10, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఏమైంది..?

  బాబుగారు,

                   ఏమైంది ఇన్నాళ్ళ మీ రాజకీయ అనుభవం? తమ్మక్కాయిలు ఉన్నారని తెలిసినప్పుడు కాస్తయినా జాగ్రత్తగా ఉండాలి కదా! పునాదులు వేసినప్పుడు మరొకడెవడూ దానిని పెకలించడానికి లేకుండా చేయాలి. అధికారం ఏం చేయగలదో తెలిసి కూడా మీరింత నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా రాష్ట్రానికి, తద్వారా మీకు, మాకు ఇన్ని సమస్యలు. ఒకప్పుడు మాది ఆంధ్రరాష్ట్రమని గర్వంగా చెప్పకున్న మేము ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో మీకే కాదు అందరికి తెలిసిన విషయమే. రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోవడానికి మీరూ కారణమే..కాదంటారా! 

          భవిష్యత్ తరాలు బావుండాలన్న ముందుచూపు మంచిదే. అదే సమయంలో ప్రస్తుత స్థితిగతులు, మన చుట్టూ ఉన్న వలయాలపై కూడా ఓ కన్ను వేసి ఉంచాలి కదా. ఎన్నికలకు ముందు నుండి మేము మెుత్తుకుంటూనే ఉన్నాము. మీ నిర్లక్ష్యానికి మూల్యం ఇప్పటి అంధప్రదేశ్. ప్రతి క్షణం అవమానాలు ఎదుర్కొంటున్న మీ మద్దత్తుదారులు. సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, అసలు సమస్య పుట్టకుండా చేయగల సత్తా మీకుందని నమ్మిన జనాలు, చాలా బాధ పడుతున్నారిప్పుడు. అధికారం కోసం ఏ దారులలోనైనా వెళ్ళగల ప్రత్యర్థులు ఉన్నారని మీకు తెలియదా! 

            మీరు చేసే మంచి ఎవరికి అవసరం లేదిప్పుడు. ఈ క్షణం మాకు గడిచిందా లేదా అన్న ఆలోచన మాత్రమే మాది. మేం సామాన్యులం. ఈ రోజు అమెరికా అవకాశాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయంటే కారణమెవరని మేం ఆలోచించం. ఎవరు రహదారులు వేసారన్నది అప్రస్తుతం మాకు. భవిష్యత్ తరాలు ఎలా పోతే మాకెందుకు? మేం ఇప్పుడు ఎలా ఉండాలన్నదే మాకు ముఖ్యం. ఎందుకంటే మూడు ముక్కలాటలు, మద్యం సిండికేట్లు…ఇలాంటివి మాకుంటే చాలు. ఇచ్చే వాటి లెక్కలే చూస్తాం కాని తీసుకునే వాటి లెక్కలు మాకెందుకు? 

          మేమింతే ఉంటాం. మమ్మల్ని బట్టి మీరుండాలి కాని మిమ్మల్ని బట్టి మేముండం. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడి సంగతి, పైవాడి సంగతి, పక్కవారి సంగతి మీకు తెలుసు. తెలిసి ఈ పరిస్థితి వచ్చిందంటే తప్పెక్కడో ఆలోచించండి. మాకు మంచి రోజులు రాకపోయినా పర్లేదు. చూపించే వేళ్ళ సంగతి చూడండి ముందు.


9, సెప్టెంబర్ 2023, శనివారం

ఎదురీత పుస్తక సమీక్ష..!!


                         కొందరికి  “ ఎదురీత “ గెలుపు బావుటా..!!

       ప్రతి మనిషి జీవితంలో ఆటుపోట్లు అనేవి సహజం. అలా అని విధికి ఎదురు నిలిచి జీవన పోరాటం సాగించి విజయ బావుటాలను ఎగురవేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎక్కడా రాజీ పడకుండా, సమాజానికి మంచి చేయాలన్న తలంపుతో ఏటికి “ ఎదురీదిన “ ఉన్నతుడు “ ఉన్నం వెంకటేశ్వర్లు గారు. కమ్యూనిజానికి సరైన అర్థం చెప్పిన సాహసి. వీరి సహచరి ఉష గారు కూడా ఉన్నం వెంకటేశ్వర్లు గారి  “ ఎదురీత “ లో సహ భాగస్వామి. అర్ధ నారీశ్వర తత్వానికి సరైన నిర్వచనం వీరిద్దరు. వీరిరువురిని ఇక్కడ ఇలా పోల్చకుండా ఉండలేక పోతున్నాను.

     శారీరక అంగ వైకల్యాలు ఏవి తాము నమ్మిన సిద్ధాంతాలకు అడ్డు గోడలు కావని ఉన్నం వెంకటేశ్వర్లు గారి జీవితాన్ని కాస్త చూసిన మనకు అర్ధమైపోతుంది. చిన్నతనం నుండే విధితో పోరాటం మెుదలు పెట్టి, కమ్యూనిజం భావజాలాలకు ఆకర్షితులై, చదువు, ఆటపాటల్లో మేటిగా ఉంటూ, సవ్యసాచిగా అందరి మన్ననలు పొందిన అనితరసాధ్యుడు. చిన్ననాటి నుండి జరిగిన ప్రతి చిన్న విషయాన్ని తనదైన శైలిలో వివరిస్తూ, సమాజ అభ్యున్నతికి  తాము చేసిన పనులను భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా అందించాలన్న సదుద్దేశ్యంతో “ ఎదురీత “ ను చాలా గొప్పగా ఆవిష్కరించారు. అసలైన కమ్యూనిజాన్ని, దాన్ని అమలు పరిచిన నాయకులను ఇలా ఆ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని నెనుపు చేసుకుంటూ, తాము అధిగమించిన కష్టనష్టాలను కూలంకషంగా వివరించారు. కొన్ని విలువైన ఫోటోలను కూడా అందించారు. 

   ఏదైనా ఒక సిద్ధాంతం రూపుదిద్దుకోవడానికి, జనంలోనికి వెళ్లడానికి వెనుక ఎంత శ్రమ, కఠోర దీక్ష అవసరమౌతాయో మనకు ఈ “ ఎదురీత “ చెబుతుంది. మన చుట్టూ ఉన్న ఎంతోమంది మానసిక వైకల్యమున్న వారికన్నా, ఉన్నం వెంకటేశ్వర్లు గారు ఉన్నతులు. సంకల్పం దృఢమైనదైతే ఏ శారీరక వైకల్యమైనా చేరాల్సిన లక్ష్యానికి అడ్డంకి కాదని వీరి జీవితం చెబుతుంది. మనసున్న ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకం “ ఎదురీత “.

అభిమానంగా పుస్తకం పంపినా, పుస్తకం చదివి కాస్త నా మాటలు రాయడానికి జరిగిన ఆలశ్యానికి ఉన్నం వెంకటేశ్వర్లు గారిని మన్నించమని కోరుతూ…వారికి ఆయురారోగ్యాలు పరిపూర్ణంగా కలహాలని కోరుకుంటూ, హృదయపూర్వక అభినందనలు..!

         

4, సెప్టెంబర్ 2023, సోమవారం

జీవన మంజూష 09/23


 నా వ్యాసాన్ని ప్రచురించిన నవమల్లెతీగ సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు..చదివి తమ విలువైన స్పందనలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు…


నేస్తం,

          కొన్ని బంధాలు దూరంగా వుంటేనే అందం. అలాగే మరికొన్ని దూరాలు దగ్గరగా రాకుంటేనే బావుంటుంది. ఇల్లంటే నాలుగు గోడలు, రెండు గుమ్మాలు, రెండు కిటికీలు, ఓ పైకప్పు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కాని ఆ ఇంటిలో ఉన్న జీవాల మధ్యన అనుబంధంపై ఆ ఇంటి విలువ ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోలేరు. మన వారసత్వాన్ని గొప్పగా మనం చెప్పుకోవడానికి కాకుండా, వారసులకు మనమేం పంచామన్నది మనం చూసుకోవాలి. మంచి వ్యక్తిత్వాలను, ఉన్నతమైన ఆలోచనలను అందించిన రోజు నిజంగా మనం గొప్పవారమే. మన ఇంటిని మనం చక్కదిద్దుకుంటే సమాజాన్ని ఉద్ధరించినట్లే. సమాజం కోసం ప్రత్యేకంగా మనం ఏ ప్యాకేజీలు పంచనక్కర్లేదు. మన నడవడి సరిగ్గా ఉంటే చాలు. సమసమాజ ఉద్ధరణకు బీజం పడినట్లే.

          ఏమాటైనా ఒకరిని అనే ముందు, మనమేంటన్నది మనం తెలుసుకోవాలి. ఎదుటివారిని విమర్శించడం, అవహేళన చేయడం అన్నది క్షణాల్లో చేయవచ్చు. కాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మన ఊహకు కూడా అందదు. వస్తువుకైనా, మనిషికైనా విలువ అనేది ఎలా వస్తుందో మన అందరికి తెలుసు. మనకు నచ్చినది గొప్పదని, నచ్చనిది విలువ లేనిదని అనుకుంటే మనకన్నా మూర్ఖులు మరొకరుండరు. 

       తూకానిదేముంది ముం వేసే రాళ్ళని బట్టి ఉంటుంది. న్యాయదేవత చేతిలోని తక్కెడ కూడా సాక్ష్యాలకు మాత్రమే తూగుతుంది. మనకు నచ్చినవారిని పొగడటం, నచ్చనివారిని అదేపనిగా ఎద్దేవా చేయడం విజ్ఞులకు తగదు. ఎవరి భావాలు వారివి. అవార్డులు రానంత మాత్రాన కొందరి అక్షరాలకు విలువ లేదని అనలేం కదా. అలాగే మనకు నచ్చినవారికి పురస్కారాలు వచ్చినంతనే..ఆ రాతలు గొప్పవేం కాదు. ఈరోజుల్లో పురస్కారాలు ఎవరికి ఎలా వస్తున్నాయన్నది జగద్విదితమే. దానికోసం అదేపనిగా మనమేం గొంతు చించుకోనక్కర్లేదు. అందరు వెళ్లేది అదే దారిలో అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాదంటే ప్రతిసారి తమ గొంతుకను వినిపించాలి. నిష్పక్షపాతంగా.

          సాహిత్యం కూడా కులాలకు, మతాలకు, భజనలకు మాత్రమే తల వొగ్గుతోంది. ప్రతిభకు కొలమానాలు ఒకప్పుడు పురస్కారాలు. ఇప్పుడు బిరుదులు, పురస్కారాలంటే ఏపాటి విలువ వుందో మనకూ తెలుసు. ఎవరికి అనుగుణమైన దారుల్లో వారు పోతూ వుంటారు. ప్రాంతీయతకు, మాండలీకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, మందులకు, పార్టీలకు, డబ్బులకు లొంగడం అనేది లోక విదితమే. ఏది ఎలా వున్నా మన పని మనం చేసుకుపోవడం ఉత్తమం.


2, ఆగస్టు 2023, బుధవారం

జీవన మంజూష ఆగస్ట్ 23


 నేస్తం,

         “ మాట “ రెండక్షరాల పదమే కాని ఆ మాటలోనే ఎన్నో భావాలు దాగున్నాయి. మనుష్యులను, మనసులను దగ్గర చేసేది, దూరం చేసేది కూడా ఈ మాటే. ఒక్కోసారి వేల మాటలకన్నా ఓ క్షణం మౌనం ఎన్నో సమస్యలకు సమాధానం చెబుతుంది. అలా అని మాటకు విలువ లేదని కాదు. దూరాలను తగ్గించి, బంధాలను పెంచేదీ మాటే. కాకపోతే కాస్త పొదుపుగా వాడాలంతే. 

            కొందరికి మాటే అలంకారమైతే, మరికొందరికి మౌనం ఆభరణం. మనం కొలిచే భగవంతుడు విగ్రహ రూపంలో ఎప్పుడూ మనతో మాట్లాడడు కాని మనం చెప్పే ప్రతిదీ వింటాడు. మన మనసులను తేలిక చేస్తాడు. కొందరు పెద్దలు అనర్గళంగా ఉపన్యాసాలు చెప్తుంటారు. వాటిలో మంచి మాటలు(మనకు నచ్చిన మాటలు) మన మనసులను ఆకట్టుకుంటాయి. మరి కొందరి మాటలు అస్సలు వినబుద్ది కాదు. ఇది మాటల్లో తేడా కాదు. మనలోని ఆలోచనల్లో తేడా. 

            ఓ చిరునవ్వు మహా భారత యుద్ధానికి కారణమైతే, ఓ మాట ఎన్నో ప్రళయాలను సృష్టిస్తుంది. మరెన్నో సత్సంబంధాలను నెలకొల్ప గలుగుతుంది. మాటకున్న శక్తి అలాంటిది. ఒకరిని హేళన చేయడమూ మాటే. ఆ అవహేళనకు పది రకాల సమాధానాలనూ ఆ మాటే తిరిగి ఎదుటివారితో చెప్పించి నోరు మూయించనూ గలదు. మన వ్యక్తిత్వాన్ని మనం పలికే మాటలు తెలుపుతాయి. మన నడవడిని బట్టే మన మాట కూడానూ.

            మన రాతలు, మాటలు మనమేంటో నలుగురికి చెప్తాయి. మాటల్లో తేనెలు ఒలకబోయడమే కాకుండా ఇతరులకు చెప్పడంతో పాటుగా కాస్తయినా మనమూ పాటిస్తుంటే మన మాటకు, రాతకు విలువ. అధికారమో, ధనబలమో వుందని ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో చరిత్రను తిరగవేస్తే తెలుస్తుంది. మాటయినా, రాతయినా మితిమీరకుండా హద్దుల్లో వుంటేనే ఎవరికయినా విలువ, గౌరవం దక్కుతాయి. కాదూకూడదని మన అహాన్ని మనం నమ్ముకుంటే మన భవిష్యత్తేంటో గత చరిత్రలు చెప్పకనే చెబుతాయి. 


1, ఆగస్టు 2023, మంగళవారం

ఏక్ తారలు

 1.  కడలీ పక్కుమంది_నాలానే నువ్వంటూ..!!

2.  అనంతాన్ని అందుకున్నట్లే_గుప్పెడు అక్షరాలను గుమ్మరిస్తే..!!

3.  కాలం ఏమార్చలేని క్షణాలు_గుప్పెట నిండిన గురుతులు కొన్ని..!!

4.  మనసుకు నచ్చని మర్మాలెన్నో_మాయలకు లోబడిన మనుష్యుల నడుమ..!!

5.  రాసేసిన కాగితాల్లో వెదుకులాట_పోగొట్టుకున్న కాలాన్ని చూద్దామని..!!

6.  అన్ని తెలిసిన రహస్యాలే_కాలం దాచలేదంటూ..!!

7.  విసుక్కుంది అక్షరం_కలం విసుర్లు కాలం మోయనంటుంటే..!!

8.  పయనం ఖరారైంది_ఏ రాతనెటు మార్చడానికో మరి..!!

9.  చీకటి గాయం మానుతుందేమో_ఎర్రని వేకువగా వెలుగులు విరజిమ్ముతూ..!!

10.  హత్తుకుందో ఆత్మీయత_ఏకాంతంలో నీతోనంటూ..!!

11.  దాగుడుమూతల సయ్యాటే జీవితం_బొమ్మో, బొరుసో తెలియక..!!

12.  ఎన్ని ఆలోచనలో_ మనసు అరల్లో..!!

13.  మరకల బతుకులే మన చుట్టూ_మనకు అంటించేయాలనుకుంటూ..!!

14.  గతంతో కలిసుండేవి జ్ఞాపకాలు_మృతానికి “అ” చేరికయితే..!!

15.  వెలుతురుపూలు ఏరుకుంటున్నా_చీకటి పారిజాతాల పరిమళాలలో..!!

16.  కలతను కాదంటున్నా_కల’వరాల కలలను కానుకంటుంటే..!!

17.  అక్షరాలన్నీ పోటి పడుతున్నాయి_అమ్మ చీరలో దాక్కున్న పాపాయితో..!!

18.  మనిషంటే ఇంతేనేమో_కాలానుగుణంగా ప్రవర్తిస్తూ..!!

19.  మాటలే మరిచిన క్షణం_మౌనంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ..!!

20.  పరికిస్తున్నా_పదలయల విన్యాసాన్ని..!!

21.  వయసెంతని కాదు_చూడాల్సింది చేతి పనితనాన్ని..!!

22.  రాయకుండా ఉండలేకున్నా_మనసు అక్షరాల్లో చొరబడినప్పుడల్లా..!!

23.  మనసు తెలిపే మౌనాక్షరాలు_కలంతో జత చేరి కాగితంపై..!!

24.  కాలాన్ని కలంతో జత కలిపా_నెమలీకతో గతాన్ని అక్షరాలకద్దేద్దామని..!!

25.  నాకు అక్షరాలను పేర్చడం అత్యంత ఇష్టం_మనసు భారాన్ని పంచుకుంటాయని..!!

26.  దూరాన్ని ప్రేమిస్తానంటావెందుకూ_కాలం దాచిన క్షణాలు మనవైతేనూ..!!

27.  నిలువరిస్తున్నా మనసుని_చూపుల సంకెళ్లు వద్దని వారిస్తూ..!!

28.  వీడలేనంటున్నా నీ చెలిమిని_రాహిత్యపు జాడను చెరిపివేయమంటూ..!!

29.  కాలానికి వదిలేయలేక పోతున్నా_నీ ఉనికిని కోల్పోతున్న క్షణాలను..!!

30.  సంద్రమెంత గుంభనమైందో_అమ్మలా అందరిని ఆహ్లాదపరుస్తూ..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner