8, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...5

       పెద్ద తెలుగు మాస్టారు చెప్పే ప్రత్యేక క్లాస్ తిరుమల తిరుపతి దేవస్థానము వారు పెట్టే పరీక్ష కోసం. నాకు ఆ క్లాస్ కి వెళ్ళడానికి సరిగా వీలయ్యేది కాదు. రోజూ క్లాస్ లో మాస్టారితో దీవెనలు అందుకుంటూనే ఉండేదాన్ని. ఆ కథలు అన్నీ నేను చదివినవే. శ్లోకాలు అన్ని తెలియవు. కొన్నే తెలిసినవి ఉండేవి. అలా తిట్లు తింటూ 9వ తరగతిలో రాసిన తిరుమల తిరుపతి దేవస్థానము వారి పరీక్షలో సముద్రాల జూనియర్ గారి సంతకంతో నాకూ ఓ సర్టిఫికేట్ వచ్చిందోచ్. 10వ తరగతిలో రామదాసు గురించి రాయమంటే మెుత్తం కీర్తనలతో సహా రాసేసాను. మరో ఉత్తరం గ్రంథాలయాల గురించి రాయమంటే నా ఫ్రెండ్ కి ఆ ఉత్తరం రాస్తూ వివరంగా ఎక్కడెక్కడ ఏ గ్రంథాలయాలున్నది అప్పట్లో రాసేసాను. మా తెలుగు మాస్టారబ్బాయి కన్నా తెలుగులో ఏమైనా సరే ఎక్కువ తెచ్చుకోవాలనుకున్నా. 2 మార్కులు ఎక్కువ వచ్చాయిలెండి. అప్పట్లో 81 మార్కులు తెలుగులో వచ్చాయి. తర్వాత కాలేజ్ జీవితం మెుదలు. 
       ఇంటరు రెండేళ్ళు విజయనగరంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మహరాజా మహిళా కళాశాలలో చదివాను. నాన్నకున్న క్రికెట్ పిచ్చి నాకూ అలవాటు చేసేసారు చిన్నప్పుడే. మా మేడంల స్టాఫ్ రూమ్ లో టివి ఉండేది. మా ఎంపిసి, బైపిసి కలిపి 118 మంది అమ్మాయిలుండేవారు. అందరి పేర్లు, రోల్ నెంబర్స్ నాకు కంఠస్తమన్నమాట అప్పట్లో. మా తెలుగు  మేడం నేను కనబడకపోతే వెదికేసుకునేవారు ఎక్కడున్నానా అని. మాథ్స్ మేడంలలో ఒకరు అంబా రమణ గారు సరదాగా కబుర్లు చెప్పేవారు. మెుదటి క్లాస్ లో ఎవరో అడిగారు 0/0 ఎంత అని. దానికి చాలా వివరణ ఇచ్చారులెండి అప్పట్లోనే. కెమిస్ట్రీ మేడం సూర్య కాంతి గారు కాస్త సీరియస్ గా ఉండేవారు. నాకిష్టమైన మా ఫిజిక్స్ మేడం శశి చాలా సింపుల్ గా ఉండేవారు. రమాదేవి గారు ఇంగ్లీష్ బాగా  చెప్పేవారు. 
       క్రికెట్ మాచ్ ఉంటే చాలు.. మంజూ స్కోరెంత అని అందరు నన్నే అడిగేవారు. స్టాఫ్ రూమ్ కి వెళ్ళి చూసి చెప్పేదాన్ని నేనే కదా మరి. అప్పటి వరకు ట్యూషన్ తెలియని నేను మాథ్స్ కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ కి ట్యూషన్ కి వెళ్ళేదాన్ని. మేం అద్దెకున్న ఇంట్లో మొత్తం ఐదు పోర్షన్లు ఇంటి వారితో కలిపి. పంచవటిలా అన్నట్టుగా. అప్పట్లో దూరదర్శన్ లో రామాయణం ఆదివారం, చిత్రలహరి శుక్రవారం వచ్చేవి. పైన నలుగురు స్టూడెంట్స్ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. ఇంటివారు అమ్మమ్మ గారు, ఆంటి, మురళి అన్నయ్య, విజ్జక్క ఉండేవారు. టివి ఉన్న అంకుల్ వాళ్ళకు చిన్న పిల్లలు పాప, బాబు..ఇలా మా ఇల్లంతా అందరితో సందడిగా ఉండేది. ఎవరి పుట్టినరోజయినా అందరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాల్సిందే, అక్కడ గోల చేయాల్సిందే. మురళి అన్నయ్య అప్పుడే కొత్తగా వస్తున్న సూర్యదేవర రామ్మెాహనరావు గారి నవల్స్ తెచ్చేవాడు. మా పక్కన చాగంటి సోమయాజులు గారు ఉండేవారు. మా అల్లరికి అప్పుడప్పుడూ ఆయనతో తిట్ల దీవెనలు అందుతూ ఉండేవి కూడా. ఇంటరు రెండేళ్ళు మూడు పుస్తకాలు ఆరు సినిమాలు అన్నట్టుగా గడిచిపోయింది. కాకపోతే సెకెండ్ ఇయర్ మధ్యలో అమ్మమ్మగారు అనుకోకుండా చనిపోవడం బాధాకరం. తర్వాత విజ్జక్క పెళ్ళికి నాకూ వెంకటగిరి పట్టులంగా కుట్టించారు ఆంటి. పినవేమలిలో జరిగిన రాజకీయాల కారణంగా లెక్కలు బాగా వచ్చిన నాకు ఇంటరులో లెక్కల పరీక్ష పోయింది. పేపర్ లో నెంబర్ లేనప్పుడు కూడా బాధనిపించలేదు. రీ వాల్యుయేషన్ కి హైదరాబాదు వెళ్ళి నా పేపర్ చూసుకుని, మెుదటి రెండు లెక్కలకు 40 వేసి, తర్వాత అన్ని లెక్కలకు ముందు రైట్ కొట్టి, దానిని ఇంటూగా మార్చి ఉండటం చూసి, ఇది కరక్టే కదా ఇలా రైట్ పెట్టి మళ్ళీ దానిని ఎందుకు దిద్దారని అడిగితే మేం ఏం చేయలేము అన్నారు. అప్పుడు కళ్ళవెంట నీళ్ళు కారిపోయాయి. ఇంటికి వచ్చేసాము. మా నాన్న ఏ ఫ్రెండ్ ని నమ్మి విజయనగరం వెళ్ళారో ఆయన మెాసం చేయడంతో మళ్ళీ మా ఊరు జయపురం కోటా బియ్యంతో వచ్చేసాము. ఇంటరు రెండేళ్ళు ఉత్తరాలు రాయడమే కాని వేరే ఏం రాయలేదు. పుస్తకాలు చదవడం మాత్రం ఆగలేదు. డబ్బులకు ఇబ్బంది పడుతున్నా నాన్న నాకు పుస్తకాలు కొనిచ్చేవారు.జయపురం వచ్చాక మా జొన్నవలస స్కూల్ ఫ్రెండ్, నాతో పోటి పడి చదివే మా తెలుగు మాస్టారబ్బాయి వాసు ఉత్తరాలు రాయడం, నన్ను చూడకపోయినా తన ప్రెండ్ బాలు కూడా నాకు ఉత్తరాలు రాయడంతో నా ఉత్తరాల రాత విఘ్నాలు లేకుండా సాగిపోయింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చదవడానికి బళ్ళారి వెళ్ళడంతో మరో కొత్త ప్రపంచం పరిచయమైంది.

  " జీవితమంటే ఏ కష్టం తెలియకుండా సంతోషంగా బతకడమెుక్కటే కాదు. కుటుంబంతో కలిసి అన్నీ పంచుకోవడం ".

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 

 

      

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner