10, డిసెంబర్ 2021, శుక్రవారం

జీవన మంజూష జనవరి 2022

​నేస్తం,

          ఈ ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం. మహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందో గమనించండి. తనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధి చేయమన్నాడట. దాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదా. ఎంత సంపాదించినా, విశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేము. ఉత్తి చేతులతో వెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకి వుంచి సమాధి చేయమన్నాడు. 

      మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయ పడుతూనే వుంటాం. అవసరాలకు డబ్బులు కావాలి. కాని మన అవసరమే డబ్బుగా మారిపోయింది ఈనాడు. ప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయింది. నైతిక విలువలు నశించి పోతున్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకుని మర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోంది. ఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్న అనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.

        ఒకే ఇంటిలో ఉంటున్నా, అపరిచితులుగా భార్యాభర్తలు, పిల్లలు మిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోంది? కుటుంబ సంబంధాలలోనా! ఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనా! లేదా మూలాలను మరచి, అందలాలను అందుకున్న మనిషి ఆలోచనలదా! ఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతిని సాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాం. కనీసం ఆ హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారు. ప్రపంచంలో ఎవరినో మనముద్దరించనక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగా మిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు. 

        ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తడబడి తడబాటుకు గురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమో, మనిషి సాయమో చేయగలిగితే చాలు కదా..!!


6, డిసెంబర్ 2021, సోమవారం

చీకటి మరకలు..!!

చీకటి మరకలు
చిత్తంలోనే
మగ్గుతున్నాయి

వెలుతురు నీడలో
వెంటాడే
క్రీనీడలకు చిక్కకూడదని

మబ్బుల మాటున
మనసును
దాచే ఆట మెదలయ్యింది

మౌనాన్ని ఆవాహన
చేసుకున్న
మాటలకర్థం వెదుకుతూ

ఓ పక్కన
చితిని పేర్చుతున్నా
భయమనిపించడం లేదు

చెంతనే
చిరునవ్వు తోడుగా
ఉన్నందుకనుకుంటా

గాయాలన్నీ
కాలిపోతాయని
ఎదురుచూస్తూంటే

ఆ గతపు మంటల నుండి
జ్ఞాపకాల నుసి
ఎగసిపడుతూనే వుంది

అక్కడక్కడా
రాలిన కన్నీటి చుక్కల
చెమ్మదనం ఇంకిపోలేదింకా

అక్షరాలకంటిన తడి
అద్దాల మేడలకు 
తాకలేదని ఆలస్యంగా తెలిసింది..!!

5, డిసెంబర్ 2021, ఆదివారం

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

3, డిసెంబర్ 2021, శుక్రవారం

రెక్కలు

1.  వదులుకోలేనిది
బలహీనత
తర్కానికి అందనిది
నమ్మకం

ఇహము పరము
తెలుసుకునేది మానవజన్మ..!!

2.  ఉలి దెబ్బలు
భరించాలి
రాతికి
రమణీయత రావాలంటే

నేర్పరితనమంతా
మలిచే తీరుదే..!!

3.   అన్నీ 
ఆశల సౌధాలే
కాసులతో
నిర్మితమిప్పుడు

జీవిత తులాభారమంతా
ధనతూకమే..!!

4.  చెంపదెబ్బ
మాసిపోతుంది
మనసుదెబ్బ
చితి మీద కూడా కాలదు

హింస
పలురకాలు..!!

5.  పరిమితంగా
కొన్ని
అపరిమితమైనవి
మరికొన్ని

అమ్మ దెబ్బల్లో ప్రేమ
తెలియనిదా..!!

6. ముసుగు పేరు
ఆధునికత
మనిషి తీరు
అనాగరికం

పరిజ్ఞానం బట్వాడా అయినది
పరాయితత్వం నుండి..!! 

7.   ప్రశ్నలతోనే
సమస్యలు
బాధ్యతనెరగని
హక్కులు

వితండవాదంతోనే
వింతపోకడలు..!!

8.   అణువే
ఆది అన్నింటికి
ఆకాశానికైనా 
అవనికైనా

దూరానికి 
కొలమానమెప్పుడూ దగ్గరతనమే..!!

9.  మారుతున్నవి
మానవ సంబంధాలే
అనుబంధాలకు
అడ్డుగోడలు కడుతూ

చుట్టరికాలెలా వున్నా
కాలంలో మార్పులేదు..!!

10.   ఓడిపోయేవి
కొన్ని
ఊరటనిచ్చేవి
మరికొన్ని

ఆటేదైనా
నైజమదే..!!

11.   రూపం లేనిది
మనసు
ఉనికి కోసమే
ఆరాటం

మనసు మనిషి మధ్యన
పోరాటమే జీవితం..!!

12.  యుద్ధమేదైనా సరే
సిద్దమే
చాటుమాటుతనం
అలవాటు లేదు

గెలుపోటములు
అక్షరాలకు అంకితం..!!

13.   ఏకపక్షం
కాదేదీ
ఏ జట్టుదైనా
గెలుపే లక్ష్యం

జీవితంలో
ఏ అటైనా..!!

14.   తల వంచని
స్థైర్యం
మెుక్కవోని
ఆత్మవిశ్వాసం

అక్షరాలకు మాత్రమే తెలిసిన
మనసు..!!

15.   ఎదురీతల
జీవితం
ఎడతెగని
అనుబంధాల నిలయం

అమ్మకు అక్షరానికి
ఎరుకైన పాశం..!!

16.   చిరునవ్వై 
సేద దీరుతున్నా
మౌనం
మనసు విప్పిందని

ఆత్మను
అక్షరం పరిపూర్ణం గావించిందని..!!

17.   కలతలు
కారణాలుగా మారుతున్నాయి
బాంధవ్యాలు
భారంగా మారుతున్నాయి

ధనానికి దాసోహం అంటోంది 
సమాజం..!!

18.    ఉచితానుచితాలు
ఆలోచించాలి
అయాచితంగా
మాట జారకూడదు

లాభం సంగతెలా వున్నా
అపాత్రదానం కూడదు..!!

19.   విభజన
ఊసెందుకు
నా నీ ఉనికి
ఒకటే అయినప్పుడు

మనమన్న మాట
మనసులో మెదిలితే చాలు..!!

20.   కలలన్నీ
కల(ల)‘వరాలే
వాస్తవాలన్నీ
వేకువ పొద్దులవే

అడుగులెటు పడినా
అంతిమ ఫలితం కాలానిదే..!!

21.   తల్లీబిడ్డల బంధం
తెచ్చిపెట్టుకుంటే వచ్చే పదవి కాదు
డబ్బుతో కొలవలేనిది
మమతనెరిగిన బాధ్యత

సంస్కారం
జన్మతః ప్రాప్తిస్తుంది..!!

22.   జ్ఞాపకాలన్ని
గత కాలానివే
చెరపలేని రాతలకు
సాక్ష్యాలుగా

భవితతో ముడిబడిన
వాస్తవం మనం..!!

23.   విసుగు
భరించవచ్చు
విరక్తి
రానివ్వకూడదు

మనిషికి 
జీవితానికి తెలియాల్సినవి..!!

24.   వీగిపోతున్న 
చుట్టరికాలు
కొలమానంగా మారిన
ధనము

మనిషితనానికి మిగిలిన
ప్రశ్నార్థకమీనాడు..!!

25.   నిరాశ
చుట్టమౌతోంది
ఆశ
ఆకాశం వైపు చూపెడుతోంది

అనుబంధాలు
ధనాత్మకమైపోతున్నాయి..!!

26.   వెలితి
తెలుస్తోంది
వెతలు
వెంబడిస్తుంటే

కాలం
నిర్వికారంగా సాగిపోతూనే వుంది..!!

27.    వెతలు
వెంటాడుతునే ఉంటాయి
బాధ్యతలు
బంధాలకు చిక్కుబడిపోయాయి

అవినాభావ సంబంధం
కాలానిది జీవితానిది..!!

28.   అనుభవాల
ఆటుపోటులే అన్ని
చిక్కుముళ్లను
విప్పుకుంటూ

భూమ్యాకాశాల కొసలను
కలిపే కాలయంత్రంలో..!!

29.   చుట్టరికానికి కొలమానం
ధన సంబంధం
మనిషితనానికి తూగేది
ఆత్మానుబంధం

కాలపు తక్కెడలో
తూకపురాళ్ళెప్పుడూ ఒకటే..!!

30.  కనబడే అబద్ధం
పొగడ్త
వినబడని నిజం
విమర్శ

కొలవలేని దూరం
రక్త సంబంధాల మధ్యన..!!

1, డిసెంబర్ 2021, బుధవారం

అవస్థ..!!

మనిషికి
మనసుకు 
మధ్యన అవస్థ

మాటకు
మౌనానికి
మధ్యన అవస్థ

బంధానికి
బంధనానికి
మధ్యన అవస్థ

ఆక్రోశానికి
ఆనందానికి 
మధ్యన అవస్థ

ప్రేమకు
ద్వేషానికి 
మధ్యన అవస్థ

అహానికి
ఆత్మాభిమానానికి 
మధ్యన అవస్థ

అక్షరానికి
పదానికి
మధ్యన అవస్థ

అనుభవానికి
సంఘర్షణకి
మధ్యన అవస్థ

చావుకు
పుట్టుకకు
మధ్యన అవస్థ

దూరానికి
చేరువకి 
మధ్యన అవస్థ

వ్యవస్థకి
వ్యక్తికి
మధ్యన అవస్థ

అర్థానికి
పరమార్థానికి
మధ్యన అవస్థ

ఆదికి
అంతానికి
మధ్యన అవస్థ

జీవితానికి
జీవించడానికి
మధ్యన అవస్థ..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner