30, మార్చి 2019, శనివారం

ఏక్ తారలు...!!

1.  మనసు తడి నే తీసుకున్నా_మౌనం నీకొద్దంటూ...!!

2.   అప్పటి పరిచయ క్షణాలే_ఇప్పటికీ అదే పరిమళ భావాలతో...!!

3.   మనసు మనసుకో ముచ్చట_మురిపెంగా మురిసిపోవాలని...!!

4.   మౌనానికీ ఎరుకయ్యింది_నీ మాటల మాయలో నే పడిపోయానని..!!

5.   ఏమెరుగని అమాయకత్వమది_చవితి చంద్రుని చూసిన నీలాపనిందలతో..!!

6.   మనసాక్షరాలంతే మరి_భావాలనలా బంధించేస్తూ.....!!

7.  మనసుకు ఊరటనందివ్వడమే_అక్షరంతో నెయ్యమంటే...!!

8.   అలవాటే అది అక్షరాలకు_జత చేరుతున్న భావాలను ముచ్చటగా చూపడం...!!

9.    అక్షరాలకూ అలవాటే_మనసుని తమలో చూపడం...!!

10.   అక్షరాలతో జత కట్టానందుకే_భారాన్నంతా భావాల్లో వొంపేద్దామని...!!

11.  అధిగమించాలి అడ్డంకులను_భావాక్షర బంధాలను బలోపేతం చేయడానికి...!!

12.   పదాలన్నీ దాసోహమంటున్నాయి_గుండెల్లో దాగిన నీ ప్రేమ తెలిసిందనుకుంటా...!!

13.   తొలగించావుగా విముఖతను_నీ ప్రేమతో మనసు అందాన్ని అలంకరిస్తూ...!!

14.   మౌనం మనసు విప్పింది_ఆరాధనకు పరమార్థాన్ని వివరిస్తూ...!!

15.   కంటి కొలను నిండింది_మనసు భారాన్ని తాను స్వీకరిస్తూ...!!

16.   వెక్కిరింతలకు వెరవకూడదు_కలతల గాయాన్ని గెలవనీయక...!!

17.   గాయానికి ఓటమి రుచి చూపాలి_కలతల కల్లోలానికి ఆనకట్ట వేస్తూ...!!

18.   మౌనాకికెరుకే మరి_మది గాయాలకు లేపనమేమిటో...!!

19.   అనునయాల ఊరడింపులే అన్నీ_మది గాయాల కలవరింపులకు...!!

20.   చెంతనే చేరింది చెలిమి_కన్నీటి కడలికి తావీయకంటూ...!!

21.   చేయూతనివ్వడానికే చెంత చేరింది_నెచ్చెలి మనసు నొచ్చకుండా...!!

22.   మౌనం అనివార్యం_శూన్యమదిని నిలువరించడానికి...!!

23.   తపస్సు మౌనానిదే_నీ మాటలను మనసులో ధ్యానిస్తూ...!!

24.    ప్రతి రేయి ఊసులాడుతుంది_నీ జ్ఞాపకాల గురుతులతో...!!

25.   మౌనాల అల్లరే అనుక్షణం_వేకువపొద్దును స్వాగతిస్తూ..!!

26.   రాతిరి నవ్వులే అవి_వేకువపొద్దు వెలుగురవ్వలుగా...!!

27.   మౌన తమస్సది_నీ స్మరణే ప్రాణనాదమై...!!

28.   మౌనాక్షరాలు రాశులుగా పేరుకున్నాయి_చెల్లింపులు సరిపోలేదనుకుంటా....!!

29.   అక్షరసంచారమే జీవితం_మనసును సముదాయించడానికి...!!

30.   ఆవాహన చేసుకుంటున్నాయలా_మదిని అక్షరాల్లోనికి....!!

అమ్మ పేరే.. నా కవిత్వం..సమీక్ష ...!!

                               అమ్మ మీద ప్రేమే ఈ "అమ్మ పేరే.. నా కవిత్వం.."
  చక్కని చిత్రాలతో అందరిని అలరిస్తూ కుంచె కలం పేరుగా చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కుంచె చింతా లక్ష్మీనారాయణ. తన భావాలను అందమైన గీతలలో చూపించడమే కాకుండా అద్భుతమైన భావాలను అలవోకగా రాయగల నేర్పు కుంచె చింతా లక్ష్మీనారాయణది. కథలు, కవితలు, బాల సాహిత్యం ఇలా అన్నింటిలో అందె వేసిన చేయి వీరిది." అమ్మ పేరే... నా కవిత్వం " అంటూ అందరి మనసుల్లోని అమ్మను, అమ్మ ప్రేమను అద్భుతంగా అక్షరాల్లో అందించారు.
                         అమ్మతో నేనంటూ అమ్మ కడుపులో జీవం పోసుకున్న వైనాన్ని, తొమ్మిది నెలల ప్రయాణంలో అమ్మతో పంచుకున్న పేగు బంధాన్ని, పురిటి బిడ్డగా లోకాన్ని చూసిన తీరును ఇలా ప్రతి క్షణాన్ని కనుల ముందు నిలిపారు. మాయమ్మ కవితలో ఈ ప్రపంచంలోనికి వచ్చిన మొదటి క్షణాల నుండి అమ్మతో పంచుకున్న అనుభూతిని, అమ్మ తనను గుండెలకత్తుకున్న క్షణాల దగ్గర నుండి అమ్మ స్పర్శలో ఆనందాన్ని, లాల  పోసినా, జోల పాడినా, ఉగ్గుపాల మురిపాలు ఇలా అన్నింటిని మనం అనుభూతించేటట్లు చేసారు. అమ్మ ముద్దులతో తడిచిన తన పాలబుగ్గల చెమ్మను అమ్మ ప్రేమలో చూపిస్తూ అమ్మ మనసును తనకు పేరు పెట్టడం దగ్గర నుండి తన కొడుకు అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్న తపన తల్లి మనసుదని చెప్తూ  క్రమశిక్షణ నేర్పిన గురువుగా వర్ణిస్తారు. తన రాక కోసం ఎదురుచూపులను, గోరుముద్దల ఆకలి, నిదుర నవ్వుల కథల నక్షత్రాల ఆకాశాన్ని అమ్మ పక్కన పడుకుని అనుభూతించడాన్ని హృద్యంగా చెప్తారు. నా.. బాల్యంలో స్కూలుకి పోయే సందడి అల్లరిని, చిరిగిన చొక్కాలో చీరుకున్న రేగు, కంప చెట్ల జ్ఞాపకాలు, అమ్మ కొత్త చొక్కాలా చేయడము, వంకల్లో వాగుల్లో వాన వచ్చినప్పుడు చేసి వదిలిన కాగితపు పడవల జ్ఞాపకాలు గుట్లోంక కవితలో, గోనుపట్ట కొప్పిరి కవితలో జీతగాడు రాకపోతే చేసిన పనిని, నా..యవ్వనం కవితలో కొత్తగా వచ్చిన కౌమార్యం, లుంగీ తిప్పలు, బయట తిండితో వచ్చిన తిప్పలు, అమ్మ చేసిన సపర్యలు సరదాగా చెప్తారు.  పండగొస్తే చేసే హడావిడి, వంటల్లో అమ్మకు చేసిన సాయం, చిన్నప్పుడు పక్కవాళ్ళని చూసి మారాం చేస్తే అమ్మ చేసిచ్చిన కొబ్బరాకు వాచ్చిని, నా..తొలి-విజయం కవితలో తొలి గురువు, దైవమై అమ్మ నేర్పిన ఆట పాటలు, విద్యాబుద్ధులు, బూగంప, మాగాణి, జమ్మిచెట్టు నీడలో వంటి  కవితల్లో పొలంలో చేను గట్టు చెట్టు కింద అమ్మ పెట్టిన పప్పు ముద్దలు, బోరు కింద తలా స్నానాలు, పైరు అందాలు, అవ్వ విసిరిన విసనకర్ర గాలిని గుర్తు చేసుకున్నారు. మనకు ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు అనడంలో సందేహం లేదు. అమ్మతో తిరునాళ్లకు వెళ్లిన జ్ఞాపకాలు, అమ్మ కొంగు చాటున దాగున్న గురుతులను, అమ్మ ఒడి తోడుగా కావాలని చెప్పడం, అమ్మ పలుకు విని నిదుర లేవడంతో మొదలై అమ్మ చేతి ముద్దతో తనకున్న అనుబంధాన్ని చెప్తూ, తనకు పెట్టందే ముద్ద ముట్టని అమ్మను , అమ్మ బాధను చూడలేని బిడ్డగా ఆ.. క్షణాలను అక్షరీకరించారు ఆర్తిగా. అమ్మ జోలపాట ఓంకారనాదమంటూ, అమ్మ పడిన జాబిల్లి పాటను మనందరికీ మరోసారి గుర్తు చేస్తూ, నా..దారి మా అమ్మ అని చెప్పడం చాలా బావుంది. అమ్మ పేరే...న కవిత్వం అంటూ చంటి పిల్లాడి ఏడుపు నుండి చివరి వరకు ప్రతి శబ్దంలోనూ  వినిపించే స్వరం అమ్మ అని అంటూ గుండె కొట్టుకునేది 72 సార్లు అయితే నిమిషానికి 100 సార్లు అమ్మ తల్చుకునేది బిడ్డనని ఎంత బాగా చెప్పారంటే ఈ కవితా సంపుటికి " అమ్మ పేరే..నా కవిత్వం " అని సరిగ్గా సరిపోయేంతగా.
          జీవిత ప్రయాణం మొదలైనప్పటి నుండి దారి పొడవునా అమ్మ జ్ఞాపకాలతో, ఎదురుచూపులా అమ్మ ప్రేమనీడలో, మాది మమతల కోవెలలో అమ్మా అని పిలిచినా ప్రతిసారి నిజమైన నేస్తం అమ్మ అని, మా నానా మీద ప్రేమ, వాళ్ళ నాన్న మీద  ప్రేమ కలిపి నామీద కురిపించే అమ్మ ప్రేమ పిచ్చిదని, నేను బయటకు వెళుతుంటే ఆరోగ్యం బాలేని అమ్మ ముఖంలో మార్పు,పక్షవాతంతో అలిగిన అమ్మ చేయి, ఆ చేయి పెట్టిన గోరుముద్దలు, అమ్మ అవస్థను అర్ధం చేసుకోలేక విసుక్కున్న తన తెలిసి తెలియని స్థితిని నిందించుకున్న తీరు తప్పు చేశానమ్మా కవితలో కనిపిస్తుంది. అమ్మను పసిపాపగా చూసుకునే భాగ్యందక్కడం తనకు ఈ జన్మలో దక్కిన వరమని తానూ ఓ పసిపిల్లాడిలా సంబరపడటం అమ్మ ఋణం కవితలో మనం చూడొచ్చు. ఉగాది పండుగ సంబరాలకు దూరమైన అమ్మా కొడుకుల ఆంతర్యాలను ఎన్ని రోజులైందో కవితలో మనకు గుర్తు చేస్తారు. అమ్మకు చేసిన సేవలను అమ్మకు తలంటు స్నానం, నా...జన్మ ద్వారం కవితల్లో చదువుతుంటే అమ్మకు అమ్మైన ఓ బిడ్డ కనిపించాడు. నాకనిపించింది భావాన్ని చెప్పడానికి మాటలు కూడా దొరకని స్థితి. చిన్నవారైనా ఇంత బాగా రాసిన మీకు నా ఆశీస్సులు. నిశ్చలమైన తల్లి కవితలో  ఒక జీవికి జీవితాన్నివ్వడానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టె తల్లి ఈ భూమిపై జీవానికి నిజంగా సంతానతల్లే అని చాలా బాగా చెప్పారు. నేను ఔనన్నా కాదన్నా నన్ను రోజు తాకే  చల్లని పైరగాలిలో భౌతికంగా దూరమైన అమ్మ, నాన్న కలిసి తాకుతున్న అమ్మానాన్నల ప్రేమే ఉంటుందని నా..తో...కవితలో చెప్తూ తనని తాను సముదాయించుకుంటారు. జాలి, దయకు,ప్రేమాప్యాయతలకు నిలువెత్తు సాక్ష్యం అమ్మంటారు. ఙివిత సాగరంలో సునామీలకు ఎదురొడ్డి గమ్యాన్ని చేర్చేది అమ్మని చెప్తారు. కలుషితం లేని అమ్మ ప్రేమ గొడుగై నిలుస్తుందని, ంఒరొ వరంగా మళ్ళీ ఆ అమ్మకే పుట్టాలని కోరుకుంటూ, అమ్మంటే ఏమిటో చెప్తూ, రెండక్షరాల ప్రేమ అమ్మానాన్నల ప్రేమంటూ, నాన్నంటే ఓ  భయం,ధర్యం, నిజం అని చెప్తూ, నాన్న నేర్పిన సంస్కారాన్ని గుర్తు చేసుకుంటూ, నాన్న మందలింపు మాటున దాగిన ప్రేమని తెలుసుకుంటారు. నాన్నని గుర్తు చేసుకుంటూ, విశ్వమంత ఎత్తులో చూసుకుంటూ, తన ఎదుగుదలకు కారణమైన నాన్నకే మళ్ళి కొడుకుగా పుట్టాలనుకోవడం బావుంది. తన జీవితాన్ని పల్లె నుండి బయటకు వచ్చిన విధానాన్ని నా... కుటుంబం కవితలో చెప్తారు. నాన్న దూరమైనా క్షణాలకు అక్షరాల్లో జీవం పోశారు. అమ్మే అక్షరమై తనలో నిలిచిపోయిందని, అదే తన శ్వాసని నాతోనే...నిర్జీవమైపోవాలి అన్న కవితలో మాతృభాషపై మమకారాన్ని చూపిస్తారు. అమ్మ కష్టాన్ని అక్షరాల్లో చూపిస్తూ  లిఖించని చరిత అమ్మదని చెప్తూ అమ్మకు తన అక్షరాభావాలతో పాదాభివందనం చేస్తూ అమ్మానాన్నల ఋణం తీర్చుకున్న కుంచె చింతా లక్ష్మీనారాయణ ధన్యులు.
     ఇంత గొప్పగా అమ్మను అక్షరాల్లో చూపిన బిడ్డ, పరాయి స్త్రీలో తల్లిని చూసే మంచి మనసున్న మనిషిగా మరిన్ని రచనలు చేయాలని కోరుకుంటూ... హృదయపూర్వక అభినందన అక్షర చందనాలు. 

28, మార్చి 2019, గురువారం

పెత్తనం...!!

"పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగిందట". పార్టీ పేరుచెప్పి చందాలు అడుక్కుని గెలిచినవాళ్ళు తర్వాత మన మీదికే రాళ్ళు రువ్వుతున్నారు. ఒక్క ఆడది ఊరంతా పెత్తనం చలాయిస్తూ అధికారులను, అనుయాయులను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతుంటే దాని అడుగులకు మడుగులు  ఒత్తుతున్నారందరు. పోతే పది ఓట్లే కదా పోతాయి అనుకుంటున్నారేమెా. ఇలాంటి పదులు చాలా చోట్ల పోతున్నాయి. రేపటి ఓటమికి ఇవే ముఖ్య కారణాలు.

18, మార్చి 2019, సోమవారం

మెుహమాటాలు...!!

అభిమానంతో ఇచ్చిన పుస్తకాలు దయచేసి పాత పుస్తకాలుగా అమ్మకండి... మీకు ఇష్టం లేకపోతే తీసుకోకండి. అంతేకాని రాసిన వారిని అవమానించకండి.. కాని దీని మూలంగా నాకు రెండు మంచి పనులు జరిగాయి.  చదువుకునే పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు తెలియని వారు ఆ పుస్తకాలు వెతుకుతూ నా పుస్తకం అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు ని పాత పుస్తకాల షాపులో కొన్నారు.  మరొకరు సడిచేయని (అ)ముద్రితాక్షరాలు పుస్తకాన్ని అలాగే పాత పుస్తకాల షాపులో కొని రేడియో లో ప్రోగ్రామ్ చేసారట. పుస్తకాలను అవమానించకండి...

17, మార్చి 2019, ఆదివారం

ఏ రాగమెా...!!

ఏ రాతిరిదే రాగమెా
ఏ వెన్నెలదే యెాగమెా
ఏ మౌనానిదే మంత్రమెా
తెలియని మనసుకు తపనెందుకో

ఏ జతను చేరుకోలేదో
ఏ మమతను పంచుకోలేదో
ఏ ఆరాధనను అందుకోలేదో
మరుజన్మకు అందుకోవాలన్న ఆరాటమేమెా

ఏ పిలుపులో ఏముందో
ఏ వలపులో ఏ ప్రేముందో
ఏ తలపులో ఏ చెలిముందో
తడిమిన అనుబంధమై చేరువౌనేమెా

ఏది తెలుసుకోలేని అమాయకత్వమై
దేనికి నోచుకోని నిరాశ్రయగా
నిశ్చల నిర్వికారమై మిగలకుండా
నిరాకారమైన విశ్వాత్మలో విలీనమీజన్మ...!!

15, మార్చి 2019, శుక్రవారం

జీవన "మంజూ"ష (ఫిబ్రవరి )...!!

నేస్తం,

          మనిషి మనుగడకు జీవనాధారం భాష. ఆ భాషకు మూలం అక్షరం. ఆది యుగానికి ముందే లిపి ఉన్నదని భాషా మూలాలు చెప్తున్నాయి. మాతృభాష మీద మమకారం నానాటికి తగ్గుతూ, అవసరాలకు తగ్గట్టుగా భాషలను మనకు ఆపాదించేసుకుంటున్న రోజులు ఇవి. పుస్తకాలను చదవడం నామోషీగా అనుకుంటూ, రాతలను, రాసే వారిని చిన్నచూపు చూస్తున్న నేటి అభ్యుదయవాదులు ఎందరో. తమ రాతలను ఓ పుస్తకంగా అచ్చులో చూసుకోవాలన్న కోరిక అందరికి ఉండటం సహజమే అయినా రాయడానికి ఎన్ని వ్యయ ప్రయాసలు రచయిత అనుభవిస్తాడో, ఆ రాతలు పుస్తకంగా రూపు దిద్దుకోవడానికి అంతకన్నా ఎక్కువగా ఇబ్బందులకు లోనుకావడం చాలా బాధాకరం. పుస్తకం చేతికి వచ్చాక దానిని ఆవిష్కరించడానికి ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది ఈనాడు. పుస్తకం ఖర్చు కన్నా కూడా ఆవిష్కరణ ఖర్చు మోయలేని భారమౌతోంది. పీఠాధిపతులను మించి సాహితీ పెద్దలు కొందరు ఉంటున్నారు. వక్తలను వేదికపైకి ఆహ్వానించడంతో మొదలు, ఆహ్వాన పత్రికలో పేర్లు వేయడం దగ్గర నుంచి ప్రతి దానికి లెక్కలు వేసే సాహితీ పెద్దలు ఉపన్యాసాలు మాత్రం ఎడతెరిపిలేకుండా చెప్తారు కాని, కనీసం ఒకింత నీతిగా చెప్పే నాలుగు మాటల్లో ఒకటయినా పాటించి ఇతరులకు చెప్పాలనుకోరు. ఒకరేమో నా పేరు ముందు ఉండాలంటూ తమ బిరుదుల ప్రత్యేకత చాటి చెప్పాలనుకుంటే, మరొకరేమో నా  పేరు ముందు గౌరవం పెట్టలేదు వేరే వారికి పెట్టారంటారు. మనకి ఇష్టమైన వారిని పిలవడానికి కూడా మనకు అధికారం ఉండదు. బయట అందరు ఆత్మీయులే కానీ ఒకరిని చూసి ఒకరు ఓర్వలేనితనమే ఇక్కడ కూడా. ప్రతిసారి తామే ఉండాలన్న అహం ఎక్కువ. పోనీ పిలిచామే అనుకోండి వచ్చి నాలుగు పొగడ్తలు పొగిడేసి తరువాత కనీసం వారిని సాధారణ రచయితలుగా కూడా గుర్తించరు సదరు పెద్ద మనుష్యులు. అందరు వీరిని మాత్రం పెద్ద పీట వేసి గౌరవించాలని తాపత్రయ పడిపోతుంటారు. మరి కొందరేమో పుస్తకాలకే విలువ లేదు, వాటి ఆవిష్కరణలకు వస్తే సమయం వృధా తప్ప మాకేంటి లాభం అంటారు. మరో హాస్యాస్పద విషమేమిటంటే ఇలా అన్న పెద్దలకే పుస్తక ప్రదర్శన నిర్వహణలు ప్రభుత్వం అప్పగించడం. పదవులు కట్టబెట్టడం. సాహితీ పిపాసకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తారు కాని వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం, అటు ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకోవడం వంటి సాహితీ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పురస్కారాలకు అర్హులౌతున్నారు. తెలంగాణ, ఆంధ్రాలలో ఎక్కడ చూసినా ఆ నలుగురే ఉంటారు ఏ సాహితీ కార్యక్రమాలకైనా, పురస్కారాలకైనా. ఈ సాహితీ కృత్యాల గురించి ఇలా చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది. 
మంచి సాహిత్యం బతకాలంటే భజన సాహిత్యం నశించి భాషా సాహిత్యానికి, అసలైన ప్రతిభకు కాస్త చేయూత ప్రభుత్వ, సాహితీ సంస్థల తోడ్పాటు ఎంతో అవసరం ఇప్పటి రోజుల్లో. నాలుగు మంచి పుస్తకాలు వస్తే నాలుగు కాలాలు భాష బతుకుతుంది. 
ఇప్పటికి ఈ ముచ్చట్లకుసశేషం.... 

జీవన "మంజూ"ష (ఏప్రియల్)...!!

నేస్తం,
                పుట్టుకతో మనకు వచ్చేది కులం. మతం అనేది మనకిష్టమైనట్లు మనం ఆపాదించుకునేది. సాహిత్యం, సంగీతం మొదలైన కళలు కొందరికి జన్మతః ప్రాప్తిస్తాయి. నేర్చుకోవాలన్న తపన ఉన్న మరికొందరు నిరంతర అభ్యాసంచే ఆయా కళల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఏ కళైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడని నాడు ఆ కళ వ్యర్థమే. కనీసం మానసిక వికాసానికైనా ఉపయోగపడినప్పుడే ఆ కళకు సార్థకత. మన పూర్వీకుల చరిత్రలు చూస్తే అనాది నుండి ఈ కళలు సామాజిక జీవితాల్లో ప్రముఖ పాత్ర వహించాయనే చెప్పాలి. వైద్యానికి, మానసిక ఉల్లాసానికి, సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడిన కళలు ఇప్పుడు కులమతాల పేరుతో చిచ్చులు పెడుతూ రావణ కాష్ఠంలా రగులుతూనే  ఉన్నాయి. మనందరం ఇలాంటి సంస్కృతిని పోషిస్తున్నందుకు చాలా సిగ్గు పడాల్సిన విషయం.
             అమ్మానాన్న మనకంటూ ఓ గుర్తింపునిస్తారు ఈ సమాజంలో. మన చదువు, మన నడవడి మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని అందిస్తుంది. సమాజ హితానికి సాహిత్యం కాని, కులమతాల కుమ్ములాటలకు కాదు. ఏ మతము పరాయి మతాన్ని దూషించమని చెప్పదు, అవహేళన చేయమని చెప్పదు. విజ్ఞానం వినయాన్నివ్వాలి కాని వివేకాన్ని కోల్పోయేటట్లు చేయకూడదు. ఎవరి కులం, మతం, ప్రాంతీయత వారికి గొప్ప. అభిమానం ఉండటం తప్పు కాదు, విచక్షణ లేకుండా ప్రవర్తించడం చాలా తప్పు. ఆ తప్పుని సమర్థించే వారిది, వారు ఎవరైనా సరే క్షమించరాని నేరం. పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన పెద్దలే ఇలాంటి వారికి కొమ్ము కాస్తుంటే సాహిత్యం సమాజానికి కాస్తయినా మంచి చేయడం అటుంచి విషాన్ని చిమ్మడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
          వ్యక్తిగతాన్ని ఎవరమైనా గౌరవించాల్సిందే, అదే సమయంలో వ్యవస్థకు కీడు చేసే ఎలాంటి సాహిత్యమైనా, కళైనా గర్హించదగినదే. అలా చేయనినాడు ఆ తప్పుని సమర్ధించిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. సమాజ నాశనానికి కారకులే. సాహిత్యకారులకైనా, కళాకారులకైనా ఓ గుర్తింపు వచ్చిన తరువాత వారి బాధ్యత ఈ సమాజంపై మరింత పెరుగుతుంది. మన భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోదు. దేశద్రోహుల్ని సైతం గౌరవిస్తున్న సంస్కారం మన భారతీయులది. అలాంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి కాని, పుట్టిన గడ్డను, సంస్కృతిని అవహేళన చేయడం అన్నది అమ్మని అంగట్లో అమ్మేసినట్లే అని ప్రతి మనిషి గుర్తించాలి. మన చేష్టలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోవాలని సాహిత్యాన్ని కాని, కళను కాని ఎంచుకోకూడదు. ఎదుటివారి మనోభావాలను గౌరవించడంలోనే మన సంస్కారం బయటపడుతుంది. కళాకారులు, సాహిత్యకారులు దయచేసి వ్యక్తిగతాన్ని వ్యవస్థకు ఆపాదించకండి. పదిమందికి మార్గ నిర్దేశకులు మీరు. మీ మీదున్న గురుతర బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి కానీ సమాజంలో విష బీజాలు నాటకండి. తప్పులు సరిదిద్దండి కానీ మరో తప్పు చేయడానికి దోహదపడకండి. సమాజ హితానికి చేయూతనివ్వండి.
చివరిగా ఓ మాట..
తప్పులు అందరు చేస్తారు కాని ఆ తప్పుని ఒప్పుకోవడంలోనే ఆ వ్యక్తి గొప్పదనం బయట పడుతుంది. అది మీకందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ...
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
            

14, మార్చి 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.   కలంలో ఒదిగిన సిరా_కాలపు క్షణాలను ఒద్దికగా లిఖిస్తూ....!!

2.  చెదరని గురుతులవి_వదలక వెంబడిస్తూ...!!

3.   సరాగమూ విరాగమే_మనసాక్షరాలకు మనసెరుక కానప్పుడు...!!

4.   గత'మది' ఘనమైనదే_జ్ఞాపకాల మంజూషమై...!!

5.   కుంచెడు నవ్వులొలికాయిగా_పుంజీడు పలుకులకు...!!

6.   మనసు విదిల్చిన సిరాచుక్కలు_సాంగత్యానికి నోచుకోని శిథిలాక్షరాలేమెా....!!

7.   ఆకాశమంత ఆదరణ అమ్మది_కన్నీటి కడలిని తనలో దాచుకున్నా...!!

8.    దైన్యానికి ధైర్యమద్దింది_మది గాయాలకు రాగాలు నేర్పి...!!

9.   క్షణమైనా ఆగలేదు_కాలానికెంత అసహనమెా...!!

10.  కొలమానమక్కర్లేని మనసులవి_స్వచ్ఛతకు మారుపేరుగా...!!

11.   చందమామ కథలకు నోచని బాల్యమిది_అమ్మ లాలిపాటలకు దూరమై...!!

12.   మన్నన మప్పిదమే ఎప్పుడూ_వేదికనెక్కిన వేర్పాటువాదులకన్నా...!!

13.   లయ తప్పని నాదమది_యుద్ధభేరైనా అస్త్ర విన్యాసమైనా...!!

14.   మనసెప్పుడూ మౌన సంద్రమే_భావాక్షరాలను వెదజల్లుతూ...!!

15.   మన ఆలోచనల రంగే అది_అవలీలగా ఎదుటివారికద్దేస్తూ...!!

16.    మరణమెరుగనిది అక్షరమే_భావాలతో నిత్యం రణం చేస్తున్నా...!!

17.   ఆకాశమే హద్దు అక్షరానికి_భావసంద్రాన్ని సముదాయించడంలో..!!

18.   దూరమన్న ఊహే లేదు_మనసుల మధ్యన అంతరాల్లేనప్పుడు...!!

19.   వెలుగు విసిరేసింది_చీకటి చేతికంటనీయవద్దంటూ...!!

20.   తగవులాడే సమయమెక్కడది_తలపుల్లో తలమునకలౌతుంటేనూ...!!

21.   తలపుల వడపోతలే అన్నీ_జ్ఞాపకాల వెదుకులాటల్లో...!!

22.    ఏకాంతమే వారధి_మన జ్ఞాపకాల ఖజానాకి....!!

23.   అనునయాలను అందుకుంటున్నా_ఆత్మీయత నిండిన నీ పలుకుల్లో...!!

24.  ఆటుపోట్లు అలవాటే కడలికి_అలుపెరగక అన్నింటిని అక్కున చేర్చుకుంటూ...!!

25.  ఆత్మీయంగా హత్తుకుంటే చాలదూ_విషాదాన్ని వెలి వేయడానికి....!!

26.   మది మనసు పడుతుంటుందప్పుడప్పుడు_ఆనంద విషాదాలపై...!!

27.   కాలమెప్పుడూ దయగలదే_దూరాలను జ్ఞాపకాల్లో దగ్గర చేస్తూ...!!

28.   మనసుకూ తెలిసిపోయింది_నా మౌనం నీతోనే మాట్లాడుతుందని..!!

29.   ఎద ఎదకో సొద_మనుషులతో రాజీ పడలేక...!!

30.   రంగుల లోకం చూపిన అందాల రాక్షసి_కలత నిదురలోని కల...!!

11, మార్చి 2019, సోమవారం

వ్యక్తిత్వం - వ్యవస్థ...!!

ప్రవీణ్ రెడ్డి చిన్ని, 
          మానవత్వము లేదు, మతము లేదు మనకు మాత్రం పక్క రాష్ట్ర రాయకీయాలు కావాలి. మనం మాత్రం మనకు రాష్ట్రమిచ్చిన పార్టీని తుంగలో తొక్కుతాం కానీ పక్క రాష్ట్రం గురించి మాత్రం ఓ తెగ సలహాలు, సంప్రదింపులు చేసేస్తాం. ఆర్థిక నేరగాడికి అవకాశమిమ్మని నీతులు చెప్తున్నాం.  పిలిచి ఆ అవకాశమివ్వలేదెందుకో.. మా రాష్ట్రం గురించి మాకు తెలుసు. కనీసం ఓ వ్యక్తిగా తప్పుని తప్పు అని చెప్పలేని మీరు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అర్హులు కాదు. ముందు ఆ  విషయం గుర్తుంచుకోండి. అవహేళన చేసింది నన్ను కాదు నా మతాన్నిలే అని మహిళాదినోత్సవాలకు దండలు వేసి శాలువాలు కప్పిన మీరు మా రాష్ట్ర రాకీయాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నీకు అంత ప్రేమ ఉంటే మరి ఆ పార్టీ తరపున తెలంగాణాలో పోటీ ఎందుకు చేయలేదు. సరే మీ నాయకుణ్ణి ఎందుకు చేయనియ్యలేదు. ఒంటి చేత్తో గెలిపించాల్సింది కదా నీ భక్తికి సంతోషించేవాళ్ళం. మీరు బావుండాలి పక్కోడు నాశనమై పోవాలన్న మీ బుద్దిని బయటేసుకున్నారు. కడుపు నిండినోడు ఒడ్డున కూసుని ఎన్ని సలహాలైనా ఇస్తాడు వాడిదేం పోయింది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడటానికి ఇదేం సినిమా తెలియాలి. కాదు. 
  " కట్టు బట్టలతో బయటికి వచ్చి మా బతుకు మేము బతుకుతూ మా ఉనికిని చాటుకుంటున్నాం ఈ రోజు. "
మా ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండాలో, దానికి మేమేం చేయాలో మీతో చెప్పించుకునే పరిస్థితిలో లేము. ఇక గెలుపోటములంటావా అది మీ రాష్టంలో గెలుపు ఎలా సాధ్యమైందో "జగ"మెరిగిన సత్యం. ప్రపంచం అంతా చూస్తూనే ఉంది, న్యాయమైన ఓటమి గెలుపే అవుతుంది. 
" అన్ని ఉంటే గుడ్డిది కూడా కాపురం చేస్తుందన్న" సామెత మీకు సరిపోతుందో లేదో మీకే తెలియాలి. 
( మన్నించాలి నన్ను ఇక్కడ వారిని కించపదచడం నా ఉద్దేశ్యం కాదు). వ్యక్తి ఇష్టమైతే అరికాళ్ళ నుండి సవరదీయ్ అంతే కానీ మరోసారి మాకు ఉచిత సలహాలు ఇవ్వకు. ఆంధ్ర ప్రదేశ్ గురించి మరో మాట మాట్లాడితే ఇక చెప్పడాలు ఉండవు. 
ముందు సంస్కృతిని, సంప్రదాయాలను, మతాలను గౌరవించడం నేర్చుకో. ఇంటిని చక్కదిద్దుకో. వ్యక్తిగా వ్యవస్థకు సాయపడు. రాజకీయాలు తరువాత చూద్దాం. 


10, మార్చి 2019, ఆదివారం

హృద్యమైన ఆవిష్కరణ " హృదయ విపంచి"..!!

సకళ కళా నిలయం మా దివిసీమ. కవులు, ధన్యవాదాలు కళాకారులకు, రాజకీయ, సామాజిక వేత్తలకు, విద్యావేత్తలకు ఇలా మరెందరికో పుట్టినిల్లు మా దివ్య మహిమల దివిసీమ. ఆ దివిసీమ బిడ్డ పద్మజ సబ్బినేని కవిత్వ సంపుటి "హృదయ విపంచి" ఆవిష్కరణ  నాగాయలంకలో అత్యంత వైభవంగా ప్రముఖులచే చేతుల మీదుగా జరిగినది.
సంగీత స్వరాలు ఏడైనా అవి పలికించే రాగాలు అనంతం. మనసుకనిపించిన భావాలను యథాతథంగా అక్షరీరకించి ఆ భావాలకు తగినట్టుగా "హృదయ విపంచి" పేరును ఎన్నుకున్న పద్మజను ప్రతి ఒక్కరు అభినందించారు. అద్భుతమైన సమీక్షను గుమ్మా సాంబశివరావు గారు అందించారు.  జి వి పూర్ణచంద్ గారు పద్మజకు సాహిత్య పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తామని సభా ముఖంగా చెప్పడం ముదావహం. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్దప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పిన ఎన్నో విషయాలు సభికులను ఆలోచింపజేసాయి. సమాజ హితానికి సాహిత్యమని, సామాజిక మాధ్యమాల ద్వారా మంచి కూడా జరుగుతోందని కొన్ని సంఘటన ద్వారా తెలుస్తోందని చెప్తూ మంచి చెడులు మన సంస్కారాన్ని బట్టి ఉంటాయని, కుల, మత విద్వేషాలు మన రాతల్లో ప్రతిబింబించకూడదని చెప్తూ.. అందరు ఆచరించదగ్గ ఓ చక్కని మాటను చెప్పారు... "మనవాళ్ళని చూసి మనం గర్వ పడాలి, ఇతరులను గౌరవించాలి" ...ఎంత గొప్ప మాటిది. ఘంటసాల వాస్తవ్యులు ప్రస్తుతం దుబాయ్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో తన వంతుగా సేవ చేస్తూ, ఘంటసాల  చరిత్రను సమీకరించి మార్పులు చేసి ముద్రించిన నిగర్వి వేమూరి రాజేష్ సభకు ప్రత్యేక ఆకర్షణ. గుత్తికొండ సుబ్బారావు గారు, జమదగ్ని గారు,  యనమదల సుబ్బారావు గారు మొదలైన పెద్దలు హృదయ విపంచిలోని కొన్ని కవితను ఉదహరించి పద్మజకు అభినందనలు తెలిపారు. సభ ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.
  సభ దిగ్విజయంగా జగడానికి కారణమైన స్వచ్ఛ నాగాయలంక టీమ్, రస రమ్యంగా సభను జనరంజకంగా నడిపించిన గుడిసేవ విష్ణు ప్రసాద్ గారు, అతిథులను అలరించిన అర్చన నృత్యం, అప్పుడప్పుడు తన మాటలతో సభికులను ఉత్సాహ పరిచిన ప్రముఖుడు పాత్రికేయులు సింహాద్రి కృష్ణ ప్రసాద్, చక్కని ఫోటోలందించిన తమ్ముడు, బాధ్యత గలిగిన పాత్రికేయుడు సుధీర్ గడ్డిపాటి, ఇతర పాత్రికేయులు ఇలా అందరు తమ వంతుగా సహకరించారు. దూరాభారమైనా అభిమానంగా వచ్చిన ఆత్మీయులు సాహిత్య ప్రకాష్, మాడిశెట్టి శ్రీనివాస్, శ్రీ రంగ బాబు గార్లకు ధన్యవాదాలు.
ఇంతకీ అసలు ఈ పుస్తకం ముద్రితం కావడానికి మూలమైన కోనేరు శ్రీలక్ష్మికి కృతజ్ఞతాభినందనలు.
మనసు భావాలను సుసంపన్నమైన, స్వచ్చమైన అక్షరభావాలుగా అందించిన " హృదయ విపంచి " పద్మజ సబ్బినేనికి అభినందన మందారాలు..అక్షర నీరాజనాలు.


8, మార్చి 2019, శుక్రవారం

అక్షరాల ఎదురుచూపులు...!!

అక్షరాల ఎదురుచూపులు..!!

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించలేని పెద్ద పెద్ద  సాహితీవేత్తలు మీకు పాదాభివందనాలు. కనీసం తప్పుని తప్పు అని చెప్పలేని అసమర్ధత మీదైనప్పుడు మీకెందుకు పదవులు, అధికారాలు, అవార్డులు, సన్మానాలు, శాలువాలు..?
ఇది అక్షరానికే అవమానం. సాహిత్యాన్ని నడిరోడ్డున నగ్నంగా నిలబెట్టిన మీ ఘనతను కీర్తించే సాహిత్యం మా వద్ద లేదు. నిరక్షరాశ్యులమైన సామాన్యులం మేము. మీలా ఆధునిక భావజాలాల ముసుగు వేసుకున్న విజ్ఞానవంతులం కాదు. మా అమ్మాబాబు నేర్పిన కాస్త సంస్కారంతో అన్ని మతాలను గౌరవించే అతి సామాన్యులం. పర మతాన్నే కదా అవహేళన చేసిందని మీరందరూ చోద్యం చూస్తూ చిచ్చు పెట్టేసాం కదా కాల్చుకు ఛావండి అన్న మీ ధోరణి సమర్ధింపదగినది కాదని మీకు తెలియడం లేదా. వ్యక్తిగతంగా మనల్ని కాదుగా అన్నది మన మతాన్నేగా అని మిన్నకున్న సాహితీ మేథావులందరికీ, వ్యక్తిగతంగా విమర్శలు వద్దన్న శాంతికాముకులందరికి ఓ మనవి..తప్పుని చెప్పలేని మీ మీ అసమర్ధతను ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నారు. వ్యక్తిగత ప్రయెాజనాలకు వ్యవస్థను బ్రష్టు పట్టించకండి.

అందరికి క్లారిఫికేషన్.... ఆ గ్రూప్ ను, ఆమె రాతను సమర్థించిన మేథావి వర్గం దయచేసి నాకు మీ పుస్తకాలు పంపించవద్దు. రెండు నాలుకల మనస్తత్వాలు మావి కాదు. "సీతను అంటే తన మీద దాడి సబబే" అని ఆమే చెప్పింది. రాతను సమర్ధించిన మీ మేథావితనాన్ని ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం. ఏ మతపరమైనా దాడయినా ఒక్కటే అని అందరు తెలుసుకునే రోజు కోసమే మా ఈ అక్షరాల ఎదురుచూపులు..

మెలకువ కల..!!

మరలిరాని క్షణాలన్ని
కాలం విసిరెళ్ళిన
గుర్తులుగా మిగులుతూ
కదిలిపోతున్న జీవితాలు
మనవైనప్పుడు...

ఏ కాలానికైనా
వెళ్ళగలిగే మనసుతో
చేసే సహవాసమెలా
ఉంటుందోనన్న ఊహ
మెుదలైతే...

ముందుకో వెనుకకో
మరలాలని తహతహలాడుతున్న
మన ప్రయాణ రాదారిని ప్రశ్నిస్తే
దొరికిన సమాధానం
ఇదేననుకుంటా..

చేరలేని దూరాలను
ఘడియల్లో చేర్చగల మది
సమయంతో నిన్ను 
జత కలపనని అడగడంతో
కలకు మెలకువ వచ్చింది...!!

7, మార్చి 2019, గురువారం

నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు...!!

నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు..!!
తాడిని తన్నేవాడుంటే దాని తలదన్నేవాడు తప్పక ఉంటాడు... పూయాల్సిన పూతలన్నీ పూసేసి గోడ మీద రాతని తీసేస్తే సరిపోతుందా... మెాస్తున్న సమూహం మాత్రం అపురూపంగా ఉంచుకున్నారు. అందుకే ఆధునిక టెక్నాలజీ వాడకం అలవాటైంది అందరికి. అతి తెలివి, ఊహశక్తి అందరికన్నా ఎక్కువ ఎవరికుందో కనబడుతూనే ఉంది. నిజాయితీ లేని రాతలు, స్పందనలు మనమేంటో నలుగురికి తెలియజేస్తున్నాయి.
నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు, తప్పుని సమర్ధించేవారు ఇంకా ఇలాంటి అభ్యుదయవాదులు ఎవరైనా ఉంటే...
ముందు ఆమ్మ అని పిలుస్తూ వెనుక ముండ అనే సంస్కారులు దయచేసి వైదొలగండి...



6, మార్చి 2019, బుధవారం

"దివిసీమ కవులు - సాహిత్య సేవ"....!!

                  "తెలుగు సాహితీ సేవకుల, పోషకుల నిలయం ఈ దివ్యసీమ దివిసీమ "

    ఎన్నో రకాల పరిశోధనాత్మక గ్రంథాలు వచ్చిన, వస్తున్న నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో సాహిత్యపు సేవల గురించి శోధించిన విషయాలను పలువురు పుస్తకాల రూపాల్లో పొందుపరిచారు. తమ పురిటి గడ్డ గురించి, ఆ ప్రాంతానికి సంబంధించిన సాహిత్యకారులు గురించి చరిత్రలో కనుమరుగు కాకుండా తరువాతి తరాలకు అందించాలన్న సదుద్దేశ్యంతో స్వతహాగా పద్య కవి, బాల సాహిత్యంపై మక్కువ గల డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ రచించిన పరిశోధనాత్మక రచన "దివిసీమ కవులు - సాహిత్య సేవ".
        19 భాగాలను మూడు అధ్యాయాలుగా విభజించిన " దివిసీమ కవులు - సాహిత్య నేవ " పుస్తకంలో మొదటగా దివిసీమ భౌగోళిక స్వరూపాన్ని హద్దులు, ఎల్లలతో కళ్ళకు కట్టినట్టుగా తన రచనలో చూపించారు. కృష్ణా జిల్లాకి తన పేరునిచ్చిన కృష్ణమ్మ రెండు పాయలుగా చీలి, సస్యశ్యామలం చేసిన సుసంపన్న భూమి దివిసీమ. సముద్రానికి చేరువగా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మూలన ఉన్నా,ఎంతో దివ్య వైభవమైన దివ్య భూమి ఈ దివిసీమ. వైశాల్యంలో చాలా చిన్నదైనప్పటికీ యావద్భారత దేశాన్ని అన్ని రంగాల్లో ప్రభావితం చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది దివిసీమ. తెలుగుభాషా వికాసానికి, సాహిత్య వైభవానికి, అనేక జాతీయ, అంతర్జాతీయ ఉద్యమాలకు కేంద్ర బిందువై, సంగీత, సాహిత్యకారులతోను, కవి,గాయక, నటులతోను, పత్రికా సంపాదకులతోను, రచయితలు,శాస్త్రవేత్తలతోను, సినీపరిశ్రమతోను(నటులు, గాయకులు, దర్శకులు... ), స్వాతంత్ర్య సమర యోధులతోను, అడుగడుగునా దేవాలయాలతోను, పద్మ అవార్డులతోను పులకరించిన నేల ఈ దివిసీమ. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర మహావిష్ణువు అని ప్రాంతాన్నే పేరుగా నెలకొన్న ఏకైక దేవస్థానం గల పరమ పవిత్ర స్థలం శ్రీకాకుళమీ దివిసీమలోనిదే. ఇలా చెప్పుకుంటూపోతే దివిసీమలోని ప్రతి ప్రాంతానికి ఒక చరిత ఉంది. ప్రతి ప్రాంతాన్ని, దేవాలయాలను, జమిందారీ సంస్థానాలను, ఆహారపుటలవాట్లను, కట్టుబొట్టులను, ఆచార వ్యవహారాలను, పాడి పంటలను, రవాణా సౌకర్యాలను,సాహితీ సాంస్కృతిక సంస్థలవివరాలను చాలా విపులంగా విశదీకరించారు డాక్టర్ గుడిసేవ విష్ణప్రసాద్.
                    రెండవ అధ్యాయంలో " దివిసీమ కవుల - రచయితల పరిచయం " మొదలుబెట్టి ఆది నుండి ఉన్న తెలుగు సాహిత్యపు ప్రక్రియలలో దివిసీమలోనున్న కవులను, పండితులను పరిచయం చేస్తూ సంస్కృత, తెలుగు కవుల పుట్టు పూర్వోత్తరాలగురించి క్లుప్తంగా వివరించారు. దివిసీమలో సంస్కృత కవుల వివరాలు, అవధానులు, పత్రికాధిపతులు, సంపాదకులు, ఆధ్యాత్మిక కవులు, పరిశోధకులు, జంటకవులు, యక్షగాన కవులు, తెలుగు కవులు, రచయితల పరిచయాలను వారి రచనలను అందించారు. నాట్యగ్రంథాలలో సంస్కృతంలో తెలుగువారు రచించిన మొదటి గ్రంథం "నృత్త రత్నావళి". 1200 దశకంలో దివిసీమలోని తలగడదీవిలో జన్మించిన జాయపసేనాని రచించినదే. తొలి సంస్కృత గ్రంథం శ్రీకృష్ణ కర్ణామృతం లీలాశుకుడు శ్రీకాకుళం నివాసి. తొలి తెలుగు ద్వ్యర్ధి కావ్యం రాఘవ పాండవీయం రాసిన పింగళి సూరన్న శ్రీకృష్ణ దేవరాయల భువన విజయంలోని అష్ట దిగ్గజ కవులలోనొకరు పుట్టిన చిట్టూర్పు ఈ పుణ్యభూమిలోనే.  మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు పుట్టిన అయ్యంకి, గార్లపాడు దివిసీమలోనివే. అపూర్వ శృగారకృతి రాధికా సాంత్వనం రాసిన తొలి కవయిత్రి ముద్దుపళని శ్రీకాకుళం నివాసి. ఇలా చెప్పుకుంటూపోతే చరిత్రకు తెలియని ఎందరో మహానుభావులను వెలికితీసి తన పరిశోధనా గ్రంథంలో పొందుపరచి దివిసీమ సాహితీ వైభవాన్ని ప్రపంచానికందించిన గుడిసేవ విష్ణుప్రసాద్ ధన్యులు.
                    మూడవ అధ్యాయంలో దివిసీమ కవులు - సాహిత్య పరిశీలనలో దివిసీమ వాగ్గేయకారులు, పదకర్తలు, శతక కవులు, తెలుగు కవుల కావ్యాలు, రచయితల గురించి, చివరిలో తనకు తెలిసిన మరికొందరు  రచయితల గురించి చెప్తూ ముగింపుని ఎంత అందంగా తీర్చిదిద్దారంటే మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ దివిసీమ తెలుగు సాహితీ వైభవానికి చేసిన సాహితీ సేవ ఎనలేనిది. ప్రతి చిన్న ఆధారాన్ని సేకరించి భవిష్యత్తరాలకు అందించిన అమూల్య సాహితీ సంపద " దివిసీమ కవులు - సాహిత్య సేవ " .  తొలి తెలుగు మహాసభలు నిర్వహించి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన ప్రఖ్యాత రాజకీయ నాయకులు కీర్తిశేషులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు, వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, మరెందరో నాయకులకు జన్మనిచ్చిన ఈ దివిసీమ బిడ్డలమే మేము అయినందుకు గర్వంగా ఉంది. ఒకప్పుడు కక్షలకు, కార్పణ్యాలకు నెలవైన దివిసీమ పుట్టు పూర్వోత్తరాలను, సాహితీ వైభవాలను, కళాకారులను వెలిసితీసి చరిత్రలో నిక్షిప్తం చేసి నేడు చదువుల సీమగా, సకల కళల నిలయంగా పండితపురంగా తన రాత ప్రతితో విశిష్ట స్థానాన్ని అందించిన డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ మాస్టారికి మనఃపూర్వక అభినందనలు.


కవిత్వం అంటే...!!

కవిత్వం అంటే...!!

కవిత్వం అంటే ఏమిటో, ఎలా పుడుతుందో సాగర్ శ్రీరామ కవచం గారు నవ మల్లెతీగలో రాసిన ఈ వ్యాసం చూడండి... సదరు అభ్యుదయవాదులూ... కనీసం అక్షరం విలువ కాస్తయినా తెలుస్తుంది... దయచేసి మీ అభ్యుదయపు ముసుగు తొలిగించి మనుషులుగా బతకండి... ఇలాంటి కుహనా అభ్యుదయవాదులూ, శాంతి కాముకులు, గాంధేయవాదులు, సహనమూర్తులు వగైరా వంటివారు నేను తీసేయకముందే నా లిస్ట్ నుండి బయటకు వెళ్ళిపొండి... డబ్బుకు, మందు పార్టీలకు అమ్ముడుపోయే సాహితీ మేథావులూ కళ్ళు తెరిచి మనుషులుగా బతకడానికి ప్రయత్నించండి ఇకనైనా..
సూక్తిసుధలు వినే ఓపికలేదు....

5, మార్చి 2019, మంగళవారం

గొంతు చించుకుంటే...!!

మధుకర్ ఉదంతమప్పుడు ఓ మహానుభావుడు రాసిన ప్రతి పదం నాకిప్పటికి గుర్తే. అప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా పట్టించుకోని నేను కొందరి రాతలను, వారి తీరును, స్పందనలను అప్పటి నుండి పట్టించుకోవడం మెదలు పెట్టాను. డబ్బు కోసం, పేరు కోసం కొందరు ఎన్ని దార్లు తొక్కుతున్నారో, ఎలాంటి రాతలు రాస్తున్నారో తెలియని విషయమేం కాదు. తమ రాతలు మాత్రమే గొప్పవైనట్టు కవితంటే ఇలా ఉండాలని అలా ఉండాలని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. "నేను దళితుణ్ణి" అని గొంతు చించుకుంటే బోలెడు చప్పట్లు. అదే మరొకరు కులం పేరు ఎత్తకపోయినా సరే వారికి కులగజ్జి అని నొక్కి వక్కాణిస్తాం. వీరు ఏది రాసినా, ఏది చేసినా ఆహా ఓహో అంటూ నీ వెనుక మేమున్నాం అని చెప్తున్న వారందరు ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.

"కవి సంగమం" గ్రూప్ నుండి బయటకు వచ్చేసాను...

నా అభిప్రాయాలు, నా రాతలు నచ్చని వారందరూ నిరభ్యంతరముగా వెళ్ళిపోవచ్చు. కవిత్వ లక్షణాలేవి తెలియని నేను కవిని మాత్రం కాదని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను.

"మెుత్తానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ కన్నా ఎక్కువ పేరు వచ్చేసి టార్గెట్ రీచ్ అయ్యారు.... " 

రాతల రోతలు...!!


ఇప్పుడు లేచిన గోంతుకలన్నీ మధుకర్ ఉదంతమప్పుడు అగ్రవర్ణ స్త్రీలని నీచాతినీచంగా రాసినవాడిని అడగలేదెందుకో... కవితను చూడండి, భావాన్ని చూడండని చెప్పేవారందరూ అప్పుడేమయ్యారు. ఏ అమ్మయినా ఒక్కటే అని గుర్తు రాలేదా... ఆ రాత చదివిన రోత నుండే అందరిని పరిశీలించడం మెుదలెట్టి ఎవరేంటి అన్నది పూర్తిగా తెలుసుకున్నాను. స్త్రీ స్వేచకి, విశృంఖలత్వానికి ఎంత తేడా ఉందో ఈ కులమతాల రాతలకు అంతే తేడా ఉంది. తప్పుని సమర్ధించేవారు తప్పు చేసినవారికంటే ప్రమాదకారులు. అలాంటి వారి నుండి దూరంగా ఉండదలుచుకున్నాను..
మన్నించండి..

అక్షరాలకంటిన కులమతాలు...!!

నేస్తం,
         ముందుగా విశాల హృదయులందరికి నా నమస్కారాలు. మీ ఉన్నతమైన భావాలకు మాకు నోట మాట రాని పరిస్థితి. వాటిని సమర్థించే సహృదయులకు శతకోటి వందనాలు.
        మన అభిప్రాయాలు, మన భావాలు మనం రాసుకోవడంలో కాస్త కూడా తప్పులేదు. ఏ మతమూ తప్పుని సమర్ధించదు. అలా అని పరమతాన్ని అవహేళన చేయమని కూడా చెప్పదు. అది మన అమ్మానాన్న మనకు నేర్పిన సంస్కారాన్ని బట్టి వస్తుంది. ఇన్నాళ్లు మనుష్యులకే కులాలు, మతాలు ఉన్నాయన్న భ్రమలో ఉన్నానని నాకిప్పుడే అర్ధమైంది. పిచ్చి పలురకాలన్నట్టు సాహిత్యంలో కూడా ఈ జాడ్యం చాలా బలంగా వేళ్ళూరుకుందని, అది పలువురి అక్షరాల్లో ప్రస్పుటంగా బయటపడుతోంది. పురాణాలు, ఇతిహాసాలు భారతీయ సనాతన ధర్మాలకు ప్రతీకలు. కులం అనేది మనకు పుట్టుకతో వస్తుంది. మనకు నచ్చిన మత ధర్మాన్ని మనం ఆచరించే వెసులుబాటు మనకు ఉంది. ఎవరిష్టపడిన మతం వారికి గొప్పది. మన మతం గొప్పది కాదు, ఎదుటివారి మతం తక్కువది కాదు. ఏ మతమూ మరో మతాన్ని కించపరచమని చెప్పలేదు. కావాలని మతాలను అవహేళన చేస్తూ రాసినంతమాత్రాన మన రాతలకు గొప్పదనం ఆపాదించబడదు. మన సంస్కారం బయటబడుతుందంతే. రాముడు సీతను వదిలేసినా, క్రీస్తు కన్యకు పుట్టిన పరిశుద్ధాత్మయినా ఇలా ఇవన్ని మన నమ్మకాలు. మనం ఒకటి రాస్తే ఎదుటివారు వంద రాయగలరు. మన స్వార్ధం కోసం అక్షరాలకు కులమతాలనాపాదించి మనమెంత హీన స్థితికి దిగజారిపోతున్నామెా తెలియడం లేదు.  ఈ వాదాన్ని  సమర్థించిన మేథావులందరికీ పాదాభివందనాలు.
"మహిళాదినోత్సవానికి రాముడు వదిలేసిన సీత ప్రభవు వెంటో ప్రవక్త వెంటో వెళ్ళిందని" రాస్తే అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని రావచ్చునేమెా, సన్మానాలతో,  సత్కారాలతో హోరెత్తించవచ్చునేమెా కాని మనం ఏంటన్నది ప్రపంచానికి తెలియజెప్తుంది. అది మంచా, చెడా అన్నది మన విజ్ఞత.

1, మార్చి 2019, శుక్రవారం

ఏక్ తారలు...!!

1.   గడవనీయడం లేదు కాలం_నీతో లేని క్షణాలను స్వీకరించలేక....!!

2.  మనసు తడి మాయమౌతోంది_అక్షరమై కాగితాన్నలరిస్తూ...!!

3.   తీరలేదనే తలపుల్లో తచ్చాడుతోంది_గతజన్మ బుుణానుబంధంగా....!!

4.  ఆరాధన అక్షరాల్లో ఉండిపోయింది_ఈ యత్నమంతా నీ మనసుకు తెలియాలనే...!!

5.   అక్షరార్చన అందంగా ఇమిడింది_నీ ఊసులు చేరినందుకనుకుంటా...!!

6.  భావాలు త్వరపడుతున్నాయి_కవన నివేదనలో చరితార్థమవ్వాలని...!!

7.  చూసి చూడనట్టుంటే ఎలా_పదబంధాల వెంట పయనించాలి మరి..!!

8.   అక్షరాలు కనుకే ఆ బంధం_ఎదలో పదిలమైపోవాలన్నంత ఆరాటంతో...!!

9.    అక్కున చేర్చుకుంది అక్షరమే_గాయాలకు ఆత్మీయలేపనమై...!!

10.    అక్కర మక్కువైంది_అక్షరం భావంతో జత కట్టినప్పుడు....!!

11.   నా ఓటమిని ఆస్వాదిస్తున్నా_నీ గెలుపు నేనై...!!

12.   కన్నీరొలికిందని తెలిసింది_కలను వదలి వాస్తవానికి వచ్చాక....!!

13.    కాలాన్ని ఏమార్చడం సాధ్యమా_మనసైన మౌనపు ముచ్చట్లెలా ఉన్నా...!!

14.     మతమెా సదాచారం_మతోన్మాదుల చేతుల్లో కార్చిచ్చులా మారిపోతూ...!!

15.   వేస్తున్నవన్నీ అద్దె వేషాలే_అక్షరభావాలనడ్డం వేసుకుని...!!

16.    నిలిచిపోవాలనుంది_నిష్క్రమణమెరుగని నిత్య నూతన జ్ఞాపకంగా...!!

17.   ఎడబాటు మనుష్యుల మధ్యనే_ఎడదనెరిగిన అక్షరాలకు కాదు...!!

18.   మనసుకలవాటే_మెాసపోతున్నా బంధాన్ని బాధ్యతగా అనుకోవడం...!!

19.    భారంగా మారింది మది_అమ్మను అవహేళన చేసిన అహాన్ని చూసి..!!

20.   వెన్నుపోటే వారి నైజం_అది తెలిసిన క్షణాలు భారమే మరి...!!

21.   కాకరకాయ మేలే చేస్తుంది_మనం కీడు చేయాలనుకున్నా...!!

22.    గాయమైన ప్రతిసారి గేయమైపోతున్నా_మనసు కొలను ఖాళీ చేయాలనుకుంటూ...!!

23.   బంధపు విలువ తెలియని మూర్ఖత్వమది_కీడు చేయాలన్న ప్రయత్నంలో....!!

24.   వెనుకకెలా మరలను_కన్నీటి కథలు లేని జీవితమదని తెలిసాక...!!

25.   ఆత్మీయ వరుసలతో ఆడుకుంటున్నారు_ అమ్మను అక్కను అంగడి బొమ్మను చేస్తూ...!!

26.   విషం చిమ్మడం జాతి లక్షణం_పాలు పోయడం మన నైజమైనప్పుడు...!!

27.  కలలూ కలత పడుతున్నాయి_ఏ జ్ఞాపకం ఎదను తడిమిందో..!!

28.   ఆదరింపు ఆదమరిచింది_కలత ఎదను కలవరపెడుతుంటే...!!

29.  తిరుగుబాటు జీవితమైంది_సవాళ్ళను స్వాగతిస్తూ...!!

30.   కలానికి ఓదార్పయ్యింది కాగితం_భారాన్ని తాను స్వీకరిస్తూ...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner