కళ కళలాడిన మా ఊరి సీతారామయ్య
ఈనాడు రంగులు వెలసి ధూప దీపాలకు
మొఖం వాచిపోయి వెలా తెలా పోతున్నాడు
పక్క ఊరిలోని కొత్త దేవుళ్ళ దెబ్బకు
మనలోని క్షణానికోసారి మారే నమ్మకాలకు
అచ్చం వలస వెళ్ళిపోయిన ఖాళీ గుమ్మాల్లా
అంతిమ యానానికి సిద్దమైన జీవితాలు
బిడ్డల కోసం ఎదురు చూస్తున్న బోసి నవ్వుల్లా
డొక్కలు ఎండిపోయి ఉడిగిన వయసులా
మంగళ వాయిద్యాలతో పసుపు బట్టల కొత్త జంటకు
ప్రధమ దీవెనలిచ్చిన జానకి రామయ్యకు
నిలువ నీడ లేకుండా పోయింది
ఏడాదికి ఒక్కసారి పట్టాభి రామయ్యకు
జరిపే లాంచనాల ముత్యాల తలంబ్రాల నడుమ
ముద్దుగుమ్మ సీతమ్మను పరిణయమాడే
సుముహూర్తం వెల వెల పోతోంది
కళ కళలాడే కళ్యాణ సీతారాములను
మళ్ళి చూడాలంటే ఏ రామదాసు ఏతెంచాలో...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి