3, జూన్ 2020, బుధవారం

రెక్కలు

1.  కొందరు
అంతే
తేనె పూసిన
కత్తులు

నాటకాల
రాయుళ్ళు..!!

2.   ఆచరించని
నీతులు
చెప్పేవి మాత్రం
ఆణిముత్యాలు

నేతిబీరకాయలో
నెయ్యి చందాన..!!

3.  మాట 
జారితే
మనసు
విరిగిపోతుంది

సరి చేయలేని
తప్పిదమిది..!!

4.  శరము 
సూటిగా తాకుతుంది
మాట విరుపు
మనసును చంపేస్తుంది

గాయం
నయం కాదు..!!

5.   చిన్న మాటే
మనసుని తెలుపుతుంది
బంధాన్ని
బలోపేతం చేస్తుంది

గతజన్మ 
అనుబంధం..!!

6.  ఆరాటం
మనిషిది
ఆశయం
మనసుది

సంఘర్షణ 
జీవితానిది...!!

7.   జ్ఞాపకాలుగా 
మిగిలిపోతాయి
గతమైన
క్షణాలన్నీ

కాలం
మౌన సాక్షి...!!

8.  సాక్ష్యం 
బెదిరిపోదు
మసను
మౌనం వహించినా

కాలమే
సమాధానం...!!

9.   బంధం
వదలలేనిది
మనసు
ఏకాకి

శూన్యం
అనంతం...!!

10.   (అ)సహజ లెక్కలు
లాభాన్ని చూపిస్తాయి
అసలైన వ్యక్తిత్వం 
స్వభావాన్ని తెలుపుతుంది 

జయాపజయాలను
కాలం నిర్ణయిస్తుంది...!!

11.  బానిసను
అయ్యాను
మనసు
చంపుకుని

విధి చేతిలో
కీలుబొమ్మను...!!

12.   ఎక్కే
మెట్లు
దిగే 
మెట్లు

ఒడిదుడుకుల
జీవితమిది..!!

13.  అంతర్వాహిని
మనసు
అక్షరాలు
ఆత్మీయ నేస్తాలు

మౌనాన్ని 
తర్జుమా చేసేస్తూ..!!

14.  శిలగా మారింది
మనిషే
ముక్కలైన మనసు
తనదయ్యాక

ఆటుపోట్లు 
కడలి అంతరంగాలు...!!

15.  చెక్కడంలో
ఓర్పు
తీర్చిదిద్దడంలో
నేర్పు

శిల్పి
మనోభావాలు...!!

16.   మనసు
కనబడదు
మౌనం
వినిపించదు

అర్థం చేసుకోవడమే
జీవితం...!!

17.  వెన్నెలను వెదుకుతుంది
మనసు
వేకువ పిలుపులో
ఊరడిల్లుతూ

గాయాలను
అక్షరాలకు అద్దాలనుకుంటూ..!!

18.  అహంకారం
ఇంటిపేరు
అధికారం
లభ్యం

లక్ష్యం లేని ప్రయాణం
నిరుపయెాగం..!! 

19.   మాటల్లో
ఒలకబోసేది
చేతల్లో 
చూపించలేనిది

నేతిబీరకాయలో
నెయ్యి వంటిది..!!

20.   అక్షరాల
అమరిక
పదాల 
పొంతన

తీరైన
రచనగా మారుతుంది..!!

21.  మనసు పొరల్లో
జ్ఞాపకాలు
కనుల కొలనులో
కన్నీటి తడి

జీవితానుభవాలెన్నో
గుప్పెడు గుండెకు...!!

22.   కెంపులు
కన్నుల్లో
ముత్యాలు
నవ్వుల్లో

నవగ్రహ రత్నాలు
జీవితానికి...!!

23.   కొందరిని చూసి 
ఎలా బతకాలో తెలుస్తుంది 
మరి కొందరిని చూస్తే 
ఎలా బతక్కూడదో తెలుస్తుంది

కాలం
ఎప్పుడూ నేర్చుకోమంటూనే ఉంటుంది..!!

24.   గతాన్ని విడువలేని
మనసు
గాయాలను చెరపలేని
కాలం

అక్షరాలకు అలవాటైన
సాన్నిహిత్యం...!!

25.   అనునయాల
అచ్చట్లు
ఆలంబనల
ముచ్చట్లు

చెంత చేరిన
జ్ఞాపకాలు..!!

26.   మనసు 
అంతర్మధనం
మనిషి
అంతరంగం

మౌనం గుట్టు
అక్షరాలకెరుక...!!

27.   అక్షరాలకు
అంతుచిక్కని రాతిది
చదవలేని
లలాటలిఖితమిది

దోబూచులాటలో
విధాత లిపి...!!

28.   ఆడక 
తప్పదు
ఓడిపోతామని
తెలిసినా

జీవిత 
కాల చక్రభ్రమణంలో..!!

29.   మనసో 
మాయాదుప్పటి
ఆనవాళ్ళేమి
అగుపడనీయకుండా

అంతరంగం
అందని జాబిల్లి...!!

30.   ఆత్మస్థైర్యానికి
అతిశయమే మరి
అనుబంధాలు
అభూతకల్పనలని తెలిసాక

నటనానుభవం లేదు
మనసున్న మనిషికి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner