7, డిసెంబర్ 2015, సోమవారం

కువైట్ ఎన్నారైస్ లో...!!

http://kuwaitnris.com/?p=150048

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు కువైట్ ఎన్నారైస్ ఆన్లైన్ పత్రికకు నా పుస్తకం " అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు" గురించి రాసిన మాటలు పై లింక్ లో మీరు చూడండి... మనఃపూర్వక ధన్యవాదాలు ప్రతాప్ గారు ..

4, డిసెంబర్ 2015, శుక్రవారం

అక్షయ తూణీరం లా...!!

మంజు యనమదల గారికి ,
నమస్తే . మీ పుస్తకంపై నా అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నాను . 
అక్షయ తూణీరం లా మీ అక్షర సముదాయం 
అంతర్లీనంగా మనసు ప్రకంపనాన్ని 
బహిర్గతం చేసిన ఉత్తమ గేయకావ్యం 
సున్నితమైన మనస్సు ప్రతి అవరోదానికీ పడే బాధ 
ప్రతి కవితలో తొంగి చూస్తుంది 
ఆలంబననూ అనురాగాన్నీ కోరే 
స్వచ్చమైన స్ఫటికపు మది 
ప్రతిపదంలో ప్రతిఫలిస్తోంది 
మనసుపొరల్లో నిక్షిప్తమైన 
గాయాలే గేయాలుగా మారినై 
చీకటినుండి వెలుతురుకు 
ప్రయాణించే మనసుకద 
కనిపిస్తోంది అంతర్లీనంగా  మీ కవితల్లో 
మనోభావాల అలజడితో 
స్పందించే హృదయవేదన 
ధ్వనిస్తోంది రసావిష్కరణ తో . 
--------------------------------
సోదరుడు -భవభూతి శర్మ

3, డిసెంబర్ 2015, గురువారం

ఏక్ తారలు....!!

1. వెన్నెల వేసారింది_చీకటి పరదాలో నీ వెలుగులకై వెదకలేక
2.  వెన్నెలను విరజిమ్ముతున్నా_వేకువ  పొద్దులో నీ కోసమై
3. వెన్నెల తుణీరాల అలజడి మదికెరికైంది_నీ ప్రేమలో తడిచి
4.  జ్ఞాపకమై అలరించింది_గతాన్ని మరువనివ్వని గాయం
5. పగటి  కలైనా_ప్రాతఃకాలపు తలపుల్లో నిన్నువరిస్తూ
6. నీ గెలుపు వీక్షించాలని నిరీక్షిస్తున్నా_ఓటమిని వద్దని వారిస్తూ
7. అమాస అలికిడే లేదు_పున్నమి వాకిట్లో నీ తలపులు నావైతే
8. మలి సంధ్య మాయమైంది_వేకువ కిరణాల్లో నిన్ను చూపిస్తూ
9. మౌనమైన మనసు భావనలు_దాయలేని కన్నీటి సాక్ష్యాలుగా
10. పండు వెన్నెలే ప్రతి క్షణమూ_పక్కుమని నీ నవ్వులు వినిపిస్తుంటే
11. బాధ్యతలను వీడలేని బంధాలు_ మది బరువైన క్షణాల్లో
12. మది అరల్లో నిక్షిప్తాలు_జ్ఞాపకాల నిధులు
13. విరహం కనుమరుగైంది_వెన్నెల వాకిట్లో నిన్ను చూసి
14. నాకు ఇష్టం_నీ మౌనం నాతొ మాట్లాడటం
15. తగవులకు తావే లేదు_మౌనం మనసుతో మాటాడేటప్పుడు
16. నాకు అపురూపం_నేను నీ మౌనమైనప్పుడు
17. పిలుపులకు పండగే_పెదవులు నా పేరే పిలుస్తున్నప్పుడు
18. మౌనమూ మాటలు కలిపింది_నిన్ను కలిసిన సంతసంలో
19. నెయ్యానికి అలంకారాలు_ఆప్యాయతల విందులు
20. మనసు పడిన ప్రేమ_మధుర జ్ఞాపకంగా
21. స్వాతి చినుకునై చూస్తున్నా_మేలిముత్యంగా నీలో ఒదగాలని

2, డిసెంబర్ 2015, బుధవారం

డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సమీక్ష అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు పై...

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ's photo.ఆప్యాయత తో పంపిన శ్రీమతి మంజు గారి కవిత్వం పుస్తకం (అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదు )చదివాను . కొత్త ఒరవడి కవిత్వం ... అన్ని కవితలు చాల బాగున్నాయి .. మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను ... ధన్యవాదములు
అక్షరాల సాక్షిగా ... గెలిచారు
------------------------------
నిజమే ! ఆమె కవిత్వం లో గెలిచారు ... మనసు పై గెలిచారు ... అక్షరాల సాక్షిగా మంజు గారి కవిత్వం గెలిచింది . కవిత్వం మనసు లోతుల్ని తట్టి చూపిస్తుంది . మనసు లోతులను తవ్వి చూపిస్తుంది ... తట్టి లేపుతోంది .. అదే మంజు గారి || అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు || కవిత్వం . నా అనే భావన మెదడు తెరపై చిత్రం లా కనిపించేట్టు ప్రతి కవితా ఊహా జనితంగా ఉన్న్నాయి . కొన్ని కవితల్లో ప్రతి ఒక్కరు
(స్వా )గత చిత్రాలను నెమరు వేసుకోక తప్పదు
"అలసిన గుప్పెడు గుండె ఆరాటం
ఆగిన మెదడు పోరాటం "
వంటి మంచి లయాత్మక వాక్యాలు పాఠకుడి ని ఆలోచింప చేస్తాయి . మెదడులో నిత్యం జరిగే ఆలోచనలు, ఆకర్షణలు , ఘర్షణలు , ఆవేశాలు ఒకదానికొకటి పెనవేసుకున్న సంఘటనలను చెప్పడం జరిగింది . అందుకే కాబోలు "గెలుపోటముల రెక్కలు ఎక్కడో ?" అని ప్రశ్నిస్తారు . మనసు - మనిషి .. ఈ రెండింటి మధ్య మానసిక సంఘర్షణలను బేరీజు వేసి కవిత్వం చెప్పడం లో మంజు యనమదల గారు ప్రసంశ నీయులు .
ఈ అక్షరాల ..... కవితలో
"సగం ఎండిన వేపచెట్టు నీడలో సేద తీరుతూ
గతించిన జీవితం రాల్చిన కన్నీటి చె మ్మలో వేదించే మదికి
వేకువ పిలుపులో తొలి పొద్దు సంతకాలు ... జ్ఞాపకాలు "
నిజంగా మంచి రసాత్మక వాక్యాలు అందించగలిగారు . అద్బుతంగా కవిత్వాన్ని మలిచారు .
"మూసుకున్న ఆ రెప్పల మాటున
ఒలుకుతున్న భావాల ఒరవడి
జారుతున్న కన్నీటికి సాక్ష్యం (అంతర్ముఖం )
కళ్ళల్లో సజీవ సాక్ష్యాలన్నీ రెప్పల మాటునే దాచుకున్న బాధలతో ఒక వేదన చెప్పగలగడం ఒక మానసిక విశ్లేషణకు అడ్డం పడుతోంది .
"అక్ష రం ఏడుస్తోంది ...
మనసు భావాలకు రూపాన్ని చెక్కే శిల్పి
చేతిలో ఉలి తానైనందుకు' .. అక్కడక్కడ కవితల్లో నిరాశ , నిస్పృహలు కనిపించిన అవి మనసు పడే ఆవేదనగా చెప్పవచ్చు
"ఏకాంతం లో నాకు నేనుగా ... ఇష్టంగా !"
నిజమే శిధిల జ్ఞాపకాలు చిద్రమైతే ఒంటరితనం కూడా ఇష్టం గా మార్చుకోక తప్పదు . ఇలా ఎన్నో కవితలు మనసు తలుపు తెరిచి చూపిస్తాయి .
మంజు గారు మంచి మనసున్న మనసు కవి "" అక్షరాల సాక్షిగా
నేను ఓడిపోలేదు "కవిత్వం ఒక సైకాలజీ ఎనాలసిస్ కూడా !. అందుకే ఆమె అక్షరాలకు ఓటమే లేదు. నిత్యం కవిత్వం లో మంజు గారిదే గెలుపు .
అభినందనలు
- డాక్టర్ కత్తిమండ ప్రతాప్ 

మనఃపూర్వక కృతజ్ఞతలు ప్రతాప్ గారు .. ఒక మెచ్చుకోలు కరువైన ఈ రోజుల్లో మీ అభిమానానికి మాటలు రావడం లేదు .. నేను చాల అదృష్టవంతురాలిని .. మీ వంటి పెద్దల రాతల్లో నా కవిత్వం కనిపించినందుకు .. _//\\_

1, డిసెంబర్ 2015, మంగళవారం

దాటేయాలని ప్రయత్నిస్తున్నా...!!

అంపకాల పంపకాలు
నిన్నో మొన్నో అయినట్లున్నా
పారాణి అడుగుల ఆనవాళ్ళు 
అక్కడక్కడా ఎండి కనబడుతున్నా
పచ్చని తాటాకు పందిరి
కాస్త వడబడి రంగు తగ్గినట్టున్నా 
పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు
ఎక్కడివాళ్ళక్కడ సర్దుకుంటున్నా
గుండె గదిని ఖాళి చేయని
నీ జ్ఞాపకాల గుభాలింపులన్ని తరుముతూనే ఉన్నా
వాస్తవాలను వాయిదా వేయలేని
మనసుపై గీసిన అసంపూర్ణ చిత్రంగా మిగిలున్నా
మదిపై  రాసిన మరణ శాసనాన్ని
వదలలేని గతాన్ని దాటేయాలని ప్రయత్నిస్తునే ఉన్నా...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner