30, జూన్ 2020, మంగళవారం

భూతల స్వర్గమేనా...16

పార్ట్... 16
             అనోన్య స్కూల్ లో నోటీస్ బోర్డ్ మీద ఓ స్లోగన్ రాసుండేది. అది నాకు బాగా నచ్చింది కూడా... 
" No one can do everything 
   But Every men can do something "...నిజమే కదా  ఇది. 

         రోజులు గడిచిపోతున్నాయి మామూలుగానే. నాకు పిల్లల పని, అప్పుడప్పుడు వంట, ఫోన్లు ఇలా జరిగిపోతోంది. డాక్టర్ గారు మూడ్ బావుంటే బానే ఉండేవారు, లేదంటే అప్పుడప్పుడూ ఏదోకటి అనేవారు. నా టైమ్ బాలేదులే అని సరిపెట్టుకునేదాన్ని.  ఓ రోజు డాక్టర్ గారికి వాళ్ళాయన ఫోన్ చేస్తే, ఆవిడ తీయలేదు. అందుకని ఇంటికి చేసారు. నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆ సాయంత్రం డాక్టర్ గారు నన్ను ఫోన్ ఎక్కువ వాడవద్దని చెప్పారు. నాకు వేరే ఫోన్ లేదు. ఆరోజు చాలా బాధనిపించింది. నాకేదయినా బాధనిపిస్తే పుస్తకంలో రాసుకునేదాన్ని అప్పుడు. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎవరితో ఒకరితో మాటలు పడాల్సి వస్తోందని దిగులు వేసింది. నాకంటూ ఏమి లేకపోబట్టే కదా ఇలా జరుగుతోందనిపించింది. ఇలా బాధ పడిన క్షణాలెన్నో. ఉమకి విషయం చెప్పాను. నాకు చెప్పకుండానే ఉమ సెల్ ఫోన్ బుక్ చేసింది. అది వచ్చే ముందు చెప్పింది.  మెుత్తానికి నా మెుదటి సెల్ ఫోన్ రావడమూ, దానిని యాక్టివేట్ చేయడమూ జరిగిపోయింది. స్ప్రింట్ నెట్ వర్క్ అన్నమాట. అప్పటి నుండి అమెరికా వదలి వచ్చే వరకు అదే నెట్ వర్క్ వాడాను. 
       నా H1B అమెరికన్ సొల్యూషన్స్ ఫైల్ చేయడము, LIN నెంబర్ రావడమూ జరిగింది. ఓ రోజు సుబ్బరాజు ఇందుకూరి కాల్ చేసి 3వీక్స్ జాబ్ ఉంది. వెంటనే జాయిన్ కావాలి వెళతారా అన్నారు. మరి డాక్టర్ గారు నేను సడన్ గా వెళిపోతే ఇబ్బంది పడతారు కదా, అదీనూ 3 వారాలే అంటున్నారు, మీ ఇష్టం వెళ్ళమంటే వెళతాను అన్నాను. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఇదంతా డాక్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. మరుసటి రోజు సుబ్బరాజు ఫోన్ చేసి మరేదైనా జాబ్ చూద్దాంలెండి అన్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు బావుండేవారు నాతో. నాకు ఫోటోలు తీయడం, అందరివి కలక్ట్ చేయడం బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. అమెరికా వచ్చాక కెమేరా కొనలేదు. పిట్స్ బర్గ్ వచ్చాక 10 డాలర్లకు కెమేరా షాప్ లో చూసి, అది కొన్నాను. దానితో నాకు వచ్చినట్టు ఫోటోలు తీసేదాన్ని. 
            మధ్యలో క్రిస్మస్ కి హాలిడేస్ వచ్చాయి. డాక్టర్ గారి హజ్బెండ్ పిట్స్ బర్గ్ వస్తానన్నారు. డాక్టర్ గారికి కూడా శలవలే. బాల్టిమెార్ లో ఉండే శిరీష వాళ్ళు డెల్లాస్ వెళిపోయారు. తనేమెా వాళ్ళింటికి రమ్మని, నా ఫ్రెండ్ వెంకట రమణ కాలిఫోర్నియా రమ్మంటే, డాక్టర్ గారు వెళ్ళిరా ఓ 4,5 రోజులు, నేను చూసుకుంటాను పిల్లలని, ప్రసాద్ కూడా వస్తారు కదా  అన్నారు. సరేనని రానుపోనూ ఫ్లైట్ టికెట్ రమణతో బుక్ చేయించుకున్నా నా డబ్బులతోనే. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ కి. మెర్సీ గారి హజ్బెండ్ నన్ను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తూ, పాస్ పోర్ట్ బయటకు తీయకండి, స్టేటస్ ఇబ్బంది అవుతుందేమెా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి ఐడిప్రూఫ్ కి అంటే లైసెన్స్ లేదండి, స్టేట్ ఐడి ఉంది అంటే, అది చూపించండి చాలు అన్నారు. మెుత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగాను. లగేజ్ తీసుకుంటుంటే వెంకట రమణ ఫోన్, ఎక్కడ ఉన్నావని, నన్ను చూడలేదు కదా గుర్తు పట్టడానికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ శోభ, అబ్బు కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేసాను. అబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్నాడు. రమణ వాళ్ళింటికి దగ్గరలోనే. తోలు ఓ రోజు భోజనానికి కూడా వెళ్ళాం. శోభ వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. బోలెడు మా కాలేజ్  కబుర్లు చెప్పుకుని, హైదరాబాదులోని శ్రీదేవికి ఫోన్ చేసాము. ఇద్దరం మాట్లాడుతుంటే తనకి నేను అమెరికాలో ఉన్నానా అని డౌట్. నువ్వు కూడా అమెరికా వెళ్ళావా అంది. ఏం వెళ్ళననుకున్నావాఅన్నాను. అలా కాసేపు తనని ఏడిపించాం. నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, నా ఫోటో పిచ్చి తెలుసు కనుక, నాకు ఓ ఆల్బం కొనిపెట్టి, మళ్ళీ రమణ వాళ్ళింట్లో వదిలేసింది. వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. ఇద్జరు తెలుగు, మరొకరు కన్నడ. నాకు కన్నడ వచ్చుగా, చాలా రోజుల తర్వాత కన్నడ మాట్లాడాను ఈ రూపంగా. మెుత్తానికి పుస్తకాల్లో చదివిన గోల్డెన్ గేట్ చూడటం ఓ థ్రిల్. పోర్ట్ కూడా చూసాను. వెస్ట్ సముద్రం వర్షంలో చూడటమెా మంచి అనుభూతి. మెుత్తానికి కాలిఫోర్నియా ట్రిప్ బాగా జరిగింది నా కెమేరాతో ఫోటోలు తీసుకోవడంతో సహా. 
         అలా ఓ ఆరు నెలలు పిట్స్ బర్గ్ లో గడిచిపోయాయి. ఆ టైమ్ లోనే ఓ అమెరికన్ లాయర్ తో చికాగో బాబ్ గురించి మాట్లాడాను. బాబ్ కి మెయిల్ కూడా పెట్టాను. నాకు బాకీ ఏది ఉంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కకయినా జాబ్ వస్తుంది, నాకు రాదన్నాడు కదా, డాలర్ కూడా ఇవ్వనన్నాడు. అది గుర్తు చేస్తూ, అవును కుక్కకి వస్తుంది, నాకు వస్తుంది జాబ్. కాని నీకు రాదు అని వాడికి మెయిల్ పెట్టాను. వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి HNC బాబ్ మీద కేస్ ఫైల్ చేద్దామన్నారు. అనవసరమండి అంటే కాదు ఇద్దరం కలిపి వేద్దామన్నారు. 1500 డాలర్లు పంపండి, నేను తర్వాత ఇస్తాను లెక్కలు చూసి అన్నారు. సరేనని పంపించాను. లాయర్ బాబ్ కి నోటీస్ పంపాడు. లాయర్ తో కపుల్ఆఫ్ డాలర్స్ ఇస్తాను సరి చేయమన్నాడట. నవ్వుకున్నా.. నాకు రావాల్సినవి ఇమ్మనండి చాలన్నాను. మన లాయర్సే కాదు అక్కడి లాయర్స్ కూడా అంతే. వినయ్ గారు కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి, లాయర్ కి తలో 2,3 వేల డాలర్లు సమర్పించి, బాబ్ మాకు ఇవ్వాల్సిన వాటికి ఇవి మేం కట్టిన వడ్డీ అని సరిపెట్టేసుకుని ఓ దణ్ణం పెట్టి వదిలేసాం. తర్వాత నా పుట్టినరోజుకి డాక్టర్ గారు పట్టుచీర, కేక్ కట్ చేయించారు. మెర్సీ గారు కూడా వచ్చారు. 
         ఇంతలో నాకు H1B కి డబ్బులు కట్టిన రామస్వామి యనమదల గారికి మనుషులు కావాల్సివచ్చారు. మా ఆయన ఫోన్ లో చికాగో రామస్వామి గారి దగ్గరకు వెళ్ళు, అన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. ఫోన్ చేసి మాట్లాడితే వచ్చేయమన్నారు. ఓ వారం, పది రోజులు టైమ్ కావాలని చెప్పాను. డాక్టర్ గారికి మరో మనిషి దొరికి ఆమెకు పిల్లలను, పనిని అలవాటు చేసి, చికాగో బయలుదేరాను. అనోన్య బాగా ఏడిచింది, నాకూ బాధనిపించింది. నేను వెళిపోతున్నానని డాక్టర్ గారి ఫ్రెండ్ మెర్సీ వాళ్ళు వచ్చి నాకో 25 డాలర్లు కూడా ఇచ్చారు. అభీని స్కూల్లో దించేటప్పుడు నాకో అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పాను కదా. తను ఓసారి ఇంటికి కూడా వచ్చింది, నన్ను డ్రాప్ చేయడానికి. చికాగో వెళడానికి బస్ టికెట్ తీసుకున్నా. నన్ను డ్రాప్ చేయడానికి అమెరికన్ ఫ్రెండ్ వస్తానంది. తనకి నేను కొన్న కెమేరా ఇచ్చేసాను అప్పటికే. తను వాళ్ళింటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టి, బస్ స్టేషన్ లో బస్ ఎక్కించి, జాగ్రత్తలు చెప్పి,గిఫ్ట్ ఇచ్చింది. అది 35 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. వద్దంటే వినలేదు. మరోసారి చికాగో బయలుదేరాను బస్ లో. 

మళ్ళీ కలుద్దాం... 

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం...

29, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం... 8

కాలం వెంబడి కలం...8
       ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం థియరీ పరీక్షలు అయ్యాక ప్రాక్టికల్స్ కి కాస్త గాప్ దొరికింది. నాకు పుస్తకాలు చదవడంతోపాటు సినిమాలు చూసే అలవాటు కూడా ఉందిగా. మా బాచ్ మెుత్తం మధ్యాహ్నం ఏదోక సినిమాకి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడూ కన్నడ సినిమాలు కూడా చూసేవాళ్ళం. ఇంటర్ ప్రాక్టికల్స్ లో వైవా అంత భయం అనిపించలేదు. ఇంజనీరింగ్ లో మెుదటి ప్రాక్టికల్ అయ్యే వరకు కాస్త టెన్షన్ అనిపించింది. మా సెక్షన్ లో అబ్బాయిలు అందరు కూడా నాతో బావుండేవారు. కన్నడ అబ్బాయిలు కాస్త జోక్స్ వేసేవారు తెలుగు భాష గురించి. నేనూ ఊరుకునేదాన్ని కాదు. సరదాగా మెుదటి సంవత్సరం గడిచిపోయింది. 
        రెండవ సంవత్సరం మెుదలయ్యింది. నా బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. నేను ముందు కంప్యూటర్స్ తీసుకుందామనుకున్నా. మా నాన్న కంప్యూటర్స్ కష్టమేమెానని ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ చేసారు. మా సీనియర్ సురేష్ ఎలక్ట్రానిక్స్ బాగా కష్టం. మెుదటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళే చదవలేక పోతున్నారు, కంప్యూటర్స్ కి మారిపో నెక్ట్స్ ఇయర్ అని చెప్పాడు. ఏం మాట్లాడలేదు నేను. బ్రాంచ్ ఛేంజ్ అవుతావా అని నాన్న అడిగితే నేను బ్రాంచ్  మారను. ఎలక్ట్రానిక్స్ లోనే ఉంటానని చెప్పాను. నాకు ఎవరైనా " నువ్వు ఆ పని చేయలేవు, నీకు రాదు " అంటే నాకు చాలా పట్టుదల వుండేది చిన్నప్పటినుండి. టెన్నీకాయిట్ అదేనండి రింగాట నాకు కుడి చేతితో ఆడటం వచ్చేది కాదు. నాకు ఆట రాదని గేమ్ కి సెలక్ట్ చేయకపోతే 2 రోజులలో కుడి చేతితో ఆడటం నేర్చుకుని, గేమ్ ఆడమంటే కూడా ఆడనని చెప్పాను. అంత పట్టుదల వుండేది అప్పట్లో. ఎలక్ట్రానిక్స్ చదవలేనన్నారని, ఇష్టమైన కంప్యూటర్స్ కూడా కాదనుకుని ఎలక్ట్రానిక్స్ లోనే ఉండిపోయాను. 
           మా సెకెండ్ ఇయర్ బాచ్లకు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ క్లాస్ రూమ్స్ ఎదురెదురుగా ఉండేవి. కాస్త అల్లరి బాచ్ కదా. అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడా కూర్చుంటూ బాగా గోల చేసేవాళ్ళు. నాతోపాటు మా సెక్షన్ లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఎలక్ట్రానిక్సే. అమ్మాయిల్లో లాస్ట్ రెండు బెంచ్ లు మావే. అబ్బాయిలు బాగా గొడవ చేయడం మెుదలెట్టారు. ఎక్కువ మంది వుండటంతో ఎవరు ఏ బ్రాంచో తెలుసుకోవడం సార్లకు బాగా కష్టంగా ఉండేది. రోజూ ఈ గొడవ ఇలా సాగుతుండగానే ఓ రోజు మా వెనుక బెంచ్ లో మా అల్లరి బాచ్ చిన్నగా మురుగన్ సార్ అనే మాటలు రిపీట్ చేస్తూ, ఇమిటేట్ చేసారు. వెనుక అబ్బాయిలు కూడా ఏదో అన్నారు. క్లాస్ అంతా నవ్వారు. సార్ మాత్రం నన్ను, నా పక్కన వాణి అని కన్నడ అమ్మాయి మా సెక్షనే ఫస్ట్ ఇయర్, ఇద్దరిని పేర్లు అడిగారు. క్లాస్ అవగానే వాణి స్టాఫ్ రూమ్ కి వెళుతుంటే, మా జనాభా నువ్వు కూడా వెళ్ళి సారి చెప్పిరా అన్నారు. సరేనని నేను తన వెనుక వెళ్ళాను. వాణి కన్నడలో చెప్పడం మెుదలుబెట్టింది. సార్ ఐ డోంట్ నో కన్నడా అన్నారు. నాకు భలే నవ్వు వచ్చింది అప్పుడు. వాణి ఏదేదో చెప్తూవుంటే వింటూ ఉన్నా సార్తోపాటు. తనదంతా చెప్పటమయ్యాక నేను సారి సర్ అన్నాను. ఎందుకండి సారి, మీరు సరిగ్గా ప్రనౌన్స్ చేయగలరా అన్నారు. నేనేం మాట్లాడలేదు. మరుసటి రోజు నుండి మా రెండు బ్రాంచెస్ కి క్లాసెస్ సస్పెండ్ చేసారు. క్లాసంతా అపాలజి లెటరిస్తే కాని క్లాసెస్, ప్రాక్టికల్స్ జరగవని చెప్పారు. ఆ ప్రొసీజర్ అంతా అయ్యాక లాబ్ కి వెళ్తే మిగతా సార్ లు పేరు అడగడం, ఏదోకటి అనడం అవుతోంది. మురుగన్ సర్ ఫ్రెండ్ శివప్రసాద్ సర్ డివైజస్ లాబ్ లో పేరు అడిగి ఫేస్ చూస్తే చాలా కామ్ గా ఉంది. ఎందుకు అల్లరి చేసారండి అని అన్నారు. అప్పుడు జరిగినదంతా సర్ కి చెప్పాను. అప్పటి నుండి శివప్రసాద్ సర్ మీ బ్రదర్ లా అనుకోండి. ఏం హెల్ప్ కావాలన్నా అడగండి అని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు శివప్రసాద్ సర్ వెళిపోయారు. ఆ తర్వాత ఓ రోజు డివైజస్ లాబ్ లో మాకు వేరే ప్రాక్టికల్ ఉంటే అది సరిగా పని చేయడం లేదని యూని జంక్షన్ ప్రాక్టికల్ చేయమన్నారు. ఎప్పటిలానే గబగబా రీడింగ్స్ వేసుకుని కాలిక్యులేషన్స్ చేసేసి, సైన్ చేయించుకోవడానికి మురుగన్ సర్ దగ్గరకి వెళ్ళాను. నా తర్వాత వచ్చిన అందరికి సైన్ చేసి పంపిస్తున్నారు కాని నా అబ్జర్వేషన్ బుక్ పై సైన్ చేయడం లేదు. ఈరన్న అని మరో సర్ కూడా ఉన్నారు అక్కడ. యూని జంక్షన్ లో ఎన్ని జంక్షన్లుంటాయెా చెప్పండి అన్నారు. నేను ఏం మాట్లాడకుండా నిల్చుని వున్నాను. ఈరన్న సర్ ఆంధ్రా  చీప్ మినిస్టర్ ఎవరు అన్నారు. యన్ జనార్ధన్ రెడ్డి అని చెప్పా. వాళ్ళదేంటి అన్నారు. అంటే ఏంటి అనడిగితే కాస్ట్ అన్నారు. రెడ్డి అని చెప్పా. యూని జంక్షన్ లో ఎన్ని జంక్షన్లుంటాయి అంటే ఒకటి అన్నా. మరి ఇందాకటి నుండి ఎందుకు చెప్పలేదు అన్నారు. నవ్వేసి సమాధానం చెప్పినా రాదు అని అనే వరకు అడుగుతూనే ఉంటారు కదా సర్ అన్నా. భలే మనిషిలే అని నవ్వేసారు. అలా ముందు కోపంగా ఉన్న సర్ తర్వాత మాకు చాలా హెల్ప్ చేసేవారు. మా ప్రాక్టికల్ బాచ్లో అందరికి నా సంగతి తెలుసు. అదేంటంటే లాబ్ నుండి బయటకు వెళ్ళాక నాకెవరు గుర్తుండరని. అవును నాకేం పని మీతో అనేదాన్ని. నిజంగానే నాకు మనుషులు ఓసారి చూస్తే గుర్తుండరు. ఆ విషయంలో ఇప్పటికి తిట్లు తింటూ వుంటాను. చాలా సరదాగా సెకెండ్ ఇయర్ కూడా గడిచిపోయింది. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..... 


22, జూన్ 2020, సోమవారం

ఏక్ తారలు

1.  మన మధ్యన పోలికెందుకు_అన్నీ సమం చేసే అక్షరాల అనుబంధం మనదైతే..!!
2.   చుక్కలన్ని లెక్కెడుతున్నా_మౌనానికి ముగింపు చెప్పడానికి...!!
3.   వాకిట్లో వెన్నెలని_గుండె గూటికి వెలుతురునౌతానంటూ.!!
4.   గాయమే గేయమైంది_దిగులుపడ్డ మనసుని ఊరడించడానికి..!!
5.   అక్షరమంతే భలే మాయ చేస్తుంది_అన్నీ తనలో ఇముడ్చుకుంటూ...!!
6.   శరము వంటిది అక్షరం_విలుకాడి పనితనంపై ఆధారపడి ఉంటుందంతే...!!
7.   పడి లేచే పోరాటం కెరటానిది_గెలవాలన్న అరాటంతో... !!
8.   గొంతు మూగబోయింది_మనసు మౌనాన్ని విప్పి చెప్పలేక...!!
9.  పుట్టుకతోనే మూగది మనసు_భావాలను స్వరపరచలేని శాపంతో..!!
10.  అక్షరాలకు వడుపు తెలిసింది_పదాలను ఏర్చి కూర్చడంలో...!!
11.  ఓ మాట చెప్పలేదనుకున్నా_మనసు తెలిసిన మౌనానికి...!!
12.   సర్దుకుపోదామనే అనుకున్నా_రహస్యాన్ని రహస్యంగా ఉంచేసావని...!!
13.  మాటెందుకు? మనసుని వినరాదూ_కారణాలేవైనా కానీ...!!
14.  గుట్టు నీకు చెప్పింది_గుంభనంగా వుంటావనే కదా...!!
15.  నమ్మాను కనుకే చెప్పాను_మనసు బాంధవ్యం మనదని..!!
16.   గుండెలో దాచుకున్నాను_గుర్తెరిగి నీవు వస్తావని...!!
17.   ఊరడింపులకు అనువైన దారే అది_అక్షరాలకే కుదురు లేదు..!!
18.   నడత తెలిసిన అక్షరాలవి_హద్దు మీరని హొయలొలకబోస్తూ..!!
19. అక్షరాల బంధమిది_అక్షరాలా మరువనివ్వనంటూ...!!
20.  మనసు భాష మనది_అక్షరాల స్నేహంలో సేదదీరుతూ...!!
21.  చదివేయడం పరిపాటైపోయింది_మనసు నీదయినా నాదయినా..!!
22.   అంతర్జాల నెయ్యమిది_అక్షరాల అనుసంధానంలో మెలుగుతూ..!!
23.   అట్టిపెట్టుకున్నానందుకే_మనసుని సర్దే చతురత తెలియక...!!
24.  నేను అపరిచితమే ఎప్పుడూ_జ్ఞాపకాల ఛాయ లేని మనసు నీదయినప్పుడు..!!
25.  గతజన్మ జ్ఞాపకమే_కలలా మెదులుతూ మదిలో కొలువై...!!
26.   మనసు మరో మాట లేదంది_మౌనమే అలంకారమంటూ...!!
27.  ఆభరణం అలంకారం మాత్రమే_మనసనే అద్భుతానికి..!!
28.   చెమ్మగిల్లిన కనులకు తెలుసు_ గాయపడిన గుండె బరువెంతో..!!
29.  తడిచిన చెక్కిలికి తెలుసు_జారిన కన్నీటి విలువ...!!
30.  వెచ్చదనం గాయానిది కాదు_గుండె మంట కన్నీటికి చేరిందంతే...!!

కాలం వెంబడి కలం....7

       సరదా రాగింగ్లు, సివిల్ ప్రాక్టికల్స్ లో ఫీల్డ్ లో జామకాయలు కొనుక్కుని తింటూ సార్ లతో తిట్లు తినడం, ఎలక్ట్రికల్ లాబ్ లో ఏదీ అంటుకోకుండా, కనీసం సార్ మెయిన్ స్విచ్ వేయమన్నా కూడా వేయకుండా రీడింగ్స్ వేసుకుని, అబ్జర్వేషన్ బుక్ లో ముందు సైన్ చేయించుకోవడమూ, బాచ్మేట్స్ స్విచ్ పక్కనే ఉండి కూడా వేయలేదేంటంటే " మా అమ్మకు నేను ఒక్కదాన్నే" అని చెప్పడమూ, ఫిట్టింగ్, కార్పెంటరీ లాబ్లలో మెాడల్స్ చేయలేక నా అవస్థలు చూసి అందరు సరదాగా స్లో అని ఏడిపించడమూ, డ్రాయింగ్ షీట్లతో కుస్తీలు, మెకానికల్, ఫిజిక్స్ లాబ్లలో ప్రాక్టికల్స్ చేయడం బావుండేది. కెమిస్ట్రీ లాబ్లలో సరదాలు, అన్ని నేనే బాగా చేయగలను అనుకునే నా బాచ్మేట్ జీనియస్ (నేను పెట్టిన నిక్ నేమ్ లెండి) కెమిస్ట్రీ లాబ్లో పిపెట్ తో తీయలేక కాస్త మింగేస్తే నేను తీస్తానని చెప్పి అప్పటి నుండి ఆ ప్రాక్టికల్స్ అయిపోయే వరకు నేనే తీయడం చేసేదాన్ని. పాపం జీనియస్ నాకేం రాదనుకునేవాడు. మనకి రాక కాదు, చేద్దామని అత్యుత్సాహ పడుతుంటే, మనకెందుకు శ్రమని, వాళ్ళు చేస్తుంటే సరదాగా చూస్తుండేదాన్ని. మెకానికల్ క్లాస్ లో సో అని సర్ ఊతపదం ఎన్నిసార్లు ఆ గంటలో అన్నారో లెక్కలేయడం, మాథ్స్ సర్ క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చోవడమూ, కెమిస్ట్రీ సర్ క్లాస్ లో తన్నుకు వచ్చే నిద్రను ఆపుకోవడానికి పడే కష్టాలు, అమరావతి రైలులో మా ప్రయాణాలు, చూసిన సినిమాలు, చేసిన అల్లరి ఇలా ఎన్నో జ్ఞాపకాలను అందించింది ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం. పరీక్షలు రాయడానికి ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివిన నేను మూడు గంటలు ఇంగ్లీష్ లో పరీక్షలు రాయగలనా అన్న సంశయాన్ని దాటినప్పటి ఆనందం భలే బావుంది. 
         నాకు ఏదైనా రాదు అని చెప్పడం ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుండి. ఏ కొద్దిమందో తప్ప మిగతా  అందరు ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చినవారే. మా రాజమండ్రి శ్రీదేవికి నాతో రాదు అని అనిపించాలని చాలా కోరికగా ఉండేది. అది చదివావా, ఇది చదివావా అంటూ ఉండేది. నేనేమెా ఇంకా చదవలేదు, చదువుతా అనేదాన్ని. నీకు భయం వేయదా అంటే భయమెందుకు అనేదాన్ని. తెలియనివి నేర్చుకోవడం నాకలవాటే కదా. కాకపోతే తెలుగు నుండి ఇంగ్లీష్ మీడియం కదా కాస్త కష్టంగా ఉండేదంతే. నా రూమ్మేట్స్ శారద, చంద్ర, నీలిమలు బాగా హెల్ప్ చేసేవాళ్ళు అప్పట్లో. దుర్గమ్మ గుడికి వెళ్ళడం, అమృత రెస్టారెంట్ లో బేల్ పూరి, వెనీలా ఐస్క్రీమ్ భలే నచ్చేవి నాకు. దోశ, కాఫీ, ఉగ్గాణి, మిరపకాయ్ బజ్జీ, సుధా హోటల్ లో మైసుర్ బోండా సూపర్ గా ఉండేది. ఇవన్నీ అప్పుడప్పుడూ అన్నమాట. మా హాస్టల్  లో బిసిబేళా బాత్ టిఫిన్ ఆదివారం ఆల్టర్నేట్ గా పెట్టేవారు. కూరలు తినేవాళ్ళం కాదు. పచ్చళ్ళు వేసుకుని తినేవాళ్ళం. నేనేమెా బాగా కారం తినేదాన్ని. గొడ్డుకారం అన్న పేరు పెట్టేసారింక. 
           ఇక ఉత్తరాలు, పుస్తకాల విషయానికి వస్తే.. పుస్తకాలు కావాలంటే బోలెడు దూరం నడిచివెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఉత్తరాలకు రిప్లై ఇవ్వడం కూడా ఆలశ్యం చేసేదాన్ని కాదు. అందుకని వారానికి కనీసం ఓ ఉత్తరమైనా నాకు వచ్చేది. మా వాసు, బాలు రాస్తుండేవారు. అమ్మ రాస్తుండేది. బాలు రెండు లైన్లో, నాలుగు లైన్లో కవిత రాసి మిగతాది నువ్వు పూర్తి చెయ్యి అనేవాడు. అప్పటికి నేను సరోజా శ్రీ శ్రీ రాసిన శ్రీ శ్రీ గారి జీవితం గురించి ఆంధ్రభూమి లో వారం వారం చదివేదాన్ని. చిన్నప్పుడు మా ఊరు రాడికల్స్ వస్తే వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళతోనే తిరిగేదాన్ని. వాళ్ళ పాటలతో కమ్యూనిజం అప్పుడు నచ్చి ఉంటుంది. అలా అని నాస్తికురాలిని కాదు. గుడ్డిగా దేనిని నమ్మే రకం కాదన్నమాట. బాలు రాసే లైన్స్ కి సరిపోనూ రాసే కవితల్లో శ్రీ శ్రీ గారి ప్రభావం ఉండేది. అలా మళ్లీ చిన్నగా కవితలు (నేననుకున్నాలెండి కవితలని) రాయడం మెుదలైంది.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..  
    

21, జూన్ 2020, ఆదివారం

'ఘనుడు నాన్న - త్యాగధనుడు నాన్న'

అమ్మతనానికో నిండుదనం ఆపాదించే
సూక్ష్మకణ నిర్మాణానికి సారథితడు

కనుపాపలకు కనురెప్పగా మారి
కావలి కాసేటి కాపరివాడు

మనసుకు గాయలెన్నౌతున్నా
మౌనంగా భరించే మౌనముని ఇతడు

అందరిలో తానొంటరౌతున్నా
తనవారి కోసమే ఈ తాపసుడు

అనుబంధాలకు వారధిగా 
అనుక్షణం శ్రమించే నిరంతర శ్రామికుడు

నడకతో నడత నేర్పి
భవితకు బంగరు బాటలు వేసే బాటసారితడు

బాధ్యతలకు బానిసగా మిగులుతూ
ప్రతిఫలమాసించని ప్రగతిశీలుడితడు

తరాల తలరాతను మార్చేది తానైనా 
అంతరాల అహాలను అధిగమించే ఆత్మయెాగితడు

ఘనత తనదైనా బిడ్డల భవితకై పరితపించే
పునాదిరాయి ఈ నిలువెత్తు త్యాగధనుడు...నాన్న...!!

20, జూన్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా...15

పార్ట్... 15

  మామూలుగానే ఆరోజు కూడా అనోన్యని స్కూల్ లో దించి, అభిని రడీ చేసి స్కూల్ కి తీసుకువెళ్ళాను, స్కూల్ లేదన్నారు. తిరిగి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫోన్ మెాగింది. ఎవరా అని ఫోన్ తీసాను. ఏమే ముసలి బతికేవున్నావా అని శోభ గొంతు. నాకేమవుతుందే అని, ఏమైంది అని అడిగా. నీకు తెలియదా, టివి చూడలేదా అంది. లేదు పిల్లల పనిలో ఉన్నాగా అన్నాను. పెంటాగన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబ్ వేశారు. మెుత్తం కూలిపోయాయి. ఎంతమంది చనిపోయారో మరి. పిట్స్ బర్గ్ లో కూడా బాంబ్ వేశారు. గుడి మీద వేయాలని ప్లాన్ చేసినట్లున్నారు. కాకపోతే అది పిట్స్ బర్గ్ అవుట్స్కర్ట్స్ లో పేలింది. పిట్స్ బర్గ్ అనగానే నువ్వు గుర్తు వచ్చావు. ఎలా ఉన్నావో ఏమెా అని వెంటనే నీకు ఫోన్ చేసాను, అని కాసేపు మాట్లాడింది. ఇక వరసనే ఫోన్లు, డాక్టర్ గారికి, నాకు. యు ఎస్ కాపిటల్ ని కూడా టార్గెట్ చేసారు. అది ఫెయిల్ అయ్యింది. భారతదేశంలో చిన్నప్పుడు 1977 లో ఉప్పెనకు, 1988 లో రంగా యాజిటేషన్ కు, 2001 లో అమెరికాలో సెప్టెంబర్ 11 కి సాక్షిగా మిగిలాను నేను కూడా. చాలా దారుణం అది. ఏమైందో తెలియకుండానే పోయిన ప్రాణాలెన్నో. బిల్డింగ్ కూలడం చూస్తూ పై ఫ్లోర్ నుండి ప్రాణ భయంతో కిందకి పరుగులు తీస్తూ బోలెడుమంది. ప్రకృతి విపత్తులు కొన్నైతే, మూర్ఖుల దుష్టచర్యలకు పరాకాష్ఠ ఇలాంటి అనైతిక చర్యలు. ఇది జరిగిన తర్వాత కూడా చాలా రోజులు ఆంత్రడాక్స్ అని, పోస్ట్ లో కూడా వస్తుంది ఆ పౌడర్, దానిని అంటుకోవద్దని జాగ్రత్తలు. 
           అప్పటికే సాఫ్ట్ వేర్ జాబ్ ల మార్కెట్ బాగోలేదు. అందుకే నేను ఈ బేబి సిట్టింగ్ జాబ్ లో చేరాను. సెప్టెంబర్ 11 తర్వాత ఇక అసలు సాఫ్ట్ వేర్ జాబన్న మాటే లేదు. నేను పిట్స్ బర్గ్ రాకముందు చికాగో గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే ఓరోజు మధ్యాహ్నం  లైబ్రరీకి వెళ్ళి మెయిల్స్ చెక్ చేసుకుంటే మా సుధ అన్నయ్య నీ కొడుకు ఎడ్వెంచర్ చేసాడు. విజయవాడ తీసుకువచ్చారు అని పెట్టాడు. అది పెట్టి కూడా 2,3 రోజులయ్యింది నేను చూసేటప్పటికి. నా కొడుకు పేరు మౌర్య. రెండేళ్ళు అప్పటికి వాడికి. చాలా అల్లరివాడు. వెంటనే టైమ్ కూడా చూసుకోకుండా ఇంటికి ఫోన్ చేసాను. మామయ్య ఫోన్ తీసాడు. ఏమైంది మౌర్యకి, ఎందుకు విజయవాడ తీసుకెళ్ళారు అంటే..ఏం లేదు 4 మెట్ల మీద నుండి పడ్డాడు. ఏం కాలేదులే బానే ఉన్నాడని చెప్పాడు. నేను అంతే కాబోలు జరిగింది అనుకున్నా. మా ఫ్రెండ్స్ కి, అన్నయ్యకు, గోవర్థన్ కి కూడా అదే మాట చెప్పాను. నీళ్ళలోనికి వెళ్ళనీయవద్దని చెప్పు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయవద్దని చెప్పమని అన్నయ్య చెప్పాడు. నేను కార్సన్ సిటీ లో ఉన్నప్పుడు సతీష్ ఇండియా వెళుతూ ఏం కావాలంటే మా అబ్బాయిని చూసిరా అని చెప్పాను. ఎవరు ఇండియా వెళుతున్నా ఇదే చెప్పేదాన్ని. అన్నయ్యా వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు చూసి వచ్చారు. 
              ఈ అంతర్జాలం అందుబాటులోనికి రాక మునుపు కలం స్నేహం అని ఉండేది. ఇంటర్నెట్ వచ్చాక కాస్త నెట్టింటి స్నేహాలు మెుదలయ్యాయి. ఓరోజు మెయిల్ చెక్ చేసుకుంటే నాకు మెసేజ్ ఉంది. నేను ఏదో తెలుగు వెబ్ సైట్ లో నా మెయిల్ ఐడి ఇచ్చాను. అది చూసి మెయిల్ చేసాడట. పేరు వెంకట రమణ అని ఉంది. రిప్లై ఇచ్చాను. ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను. అలా ఇవ్వకూడదని అప్పట్లో తెలియదు. కాని ఇప్పటిలా అప్పుడు మిస్ బిహేవ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ. వెంకట రమణ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా నాకు ఓ మంచి ఫ్రెండ్ ఇలా దొరికాడు. 

మళ్ళీ కలుద్దాం...

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి...

19, జూన్ 2020, శుక్రవారం

ప్రపంచ వ్యాప్తంగా...!!

నేస్తం, 

     పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఏంటో అనుకున్నా. అనుభవమైతే కాని తెలియలేదు. గొప్ప పేరున్న సంస్థ కదా పోటీలు పారదర్శకంగా ఉంటాయని ఊహించడం పొరబాటని అర్థమయ్యింది. శాలువాలు కప్పించుకోవడానికి, సన్మానాలు చేయించుకోవడానికి ఉండాల్సిన కనీస అర్హతలేంటో చెప్తే సరిపోతుంది కదా..! దానికింత ఆర్భాటంగా ప్రపంచ వ్యాప్తంగా కవితా పోటీలు నిర్వహించనక్కర్లేదు. ప్రత్యేక ప్రోత్సాహకాలు, విశిష్ట బహుమతులని పెట్టి కొందరికి రెండు బహుమతులెలా ఇస్తారో నిర్వాహకులకే తెలియాలి. పోటీలకు ఒక కవిత మాత్రమే రాయాలన్న నిబంధన ప్రకారం ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో మరి? లోగుట్టు పెరుమాళ్లకెరుకండి...😊

16, జూన్ 2020, మంగళవారం

మానవ యంత్రం..!! జూన్ 16 అంతర్జాతీయ ఇంటి పనివారల దినోత్సవం సందర్భం గా

నా కవితను ప్రచురించిన ఆంధ్రాప్రవాసి వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు

మానవ యంత్రం..!!

ఓపిక లేని వేళ
ఇంటి మనిషిగా 
చేయూతనందించే
ఆత్మబంధువని
మనమనుకుంటాం

శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ
ఇంటిపని, వంటపనిలో
సాయమందిస్తూ 
మనతోపాటుగా మనవారికోసం
శ్రమించే కష్టజీవి

కాయకష్టం చేసుకుంటూ
ఆరోగ్యాన్ని సైతం లెక్కజేయక
శారీరకశ్రమతో తన కుటుంబ 
అవసరాలకు మరో ఇంటికి
మానవ యంత్రంగా మారిన మనీషికి వందనం...!! 




మానవ యంత్రం..!! జూన్ 16 అంతర్జాతీయ ఇంటి పనివారల దినోత్సవం సందర్భం గా

15, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...6

       ఇంజనీరింగ్ కోసం కర్నాటక లోని బళ్ళారి వెళ్ళడంతో మరో అధ్యాయం మెుదలయ్యింది. కొన్న కొద్దిపాటి పొలం అమ్మి నన్ను చదివించారు నాన్న. బంధువులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ఆ సమయంలో. సాయానికి మాత్రం ఎవరు ముందుకు రారు కాని మాటలనడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఆడపిల్లకు చదువెందుకు? అన్న మాటలు చాలామంది దగ్గర విన్నాను. మా నాన్న బాబాయి కొడుకు మా రాధ పెదనాన్న మాత్రం దాన్ని చదివించరా.. అవసరమైతే నేను చూసుకుంటాను అన్న భరోసానిచ్చారు. 
      ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కథలు, కవిత్వాలు మెుదలైన రాతలు ఎక్కడి నుండో రావు, మన జీవితాల్లో నుండో, మనం మన చుట్టూ చూసే పరిసరాలు, పరిస్థితులనుండోనే ఈ రాతలు పురుడు పోసుకుంటాయి. కాకపోతే అందరు రాయలేరు. కొందరికి రాయగలగడమనే వరం పూర్వజన్మ సుకృతం అయితే మరి కొందరికి రాయాలన్న తపన కారణమౌతుంది. మనం పెరిగిన వాతావరణం, మనం నేర్చుకున్న నడత, నడవడి మన రాతలలో కనిపిస్తుంది. వీటన్నిటికి మూలం మనకు మంచి చెడు నేర్పిన అమ్మానాన్నల పెంపకం. చదువు నేర్పిన గురువుల దీవెనలు. ఇవే మన రాతలకు మూల కారణాలు. మన ఆలోచనా విధానం ఏ వైపుకు పరిగెడుతుంటే ఆ వైపుకే మన రాతలు కూడా పయనిస్తాయి. 
           చిన్నప్పుడు వ్యాస రచన పోటీలకు అస్సలు వెళ్ళేదాన్నే కాదు. మరిప్పుడేమెా ఇలా రాస్తున్నాను. ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పుడు మెుదట్లో కాలేజ్ కి దగ్గరలో రూమ్ లో అమ్మా నేను ఉండేవాళ్ళం. నా సెక్షన్ లో నేను కాకుండా మరో నలుగురు అమ్మాయిలుండే వారు. వాళ్ళలో ఒక్కమ్మాయికే కాస్త తెలుగు తెలుసు. మిగతా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళని హాస్టల్లో ఆంధ్రావాళ్ళు ఏడిపిస్తున్నారని, ఆ కోపం నామీద చూపించేవారు. నేనేం పట్టించుకునేదాన్ని కాదు. ఎవరు పలకరించినా నా నోటి నుండి వచ్చే మెుదటి మాట " నీకు తెలుగు వచ్చా? ".  మరి మనకేమెా తెలుగు తప్ప మరో భాష రాదాయే అప్పటికి. మేమున్న ఇంటి దగ్గర పిల్లల నుండి కన్నడ 12 రోజులలో నేర్చుకున్నా. పిల్లలు నేను అడుగుతుంటే నవ్వేవారు. అయినా రానప్పుడు పిల్లలను అడిగి నేర్చుకోవడానికి నేను సిగ్గు పడలేదు. తర్వాత మా సీనియర్స్ రూమ్ లో వద్దు, హాస్టల్ లో ఉండమంటే, హాస్టల్ కి మారిపోయాను. అప్పటివరకు ఎప్పుడూ ఇంట్లోవాళ్ళు లేకుండా ఎక్కడా ఉండలేదు. అదే మెుదటిసారి. అతి కొద్ది రోజులలోనే మా సెక్షన్ అమ్మాయిలందరు బాగా క్లోజ్ అయ్యారు. సీనియర్స్ అందరు కూడా మాతో చాలా బావుండేవారు. హాస్టల్ లో కూడా నా పుస్తకాల పిచ్చి గురించి అందరికి తెలిసిపోయింది. కాలేజ్ లో, బయట కూడా నన్ను కన్నడ అమ్మాయనుకునేవారు. అప్పట్లో ఫోన్లు లాండ్ లైన్లు కూడా చాలా తక్కువ ఉండేవి. ఉత్తర,ప్రత్యుత్తరాలే వారధన్న మాట. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 


          

13, జూన్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా..!! 14

         పిట్స్బర్గ్ లో రోజులు గడిచిపోతున్నాయి. నా H1B గురించి శ్రీనివాస్ మళ్ళీ నాకు మెయిల్ పెడితే, ఫోన్ చేసాను. సుబ్బరాజు మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు, చేయలేదని చెప్పాను. వెంటనే శ్రీనివాస్ సుబ్బరాజుకి ఫోన్ చేసి చెప్తే, నాకు ఫోన్ చేసి మీరు H1B  చేయించుకున్నారని అనుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, పేపర్స్ అన్నీ పంపండి. 1100 డాలర్లు కూడా పంపండి. వన్ ఇయర్ లోపల మీకు జాబ్ వస్తే మీ 1100ల డాలర్లు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారు. సరేనని డబ్బులు, H1B కి అవసరమైన పేపర్స్ అన్ని పంపించాను. డాక్టర్ గారేమెా జాగ్రత్త, ఎవరికి నీ స్టేటస్ గురించి చెప్పకు, మళ్ళీ నాకు ప్రోబ్లం అవుతుంది, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది అని అన్నారు. డాక్టర్ గారి పేరు ఇందిర. పిల్లలు అనోన్య, అభిలాష్. 
       నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం. అనోన్య బాగా దగ్గరైంది. అభిలాష్ చిన్నోడు కదా, సరిగా తినేవాడు కాదు. అందుకని నేను కాస్త కోపంగా ఉన్నట్టు నటించేదాన్ని వాడి తిండి దగ్గర. రోజు వాళ్ళ అమ్మ వచ్చాక నా మీద కంప్లయింట్స్ చెప్తూ ఉండేవాడు. పాప నన్ను సపోర్ట్ చేసేది. డాక్టర్ గారు ఏమనేవారు కాదు. పిల్లలని చూస్తే తెలుస్తుందిగా ఆవిడకు పిల్లలు ఎలా ఉన్నారని. వీళ్ళ ఫ్రెండ్స్ మెర్సీ వాళ్ళు కూడా పిట్స్బర్గ్ లోనే ఉండేవారు. అప్పుడప్పుడూ వాళ్ళు రావడం, లేదా మేం వాళ్ళింటికి వెళ్ళడం జరిగేది. అప్పుడప్పుడూ చర్చికి కూడా వెళ్ళేవాళ్ళం. పిల్లలతో హారిపోర్టర్ సినిమా అమెరికా థియేటర్ లో మెుదటిసారి చూసాను. మధ్యలో ఓ రోజు నా ఫ్రెండ్స్ కళ్యాణ్, రాంబాబు వాళ్ళు పిట్స్బర్గ్ వేంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వచ్చారు. 
            నాకు అప్పటికి సెల్ ఫోన్ లేదు. ఇంటికి మాట్లాడుతునే ఉండేదాన్ని డాక్టర్ గారి లాండ్ లైన్ తో నా కాలింగ్ కార్డ్స్ తో. అప్పట్లో ఈమెయిల్ చూసుకోవాలంటే కంప్యూటర్ కూడా లేదు. లైబ్రరీలో అయితే ఇంటర్నెట్ ఫ్రీగా ఒక గంట చూసుకోవచ్చని చికాగోలో ఉన్నప్పుడు తెలుసు. అప్పుడు కూడా రెండోసారి గెస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ లేదు. అప్పుడు విజయ్ తీసుకెళ్ళాడు. అలా తెలిసిందన్న మాట. ఓ రోజు అభిని స్కూల్ లో దించి, లైబ్రరీకి వెళదామని బయలుదేరాను. మా అపార్ట్మెంట్స్ బయట అడిగితే 10 మినిట్స్ పడుతుందన్నారు పబ్లిక్ లైబ్రరీకి వెళడానికి. సరేనని నడిచి బయలుదేరాను. నడవడానికి ఫుట్పాత్ కూడా లేదు. ఎంత దూరం నడిచినా 10 మినిట్స్ అంటూనే ఉన్నారు ఎవరిని అడిగినా. అలా మూడు మైళ్ళు నడిస్తే కాని రాలేదు. లైబ్రరీని చూడగానే ఎంత సంతోషమేసిందో. గబగబా మెయిల్స్ చెక్ చేసుకుని, రిప్లైలు ఇచ్చేసి బయలుదేరాను నడుచుకుంటూనే. ఇంటికి వచ్చాక డాక్టర్ గారికి ఇలా జరిగిందని చెప్పాను. ఆవిడకి చెప్పే వెళ్ళాలెండి. తర్వాత బస్ ఉందని తెలిసింది. బస్ లో వెళ్ళి వచ్చేదాన్ని. ఓరోజు లైబ్రరీకి వెళ్ళి  వచ్చేటప్పుడు పెద్ద వర్షం. బస్ స్టాప్ లో బస్ అయితే ఎక్కాను కాని పాపం బస్ డ్రైవర్ చాలా మంచోడు. ఎటేటో తిప్పి జాగ్రత్తగా నన్ను మా బస్ స్టాప్ లో దించాడు. లైబ్రరీకి  ఎదురుగుండా పూల చెట్లు చాలా ఉండేవి. భలే బావున్నాయి అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది అది బరియల్ గ్రౌండ్ అని. మనవయితే భయం వేసేటట్లుగా ఉంటాయి. అమెరికాలో చనిపోయిన తర్వాత జ్ఞాపకాన్ని కూడా అందంగా ఉంచుతారని అర్థం అయ్యింది. 
            పిల్లల స్కూల్ లో నేనే వారికి అమ్మని అనుకునేవారు అక్కడికి మిగతా పిల్లల కోసం వచ్చే పేరెంట్స్. తన పేరు గుర్తు లేదు కాని ఓ అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యింది నాకు. అప్పుడప్పుడు  తను డ్రాప్ చేసేది స్నో బాగా ఉన్నప్పుడు. పిల్లల పుట్టినరోజులకి 150 బెలూన్స్ ఊది ఉంచితే, డాక్టర్ గారు డ్యూటి నుండి వచ్చి డెకరేషన్ చేయడం, పిల్లల పార్టీలు, పిల్లలతో ఇంట్లో ఆడటం, మా క్రింది ఫ్లోర్ వాళ్ళు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కి కంప్లయింట్స్ ఇలా రోజులు గడిచిపోతున్నాయి.

మళ్ళీ కలుద్దాం....

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాలు పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాలు పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో...

11, జూన్ 2020, గురువారం

అందరూ అపర గానకోకిలలే...!!

కష్టంలో ఉన్నోడికి ఓ పూట ముద్ద పెట్టలేరు(ముద్దెటగలరు) కాని... నాలుగు ముక్కలు రాయడమెుచ్చిన పతోరూ... సరదాగా ఓ రాగం తీస్తే ఈ అపర గానగంధర్వులందరూ ఓ గోలెట్టేత్తున్నారే...
రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ యన్ టి ఆర్ హీరో భార్యకి ఫ్రీ గా ట్రీట్మెంట్ చేయించిన మంచి మనసు బాలయ్యది. తన కన్నా ఎదిగిపోతారేమెానన్న అసూయతో ఎవరి మీదా బ్లూ ఫిలిం కేసులు బనాయించలేదు. అన్యాయంగా ఓ యువ హీరో మరణానికి కారకుడు కాలేదు. ప్రజాసంక్షేమానికి, ధన రాజకీయాలకు, పార్టీ పెట్టి పదవి కోసం, అవార్డుల కోసం నాటకాలాడటం, రాక్షసనీతికి తేడా తెలిసినోడు. కుటుంబ విలువలు, పిల్లల పెంపకం, బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం మాత్రమే తెలిసినోడు... తెలుగు భాషకు చరమగీతం పాడాలన్న దరిద్రపు ఆలోచనలు లేనోడు. ఓరి నిరారక్షిత అక్షుపక్షుల్లారా.. రాజిక సౌద్దానం అంటూ సగం తెలుగు, సగం ఇంగ్లీష్ మాట్లాడే మీకన్నా,  కనీసం ఎమ్ ఎల్ ఏ గా ప్రమాణ స్వీకారం చేయలేని మీకన్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్నే పరిహసించే మీకన్నా తన సంపాదనతో బతుకుతూ, నలుగురికి సాయపడే బాలయ్య పాట మీకంత నవ్వులాటైందా? 
ముఖపుస్తకం గానకోకిలలందరూ మీ స్వరాలు, రాగాలు కాస్త చూసుకోండమ్మా... రేపు ఇండియన్ నైటింగేల్ అవార్డ్ మీకే...ఓ చదువుకోని ఏలిముద్రలున్నాయి కదా... అదేనండి భారత కోకిల పురస్కారం మీకే మరి....

10, జూన్ 2020, బుధవారం

నిశ్శబ్ద గీతం..!!

మన మధ్యన
దశాబ్దాల పరిచయమున్నా
ఒకే ఇంట్లోనున్న
అపరిచితులం మనం

అప్పుడప్పుడూ అవసరానికి 
వినిపించే మాటల అనుబంధం
తెలిసిన మనసు గోల
దూరాన్ని సరి చేయలేకపోతోంది

నియంతృత్వానికి అహానికి
అడ్డుగోడగా నిలిచిన 
ఆత్మాభిమానపు తెరలు
పీలికలై పోతూనే ఉన్నాయి

ఏ పని చేతగాకున్నా
ఏదో చేయాలన్న తపన
నిరంతరం జ్వలిస్తూనే ఉన్నా
చేష్టలుడిగిన చేతగానితనమయ్యింది

నివురుగప్పిన నిప్పులా నిలిచి
నియంత నిరంకుశత్వానికి 
చరమగీతం ఆలపించే సమయానికై
నిరీక్షణా రాగాన్నాశ్రయించే నిశ్శబ్ద గీతమిది..!! 









8, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...5

       పెద్ద తెలుగు మాస్టారు చెప్పే ప్రత్యేక క్లాస్ తిరుమల తిరుపతి దేవస్థానము వారు పెట్టే పరీక్ష కోసం. నాకు ఆ క్లాస్ కి వెళ్ళడానికి సరిగా వీలయ్యేది కాదు. రోజూ క్లాస్ లో మాస్టారితో దీవెనలు అందుకుంటూనే ఉండేదాన్ని. ఆ కథలు అన్నీ నేను చదివినవే. శ్లోకాలు అన్ని తెలియవు. కొన్నే తెలిసినవి ఉండేవి. అలా తిట్లు తింటూ 9వ తరగతిలో రాసిన తిరుమల తిరుపతి దేవస్థానము వారి పరీక్షలో సముద్రాల జూనియర్ గారి సంతకంతో నాకూ ఓ సర్టిఫికేట్ వచ్చిందోచ్. 10వ తరగతిలో రామదాసు గురించి రాయమంటే మెుత్తం కీర్తనలతో సహా రాసేసాను. మరో ఉత్తరం గ్రంథాలయాల గురించి రాయమంటే నా ఫ్రెండ్ కి ఆ ఉత్తరం రాస్తూ వివరంగా ఎక్కడెక్కడ ఏ గ్రంథాలయాలున్నది అప్పట్లో రాసేసాను. మా తెలుగు మాస్టారబ్బాయి కన్నా తెలుగులో ఏమైనా సరే ఎక్కువ తెచ్చుకోవాలనుకున్నా. 2 మార్కులు ఎక్కువ వచ్చాయిలెండి. అప్పట్లో 81 మార్కులు తెలుగులో వచ్చాయి. తర్వాత కాలేజ్ జీవితం మెుదలు. 
       ఇంటరు రెండేళ్ళు విజయనగరంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మహరాజా మహిళా కళాశాలలో చదివాను. నాన్నకున్న క్రికెట్ పిచ్చి నాకూ అలవాటు చేసేసారు చిన్నప్పుడే. మా మేడంల స్టాఫ్ రూమ్ లో టివి ఉండేది. మా ఎంపిసి, బైపిసి కలిపి 118 మంది అమ్మాయిలుండేవారు. అందరి పేర్లు, రోల్ నెంబర్స్ నాకు కంఠస్తమన్నమాట అప్పట్లో. మా తెలుగు  మేడం నేను కనబడకపోతే వెదికేసుకునేవారు ఎక్కడున్నానా అని. మాథ్స్ మేడంలలో ఒకరు అంబా రమణ గారు సరదాగా కబుర్లు చెప్పేవారు. మెుదటి క్లాస్ లో ఎవరో అడిగారు 0/0 ఎంత అని. దానికి చాలా వివరణ ఇచ్చారులెండి అప్పట్లోనే. కెమిస్ట్రీ మేడం సూర్య కాంతి గారు కాస్త సీరియస్ గా ఉండేవారు. నాకిష్టమైన మా ఫిజిక్స్ మేడం శశి చాలా సింపుల్ గా ఉండేవారు. రమాదేవి గారు ఇంగ్లీష్ బాగా  చెప్పేవారు. 
       క్రికెట్ మాచ్ ఉంటే చాలు.. మంజూ స్కోరెంత అని అందరు నన్నే అడిగేవారు. స్టాఫ్ రూమ్ కి వెళ్ళి చూసి చెప్పేదాన్ని నేనే కదా మరి. అప్పటి వరకు ట్యూషన్ తెలియని నేను మాథ్స్ కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ కి ట్యూషన్ కి వెళ్ళేదాన్ని. మేం అద్దెకున్న ఇంట్లో మొత్తం ఐదు పోర్షన్లు ఇంటి వారితో కలిపి. పంచవటిలా అన్నట్టుగా. అప్పట్లో దూరదర్శన్ లో రామాయణం ఆదివారం, చిత్రలహరి శుక్రవారం వచ్చేవి. పైన నలుగురు స్టూడెంట్స్ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. ఇంటివారు అమ్మమ్మ గారు, ఆంటి, మురళి అన్నయ్య, విజ్జక్క ఉండేవారు. టివి ఉన్న అంకుల్ వాళ్ళకు చిన్న పిల్లలు పాప, బాబు..ఇలా మా ఇల్లంతా అందరితో సందడిగా ఉండేది. ఎవరి పుట్టినరోజయినా అందరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాల్సిందే, అక్కడ గోల చేయాల్సిందే. మురళి అన్నయ్య అప్పుడే కొత్తగా వస్తున్న సూర్యదేవర రామ్మెాహనరావు గారి నవల్స్ తెచ్చేవాడు. మా పక్కన చాగంటి సోమయాజులు గారు ఉండేవారు. మా అల్లరికి అప్పుడప్పుడూ ఆయనతో తిట్ల దీవెనలు అందుతూ ఉండేవి కూడా. ఇంటరు రెండేళ్ళు మూడు పుస్తకాలు ఆరు సినిమాలు అన్నట్టుగా గడిచిపోయింది. కాకపోతే సెకెండ్ ఇయర్ మధ్యలో అమ్మమ్మగారు అనుకోకుండా చనిపోవడం బాధాకరం. తర్వాత విజ్జక్క పెళ్ళికి నాకూ వెంకటగిరి పట్టులంగా కుట్టించారు ఆంటి. పినవేమలిలో జరిగిన రాజకీయాల కారణంగా లెక్కలు బాగా వచ్చిన నాకు ఇంటరులో లెక్కల పరీక్ష పోయింది. పేపర్ లో నెంబర్ లేనప్పుడు కూడా బాధనిపించలేదు. రీ వాల్యుయేషన్ కి హైదరాబాదు వెళ్ళి నా పేపర్ చూసుకుని, మెుదటి రెండు లెక్కలకు 40 వేసి, తర్వాత అన్ని లెక్కలకు ముందు రైట్ కొట్టి, దానిని ఇంటూగా మార్చి ఉండటం చూసి, ఇది కరక్టే కదా ఇలా రైట్ పెట్టి మళ్ళీ దానిని ఎందుకు దిద్దారని అడిగితే మేం ఏం చేయలేము అన్నారు. అప్పుడు కళ్ళవెంట నీళ్ళు కారిపోయాయి. ఇంటికి వచ్చేసాము. మా నాన్న ఏ ఫ్రెండ్ ని నమ్మి విజయనగరం వెళ్ళారో ఆయన మెాసం చేయడంతో మళ్ళీ మా ఊరు జయపురం కోటా బియ్యంతో వచ్చేసాము. ఇంటరు రెండేళ్ళు ఉత్తరాలు రాయడమే కాని వేరే ఏం రాయలేదు. పుస్తకాలు చదవడం మాత్రం ఆగలేదు. డబ్బులకు ఇబ్బంది పడుతున్నా నాన్న నాకు పుస్తకాలు కొనిచ్చేవారు.జయపురం వచ్చాక మా జొన్నవలస స్కూల్ ఫ్రెండ్, నాతో పోటి పడి చదివే మా తెలుగు మాస్టారబ్బాయి వాసు ఉత్తరాలు రాయడం, నన్ను చూడకపోయినా తన ప్రెండ్ బాలు కూడా నాకు ఉత్తరాలు రాయడంతో నా ఉత్తరాల రాత విఘ్నాలు లేకుండా సాగిపోయింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చదవడానికి బళ్ళారి వెళ్ళడంతో మరో కొత్త ప్రపంచం పరిచయమైంది.

  " జీవితమంటే ఏ కష్టం తెలియకుండా సంతోషంగా బతకడమెుక్కటే కాదు. కుటుంబంతో కలిసి అన్నీ పంచుకోవడం ".

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 

 

      

6, జూన్ 2020, శనివారం

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో...

భూతల స్వర్గమేనా...13

పార్ట్.. 13

      ఇండియానా యూనివర్శిటీలో MS చేసే పిల్లలు అందరు కలివిడిగానే ఉండేవారప్పుడు. గోవర్థన్ రూమ్ లో విజయ్, ఇంకో అతను ఉండేవారు. వీళ్ళ క్లాస్మేట్ ఓ అమ్మాయి పేరు శ్వేత అనుకుంటా. తను చాలా మంచి అమ్మాయి. నాతో ఎక్కువ క్లోజ్ గా ఉండేది. పిల్లలు అందరు నన్ను బాగా చూసుకున్నారు. గోవర్థన్ కి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తెలుసు. బాబి అని  మా చిన్నప్పటి క్లాస్మేట్ అమెరికాలోనే ఉన్నాడని, తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడో 88 లో చూసాను. సరే కాని గుర్తు పడితే మాట్లాడదాం లేదంటే లేదని ఫోన్ చేసా. హమ్మయ్య గుర్తు పట్టాడు బాబి. తన కబుర్లు చెప్పి, నా గురించి అడిగాడు. అలా మా చిన్నప్పటి స్నేహం మళ్ళీ కలిసిందన్నమాట. ఇండియానా లో వీళ్ళున్నది టెర్రాహట్ అన్న ఊరు. ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయేమెానని చూశాను. ఈ HNC వాడు నాకు H1B వీడి కంపెనీకి మార్చలేదు. నరసరాజు అంకుల్ నేను జాబ్ లో ఉన్నప్పుడు GIS వాళ్ళు వాళ్ళ H1B కాన్సిల్ చేసుకోవచ్చా అని అడిగితే వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటానన్నాడని చెప్తే GIS వాళ్ళు ఆ H1B కాన్సిల్ చేసుకున్నారు. అందుకని నాకిప్పుడు స్టేటస్ కూడా పోతుంది. వెంటనే వేరే ఎవరితోనైనా H1B ఫైల్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ అందరిని అడగడం మెుదలు పెట్టాను. మెుత్తానికి ఎవరి వల్లా కాలేదు. అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. నా క్లాస్మేట్, మద్రాస్ లో నా కొలీగ్ అయిన సుబ్బారెడ్డికి మెసేజ్ చేస్తే, తను మా జూనియర్ శ్రీనివాస చౌదరికి చెప్పాడట. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఉందని వాళ్ళతో మాట్లాడమని నెంబర్ ఇచ్చారు. అమెరికన్ సొల్యూషన్స్ సుబ్బరాజు ఇందుకూరికి ఫోన్ చేసి మాట్లాడాను. H1B చేస్తామని, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ లోపల మా ఆయనకు తెలిసిన వారు ఉన్నారని వాళ్ళతో మాట్లాడమంటే, వాళ్ళేమెా MS చెయ్యి ఓ సెమిస్టర్ వరకు నేను చూసుకుంటానన్నారు. లేదండి H1B చేయించుకుంటానని చెప్తే, ఆ డబ్బులు తను పంపిస్తానని చెప్పారు. ఆయన పేరు రామస్వామి యనమదల. నేను ఈయనను ఇండియాలో ఓసారి కలిసాను జాబ్ కోసం. రఘుబాబు పోతిని పేరుతో పాటు ఈ ఇందుకూరి సుబ్బరాజు, రామస్వామి యనమదల పేర్లు బాగా గుర్తుంచుకోండి. 
           నాకేమెా ఖాళీగా ఉండటానికి ఇష్టంగా అనిపించలేదు. నా ఫ్రెండ్ వినికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే తను వేరే జాబ్స్ ఉంటాయేమెా చూస్తానని, బేబి సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయని ఆ వివరాలు చెప్పడం, వాటిలో ఓ రెండు నెంబర్లకి కాల్ చేయడం, నార్త్ ఇండియన్ వారు 1500 డాలర్లు ఇస్తాం రమ్మని చెప్పారు. మరొకావిడ తెలుగావిడ,డాక్టర్. రెసిడెన్సీ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి అడిగారు. వాళ్ళాయన కూడా డాక్టర్. వేరే చోట ఉంటారు. లండన్ నుండి వచ్చారనుకుంటా. 1200 డాలర్లు ఇస్తానన్నారు. సరే అని ఉమతోనూ, వినితోనూ ఆలోచించి డాక్టర్ గారి దగ్గరకు వెళడానికి సిద్ధపడ్డాను. గోవర్థన్ కి చెప్పాను ఇదంతా. తనకి కార్ లేదు, కార్ రెంట్ కి తీసుకుని తను,  విజయ్ వచ్చి పంపిస్తామన్నారు. మర్చిపోయా నేను వెళ్ళాల్సిన ఊరు పిట్స్బర్గ్. పెన్సల్వేనియా స్టేట్. అదేనండి అమెరికాలో బాగా ఫేమస్ అయిన మన వేంకటేశ్వర స్వామి గుడి ఉన్న ఊరన్నమాట. ఉమా వాళ్ళు ఉండేది ఒహాయెాలో. వాళ్ళు పిట్స్బర్గ్ మేము పంపిస్తాము, గోవర్థన్ వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చేయమని చెప్పమన్నారు. పాపం పిల్లలు ఉమావాళ్ళ దగ్గర దిగబెట్టారు. అక్కడ ఓ వారం రోజులున్నాక, ఉమ,సురేష్ పిట్స్బర్గ్ వచ్చి, నన్ను గుడికి తీసుకువెళ్ళారు. అక్కడ మా గోపాలరావు అన్నయ్యా, వదిన కనిపించారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వదిన మేనమామ కొడుకు శీను అన్న కూడా కనిపించాడు. తర్వాత నన్ను డాక్టర్ గారి ఇంటిలో వదిలేసి, ఉమావాళ్ళు వెళుతుంటే బాగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళిద్దరు వెంటనే " నీకెప్పుడు ఉండాలనిపించకపోతే అప్పుడు చెప్పు. మేం వచ్చి తీసుకువెళిపోతాం " అని, డాక్టర్ గారికి కూడా జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళిపోయారు. డాక్టర్ గారికి పాప, బాబు. పాప 4,బాబు కిండర్ గార్డెన్. పాప స్కూల్ మేం ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగానే. బాబు స్కూల్ కొద్దిగా పక్కన. డాక్టర్ గారు 6 గంటలకు డ్యూటీకి వెళిపోవాలి. పాపకి  8 కి, బాబుకి 11కి స్కూల్. స్కూల్ కి పంపడం, తీసుకురావడం, వాళ్ళను డాక్టర్ గారు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవడం నా పని. నాకో రూమ్, వాళ్ళ ముగ్గురికి ఓ రూమ్. 

మళ్ళీ కలుద్దాం.. 




5, జూన్ 2020, శుక్రవారం

జీవితం అంటే...!!

మనసు
నీకు లేదు
నాకు ఉంది

జ్ఞాపకాలు
నీకు ఉండవు
నాకాలంబన అవే

మాట
నీ అహం
నా ఆత్మాభిమానం 

బంధం
నీకు అవసరానికి
నాకు ఆత్మీయతకు

బాధ్యతలు
నీకసలు పట్టవు
నన్ను వదలవు

హక్కులు
నీకెంత బాగా తెలుసో
నాకూ హక్కుందని మర్చిపోయాను

లోపాలు
వెదకడం నీకు తెలిసినంతగా
నాకు తెలియదు

కన్నీరు
నీకు పరిచయమే లేదసలు
నా నేస్తమే తాను

చిరునవ్వు
నువ్వు చూడొద్దనుకుంటావు
నా పెదవులపై చిరునామా అదే

అక్షరం
నీకయిష్టం
నాకిష్టం

ప్రణయం
నీకో ఆట
నాకేమెా ప్రణవం

జీవితం
నీకో వరం
నాకో శాపం...!! 

చినుకు తాకిన నేల సమీక్ష..!!

చినుకు తాకిన నేల సమీక్ష...!!

             మనసున్న మనిషి తపనే ఈ " చినుకు తాకిన నేల " అక్షర సవ్వడి...!! 

         భావుకత్వమంటే తనకు చాలా మక్కువంటూ, మనసు పలికిన భావాలను బహు సున్నితంగా తన అక్షరాలతో లాలించిన కవయిత్రి శాంతి కృష్ణ. ఈవిడ తన పదిహేనవ ఏట నుండే కథలు రాయడం మెుదలు పెట్టిన రచయిత్రి కూడానూ. చదవడం, రాయడం నిత్య వ్యాపకమీవిడకు. చక్కని సమీక్షకురాలు కూడా. ఎన్నో సత్కారాలు, బిరుదులు పొందిన శాంతి కృష్ణ ముఖ పుస్తకంలో అందరికి సుపరిచితురాలే. ఈ సాహితీ పిపాసకురాలి కలం నుండి వెలువడిన కవితా సంకలనమే " చినుకు తాకిన నేల ".
        తొలి గురువు అందరికి అమ్మ అంటారు చాలామంది. కాని శాంతి తన తొలి గురువు నాన్నంటూ, నాన్న కఠిన అంక్షలు పెట్టినా తన మంచి కోసమేనని, సద్బుద్దిని బోధించి, మంచి నడవడిని నేర్పిన నాన్నే తన ఆది గురువని చక్కని భావాలను తొలి కవితలో అందించారు. సంద్రం పిలుపు కవితలో ముసురు పట్టిన సమయంలో సముద్రాన్ని వర్ణిస్తూనే, మరోపక్క 
" సూరీని కబురు లేక
   సంద్రం పిలుపు లేక

   బెస్తపల్లె ముడుచుకున్న 
   గువ్వలా ఉంది నేడు... 
    దిగులు గుప్పెట్లో ఒదిగిపోతూ..!! " అంటూ మత్స్యకారుల కష్టాలను చక్కని, చిక్కని భావాలతో ఈ కవితలో వాన చినుకుల్లా ఒంపేసారు. మెుగలి రేకులు కవితలో చేతి చప్పట్లతో చెప్పే జీవిత సత్యాన్ని, గుండె గాయాలకు లేపనమద్దుతూ, అర్ధ నారీశ్వరుల అసలు గాథను " గరుకు మేనిపై పరిమళాలద్దుతున్న మెుగలి రేకులమంటూ " వారి మనసు చప్పుడును అక్షరాలుగా మనకు వినిపించారు అద్భుతంగా. తన ఆశలకు రూపమిచ్చి సరికొత్త బంగారు లోకాన్ని చూడాలని ఉంది అంటారు మరో కవితలో. మైత్రీ వనపు వనమాలికి తన భావోద్వేగాలను తెలియపరుస్తారు వనమాలి కవితలో. 
         సమాజంలో రోజూ జరిగే సంఘటనలకు అక్షర రూపమిస్తే అవే రేపటి పువ్వు, మృగాడు, ఓ అమ్మ, చిట్టి తల్లి, ఆడపిల్లా ఆశపడకు, ఆహ్వానం, పగిలిన మనసుల నవ్వులు, అందరూ మరిచిపోయిన గూడు రిక్షా, అడవిని నాశనం చేయవద్దని వైధవ్యం కవిత, నీ విజయం, పుడమి తనయుడు వంటి కవితలవుతాయి. ఇవన్నీ చక్కని సందేశాత్మక కవితలు. చదివిన ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తిస్తాయనడంలో ఎట్టి సందేహమూ లేదు
           తన మనసు ముచ్చట్లను ప్రియ సఖితోనూ, పుత్తడిబొమ్మ అందాలను వర్ణించడంలోనూ,  కనిపించని పల్లెను వెదుకుతూ ఆ పల్లె జ్ఞాపకాలను అందంగా నా పల్లె కవితలో పంచుకుంటారు. మనలో నిద్ర పోతున్న మానవత్వాన్ని తట్టి లేపి అనాధ పిల్లలకు ఆసరాకమ్మంటూ "చినుకు తాకిన నేల " కవితలో పిలుపునిస్తారు. కథలు, కవితలతో అన్నార్తుల ఆకలి తీరదు, మన అక్షరాలు ఆ పసిపిల్లల కంచంలో ఓ ముద్దగా కూడా మారవు. చిన్న సాయమైనా చేసి వారి నవ్వుల్లో ఓ వెన్నెల వాగు అవుదామంటారు. 
           స్నేహం గురించి, రాఖీ గురించి, బోనాలు, నందివర్ధనం, తంగేడు, చీకటి రాత్రి, వెన్నెల , స్నేహం, హృదయం, ఒంటరితనం, ప్రకృతి అందాలు, మరలిరాని స్వప్నాలు, అమ్మ గురించి, ప్రతిరూపం గురించి, అనుబంధాల గురించి, వానా, వసంతా గురించి, ప్రపంచం, ప్రపంచ శాంతి గురించి, సైనికులు గురించి, తెలుగు భాష గురించి, వెచ్చని తడిని, ఆశల చివుళ్ళను, పూల దొంతరలను, ప్రేమను, నేటి విద్యార్థి గురించి, ఆయువు, ధీర వనిత,  హేతువుల గురించి రాయడమే కాకుండా పనిలో పనిగా  సూరీనికి ప్రేమలో కూడా రాసేసారండి ఈవిడ. అడవిని అమ్మతో పోల్చి మరో కవిత రాశారు. ఆమె కలం ఏమనుకుంటోందోనని చెప్తారు ఓ కవితలో. రవీంద్రుని గీతాంజలికి, దామెాదరం సంజీవయ్యకు,గిడుగు గారికి అక్షరాంజలి ఘటిస్తూ...తెలుగు వెలుగు  ఘనతను, తెలుగు జాతి గౌరవాన్ని తన అక్షరాల్లో అద్భుతంగా చూపించారు. ప్రతి చిన్న విషయాన్ని తనదైన శైలిలో చక్కని అభివ్యక్తితో కవితలు చదివే అందరి మనసులను ఆకట్టుకునేటట్లుగా రాశారు. 
           చక్కని భావాలతో, వాటికి తగిన అర్థవంతమైన పదాలతో, నిండైన తెలుగు భాషకు మరింత నిండుదనమిస్తూ, సమాజ అభ్యున్నతికి సాహిత్యంతో పాటుగా మానవత్వమూ అవసరమని సూచిస్తూ 70 కవితలతో వెలువరించిన ఈ కవితా సంపుటి " చినుకు తాకిన నేల " కు హృదయపూర్వక అభినందనలు... 

మంజు యనమదల
విజయవాడ. 


3, జూన్ 2020, బుధవారం

రెక్కలు

1.  కొందరు
అంతే
తేనె పూసిన
కత్తులు

నాటకాల
రాయుళ్ళు..!!

2.   ఆచరించని
నీతులు
చెప్పేవి మాత్రం
ఆణిముత్యాలు

నేతిబీరకాయలో
నెయ్యి చందాన..!!

3.  మాట 
జారితే
మనసు
విరిగిపోతుంది

సరి చేయలేని
తప్పిదమిది..!!

4.  శరము 
సూటిగా తాకుతుంది
మాట విరుపు
మనసును చంపేస్తుంది

గాయం
నయం కాదు..!!

5.   చిన్న మాటే
మనసుని తెలుపుతుంది
బంధాన్ని
బలోపేతం చేస్తుంది

గతజన్మ 
అనుబంధం..!!

6.  ఆరాటం
మనిషిది
ఆశయం
మనసుది

సంఘర్షణ 
జీవితానిది...!!

7.   జ్ఞాపకాలుగా 
మిగిలిపోతాయి
గతమైన
క్షణాలన్నీ

కాలం
మౌన సాక్షి...!!

8.  సాక్ష్యం 
బెదిరిపోదు
మసను
మౌనం వహించినా

కాలమే
సమాధానం...!!

9.   బంధం
వదలలేనిది
మనసు
ఏకాకి

శూన్యం
అనంతం...!!

10.   (అ)సహజ లెక్కలు
లాభాన్ని చూపిస్తాయి
అసలైన వ్యక్తిత్వం 
స్వభావాన్ని తెలుపుతుంది 

జయాపజయాలను
కాలం నిర్ణయిస్తుంది...!!

11.  బానిసను
అయ్యాను
మనసు
చంపుకుని

విధి చేతిలో
కీలుబొమ్మను...!!

12.   ఎక్కే
మెట్లు
దిగే 
మెట్లు

ఒడిదుడుకుల
జీవితమిది..!!

13.  అంతర్వాహిని
మనసు
అక్షరాలు
ఆత్మీయ నేస్తాలు

మౌనాన్ని 
తర్జుమా చేసేస్తూ..!!

14.  శిలగా మారింది
మనిషే
ముక్కలైన మనసు
తనదయ్యాక

ఆటుపోట్లు 
కడలి అంతరంగాలు...!!

15.  చెక్కడంలో
ఓర్పు
తీర్చిదిద్దడంలో
నేర్పు

శిల్పి
మనోభావాలు...!!

16.   మనసు
కనబడదు
మౌనం
వినిపించదు

అర్థం చేసుకోవడమే
జీవితం...!!

17.  వెన్నెలను వెదుకుతుంది
మనసు
వేకువ పిలుపులో
ఊరడిల్లుతూ

గాయాలను
అక్షరాలకు అద్దాలనుకుంటూ..!!

18.  అహంకారం
ఇంటిపేరు
అధికారం
లభ్యం

లక్ష్యం లేని ప్రయాణం
నిరుపయెాగం..!! 

19.   మాటల్లో
ఒలకబోసేది
చేతల్లో 
చూపించలేనిది

నేతిబీరకాయలో
నెయ్యి వంటిది..!!

20.   అక్షరాల
అమరిక
పదాల 
పొంతన

తీరైన
రచనగా మారుతుంది..!!

21.  మనసు పొరల్లో
జ్ఞాపకాలు
కనుల కొలనులో
కన్నీటి తడి

జీవితానుభవాలెన్నో
గుప్పెడు గుండెకు...!!

22.   కెంపులు
కన్నుల్లో
ముత్యాలు
నవ్వుల్లో

నవగ్రహ రత్నాలు
జీవితానికి...!!

23.   కొందరిని చూసి 
ఎలా బతకాలో తెలుస్తుంది 
మరి కొందరిని చూస్తే 
ఎలా బతక్కూడదో తెలుస్తుంది

కాలం
ఎప్పుడూ నేర్చుకోమంటూనే ఉంటుంది..!!

24.   గతాన్ని విడువలేని
మనసు
గాయాలను చెరపలేని
కాలం

అక్షరాలకు అలవాటైన
సాన్నిహిత్యం...!!

25.   అనునయాల
అచ్చట్లు
ఆలంబనల
ముచ్చట్లు

చెంత చేరిన
జ్ఞాపకాలు..!!

26.   మనసు 
అంతర్మధనం
మనిషి
అంతరంగం

మౌనం గుట్టు
అక్షరాలకెరుక...!!

27.   అక్షరాలకు
అంతుచిక్కని రాతిది
చదవలేని
లలాటలిఖితమిది

దోబూచులాటలో
విధాత లిపి...!!

28.   ఆడక 
తప్పదు
ఓడిపోతామని
తెలిసినా

జీవిత 
కాల చక్రభ్రమణంలో..!!

29.   మనసో 
మాయాదుప్పటి
ఆనవాళ్ళేమి
అగుపడనీయకుండా

అంతరంగం
అందని జాబిల్లి...!!

30.   ఆత్మస్థైర్యానికి
అతిశయమే మరి
అనుబంధాలు
అభూతకల్పనలని తెలిసాక

నటనానుభవం లేదు
మనసున్న మనిషికి..!!

1, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...4

          చిన్నప్పటి నుండి పుస్తకాలతో పాటుగా సినిమాలు చూసే అలవాటు కూడా ఉండేది. చిన్నప్పటి నుండే నాన్న హింది, ఇంగ్లీష్ సినిమాలు కూడా చూపించేవారు.మాటలు అర్థం కానప్పుడు అడిగితే విసుక్కోకుండా చెప్పేవారు. ఇక రేడియోలో లలిత సంగీతం, సామూహిక గేయాలు, ఆదివారం మూడింటికి వచ్చే నాటకం, వివిధ భారతి, జనరంజని వంటివి అన్నీ వినడం, ఆ పాటలు నేర్చుకోవడమెా అలవాటు అప్పట్లో. వాటి కోసం ఓ పుస్తకం కూడా స్పెషల్ గా పెట్టి పాటలన్నీ రాసుకునేదాన్ని. బయట వేరే వాళ్ళ దగ్గర కూడా నచ్చిన జానపద గీతాలు నేర్చుకునేదాన్ని. మా గోపాలరావు అన్నయ్య నాకు మూడేళ్ళ వయసప్పుడు హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనే ఇచ్చిన స్కైబ్లూ కలర్ పానాసానిక్ రౌండ్ రేడియో చాలా సంవత్సరాల వరకు నాకు మంచి నేస్తమే. 
    పాటలు వింటున్నప్పుడు అనిపించేది ఇంత బాగా ఎలా రాయగలుగుతున్నారో అని. ఇప్పటికి నాకు ఆశ్చర్యమే కొన్ని పాటలు వింటున్నప్పుడు. ఎలా తడతాయా ఆ పదాలు అని. జీవన పోరాటం లో కొన్ని పాటలు అప్పట్లో మా దేవికి రాసిన ఉత్తరాల కవితలకు ఇన్స్పిరేషన్. సిరివెన్నెల సినిమా చూసాక సిరివెన్నెల గారి సాహిత్యానికి అభిమానినైపోయాను. శ్రీ శ్రీ గారు, వేటూరి గారు, ఆత్రేయ గారు, అనంత శ్రీరాం గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు, చంద్రబోస్ ఇలా ఎంతోమంది పాటల సాహిత్యంలో తెలుగుభాషలోని తీయదనాన్ని ఆస్వాదించడం ఓ వ్యాపకమైపోయింది. పుస్తకాలు చదవడమే కాకుండా పాటలు వినడం కూడా మనకు మన తెలుగు భాషలోని అందాన్ని, పదాల విరుపుల సోయగాన్ని తెలుపుతుంది. 
        రామాయణం, భారతం, భాగవతం, శ్రీ వేంకటేశ్వర కళ్యాణం, పంచతంత్రం, అక్బర్ బీర్బల్ కధలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఇంకా ఏవేవో సాహస యాత్రల కథలు, గౌతమ బుద్ధుని గురించి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, తెనాలి రామకృష్ణ కథలు ఇలా చదవని పుస్తకాలు అప్పట్లో లేవనే చెప్పాలి. వేసవి శలవల్లో పిల్లలందరం మా డాబా పైకి చేరేవాళ్ళం. మా డాబాకి అప్పట్లో మెట్లు లేవు. నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాలి. పగలైతే వెనుక గోడలెక్కి పైకి వెళిపోయేవాళ్ళం. వెన్నెల్లో డాబా మీద పడుకుని అందరు తలా ఓ కథా చెప్పాలని వంతులు వేసుకునే వాళ్ళం. మళ్ళీ దానిలో కూడా రూల్స్. అందరికి తెలిసిన కథలు చెప్పకూడదన్న మాట. మరో మాట ఎవరికి చెప్పకండి పేకాట కూడా ఆడుకునేవాళ్ళం. సరదాకే లెండి, డబ్బులకి కాదు. బోలెడు ఆటలు కూడా ఆడుకునే వాళ్ళం. బాల్యం ఓ అందమైన గతం నాకు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner