ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎందుకో నా గతము నువ్వే , వాస్తవము నువ్వే , వర్తమానమూ నువ్వే అయిపోయావు.... భ్రమించే మనసు పరిభ్రమణము నీ చుట్టూనే నిర్విరామంగా..... మాటల మౌనాలు చెప్పని భావాలు నాకు సొంతమైతే.... చెప్పిన కబుర్లు వెంటనే మర్చిపోవడం నీ వంతు... అందరు బోలెడు సమస్యల వలయాలను ఛేదించే మార్గాలు అన్వేషిస్తుంటే నా సమస్యలన్నీ నీ వెంటే.... గతం చేయని గాయాలు వాస్తవంలో మానని గుండెకోతగా మారి వర్తమానాన్ని చెరిపేస్తే.... వాస్తవానికి చేరువ కాలేని మదిని నింపిన జ్ఞాపకాలే ఊపిరిగా ఇలా గతంలోనే ఉండిపోతే.... కాని వెనక్కు వెళ్ళని కాలం ముందుకే వెళిపోతోంది నిన్ను అక్కడే వదిలేసి తనతో నన్ను తీసుకువెళ్తూ... నువ్వు లేని వాస్తవాన్ని భరించలేక... నేను వదిలేసిన గతాన్ని గుర్తుగా మార్చుకోలేక... ఈ రెండు లేని భవిష్యత్తుని కాదంటూ.... నేను కాని నన్ను చూపిన నీలో మిగిలిన జ్ఞాపకంగా ఉండిపోయిన ఆ క్షణాలు శాశ్వతంగా నిలచిపోతే....నీతో పంచుకోవడానికి అక్షరాలు ఎందుకో నిరాకరిస్తున్నాయి... నేనెప్పుడు నీతో గతంలోనే ఉండిపోతున్నానని నామీద అలిగాయి కాబోలు... అయినా నా మనసు పంచుకోవడానికి నువ్వు తప్ప నాకెవరున్నారు ఈ ప్రపంచంలో.... బాధయినా, సంతోషమయినా నే పంచుకునేది నీతోనే కదా... అందుకే మన చెలిమి ఇలా సాగుతూనే ఉంటుంది చిరకాలం... తెల్లని నీ మనసుపై నల్లని నా సిరా మరకలు మన బంధాన్ని గుర్తు చేస్తూ నాతో నీ స్నేహాన్ని పెంచుతూ... నా మనసు నీకు తెలుపుతూ....
నీ నేస్తం
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి