18, అక్టోబర్ 2014, శనివారం

సంద్రంలా నువ్వు.....!!

 ప్రియమైన నేస్తమా....
అమ్మ చాటు బొమ్మలా కొంగుచాటు నుంచి తొంగి చూస్తున్న బుజ్జాయి గుర్తుకు వస్తోంది నిన్ను తలచుకుంటుంటే... ఎప్పుడు చూసినా పుస్తకంలో తల దూర్చి చదివేస్తూనే ఉంటావాయే.... ఎందుకోయ్ అంత తాపత్రయం బాగా చదివేయాలని..... పుస్తకాలను చదవడం కాస్త పక్కన పెట్టి జీవితాన్ని చదువుతూ ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరాదు... పుస్తకంలో నుంచి ఒక్కసారి తల ఎత్తి చూడు... ఎన్ని రంగుల హంగుల రాతి జీవితాలు కనిపిస్తాయో.... ఒకప్పుడు నేను అలానే అనుకున్నా... మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా బావుందని... ఎంత బావుందో తెలిసాక జీర్ణించుకోవడం చాలా కష్టం అయ్యింది.... పైకి కనిపించే మంచితనం వెనుక దాగున్న మోసం... దాని చుట్టూ అల్లుకున్న నటన.... అవసరానికి తగినట్లుగా మార్పులు చేర్పులు.... ఓ గొప్పాయన (పేరు గుర్తు లేదులే) అన్నట్టు మానవ బంధాలన్నీ ఆర్ధిక అనుబంధాలుగా మార్చేసిన ఈ మనుష్యులలో మనము ఉన్నామని కించిత్ బాధగా కూడా ఉంది..... భావుకతలో బతికేద్దామంటే బాదరబందీలు ఎక్కువై భాష్యాలు తెలియకుండా కనుమరుగై పోతున్నాయి...ఎందుకో సముద్రం చాలా బావుంటుంది నాకు ... ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయి దానిలో... సముద్రంలో ఉన్నది పనికిరాదనుకునే ఉప్పునీరైనా మన అవసరానికి ఉప్పుగా పనికి వస్తోంది.... దానికున్న పారదర్శకత మనలో ఎంత మందికి ఉంది..?? ఎందుకో కాని ప్రతి అల నాకు ఓ జీవిత పాఠం నేర్పుతున్నట్టుగా అనిపిస్తుంది... తీరాన్ని చేరాలన్న తపన మధ్యలో పడిపోయినా మళ్ళి ఎగసిపడే దాని ఉబలాటం భలే ముచ్చటగా అనిపిస్తుంది... అలను విసిరినా మళ్ళి తనలోనికే చేర్చుకునే సాగరం ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకునే అమ్మ మనసులా హాయిగా అనిపిస్తుంది.... అలలు వెనుకకు వెళ్ళగానే ఆ తడి తగిలిన ఇసుక ఎంత స్వచ్చంగా ఉంటుందో ఎప్పుడైనా చూసావా... అచ్చు నీ మనసులానే...సంద్రానికి ఏమి పట్టదు... నీకు ఏది పట్టదు... అందుకే సముద్రము, దాని అంత విశాలమైన మనసున్న నువ్వు మీ ఇద్దరు నాకెంతో ఇష్టమైన నా నేస్తాలె ఎప్పటికి... అందుకే ఇలా నా అనుభూతుల భావాలు పంచుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు.... మరి ఉండనా బుజ్జాయి....!!
నీ నేస్తం.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner