15, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...6

       ఇంజనీరింగ్ కోసం కర్నాటక లోని బళ్ళారి వెళ్ళడంతో మరో అధ్యాయం మెుదలయ్యింది. కొన్న కొద్దిపాటి పొలం అమ్మి నన్ను చదివించారు నాన్న. బంధువులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ఆ సమయంలో. సాయానికి మాత్రం ఎవరు ముందుకు రారు కాని మాటలనడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఆడపిల్లకు చదువెందుకు? అన్న మాటలు చాలామంది దగ్గర విన్నాను. మా నాన్న బాబాయి కొడుకు మా రాధ పెదనాన్న మాత్రం దాన్ని చదివించరా.. అవసరమైతే నేను చూసుకుంటాను అన్న భరోసానిచ్చారు. 
      ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కథలు, కవిత్వాలు మెుదలైన రాతలు ఎక్కడి నుండో రావు, మన జీవితాల్లో నుండో, మనం మన చుట్టూ చూసే పరిసరాలు, పరిస్థితులనుండోనే ఈ రాతలు పురుడు పోసుకుంటాయి. కాకపోతే అందరు రాయలేరు. కొందరికి రాయగలగడమనే వరం పూర్వజన్మ సుకృతం అయితే మరి కొందరికి రాయాలన్న తపన కారణమౌతుంది. మనం పెరిగిన వాతావరణం, మనం నేర్చుకున్న నడత, నడవడి మన రాతలలో కనిపిస్తుంది. వీటన్నిటికి మూలం మనకు మంచి చెడు నేర్పిన అమ్మానాన్నల పెంపకం. చదువు నేర్పిన గురువుల దీవెనలు. ఇవే మన రాతలకు మూల కారణాలు. మన ఆలోచనా విధానం ఏ వైపుకు పరిగెడుతుంటే ఆ వైపుకే మన రాతలు కూడా పయనిస్తాయి. 
           చిన్నప్పుడు వ్యాస రచన పోటీలకు అస్సలు వెళ్ళేదాన్నే కాదు. మరిప్పుడేమెా ఇలా రాస్తున్నాను. ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పుడు మెుదట్లో కాలేజ్ కి దగ్గరలో రూమ్ లో అమ్మా నేను ఉండేవాళ్ళం. నా సెక్షన్ లో నేను కాకుండా మరో నలుగురు అమ్మాయిలుండే వారు. వాళ్ళలో ఒక్కమ్మాయికే కాస్త తెలుగు తెలుసు. మిగతా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళని హాస్టల్లో ఆంధ్రావాళ్ళు ఏడిపిస్తున్నారని, ఆ కోపం నామీద చూపించేవారు. నేనేం పట్టించుకునేదాన్ని కాదు. ఎవరు పలకరించినా నా నోటి నుండి వచ్చే మెుదటి మాట " నీకు తెలుగు వచ్చా? ".  మరి మనకేమెా తెలుగు తప్ప మరో భాష రాదాయే అప్పటికి. మేమున్న ఇంటి దగ్గర పిల్లల నుండి కన్నడ 12 రోజులలో నేర్చుకున్నా. పిల్లలు నేను అడుగుతుంటే నవ్వేవారు. అయినా రానప్పుడు పిల్లలను అడిగి నేర్చుకోవడానికి నేను సిగ్గు పడలేదు. తర్వాత మా సీనియర్స్ రూమ్ లో వద్దు, హాస్టల్ లో ఉండమంటే, హాస్టల్ కి మారిపోయాను. అప్పటివరకు ఎప్పుడూ ఇంట్లోవాళ్ళు లేకుండా ఎక్కడా ఉండలేదు. అదే మెుదటిసారి. అతి కొద్ది రోజులలోనే మా సెక్షన్ అమ్మాయిలందరు బాగా క్లోజ్ అయ్యారు. సీనియర్స్ అందరు కూడా మాతో చాలా బావుండేవారు. హాస్టల్ లో కూడా నా పుస్తకాల పిచ్చి గురించి అందరికి తెలిసిపోయింది. కాలేజ్ లో, బయట కూడా నన్ను కన్నడ అమ్మాయనుకునేవారు. అప్పట్లో ఫోన్లు లాండ్ లైన్లు కూడా చాలా తక్కువ ఉండేవి. ఉత్తర,ప్రత్యుత్తరాలే వారధన్న మాట. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 


          

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner