21, జూన్ 2020, ఆదివారం
'ఘనుడు నాన్న - త్యాగధనుడు నాన్న'
అమ్మతనానికో నిండుదనం ఆపాదించే
సూక్ష్మకణ నిర్మాణానికి సారథితడు
కనుపాపలకు కనురెప్పగా మారి
కావలి కాసేటి కాపరివాడు
మనసుకు గాయలెన్నౌతున్నా
మౌనంగా భరించే మౌనముని ఇతడు
అందరిలో తానొంటరౌతున్నా
తనవారి కోసమే ఈ తాపసుడు
అనుబంధాలకు వారధిగా
అనుక్షణం శ్రమించే నిరంతర శ్రామికుడు
నడకతో నడత నేర్పి
భవితకు బంగరు బాటలు వేసే బాటసారితడు
బాధ్యతలకు బానిసగా మిగులుతూ
ప్రతిఫలమాసించని ప్రగతిశీలుడితడు
తరాల తలరాతను మార్చేది తానైనా
అంతరాల అహాలను అధిగమించే ఆత్మయెాగితడు
ఘనత తనదైనా బిడ్డల భవితకై పరితపించే
పునాదిరాయి ఈ నిలువెత్తు త్యాగధనుడు...నాన్న...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి