3, ఏప్రిల్ 2022, ఆదివారం

ఏ తనమిది? కి విజయ విశ్లేషణ

 నా రాతకు Vijaya Lakshmi పోతేపల్లి సరికొత్త విశ్లేషణ. ఇలాంటి విశ్లేషణ ఇదే మెుదటిసారి నేను చదవడం…మనఃపూర్వక ధన్యవాదాలు విజయా😍


ఎప్పుడూ విశ్లేషణ అంటే...మంజూగారి కవితలకు డప్పు కొట్టడమే విజయకు పని అనుకుంటున్నారా... అందుకే.. ఇప్పుడు రివర్స్ రివ్యూ.

"ఏ తనమిది?"

బతకనేర్చిన తనమదండోయ్...


"ఆత్మీయులమంటారు

చుక్కయినా తాగలేని

అమృతమొలికిస్తారు"

ఏడుండారమ్మా ఈ రోజుల్లో ఆత్మీయులు.నమ్మేసొచ్చేది మీరు.ఓపాలి జర సోచాయించాలి గాదేటి.పంచుకుంట పోతాంటే పెరిగేయి అప్పుడెప్పుడో జమానాలో. ఏడదేవాల్నేటి అమృతం..చుక్క.అనేవన్నీ నాల్క మీదుగొచ్చేయంతే.ఓలు నమ్మమన్నారేటి...మేమంతే.


"గుండె నిండా ప్రేముందంటారు

గుప్పెడు మెతుకులు పెట్టలేని

నిస్సహాయులమంటారు"

ఏటంటారయితే...గుండెప్పి సూపలా.మెతీకులంటే ఊకే వత్తాయా.ఆ గుండు బాసెవలో సెప్పినట్టు ఏదీ ఊర్మే రాదమ్మా.పేమేముందీ...ఓలు గెలిసారంట నిజమైన పేమలతో.మేమందుకే పేమంటామంతే సూపం.పెడతామంటాం.పెట్టాలంటే మళ్ళొత్తామంటామంతే.


"కనుచూపు మేరంతా

చలువరాళ్ళ దారి వేయించామంటారు

బొబ్బలెక్కిన పాదాలు చూడరు"

పూలబాటగానీ ఎయ్యాల ఏంటమ్మో...తలపేకెక్కిన మనసులు మనుషులు కాదేటి మేము...మీ కాలి బొబ్బలు మాకేం పనో.నడిస్తే నడువాల్నే వల్లకుంటే కూకోవాలి.గంతేగానీ మా దారి మాకే తప్పంటరా...ఇదేం నాయమండో..


"తేనీటి విందుతో 

స్వాగతాలు పలుకుతామంటారు

గుక్కెడు తాగునీరివ్వలేరు"

మా బాగుందే మీ మాటలాట...తేనీరిస్తామంటే నీళ్ళేడదేవాల్నంట.మా మనసులన్నీ సముద్రొలమ్మి...ఇశాలం.ఉప్పంగుంటాం గానీ తాగేనీళ్ళేడ దేవాలంట.తేనీరెట్టాగో పడదాం గందా గమ్మున తాగిపోక ఈ నీరెందమ్మీ...


"పంచభక్ష్య భోజనాలు

సిద్దం చేయించామంటారు

వడ్డించే విస్తరే లేదంటారు"

సేతులు పట్టచ్చుగా అమ్మలూ...ఇస్తరాకు లేదంటే పొలోమని పోకపోతే ఇత్తడాకు తేవాల్సింది కాదేటి.పెట్టేటోళ్ళమో కాదో.ఓపాలి సూడొచ్చుగా.వడ్డనేపాటంట ఒలికించేస్తమేమో...


"తెలివితేటల్లేని 

తెల్లకాగితాలమంటారు

చురకల పదాలతో పచ్చబొట్టులేస్తారు"

మేమేటిసేత్తమమ్మా...మీకు మాటాడటం రానపుడు.మడిషన్నాక కూసంత కళాపోషణొద్దేటి.అమ్మ బొమ్మ అంటే ఓలు ఇంటారేటి కబుర్లు.సురకలేయాలి సోది సెప్పాలి.తెల్లకాగితాలమంటాం...మీరేటైనా రాసుకోండి మరి.


"దాపరికాలు తెలియని తనమంటూ

దాటేయడంలో నేర్పరులు

దాడి చేయడంలో సిద్దహస్తులు వీరు"

బాసెప్తిరే.మీలేమో అన్నట్ల సెప్పేస్తారు.మాకేటి లాభమో అట్ల వర్లితే.మీ గుట్టు మీతాన...మాకాడికొచ్చాక ఈధి గుట్టు కాదేటి.మాయన్నీ బీరవాలో నగల మాదిరి.మీయ్యి పబ్లిక్ వార్తల మాదిరి.


"మాటల గారడిలో ముంచుతారు

పొగడ్తల మాయలో పడేసి

ప్రపంచానికి పిచ్చివారుగా మనల్ని పరిచయం చేస్తారు"

కాదేటి మరి.ఓలు పడమన్నారట మాయలో.దొర్లుకుంటూ.దొరికితే మాకు మడిషైనా మనసైనా ఓకటే.పిచ్చోల్లయినారు కాబట్టి సేసేసినాం.వల్లకుండచ్చు కాదేటి...మా బుద్దేటో తెలిసినాక.


"ఎవరిదే తనమయినా

తన మనసుకు తెలుసు

ఏ మనిషిదే తనమో..!!

కాదేటి మరి.ఓలిక్కావల్నట.ఈ తనాలన్నీ.ఓలికి కనపడతాదేటి మనసు.నీదేదో బాగు నాదేదో  బాగు సూసేసుకోవాల్నంతే.శెలవండోయ్ మరి.కాస్త నవ్వండి మరి మంజూమేడం.

​ఏ తనమిది?

ఆత్మీయులమంటారు

చుక్కయినా తాగలేని

అమృతమొలికిస్తారు


గుండె నిండా ప్రేముందంటారు

గుప్పెడు మెతుకులు పెట్టలేని

నిస్సహాయులమంటారు


కనుచూపు మేరంతా

చలువరాళ్ళ దారి వేయించామంటారు

బొబ్బలెక్కిన పాదాలు చూడరు


తేనీటి విందుతో 

స్వాగతాలు పలుకుతామంటారు

గుక్కెడు తాగునీరివ్వలేరు


పంచభక్ష్య భోజనాలు

సిద్దం చేయించామంటారు

వడ్డించే విస్తరే లేదంటారు


తెలివితేటల్లేని 

తెల్లకాగితాలమంటారు

చురకల పదాలతో పచ్చబొట్టులేస్తారు


దాపరికాలు తెలియని తనమంటూ

దాటేయడంలో నేర్పరులు

దాడి చేయడంలో సిద్దహస్తులు వీరు


మాటల గారడిలో ముంచుతారు

పొగడ్తల మాయలో పడేసి

ప్రపంచానికి పిచ్చివారుగా మనల్ని పరిచయం చేస్తారు


ఎవరిదే తనమయినా

తన మనసుకు తెలుసు

ఏ మనిషిదే తనమో..!!


1, ఏప్రిల్ 2022, శుక్రవారం

అక్షర విహంగాలు సమీక్ష

​అక్షర విహంగాలు-జీవన సత్యాలు


ఆమె మనసు ఎల్లప్పుడూ ఉవ్వెత్తున

ఎగసిపడే ఓ భావతరంగం..

ఆమె ఓ అక్షర తపస్విని..

ఆమె అక్షర సహవాసం చేస్తూ

భావాల పంట పండిస్తూ

మనకు అద్భుతమైన జీవన సత్యాలను అందిస్తుంటారు.

ఉన్నత చదువులు చదివి, తెలుగు భాష గొప్ప దనాన్ని

నలుదిశలా వ్యాపింపచేయడానికి నిత్యం వాడుక భాషలో

ఉన్న పదాలతోనే కొత్త కొత్త ప్రయోగాలతో ఎన్నో మంచి

రచనలు చేస్తూ తెలుగు భాషకు ఎనలేని సేవలు చేస్తున్నారు.


           ప్రస్తుతం రెక్కలు అనే మరో ప్రక్రియలో "అక్షర విహంగాలు" 

సంపుటిని ముద్రింపచేశారు.వారి పదాలు అక్షర తూటాలు, సున్నితంగా

మనసుని కోసేస్తూ అంతర్లీనంగా నిక్షిప్తమౌతాయి.ఉన్నదున్నట్లు చెప్పే

ముక్కు సూటితత్వం,నిక్కచ్చితనం వారి రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.


1.గొప్పోళ్ళందరూ

   మనకి తెలుసు

   మనమెంత మందికి

   తెలుసో మరి


    మాటలు కోటలు దాటడం 

    నిజమేగా..!!


2.ఘనత

   ఎవరిదైనా

   గొప్పతనం

   నాదే


   వదిలేసిన విలువలే

   ఘనకార్యాలిప్పుడు..!!


నిజమైన సాహిత్యం గూర్చి వారు రాసిన అద్భుతమైన రెక్కలు


1.క్లిష్టమైన

   పదాలు అందమేమో

   వాడుక భాష

   వద్దకు చేరుతుంది త్వరగా


   అక్షరం అక్కరకు రావడమే

   నిజమైన సాహిత్యం..!!


2.భాష 

   సహకరిస్తుంది

   అక్షరం

   అల్లుకుంటుంది


   జనిస్తుంది

   సుస్వరాల సాహిత్యం..!!

  

అక్షరాలపై వారికున్న మమకారం తెలిపే రెక్కలు..


1.అపహాస్యాలు

   వినబడినా

   అవరోధాలు

   వెన్నంటినా


   వెరవని మొండి తనం

   ఈ అక్షరాలది..!!


2.రాయడం తెలియని

   కలము కాదు

   అమరికనెరుగని 

   అక్షరాలు కావు


   మనసును సాంత్వన పరిచే

   మనో విహంగాలివి..!!


అక్షరాలతోనే వారి సాన్నిహిత్యం, సహవాసం.అక్షరాలే వారి నేస్తాలని

మనకు చెప్పకనే చెప్పే రెక్కలు.


1.జ్ఞాపకాలే

    జీవితం

    అక్షరాలే

    సన్మిత్రులు


   శూన్యంతో సహవాసమైనా

   మదినిండా సంతోషమే..!!


2.జీవితం

    ఇమిడి పోయింది

    అక్షరంతో

     సహవాసం చేస్తూ


     సన్నిహితమే

     ఏ అనుబంధమైనా..!!


బంధాలు అనుబంధాల గూర్చి,అనురాగాలు ఆత్మీయతలు,గూర్చి

మమకారాలు మాధుర్యాల గూర్చి, కనుమరుగౌతున్న బాధ్యతల పై,సమాజంలో పెచ్చు మీరుతున్న హింస,అవినీతి ఇలా ప్రతి ఒక్క అంశంపై ఎక్కుపెట్టి వదిలిన బాణాలెన్నో

సూటిగా గుచ్చుకుని ఎవరికి వారిని భుజాలు తడముకునేలా చేస్తాయి. 

ఇలా ఎన్నో ఎన్నెన్నో భావాల అల్లికలు వారి రచనల నిండా. అందుకే వారి రచనలు

తప్పక చదివి తీరవలసిందే.


       ఇంతకీ ఇంత అద్భుతమైన రచయిత్రి ఎవరో చెప్పలేదు కదా.

ఇంకెవరండీ మనందరికీ ఆత్మీయురాలు శ్రీమతి మంజు యనమదల గారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అవడానికి ఇద్దరం దివిసీమ బిడ్డలమైనా

మా పరిచయం మాత్రం ఓ విచిత్రమే.మాటా మంతీ భయంతో మొదలైనా

తొందరగానే ఆత్మీయ తీరం చేరిందనే చెప్పాలి.


       వారి రచనల నిత్య పఠన ప్రభావంతో ఏక్తారలు

అనే ప్రక్రియను నేనూ రాయడం నేర్చుకున్నాను.

         వారి రచనా విధానం చాలా పొందికగా చదువరులకు ఇట్టే

అర్థం అయ్యే రీతిలో ఎంతో భావయుక్తంగా,సందేశాత్మకంగా ఉంటాయి.

        వారి రచనల గూర్చి రాయడమంటే నేను చేసిన అతి పెద్ద సాహసమనే

చెప్పాలి.నేను చేసిన ఈ సాహసాన్ని మీరూ చదివి సాహిత్యం పట్ల అందరూ

మక్కువ చూపుతారని ఆశిస్తూ  మంజుగారి "అక్షర విహంగాలు"పుస్తకావిష్కరణకై ఎదురుచూద్దాం.


               మంజూ మీ నుంచి మరిన్ని మంచి సందేశాత్మక రచనలను  ఆశిస్తూ..


                                                     ఆత్మీయ నేస్తానికి

                                                     భావాల రాక్షసికి (ప్రేమతో)

                                           శుభాభినందనలు మరియు శుభాకాంక్షలతో

                                                        @పద్మజ సబ్బినేని@

31, మార్చి 2022, గురువారం

​ఆ నలుగురితో..!!

మౌనం 

పయనం

మనసుతో


మాటల

యుద్ధం

బంధాలతో


మనిషి

గమనం

కాలంతో


విధి

రాతలు

కలంతో


అక్షరాల

సహవాసం

భావాలతో


ఏడుపు

ముగింపు

మరణంతో


కడలి

కల’వరం

తీరంతో


విశ్వ

రహస్యం

శూన్యంతో


ఏదారెటైనా

చివరి నడక కర్మభూమికి

ఆ నలుగురితో..!!

29, మార్చి 2022, మంగళవారం

మనస్తత్వాలు..!!

  నేస్తం,

    కొందరి మనస్తత్వాలు ఎలా వుంటాయంటే ఎంత తిన్నా మేం ఏమి తినలేదు. మాదే పెట్టాము. మమ్మల్ని, మా వాళ్ళని ముఖ్యంగా మా అమ్మని ఒక్కదాన్ని చేసి అందరు బాధ పెట్టారు. మా అమ్మానాన్న మాకు ఏది చెప్పలేదు. చూసినవాళ్ళు చెప్పారని చెప్తారు. అది సరే మరి పెద్దావిడ సంతకం పెట్టమంటేనే కదా మిగతావాళ్ళు సంతకం పెట్టారని ఎలా మర్చిపోయారు. పెద్దావిడకి విభజించి పాలించడం రాదు. అలా వస్తే అల్లుడయిన తన తమ్ముడికే రాయించేది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా! ఇప్పటికి పెద్దావిడ అందరు కావాలనే అనుకుంటుంది కాని వద్దనుకోదు.

     వారిది మధ్య చోటని, తమ్ముడిది అమ్మితే తప్ప తనది కొనరని, తనదేమో ఇంటితో బేరం ఇచ్చి, తమ్ముడిది ఉత్త చోటు బేరం ఇచ్చి, అదీ నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నా చోటులో ఇస్తానని మాట ఇచ్చి, ఇంటి కలప అంతా తీసుకోవడం, కనీసం వాటా వచ్చిన సామాను కూడా ఇవ్వడం తెలియదని సరిపెట్టుకోవడం మంచిదే. ఆ లెక్కల ఈ లెక్కల చెప్పి మరికొంత చోటు తీసుకోవడమూ సబబే మరి.  తర్వాత చోటు అడిగితే ఇవ్వడానికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని అన్నా పర్లేదు. 

    తమ్ముడు పొలం కొనుక్కుంటే, తన పొలమూ అమ్ముతానంటే ఇంట్లో అందరికి చెప్పావా అని అడిగితే చెప్పానని చెప్పి, ఇప్పుడు కాస్త, పంట వచ్చాకా ఆ పక్కది ఇస్తానని చెప్పి, అంతకు ముందు వారం క్రిందట తమ్ముడు బయానా ఇచ్చిన పొలం కన్నా రేటు ఎక్కువ చెప్పి, ఎవరికి చెప్పకు రేటు ఇంకా ఆ పొలం రిజిస్ట్రేషన్ అవలేదు అన్నా అందరికి చెప్పి ఎక్కువ రేటుకి అమ్మి కనీసం ఇస్తానన్నది అవడం పక్కనబెట్టి , కొన్నదానికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పటి వరకు. అది దేనికి పనికి రాదు. అసలు కొనడం తమ్ముడి తప్పు. ఎన్ని జరిగినా ఆ తమ్ముడికి ఇప్పటికి బుద్ధి రాదు. ఆ కాస్త కొన్నందుకు చాలా గొడవలు చేసారప్పుడు.         

        మన పిల్లలు, మనం బావుండాలి నిజమే. కాని బయటివారు సరే, తోడబుట్టినవారిని ఇలా చేయడం సరైన పనేనా! పక్క పొలంలో పంట మన పొలంలో వేసుకుంటే అది మన పొలంలో పండినట్టు కాదు. ఆడపిల్లకు పెట్టకపోయినా పర్లేదు. ఆడపిల్ల మీ చెడు కోరదు కాబట్టి మీరెన్ని చేసినా తోబుట్టువులు బావుండాలనే నూటికి తొంభైమంది ఆడపిల్లలు కోరుకుంటారు. ఆడపిల్ల సొమ్ము తినాలో, కూడదో అది మీకే వదిలేస్తున్నాం. 

        ఎవరి అమ్మాబాబు వాళ్ళకు మంచివారే. అలా అనుకోవడమూ మంచిదే. మనం రేపు పోతూ ఏమి పట్టుకుపోము. మాటా మంచే మిగిలేది. ఓ మాట ఎవరినైనా అనేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి. మనకు తెలిసిందే నిజం కాదు. 

     కాలం వెంబడి కలంలో నేను రాసింది ఒక వంతే. ఇలాంటి చాలా నిజాలు నాకు బాగా గుర్తున్నాయి. ఏదీ మర్చిపోలేదు. అన్ని వివరాలు, అందరి సంగతులు తెలుసు కాని రక్త సంబంధాలను చులకన చేయడం ఇష్టం లేదు. రేపు పోయినప్పుడు నాకు సొమ్ము లేదని కట్టె పుల్లలు వేస్తారు. మహా అయితే ఈ కోటీశ్వరులకు నాలుగు గంధం ముక్కలేస్తారు. అంతే కదా తేడా…😊 అది సంగతి.



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner