ సంద్రమై చెంత చేరితే...!!
30. అద్దానికి అర్థమయ్యింది
మనసు భావాలు మనవే అని...!!
27, జనవరి 2019, ఆదివారం
మీ ఏడుపు మీరేడవండి...!!
మీ దృతరాష్ట్ర ప్రేమ మాకు వద్దు....
గత నాలుగునర్ర ఏళ్ళుగా తెలంగాణా వాదుల గురించి కాని, కే సి ఆర్ గురించి ఏమి మాట్లాడని నేను, మీ ప్రాంతీయతను గౌరవించడమే కారణం. ప్రాంతీయతాభిమానం అందరికి ఉండటంలో తప్పులేదు, ఉండాలి కూడా. చంద్రబాబు దగ్గినా తుమ్మినా అదో పెద్ద నేరంగా చూసే మీలాంటి వారికి దత్తత తీసుకున్న గ్రామాలు, పేర్లు ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి అని అనుకోవడంలో మీ వక్రబుద్ది తెలుస్తోంది. మాకు అలా అయినా అభివృద్ధి జరుగుతోంది. యాగాల మూలంగా మీకొరిగింది ఏమిటి..? ఎదుటివారి కొంపలో ఏం జరుగుతోందని కాకుండా మీ కొంప తగలకుండా చూసుకునేడవండి...
మీరు, మీ కే సి ఆర్ ఎలా పోయినా మాకనవసరం. మీ అందరి మాటలకే మేము స్పందించాల్సి వస్తోంది. ఏం నష్టపోయామెా, పోతున్నామెా మాకు తెలుసు. మీ ప్రాంతీయాభిమానమే మాకూ ఉంటుంది. మీకు మీ కే సి ఆర్ కి తేడా ఏం లేదు. మాటకు పది మాటలు సమాధానం చెప్పగలం. ఇన్నాళ్లు మీ గురించి మేమేం అనలేదు, కానీ మీరు రెచ్చగొడుతూనే ఉన్నారు. అందుకే సమాధానాలు చెప్పక తప్పదు. ఊరుకుంటామని అనుకోకండి...వ్యక్తి విలువలు దిగజార్చుకోకండి. తప్పును చూపడం తప్పులేదు. తప్పుడు మాటలు, చేష్టలు వద్దు. ముందు మీ లోపాలు మీరు చూసుకోండి మాతో చెప్పించుకోకుండా.... అన్ని అమర్చితే అనుభవించడము కాదు. కనీసం నిలబెట్టుకోండి చాలు. ఇంకేమైనా కావాలంటే అడగండి... మాకు లేకపోయినా పర్లేదు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ అంటే ... మైండిట్
26, జనవరి 2019, శనివారం
ఏంటో మరి...!!
నేస్తం,
కొందరి ఆలోచనలు చూస్తుంటే నవ్వు వస్తోంది, బాధ వేస్తోంది. ఈ ముఖపుస్తకంలో మన పోస్ట్లకు వచ్చే లైకులు, కామెంట్లు మాత్రమే మన అక్షరభావాలకు కొలమానాలనుకుంటే దానికన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. మనకు నచ్చిన పోస్ట్ మరొకరికి నచ్చాలని రూలేం లేదు కదా. మన చేతికున్న ఐదువేళ్ళే ఒకలా లేవు. మరలాంటప్పుడు మనమెలా చెప్పగలం "నాకు పలానా పోస్ట్ నచ్చింది, మీరందరూ లైక్ చేసి కామెంట్లు రాయండని." మనకు నచ్చిన వారి రాతలూ మనకు బావుంటాయి, అందరికీ కాదు. మనకి మనం అనుకుంటాం చాలా నిజాయితీపరులమని. అలా అనుకొనకపోతే బతకలేం. ఓ అమ్మ కడుపున పుట్టిన బిడ్డలే ఒకేలా ఆలోచించలేరు, విభిన్న దృక్పథాలు, దృష్టి కోణాలు ఉంటాయి. మనకి నచ్చని రాతలు విలువలేనివి కాదు, అలా అని నచ్చిన రాతలన్నీ అమెాఘమూ కాదు. లైకుల లెక్కల కోసం, కామెంట్ల కోసం కాకుండా మన కోసం మనం రాసుకుంటే చాలని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుడు కూడా మినహాయింపు కాదు. దేవుడు కూడ అందరికి మంచివాడేం కాదు కదా. కోరిక తీరితే దణ్ణం పెట్టి మెుక్కు చెల్లించుకుంటాం లేదా తిట్టిపోస్తాం. ఇది అంతే మరి. దేవుడే అందరికి మంచోడు కానప్పుడు మనమెలా అవుతాం, మన రాతలెలా నచ్చుతాయ్. మన ఆలోచనల్లో తేడా ఉందని అర్ధం చేసుకోవాలి. ఇదన్న మాట అసలు సంగతి.
