1, జూన్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...4

          చిన్నప్పటి నుండి పుస్తకాలతో పాటుగా సినిమాలు చూసే అలవాటు కూడా ఉండేది. చిన్నప్పటి నుండే నాన్న హింది, ఇంగ్లీష్ సినిమాలు కూడా చూపించేవారు.మాటలు అర్థం కానప్పుడు అడిగితే విసుక్కోకుండా చెప్పేవారు. ఇక రేడియోలో లలిత సంగీతం, సామూహిక గేయాలు, ఆదివారం మూడింటికి వచ్చే నాటకం, వివిధ భారతి, జనరంజని వంటివి అన్నీ వినడం, ఆ పాటలు నేర్చుకోవడమెా అలవాటు అప్పట్లో. వాటి కోసం ఓ పుస్తకం కూడా స్పెషల్ గా పెట్టి పాటలన్నీ రాసుకునేదాన్ని. బయట వేరే వాళ్ళ దగ్గర కూడా నచ్చిన జానపద గీతాలు నేర్చుకునేదాన్ని. మా గోపాలరావు అన్నయ్య నాకు మూడేళ్ళ వయసప్పుడు హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనే ఇచ్చిన స్కైబ్లూ కలర్ పానాసానిక్ రౌండ్ రేడియో చాలా సంవత్సరాల వరకు నాకు మంచి నేస్తమే. 
    పాటలు వింటున్నప్పుడు అనిపించేది ఇంత బాగా ఎలా రాయగలుగుతున్నారో అని. ఇప్పటికి నాకు ఆశ్చర్యమే కొన్ని పాటలు వింటున్నప్పుడు. ఎలా తడతాయా ఆ పదాలు అని. జీవన పోరాటం లో కొన్ని పాటలు అప్పట్లో మా దేవికి రాసిన ఉత్తరాల కవితలకు ఇన్స్పిరేషన్. సిరివెన్నెల సినిమా చూసాక సిరివెన్నెల గారి సాహిత్యానికి అభిమానినైపోయాను. శ్రీ శ్రీ గారు, వేటూరి గారు, ఆత్రేయ గారు, అనంత శ్రీరాం గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు, చంద్రబోస్ ఇలా ఎంతోమంది పాటల సాహిత్యంలో తెలుగుభాషలోని తీయదనాన్ని ఆస్వాదించడం ఓ వ్యాపకమైపోయింది. పుస్తకాలు చదవడమే కాకుండా పాటలు వినడం కూడా మనకు మన తెలుగు భాషలోని అందాన్ని, పదాల విరుపుల సోయగాన్ని తెలుపుతుంది. 
        రామాయణం, భారతం, భాగవతం, శ్రీ వేంకటేశ్వర కళ్యాణం, పంచతంత్రం, అక్బర్ బీర్బల్ కధలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఇంకా ఏవేవో సాహస యాత్రల కథలు, గౌతమ బుద్ధుని గురించి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, తెనాలి రామకృష్ణ కథలు ఇలా చదవని పుస్తకాలు అప్పట్లో లేవనే చెప్పాలి. వేసవి శలవల్లో పిల్లలందరం మా డాబా పైకి చేరేవాళ్ళం. మా డాబాకి అప్పట్లో మెట్లు లేవు. నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాలి. పగలైతే వెనుక గోడలెక్కి పైకి వెళిపోయేవాళ్ళం. వెన్నెల్లో డాబా మీద పడుకుని అందరు తలా ఓ కథా చెప్పాలని వంతులు వేసుకునే వాళ్ళం. మళ్ళీ దానిలో కూడా రూల్స్. అందరికి తెలిసిన కథలు చెప్పకూడదన్న మాట. మరో మాట ఎవరికి చెప్పకండి పేకాట కూడా ఆడుకునేవాళ్ళం. సరదాకే లెండి, డబ్బులకి కాదు. బోలెడు ఆటలు కూడా ఆడుకునే వాళ్ళం. బాల్యం ఓ అందమైన గతం నాకు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner