17, అక్టోబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...మూడవ భాగం....!!

సాహిత్యానికి మూలమైన బాషలోని అందాలు చందస్సు మూలంగా అమరినవే ... అందుకే మన తేట తెనుగులో చక్కనైన సాహిత్యాన్ని అందించిన ఎందరో తెలుగు కవిరాజులు మనకు ఆణిముత్యాలుగా సమకూర్చిన సాహితీ సంపద నేటికి చెక్కు చెదరని శిలాక్షరాలుగా నిలిచి పోయినదనడానికి ఎన్నో ఆధారాలు మనకు అజరామరమైన మధుర కావ్యాలుగా అలరాలుతున్నాయి నేటికీ.... ఇక సాహితీ ముచ్చట్లలో ముచ్చటైనవి గురు లఘువుల గమ్మత్తులతో మనలను అలరాలించిన అందమైన వృత్తాల ఛందస్సుతో కూడిన పద్య రాజాలు ఇప్పటి రోజులలో తెలిసిన వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.....
య మా తా రా జ భా న స లగం అంటే చాలు.... తొమ్మిదిలో నేర్చుకోవడం మొదలు పెట్టిన చందస్సు మనలో చాలా మందికి కాస్తయినా గుర్తు ఉండే ఉంటుంది కదూ.... కొత్తగా నేర్చుకోవడం మొదలు పెట్టిన ఈ గురు లఘువుల గుర్తింపు మొదటి అంకం అయితే.... ఇక నోరు తిరగని పద్యాలలో వృత్తాల పేర్లు గుర్తు పట్టడం మరీ కష్టంగా అనిపిస్తూ అందరికి గుర్తున్న వృత్త పద్యం ఉత్పలమాల... చంపకమాల... శార్దూలం.... మత్తేభం.... మత్తకోకిల..... ఈపాటికి మీకు కొన్నయినా గుర్తు వచ్చే ఉంటాయి ఎందుకంటే మన అందరికి తెలుగు అంటే బోలెడు అభిమానం ఉంది కదా....
ఉదాహరణకు కొన్ని భ ర న భ భ ర వ.... స బ ర న మ య వ... మ స జ స త త గ.... ఇలా పద్య పాదంలో గురు లఘువులను గుర్తించి అది ఏ వృత్తమో అని చెప్పడం నాకయితే భలే ఇష్టంగా ఉండేది....
ఉత్పలమాల గురించి .....
భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్. 

లక్షణములు:
పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20 

ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ 
యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము 
ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
గణవిభజన ఉత్పలమాల వృత్త పాదము నందు గణవిభజన
      భ            ర         న           భ            భ         ర         వ


    U I I     U I U     I I I      U I I        U I I    U I U    I U
  పుణ్యుడు రామచం ద్రుడట పోయిము  దంబున గాంచెదం డకా  
పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో ఒకటిని ఉదాహరణగా పేర్కొంటున్నాను . ఉదాహరణ 1:
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.


మరికొన్ని వృత్తాల లక్షణాలు మళ్ళి వారం....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner