31, జులై 2014, గురువారం

కరిగేదెన్నడో...!!

వేల కధల వెతల కన్నీటి చినుకుల్లో
ఓ చినుకుగా ఉండిపోయిన సశేషాన్ని
వెలిసిపోయిన రంగుల్లో వెదుకుతున్నా 
సంతోషాన్ని చిరునామాగా చూడాలని..!!

అందరాని చందురుని అందుకోవాలని
ఆశపడుతున్నా అందుకోవాలని ఆరాటమే
అంబరాన్ని తాకాలన్న తపన వీడని
అక్షరాల పయనం ఇలా సాగుతోంది...!!

లెక్కలేయని అనుబంధాల్లో మిగిలిపోయిన
బాంధవ్యాలు నాతోపాటుగా రాలేమంటూ
దూరంగా పారిపోతుంటే పట్టుకోవాలన్నా
జారిపోతున్న జీవితానికి అంటని చెలిమిలా....!!

ప్రళయంలో వెదికినా ప్రణయంలో చూసినా
మనసులో దాగిన మాటలు పెదవిపై చేరి
గుండె గొంతుకను విప్పి చెప్పినా వినని
కరకురాయి కాఠిన్యం కరిగేదెన్నడో...!!

30, జులై 2014, బుధవారం

మధ్యలో ఎప్పటికి...!!

మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేసే మంత్రం ఒక్కటే అదే ఆప్యాయత...కొంత మంది దగ్గరే ఉన్నా
మనసుకు మనకు దగ్గరగా రాలేరు...దూరాన్ని దగ్గర చేసి పంచే ఆ ప్రేమకు ఇష్టానికి దాసోహం కాక తప్పదు...దగ్గరలోకి వచ్చి కూడా దగ్గరగా రాలేని అనుబంధాలు ఎన్నో...!! మాటల వరకే పరిమితం కొన్ని... డబ్బుల వరకే సరి చూసుకునేవి కొన్ని.... అవసరానికి నటించేవి మరికొన్ని...!! అమెరికా నుంచి గుంటూరు వచ్చినా పక్కన ఊరు రాలేక ఫోన్ లో పలకరించి అబ్బా పలకరించానులే పని అయిపొయింది సరి పెట్టుకుంటే సరిపోతుంది.. .చూడాలని మనసు ఉంటే మార్గం అదే వస్తుంది...మనమేమో అబ్బో అమెరికా నుంచి వచ్చి గుర్తు ఉంచుకుని ఫోన్ చేసి పలకరించారు చూసావా అని తృప్తి పడే అల్ప సంతోషులం...!! మనుష్యులు మమతలు ఎక్కడ ఉన్నా అవే కదా..!! మరి ఎందుకీ తేడాలు...!! ముక్కు మొహం తెలియని ఎందరో పలకరించే పలకరింపు మనం ఎందుకు పలకరించుకోలేక పోతున్నాం...?? ఎందుకీ దూరం...మన అంతరంగంలో దాగిన అభిమానం అనంత దూరంగా అందకుండా చేసుకోవాల్సిన అవసరం ఉందా..!!  పేరుకి మాత్రం పలకరింపులు ఎందుకు..?? చిన్నప్పటి స్నేహాలు కల్మషం లేనివి ఇక తరువాత స్నేహాలు అంటారా మనకు నచ్చిన మనము మెచ్చిన బాంధవ్యాలు అనుకుంటాము కాని వాటిలో కొన్నే నిజమైనవి అని కాలంతో పాటు మనకున్న డబ్బు, హోదాని బట్టి వస్తూ ఉంటాయి...ఎన్ని రోజుల స్నేహం అన్నది కాదు ఎన్నాళ్ళ నుంచి అలానే ఉన్నాయి ఆ ఆప్యాయతలు అన్నది ముఖ్యం,,,, కొందరికేమో తీరికే ఉండదు మరికొందరేమో తీరిక చేసుకుని కొద్ది సమయమైనా చూడాలని కలుస్తారు... మనసులో లేకుండా మాటలతో సరిపెడితే సరిపోదు... దేనికైనా మనసుతో కలిపి ఉంటేనే అది చిరకాలం నిలుస్తుంది.... అది ఏ అనుబంధమైనా...!! మనం కావాలనుకునే అనుబంధాలను దూరం చేసే దూరాన్ని దూరంగా ఉంచితే అన్ని మనకు దగ్గరగా మన అందుబాటులోనే ఉంటాయి.....!! కొన్నిటిని డబ్బుతో కొనలేము.... కోట్లు పోసినా సంతోషాన్ని తేలేము... జరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకోగలం కాని మళ్ళి ఆ కాలాన్ని వెనక్కు తీసుకురాలేము...!! విరిగి పోయిన మనసుని అతుకు వేసినా అది అతుకుల విస్తరే కాని నిండు విస్తరి కాదు... ఎప్పటికి కాలేదు...!! మనసులో ఉంటే ఇరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు అయినా గత జ్ఞాపకాల అనుభూతుల గురుతులు మదిలో పదిలంగానే ఉండిపోతాయి.... వదిలేసుకుంటే ఏది మనతో ఉండదు... కొందరేమో వదులుకోలేరు మరికొందరేమో విదుల్చుకుంటారు..... అదే చిన్న తేడా మనసుల మనుష్యుల మధ్యలో ఎప్పటికి...!! 
నా అల్ప సంతోషాన్ని అధికమైన ఆనందంగా మార్చుతున్న కొందరు ఆత్మీయులకు ఈ రాత అంకితం...!!

27, జులై 2014, ఆదివారం

కాలుతున్న జ్వాల....!!

నిశబ్ధం మాటాడేస్తోంది తన గుండె చప్పుడు
వినిపిస్తూ ఎన్ని మాటల మౌనాలో దానిలో
దాచుకున్న భారమంతా వదిలేస్తూ చెప్పిన
ఆ ఆనకట్ట లేని ప్రవాహాన్ని అడ్డుకోవాలని
అడ్డుపడక వింటూనే ఉండిపోయాను ఎందుకో....
ఇన్ని కాలాల సంగతుల కబుర్లు చెప్పిన
సత్యాల సమాధుల ఇటుకల అలజడి
రేపిన గాలి ధుమారంలో అక్కడక్కడా
మిగిలిపోయిన ముక్కల జ్ఞాపకాలు ఎక్కడో
చెరిపేసిన అక్షరాలుగా తెర చాటుగా దాగుండి
శిధిలమైన మనసు శిలగా నిలిచిపోయి వ్యధశిలగా
మారిన తరుణం మరచిపోయిన మరుక్షణం
నేను అందరిలా ఓ మనిషినే అని గుర్తు చేసుకుంటూ
కాలుతున్న చితిలో పేర్చబడ్డ మరో కట్టెగా మారిన
ఈ శరీరం కోరికల రణరంగంలోనికి నెట్టబడిన
కాలని కట్టెగా మిగిలిపోతున్న మండుతున్న జ్వాల....!!

పుట్టినరోజు శుభాకాంక్షలు


నాకు ఆప్తురాలు నా పేరుని తనలో దాచుకున్న నా సన్నిహితురాలు ఇంజనీరింగ్ లో ఎప్పుడు అడిగినా పాటలు పాడి అలరించిన నా నేస్తం ఇప్పటికి అదే ప్రేమతో పలకరించే మంజుకి ప్రేమతో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షల శుభాశీస్సులు
                                                        ప్రేమతో
                                                     మంజు అక్క

24, జులై 2014, గురువారం

క్షమాపణలు చెప్తోంది ఇలా అయినా...!!

ఒక్కోసారి మనం ఎంతగా అనుకున్నా అది చేయలేము... నా విషయంలో అది బాగా జరుగుతుంది. పిల్లలకు కూడా అలానే అయ్యింది....బాగా చేద్దామనుకున్న మా వాళ్ళ అందరి కోరిక తీరకుండానే ఎవరిని పిలువకుండానే మొన్నటి ఉగాది రోజున పంచెలు కట్టబెట్టేసాము..... నాకు ఓ పాట గుర్తు వస్తోంది... " ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను...." మా వాళ్ళను నా పెళ్లి చూడనివ్వని చందానే నా కొడుకుల పంచెల సరదా తీరకుండానే అయిపొయింది....పాపం వాళ్ళు బోలెడు సరదా పడ్డారు... కాని వాళ్ళ సంతోషం కూడా చూడకుండానే జరిగిపోయింది.....
ఆహ్వానపత్రిక కొట్టించి చాలా వరకు అందరికి చెప్పిఅన్ని సిద్ధం చేసి కొన్ని అనివార్య కారణాల వలన పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయాను.... కొన్ని కోట్లు ముందు రాశులుగా పోసినా మళ్ళి ఆ సంతోషాన్ని తిరిగి తేగలమా....!! ఈ తప్పు నా జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది....ఏమి చేయలేని ఈ అమ్మ పిల్లలకు క్షమాపణలు చెప్తోంది ఇలా అయినా...!! మనకు జరగక పోయినా పిల్లలకు అన్ని బాగా జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.... అతి కొద్ది మంది మాత్రం ఈ లెక్క లోనికి రాకుండా ఉంటారు... !! పోనిలెండి బాగా జరపాలనుకున్న మా కోరిక తీరక పోయినా జరగనీయవద్దు అనుకున్న వారి కోరిక తీరినందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాము.....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner