22, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం....7

       సరదా రాగింగ్లు, సివిల్ ప్రాక్టికల్స్ లో ఫీల్డ్ లో జామకాయలు కొనుక్కుని తింటూ సార్ లతో తిట్లు తినడం, ఎలక్ట్రికల్ లాబ్ లో ఏదీ అంటుకోకుండా, కనీసం సార్ మెయిన్ స్విచ్ వేయమన్నా కూడా వేయకుండా రీడింగ్స్ వేసుకుని, అబ్జర్వేషన్ బుక్ లో ముందు సైన్ చేయించుకోవడమూ, బాచ్మేట్స్ స్విచ్ పక్కనే ఉండి కూడా వేయలేదేంటంటే " మా అమ్మకు నేను ఒక్కదాన్నే" అని చెప్పడమూ, ఫిట్టింగ్, కార్పెంటరీ లాబ్లలో మెాడల్స్ చేయలేక నా అవస్థలు చూసి అందరు సరదాగా స్లో అని ఏడిపించడమూ, డ్రాయింగ్ షీట్లతో కుస్తీలు, మెకానికల్, ఫిజిక్స్ లాబ్లలో ప్రాక్టికల్స్ చేయడం బావుండేది. కెమిస్ట్రీ లాబ్లలో సరదాలు, అన్ని నేనే బాగా చేయగలను అనుకునే నా బాచ్మేట్ జీనియస్ (నేను పెట్టిన నిక్ నేమ్ లెండి) కెమిస్ట్రీ లాబ్లో పిపెట్ తో తీయలేక కాస్త మింగేస్తే నేను తీస్తానని చెప్పి అప్పటి నుండి ఆ ప్రాక్టికల్స్ అయిపోయే వరకు నేనే తీయడం చేసేదాన్ని. పాపం జీనియస్ నాకేం రాదనుకునేవాడు. మనకి రాక కాదు, చేద్దామని అత్యుత్సాహ పడుతుంటే, మనకెందుకు శ్రమని, వాళ్ళు చేస్తుంటే సరదాగా చూస్తుండేదాన్ని. మెకానికల్ క్లాస్ లో సో అని సర్ ఊతపదం ఎన్నిసార్లు ఆ గంటలో అన్నారో లెక్కలేయడం, మాథ్స్ సర్ క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చోవడమూ, కెమిస్ట్రీ సర్ క్లాస్ లో తన్నుకు వచ్చే నిద్రను ఆపుకోవడానికి పడే కష్టాలు, అమరావతి రైలులో మా ప్రయాణాలు, చూసిన సినిమాలు, చేసిన అల్లరి ఇలా ఎన్నో జ్ఞాపకాలను అందించింది ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం. పరీక్షలు రాయడానికి ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివిన నేను మూడు గంటలు ఇంగ్లీష్ లో పరీక్షలు రాయగలనా అన్న సంశయాన్ని దాటినప్పటి ఆనందం భలే బావుంది. 
         నాకు ఏదైనా రాదు అని చెప్పడం ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుండి. ఏ కొద్దిమందో తప్ప మిగతా  అందరు ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చినవారే. మా రాజమండ్రి శ్రీదేవికి నాతో రాదు అని అనిపించాలని చాలా కోరికగా ఉండేది. అది చదివావా, ఇది చదివావా అంటూ ఉండేది. నేనేమెా ఇంకా చదవలేదు, చదువుతా అనేదాన్ని. నీకు భయం వేయదా అంటే భయమెందుకు అనేదాన్ని. తెలియనివి నేర్చుకోవడం నాకలవాటే కదా. కాకపోతే తెలుగు నుండి ఇంగ్లీష్ మీడియం కదా కాస్త కష్టంగా ఉండేదంతే. నా రూమ్మేట్స్ శారద, చంద్ర, నీలిమలు బాగా హెల్ప్ చేసేవాళ్ళు అప్పట్లో. దుర్గమ్మ గుడికి వెళ్ళడం, అమృత రెస్టారెంట్ లో బేల్ పూరి, వెనీలా ఐస్క్రీమ్ భలే నచ్చేవి నాకు. దోశ, కాఫీ, ఉగ్గాణి, మిరపకాయ్ బజ్జీ, సుధా హోటల్ లో మైసుర్ బోండా సూపర్ గా ఉండేది. ఇవన్నీ అప్పుడప్పుడూ అన్నమాట. మా హాస్టల్  లో బిసిబేళా బాత్ టిఫిన్ ఆదివారం ఆల్టర్నేట్ గా పెట్టేవారు. కూరలు తినేవాళ్ళం కాదు. పచ్చళ్ళు వేసుకుని తినేవాళ్ళం. నేనేమెా బాగా కారం తినేదాన్ని. గొడ్డుకారం అన్న పేరు పెట్టేసారింక. 
           ఇక ఉత్తరాలు, పుస్తకాల విషయానికి వస్తే.. పుస్తకాలు కావాలంటే బోలెడు దూరం నడిచివెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఉత్తరాలకు రిప్లై ఇవ్వడం కూడా ఆలశ్యం చేసేదాన్ని కాదు. అందుకని వారానికి కనీసం ఓ ఉత్తరమైనా నాకు వచ్చేది. మా వాసు, బాలు రాస్తుండేవారు. అమ్మ రాస్తుండేది. బాలు రెండు లైన్లో, నాలుగు లైన్లో కవిత రాసి మిగతాది నువ్వు పూర్తి చెయ్యి అనేవాడు. అప్పటికి నేను సరోజా శ్రీ శ్రీ రాసిన శ్రీ శ్రీ గారి జీవితం గురించి ఆంధ్రభూమి లో వారం వారం చదివేదాన్ని. చిన్నప్పుడు మా ఊరు రాడికల్స్ వస్తే వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళతోనే తిరిగేదాన్ని. వాళ్ళ పాటలతో కమ్యూనిజం అప్పుడు నచ్చి ఉంటుంది. అలా అని నాస్తికురాలిని కాదు. గుడ్డిగా దేనిని నమ్మే రకం కాదన్నమాట. బాలు రాసే లైన్స్ కి సరిపోనూ రాసే కవితల్లో శ్రీ శ్రీ గారి ప్రభావం ఉండేది. అలా మళ్లీ చిన్నగా కవితలు (నేననుకున్నాలెండి కవితలని) రాయడం మెుదలైంది.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..  
    

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner