ఏంటో ఈమద్య బోలెడు కబుర్లు చెప్పాలని ఉన్నా ఎందుకో మరి అక్షరాలు సహకరించకో, భావాలు అటూ ఇటూ పరుగులెత్తుతూ దొరకక పారిపోతూనో.. ఆగిపోయిన మనసు అలజడిని నీతో పంచుకోలేక పోయాను... ఈ ముఖ పుస్తకానికి రోజు మనం రాకపోయినా పోయేదేం ఉండదు... వచ్చి గంటల తరబడి ఉన్నా ఒరిగేదేం ఉండదు... ఏదో మన ముచ్చట్లు నాలుగు పంచుకోవాలనిపిస్తే పంచుకుంటాం లేదా నలుగురివి నచ్చితే నాలుగు స్పందనలు, ఇష్టాలు తెలుపుతాం... దీనివల్ల మనకు పోయేదేం లేదు.. మన జీవితాన్నే ముఖ పుస్తకానికి అంకితమిచ్చేసినట్లు మనం అనుకోనక్కర లేదు.. మన భావాలు ఎదుటి వారు గౌరవించినట్లే మనము కనీసం మనకు నచ్చిన ఓ నలుగురి భావాలకు మన స్పందనలు తెలిపినంత మాత్రాన మన సమయం ఏం తరిగిపోదు... ఎవరమైనా మనకు అనిపించిన భావాలు పంచుకోవడానికి ఈ ముఖ పుస్తకాన్నే వేదికగా చేసుకుంటున్నాము... మనకున్న సమయంలో కాస్త మన అభిప్రాయాలు పంచుకోవడానికి ఏదో మనకు వచ్చిన భాషలో తెలియపరుస్తున్నాము... మనకు నచ్చిన ఓ నాలుగు పోస్టులకు స్పందిస్తున్నాము... దీని కోసం జీవితమంతా ముఖ పుస్తకంలోనే ఉన్నట్టు మనం భావించనక్కర లేదు... మనం ఏదో గొప్పగా రాసేసామని మనకు స్పందనలు బోలేడు వస్తున్నాయని గర్వంగా అనుకోనక్కరలేదు... మనకు, మన భావాలకు విలువ ఇస్తున్నారంటే అది ఎదుటి వారికున్న సంస్కారం... ఆ సంస్కారమున్న ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు.. ఎవరి జీవితాలు, బాధ్యతలు, వృత్తి, ఉద్యోగాలు వారికి ఉంటాయి... ఓ నాలుగు నిమిషాలు మనము మన సంస్కారాన్ని తెలిపినంత మాత్రాన మనకు పని పాటా లేక మన జీవితాన్ని ముఖ పుస్తకానికి అంకితం చేసినట్లు కాదు... సమయం మన చేతిలో ఉండాలి కాని మనం దాని చేతిలో ఉండకూడదు... మన రాతలకు కేటాయించిన సమయాన్నే కొద్దిగా ఎదుటి వారి భావాలకు విలువ ఇవ్వడానికి ప్రయత్నిస్తే మనకు వచ్చిన ఆనందమే ఎదుటి వారికి వస్తుంది... ఏం మన సంతోషానికి కారణమైన వారికోసం మనమూ ఓ నాలుగు నిమిషాలు కేటాయించలేమా.. మీరే ఆలోచించండి నేస్తం...!!
నీ నెచ్చెలి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి