5, జూన్ 2020, శుక్రవారం

చినుకు తాకిన నేల సమీక్ష..!!

చినుకు తాకిన నేల సమీక్ష...!!

             మనసున్న మనిషి తపనే ఈ " చినుకు తాకిన నేల " అక్షర సవ్వడి...!! 

         భావుకత్వమంటే తనకు చాలా మక్కువంటూ, మనసు పలికిన భావాలను బహు సున్నితంగా తన అక్షరాలతో లాలించిన కవయిత్రి శాంతి కృష్ణ. ఈవిడ తన పదిహేనవ ఏట నుండే కథలు రాయడం మెుదలు పెట్టిన రచయిత్రి కూడానూ. చదవడం, రాయడం నిత్య వ్యాపకమీవిడకు. చక్కని సమీక్షకురాలు కూడా. ఎన్నో సత్కారాలు, బిరుదులు పొందిన శాంతి కృష్ణ ముఖ పుస్తకంలో అందరికి సుపరిచితురాలే. ఈ సాహితీ పిపాసకురాలి కలం నుండి వెలువడిన కవితా సంకలనమే " చినుకు తాకిన నేల ".
        తొలి గురువు అందరికి అమ్మ అంటారు చాలామంది. కాని శాంతి తన తొలి గురువు నాన్నంటూ, నాన్న కఠిన అంక్షలు పెట్టినా తన మంచి కోసమేనని, సద్బుద్దిని బోధించి, మంచి నడవడిని నేర్పిన నాన్నే తన ఆది గురువని చక్కని భావాలను తొలి కవితలో అందించారు. సంద్రం పిలుపు కవితలో ముసురు పట్టిన సమయంలో సముద్రాన్ని వర్ణిస్తూనే, మరోపక్క 
" సూరీని కబురు లేక
   సంద్రం పిలుపు లేక

   బెస్తపల్లె ముడుచుకున్న 
   గువ్వలా ఉంది నేడు... 
    దిగులు గుప్పెట్లో ఒదిగిపోతూ..!! " అంటూ మత్స్యకారుల కష్టాలను చక్కని, చిక్కని భావాలతో ఈ కవితలో వాన చినుకుల్లా ఒంపేసారు. మెుగలి రేకులు కవితలో చేతి చప్పట్లతో చెప్పే జీవిత సత్యాన్ని, గుండె గాయాలకు లేపనమద్దుతూ, అర్ధ నారీశ్వరుల అసలు గాథను " గరుకు మేనిపై పరిమళాలద్దుతున్న మెుగలి రేకులమంటూ " వారి మనసు చప్పుడును అక్షరాలుగా మనకు వినిపించారు అద్భుతంగా. తన ఆశలకు రూపమిచ్చి సరికొత్త బంగారు లోకాన్ని చూడాలని ఉంది అంటారు మరో కవితలో. మైత్రీ వనపు వనమాలికి తన భావోద్వేగాలను తెలియపరుస్తారు వనమాలి కవితలో. 
         సమాజంలో రోజూ జరిగే సంఘటనలకు అక్షర రూపమిస్తే అవే రేపటి పువ్వు, మృగాడు, ఓ అమ్మ, చిట్టి తల్లి, ఆడపిల్లా ఆశపడకు, ఆహ్వానం, పగిలిన మనసుల నవ్వులు, అందరూ మరిచిపోయిన గూడు రిక్షా, అడవిని నాశనం చేయవద్దని వైధవ్యం కవిత, నీ విజయం, పుడమి తనయుడు వంటి కవితలవుతాయి. ఇవన్నీ చక్కని సందేశాత్మక కవితలు. చదివిన ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తిస్తాయనడంలో ఎట్టి సందేహమూ లేదు
           తన మనసు ముచ్చట్లను ప్రియ సఖితోనూ, పుత్తడిబొమ్మ అందాలను వర్ణించడంలోనూ,  కనిపించని పల్లెను వెదుకుతూ ఆ పల్లె జ్ఞాపకాలను అందంగా నా పల్లె కవితలో పంచుకుంటారు. మనలో నిద్ర పోతున్న మానవత్వాన్ని తట్టి లేపి అనాధ పిల్లలకు ఆసరాకమ్మంటూ "చినుకు తాకిన నేల " కవితలో పిలుపునిస్తారు. కథలు, కవితలతో అన్నార్తుల ఆకలి తీరదు, మన అక్షరాలు ఆ పసిపిల్లల కంచంలో ఓ ముద్దగా కూడా మారవు. చిన్న సాయమైనా చేసి వారి నవ్వుల్లో ఓ వెన్నెల వాగు అవుదామంటారు. 
           స్నేహం గురించి, రాఖీ గురించి, బోనాలు, నందివర్ధనం, తంగేడు, చీకటి రాత్రి, వెన్నెల , స్నేహం, హృదయం, ఒంటరితనం, ప్రకృతి అందాలు, మరలిరాని స్వప్నాలు, అమ్మ గురించి, ప్రతిరూపం గురించి, అనుబంధాల గురించి, వానా, వసంతా గురించి, ప్రపంచం, ప్రపంచ శాంతి గురించి, సైనికులు గురించి, తెలుగు భాష గురించి, వెచ్చని తడిని, ఆశల చివుళ్ళను, పూల దొంతరలను, ప్రేమను, నేటి విద్యార్థి గురించి, ఆయువు, ధీర వనిత,  హేతువుల గురించి రాయడమే కాకుండా పనిలో పనిగా  సూరీనికి ప్రేమలో కూడా రాసేసారండి ఈవిడ. అడవిని అమ్మతో పోల్చి మరో కవిత రాశారు. ఆమె కలం ఏమనుకుంటోందోనని చెప్తారు ఓ కవితలో. రవీంద్రుని గీతాంజలికి, దామెాదరం సంజీవయ్యకు,గిడుగు గారికి అక్షరాంజలి ఘటిస్తూ...తెలుగు వెలుగు  ఘనతను, తెలుగు జాతి గౌరవాన్ని తన అక్షరాల్లో అద్భుతంగా చూపించారు. ప్రతి చిన్న విషయాన్ని తనదైన శైలిలో చక్కని అభివ్యక్తితో కవితలు చదివే అందరి మనసులను ఆకట్టుకునేటట్లుగా రాశారు. 
           చక్కని భావాలతో, వాటికి తగిన అర్థవంతమైన పదాలతో, నిండైన తెలుగు భాషకు మరింత నిండుదనమిస్తూ, సమాజ అభ్యున్నతికి సాహిత్యంతో పాటుగా మానవత్వమూ అవసరమని సూచిస్తూ 70 కవితలతో వెలువరించిన ఈ కవితా సంపుటి " చినుకు తాకిన నేల " కు హృదయపూర్వక అభినందనలు... 

మంజు యనమదల
విజయవాడ. 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner