23, ఆగస్టు 2013, శుక్రవారం

మనసున్న మగువ.....!!

రాతి యుగమైనా... రావణ యుగమైనా మగువ గువ్వలా ఒదిగి పోయింది తన స్థానంలో... తనకున్న పరిధిలో...!! ఏ చట్రంలో పెట్టినా తనకంటూ ఒక ఉన్నత స్థానాన్నే సంపాదించుకుంది. అమ్మగా తన బాధ్యతను, బంధాలను, అనుబంధాలను ఇలా అన్నిటిని సమన్వయ పరచుకుంటూ ఇంటి బాధ్యతనే కాక బయటి  అదనపు బాధ్యతలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తోంది ఈనాడు. మగువ ఎప్పుడు బాధ్యతలకు బంధాలకు దూరంగా పారిపోవాలని అనుకోదు...అది ఆధునిక మహిళ అయినా.... ఏమి తెలియని పల్లెటూరి అమాయకురాలైనా పరిస్థితులతో పోరాడుతుంది ధైర్యంగా.
అమెరికా వంటి ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశంలో కూడా మగువ పరిస్థితిలో పెద్దగా మార్పేం లేదు...కాకపొతే అక్కడి మహిళల్లో కాస్త ధైర్యం ఎక్కువ. అవసరమైతే ఒంటరిగా జీవించడానికి కూడా భయపడదు. ఇద్దరికీ ఇష్టమైతే కలిసి ఉంటుంది లేదా ఎవరికీ వారే యమునా తీరే చందాన బతికేస్తుంది కాని ఎవరో ఏదో అనుకుంటారని తన ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించదు. వివాహ వ్యవస్థ పటిష్టంగా లేకపోయినా....బంధం ఎలాంటిదయినా విడిపోయినప్పుడు నష్టం మహిళకే ఎక్కువ. ఒంటరిని అని పిల్లలని వదలివేయదు, భరణం కోరదు....జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. నాకు బాగా నచ్చిన అంశం అక్కడి మహిళల్లో ఒంటరి జీవితంలో ధైర్యంగా బతకడం. కలిసి ఉన్నప్పుడు బాధ్యతలను సమంగా పంచుకోవడం.. .విడిపోయినప్పుడు అయ్యో జీవితం పాడయ్యిందే ఎలా బతకాలి అని బాధ పడకుండా మరో కొత్త జీవితానికి తొందరగా అలవాటు పడటం....ఇలా కొన్ని విషయాల్లో ఆ నాగరికత బావుంటుంది. కాకపొతే అదే సర్వ జనీనం కాదు.
ఇక మన విషయానికి వస్తే ఇక్కడి వివాహ వ్యవస్థ భద్రతతో కూడుకున్నది ఒకప్పుడు. ఏవైనా కలతలు వస్తే పెద్దలు సర్ది చెప్పడం లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు సరిపెట్టుకోవడంతో బంధం నిలబడేది. నా ఇల్లు నా వాళ్ళు అనుకుంటే ఏ బంధమైనా ఎన్ని కలతలు కస్టాలు వచ్చినా చెక్కు చెదరక అలానే నిలబడుతుంది. ఇప్పటి మహిళల్లో చాలా మంది చిన్న చిన్న కారణాలకు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ అదే ఆత్మ గౌరవం అన్న భ్రమలో బంగారు జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మన వివాహ వ్యవస్థను అందరు ఆదర్శంగా తీసుకుంటుంటే మనమేమో స్వతంత్రము, సమాన హక్కులు అంటూ పరాయి నాగరికతలో చెడు వైపు తొందరగా ఆకర్షితులమౌతున్నాము. అమెరికా వంటి దేశాల నాగరికతకు అలవాటు పడి చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల వరకు పోతున్న బంధాలు ఎన్నో ఈ రోజుల్లో. సహజీవనమంటూ వెర్రి తలలు వేస్తున్న కొత్త నాగరిక ప్రపంచంలో పడి పోతున్న ఎన్నో జంటలు రేపటి తరాల భవిత గురించి ఆలోచించకుండా తమ స్వార్ధం చూసుకుంటున్నారు. ఎందరో ఇష్టపడే మన వివాహ వ్యవస్థను మనమే నవ్వులపాలు చేస్తున్నాము ఆధునికత పేరుతో. తప్పని పరిస్థితిలో విడిపోవాలి కాని అది ఒక గొప్పదనానికి గుర్తుగా అనుకోకూడదు. మనతో పాటు పిల్లల మనసులు కూడా ఎంత బాధ పడతాయో ఆలోచించాలి. మన సమాజంలో భర్త లేని భార్యను ఎంత చిన్న చూపు చూస్తారో....ఆమెను పిల్లలను మాటల
తూట్లతో కుళ్ళబొడుస్తారు. ఒంటరిగా బతకడానికి అవకాశం ఇవ్వని రోజులు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితి అలా లేదనుకోండి కాని ఇద్దరి మధ్య బంధం భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి కాని ఏకత్వాన్ని విభజించరాదు. ఒక్కటిగా ఉండాలి కాని విడిపోవాలి అని కారణాలు వెదుక్కొకూడదు. ఆధునికతలో మంచిని తీసుకోవాలి కాని నాగరికత వెర్రి తలలు వేయకూడదు. భిన్న మనస్తత్వాల కలయికే కుటుంబం...అది మన సొంతం. అందరు దాన్ని చూసి గర్వపడాలి....ఆచరించాలి. మగువకు అర్ధం మమత, సమత, మానవత్వం, మంచితనం, కరుణ, ప్రేమ, సహనం... ఇలా అన్ని కలిపి దేవుడు సృష్టించిన ముగ్ధ మూర్తి. ఆధునికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపరా నీ జాతి నిండు గౌరవం.....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఉన్న మాట చెప్పేరు. వినేవారెందరని?

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అండి శర్మ గారు వినని వారిని మనం ఏమి చేయలేము చూస్తూ ఉండటం తప్ప.... ధన్యవాదాలు మీ స్పందనకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner