6, జూన్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా...13

పార్ట్.. 13

      ఇండియానా యూనివర్శిటీలో MS చేసే పిల్లలు అందరు కలివిడిగానే ఉండేవారప్పుడు. గోవర్థన్ రూమ్ లో విజయ్, ఇంకో అతను ఉండేవారు. వీళ్ళ క్లాస్మేట్ ఓ అమ్మాయి పేరు శ్వేత అనుకుంటా. తను చాలా మంచి అమ్మాయి. నాతో ఎక్కువ క్లోజ్ గా ఉండేది. పిల్లలు అందరు నన్ను బాగా చూసుకున్నారు. గోవర్థన్ కి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తెలుసు. బాబి అని  మా చిన్నప్పటి క్లాస్మేట్ అమెరికాలోనే ఉన్నాడని, తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడో 88 లో చూసాను. సరే కాని గుర్తు పడితే మాట్లాడదాం లేదంటే లేదని ఫోన్ చేసా. హమ్మయ్య గుర్తు పట్టాడు బాబి. తన కబుర్లు చెప్పి, నా గురించి అడిగాడు. అలా మా చిన్నప్పటి స్నేహం మళ్ళీ కలిసిందన్నమాట. ఇండియానా లో వీళ్ళున్నది టెర్రాహట్ అన్న ఊరు. ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయేమెానని చూశాను. ఈ HNC వాడు నాకు H1B వీడి కంపెనీకి మార్చలేదు. నరసరాజు అంకుల్ నేను జాబ్ లో ఉన్నప్పుడు GIS వాళ్ళు వాళ్ళ H1B కాన్సిల్ చేసుకోవచ్చా అని అడిగితే వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటానన్నాడని చెప్తే GIS వాళ్ళు ఆ H1B కాన్సిల్ చేసుకున్నారు. అందుకని నాకిప్పుడు స్టేటస్ కూడా పోతుంది. వెంటనే వేరే ఎవరితోనైనా H1B ఫైల్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ అందరిని అడగడం మెుదలు పెట్టాను. మెుత్తానికి ఎవరి వల్లా కాలేదు. అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. నా క్లాస్మేట్, మద్రాస్ లో నా కొలీగ్ అయిన సుబ్బారెడ్డికి మెసేజ్ చేస్తే, తను మా జూనియర్ శ్రీనివాస చౌదరికి చెప్పాడట. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఉందని వాళ్ళతో మాట్లాడమని నెంబర్ ఇచ్చారు. అమెరికన్ సొల్యూషన్స్ సుబ్బరాజు ఇందుకూరికి ఫోన్ చేసి మాట్లాడాను. H1B చేస్తామని, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ లోపల మా ఆయనకు తెలిసిన వారు ఉన్నారని వాళ్ళతో మాట్లాడమంటే, వాళ్ళేమెా MS చెయ్యి ఓ సెమిస్టర్ వరకు నేను చూసుకుంటానన్నారు. లేదండి H1B చేయించుకుంటానని చెప్తే, ఆ డబ్బులు తను పంపిస్తానని చెప్పారు. ఆయన పేరు రామస్వామి యనమదల. నేను ఈయనను ఇండియాలో ఓసారి కలిసాను జాబ్ కోసం. రఘుబాబు పోతిని పేరుతో పాటు ఈ ఇందుకూరి సుబ్బరాజు, రామస్వామి యనమదల పేర్లు బాగా గుర్తుంచుకోండి. 
           నాకేమెా ఖాళీగా ఉండటానికి ఇష్టంగా అనిపించలేదు. నా ఫ్రెండ్ వినికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే తను వేరే జాబ్స్ ఉంటాయేమెా చూస్తానని, బేబి సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయని ఆ వివరాలు చెప్పడం, వాటిలో ఓ రెండు నెంబర్లకి కాల్ చేయడం, నార్త్ ఇండియన్ వారు 1500 డాలర్లు ఇస్తాం రమ్మని చెప్పారు. మరొకావిడ తెలుగావిడ,డాక్టర్. రెసిడెన్సీ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి అడిగారు. వాళ్ళాయన కూడా డాక్టర్. వేరే చోట ఉంటారు. లండన్ నుండి వచ్చారనుకుంటా. 1200 డాలర్లు ఇస్తానన్నారు. సరే అని ఉమతోనూ, వినితోనూ ఆలోచించి డాక్టర్ గారి దగ్గరకు వెళడానికి సిద్ధపడ్డాను. గోవర్థన్ కి చెప్పాను ఇదంతా. తనకి కార్ లేదు, కార్ రెంట్ కి తీసుకుని తను,  విజయ్ వచ్చి పంపిస్తామన్నారు. మర్చిపోయా నేను వెళ్ళాల్సిన ఊరు పిట్స్బర్గ్. పెన్సల్వేనియా స్టేట్. అదేనండి అమెరికాలో బాగా ఫేమస్ అయిన మన వేంకటేశ్వర స్వామి గుడి ఉన్న ఊరన్నమాట. ఉమా వాళ్ళు ఉండేది ఒహాయెాలో. వాళ్ళు పిట్స్బర్గ్ మేము పంపిస్తాము, గోవర్థన్ వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చేయమని చెప్పమన్నారు. పాపం పిల్లలు ఉమావాళ్ళ దగ్గర దిగబెట్టారు. అక్కడ ఓ వారం రోజులున్నాక, ఉమ,సురేష్ పిట్స్బర్గ్ వచ్చి, నన్ను గుడికి తీసుకువెళ్ళారు. అక్కడ మా గోపాలరావు అన్నయ్యా, వదిన కనిపించారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వదిన మేనమామ కొడుకు శీను అన్న కూడా కనిపించాడు. తర్వాత నన్ను డాక్టర్ గారి ఇంటిలో వదిలేసి, ఉమావాళ్ళు వెళుతుంటే బాగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళిద్దరు వెంటనే " నీకెప్పుడు ఉండాలనిపించకపోతే అప్పుడు చెప్పు. మేం వచ్చి తీసుకువెళిపోతాం " అని, డాక్టర్ గారికి కూడా జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళిపోయారు. డాక్టర్ గారికి పాప, బాబు. పాప 4,బాబు కిండర్ గార్డెన్. పాప స్కూల్ మేం ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగానే. బాబు స్కూల్ కొద్దిగా పక్కన. డాక్టర్ గారు 6 గంటలకు డ్యూటీకి వెళిపోవాలి. పాపకి  8 కి, బాబుకి 11కి స్కూల్. స్కూల్ కి పంపడం, తీసుకురావడం, వాళ్ళను డాక్టర్ గారు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవడం నా పని. నాకో రూమ్, వాళ్ళ ముగ్గురికి ఓ రూమ్. 

మళ్ళీ కలుద్దాం.. 




0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner