29, జనవరి 2020, బుధవారం
మరోసారి చెప్పించుకోవద్దు..!!
నేస్తాలూ,
పాపం తెలంగాణా నాయకులందరు హరిశ్చంద్రుడి చుట్టాలట..ఆంధ్రాలో వాడు భూదందాలో కోట్లు సంపాదించాడు, వీడు తరతరాలు తిన్నా తరగని సంపద సంపాదించేసాడని ఏడవడం కాదు...మా ఏడుపేదో మేమేడుస్తాం...గతంతో పోల్చుకుంటే ఈ ఆరేళ్ళలో ఆడపిల్లల మీద...ముసలి, ముతకా, పసిపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయెా లెక్కలేసుకోండి.. పక్కోడి ఇల్లు కాలుతోంటే ఎకిలి నవ్వులు నవ్వటం కాదు గురువిందలూ. ఓ నాయకుడి ఇంట్లో కోడలు, పిల్లల సజీవ దహనం కేస్, డ్రగ్స్ కేస్, ఎమ్ సెట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులను జైల్ లోనే హత్యలు చేయించి ఆత్మహత్యలుగా మార్చిన వైనం, మార్కుల అవకతవకలతో పిల్లల ప్రాణాలతో ఆటలాడిన వైనం...వీటికి కనీసం నైతిక బాధ్యత వహించని మంత్రులు...ఇవి మచ్చుకు కొన్ని...ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు పురాణాలు...
కనుక చుట్టాలు..
మా పురాణాల సంగతి మేం చూసుకుంటాం.. ముందు మీ కొంపలు సక్కబెట్టుకునేడవండి. ఈ సందర్భంగా ఓ ముతక సామెత గుర్తు సేయక తప్పడం లేదు. " ఒకడికి పడి ఏడిస్తే ఓ కన్ను పోయిందట.. ఇద్దరికి పడి ఏడిస్తే .... ". అప్పనంగా వచ్చాయని అనుభవించడం కాదు. కష్టంలో ఎదుటివాడికి సాయం చేయకపోయినా పర్లేదు... ఎద్దేవా చేయకండి. రాయడం మెుదలెడితే మీకన్నా బాగా రాయగలం. ముందు మీ.. చూసుకోండి.తర్వాత తీరికగా మాగురించి విశ్లేషణ చేద్దురు.
వర్గము
కబుర్లు
ఏ'కాంతా'క్షరాల సమీక్ష ఆంధ్రభూమిలో..!!
నా ఏ'కాంతా'క్షరాలు ఏక్ తారల పుస్తకంపై రాజా చంద్రశేఖర్ మానాపురం గారు ఆంధ్రభూమి వార్తా పత్రికలో రాసిన సమీక్షకు వారికి, ఆంధ్రభూమి యాజమాన్యానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...
ఏకార్త అని అచ్చు తప్పుగా పడినందుకు, అది తెలియజేసినవారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు. సృజనకర్త అని కాకుండా సృష్టి కర్తగా పొరపాటుగా అచ్చయింది. గమనించ మనవి.
ఏక్తారల ఏ'కాంతా'క్షరాలే ఈ చిరు కవితలు
- మానాపురం రాజా చంద్రశేఖర్
9440593910
వర్తమాన కవిత్వం అనేక సాహితీ ప్రక్రియలకు ఊపిరి పోసి పలు లఘు కవితా రూపాలకు ప్రాణప్రతిష్ఠ చేసింది. వీటిలో అత్యాధునిక కవితా రూపమే " ఏక్తార ".దీని సృజనకర్త కవయిత్రి ' మంజు యనమదల '. 28 అక్షరాల పరిమితికి లోబడి, ఏక వాక్య కవితా ప్రయోగంతో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.రెండు వాక్యాలను ఏక నిడివితో కలుపుతూ చిరు కవితలుగా మలిచి 'ఏక్ తారల'గా ఆవిష్కరించారు.గాఢత, స్పష్టత, సరళతలు వీటి ప్రత్యేకతలు. షడ్రుచులుగా చెప్పబడే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు శీర్షికలతో ఈ లఘు కవితా ప్రక్రియను పరిపుష్టం చెయ్యగలిగారు.ఇవి రాశిలో కన్నా వాసిలో మిన్నగా అనిపిస్తాయి.అనుభవసారం నిండిన కవితాత్మక తాత్విక సత్యాల్ని తార్కికబద్ధంగా ధ్వనింపచేస్తాయి. నర్మగర్భితమైన జీవన సందేశాల్ని కళాత్మకంగా, సున్నితంగా, సహజంగా, సాహిత్యపరంగా విప్పి కప్పి లోతైన భావాలతో ప్రతిఫలింపచేస్తాయి. మార్మికత పొడసూపే విభిన్న మానసిక సంఘర్షణల భావోద్వేగాలను, అనుభూతులను, సందర్భాలను ఒకచోట కుప్పగా పోసి, పాఠకులను అలరించి రసార్ద్రభరితం చేస్తాయి. స్వతహాగా భావుకురాలైన మంజు యనమదల వీటిని " ఏ'కాంతా'క్షరాలు " శీర్షికతో కవితాసంపుటిగా తీర్చిదిద్ది అందించారు.
" నిరాశకు చరమగీతం - నిశిలో సైతం వెలుగు పూల వర్షం " అని చెబుతున్నప్పుడు- ఒక రకమైన ఆశావహ దృక్పథం తొణికిసలాడుతుంది. నిరాశను నిశికి ప్రతీకగా చేసి, వెలుగును ఆశావాదానికి ప్రతిబింబంగా నిలుపుతుంది ఈ ఏక వాక్య కవిత. ఈ కాంతి పూల వర్షం వెల్లువలో చైతన్యం వెల్లివిరిసి, చీకటిని పోలిన నిరాశకు చరమగీతం పాడవచ్చనే భావన ఈ స్వల్ప అక్షరాల్లో ధ్వనిస్తుంది. ఇదే ఈ వచనరచన పరమార్థం. ఇందులో తాత్వికత అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
" అమాయకత్వంలో ఆహ్లాదం - విడువలేని పసితనపు ఛాయలు " అంటూ మరోచోట కవిత్వీక రిస్తారు మంజు యనమదల. బాల్యం అంటేనే అమాయకత్వానికి ప్రతిరూపం. ఎలాంటి కల్మషత్వం ఎరగని సున్నితమైన పసిమనసుల నిర్మల మనోభావాలు ఇందులో ప్రతిఫలిస్తాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఒక్క చిరుప్రాయంలోనే పసితనపు జ్ఞాపకాలుగా ఊగిసలాడుతూ కడదాకా వెంటాడతాయి. ఈ సందర్భాన్నే ఇక్కడ కవయిత్రి కవిత్వమయం చేసింది. దీనిలో సజీవ శాశ్వత జీవ లక్షణం ఉట్టిపడుతుంది.
" స్వప్నమూ మెలకువలోనే - గాయాలను నిదురపుచ్చలేక " అని వాపోతున్నప్పుడు నిలువెల్లా గూడుకట్టిన మానసిక జీవ సంఘర్షణతో సుడులు తిరుగుతున్న వేదన అడుగడుగునా వర్ణనాతీతంగా మిగిలిపోతుంది. ఈ రంపపుకోతలో స్వప్నం కూడా నిద్రాణ స్థితిలాంటి మెలకువలోనే ఊగిసలాడుతూ గాయాల సమస్యలకు పాదు కడుతున్న సందర్భంలోనివి ఈ కవిత్వపంక్తులు. కాబట్టే క్షణక్షణ నరకయాతన మౌన సందిగ్ధ మూగ మానసిక స్థితికి ఇది దర్పణం పడుతుంది.
" చుక్కల సందడితో - గగనమంతా నవ్వులే " అంటున్నపుడు భావుకత పరాకాష్టకు చేరుకుని వెన్నెలనవ్వుల్ని కురిపిస్తాయి. వెన్నెల ఆహ్లాదానికి సంకేతం. చల్లదనానికి ప్రతిబింబం. ఇది ఆకాశంలో పరుచుకుని చుక్కల మధ్య కాంతివంతంగా మెరిసి పోతుంటుంది. ఈ తారల మెరుపుల సందడికి గగనమంతా విచ్చుకున్న నవ్వుల విశ్వంగా మారిపోతుంది. ఈ దృశ్యం చూపరులకి కనువిందుగా మారి అనుభూతితో మమేకం చేస్తుంది. దీనినే సందర్భోచితంగా సౌందర్యారాధనా దృష్టితో కవయిత్రి చిత్రిస్తారు.
" ముక్కలైన మనసులో - ఎక్కడ చూసినా నీ ప్రతిబింబమే " అంటారు ఇంకోచోట మంజు. ఈ పలుకుల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, తునాతునకలైన మనసు బీభత్సాన్ని ఉద్వేగభరితంగా కళ్ళకి కట్టిస్తారు ఈమె. గాయపడి ఛిద్రమైన సన్నివేశాల్ని విఫలమైన సంఘటనల కోవలోంచి ఎత్తిచూపి అవతలివారిని దోషిగా, మూలకారకులుగా సందర్భీకరించే ప్రయత్నంలోనిది ఇది. చాలా హృదయవిదారకంగా కవిత్వీకరిస్తారు.
ఇంకో చోట- " నిలబడే ఉంది - నీడలో నిజం " అనడం వెనుక సజీవమైన ఒక భౌతికసత్యాన్ని తర్కబద్ధమైన కోణంలో ఆవిష్కరిస్తారు. నిప్పు లాంటి నిజం నిలబడే నీడలో దాగివుందనే స్పృహను తేటతెల్లం చేస్తారు. ఇది పైకి కనీ కనిపించని వాస్తవమే అయినా అంతర్లీనంగా ధ్వనించే అర్థాన్ని చాలా నర్మగర్భితంగా మార్మికతతో విడమర్చి చెబుతారు కవయిత్రి.
" ఒక్కో చినుకే - వేల జీవాలకు ప్రాణాధారంగా " అంటూ చెప్పినపుడు జీవకోటి మనుగడకి ఆధారభూతమైన చినుకుచుక్క ఉనికి ఈ లోకానికి ఎంతవసరమో స్పష్టంగా విపులీకరిస్తారు. తాగడానికీ, జీవజాలం మొలకెత్తడానికీ, శుభ్రపరుచుకోవడానికీ నీటి ఆవశ్యకత ప్రాధాన్యతను తెలియజేస్తారు. జలం లేనిదే ప్రాణి బతికి బట్టకట్టలేదు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి దీనిని ఒక సందర్భ ప్రయోజనంగా భావించాలి.
వీటితోపాటు కవితాత్మక వాక్యప్రయోగాలు ఈ సంపుటిలో కోకొల్లలుగా దర్శనమిచ్చి సృజనాత్మకతకు గీటురాయిగా నిలుస్తాయి. మచ్చుకు వీటిలో కొన్నింటిని రుచి చూద్దాం. ' చుక్కల దుప్పటి ఎగిరిపోయింది ' , ' కాలం రాల్చిన కలలు ' , ' మౌనం మాటలు పరిచింది ' , ' వెన్నెలకే వర్ణాలన్నీ ' , ' అసూయ నల్లపూసైoది' , ' సరిగమలు ఒలికి పోయాయి ' , ' నిరీక్షణ ఓ రాగమైంది ' , ' ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు ' , ' వెన్నెల ఆరబెట్టుకుంటోంది ' , ' గాయపడ్డ వేణువు గానం ' , ' రెప్పచాటు స్వప్నాలు ' , ' చీకటి చిరునామా చెరిగిపోయింది ' , ' రాలుతున్న పూల రాగాలు ' , ' వాలిపోతున్న పొద్దులో వర్ణాలు ' , ' మనసు చెమ్మ మదిని తాకింది ' , ' పగిలింది నిశ్శబ్దం ' , ' చిరు స్పర్శే విశ్వమంతగా మారింది ' , ' పిలుపు పిల్లనగ్రోవిలో సాగి ' , ' వెన్నెల దోసిళ్ళలో ఒదిగిపోయింది ' , ' పెదవి అంచున చిరునవ్వవుతావా ' , ' మౌనమూ మాటలు కలిపింది ' , ' నీ నవ్వుల్లో రాలిన ముత్యాలు ' , ' తూరుపు సిందూరమై మెరుస్తోంది ' , ' అనంతమై నన్ను చుట్టేశావు ' , ' సంతోషం ఉప్పెనయ్యింది ' , ' హృదయం చేజారిపోయి ' , ' తాకినది మది మౌన తరంగం ' , ' గుండె గొంతు విప్పింది ' , ' చిరునవ్వుల మౌనాన్ని నేను ' , ' నేల రాలినా నిత్య పరిమళమే ' , ' కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది ' , ' గెలిచిన మనసుని అక్షరాలుగా మలుస్తూ ' , ' గువ్వల్లా ఒదిగిన జ్ఞాపకాలు ' , ' మువ్వలా ముడుచుకుంది ' , ' నిశిని చుట్టేసిన వెన్నెల' , ' మంచులా నీ మనసెంత చల్లన ' , ' పున్నమి వెన్నెలే చెలి సింగారాలు ' , ' అక్షర సంచారమే జీవితం ' వంటి కవిత్వ పరిమళాలు సహజంగానే మనసుని హత్తుకుంటాయి. ఇలా బహుముఖ అంశాల వెల్లువలో సేదతీరిన ఈమె కవిత్వం ' ఏక్తారల ఏ'కాంతా'క్షరాలుగా కొలువుదీరి సామాజిక చైతన్యాన్ని ఉద్దీపింపచేస్తుంది. లోతైన భావజాలంతో పలు పార్శ్వాలకు అక్షరాలతో ఊపిరి పోసిన కవయిత్రి మంజు యనమదలకు సాదర ఆహ్వానం పలుకుతూ పాఠకలోకంలోకి స్వాగతిద్దాం.
వర్గము
కబుర్లు
25, జనవరి 2020, శనివారం
సేవ సంక్రాంతి కవితల పోటి..!!
సేవ సంస్థ నిర్వహించిన సంక్రాంతి కవిత పోటికి నన్నో న్యాయ నిర్ణేతగా చేసిన కంచర్ల సుబ్బానాయుడు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
సంక్రాంతికి చక్కని కవితలతో గత జ్ఞాపకాలను గుర్తు చేసి సంకురాతిరి సంబరాలను అక్షరాల్లో చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.
ఒకే వస్తువుపై విభిన్నమైన శైలితో ప్రతి ఒక్కరూ కవిత్వీకరించిన తీరు బాగా ఆకట్టుకుంది. న్యాయ
నిర్ణయం చేయడం చాలా కష్టతరమైంది. న్యాయ నిర్ణయం ఎవరిని వారిది విభిన్నంగా ఉంటుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. ప్రతి కవితా చక్కగా ఉంది. విజేతలు కొందరే కనుక అన్నీ ఎంపిక చేయలేము.
నా పరిధిలో నాకనిపించిన విధంగా తృతీయస్థాన కవితలను సంక్షిప్తంగా సమీక్షిస్తాను.
ఆనాటి సంక్రాంతి ఎలా మెుదలై ఎంత వైభవంగా పెద్దలు, పిన్నలు సంబరాలు చేసుకునేవారో, ఎన్ని ముచ్చట్లు మురిపాలు పంచుకునేవారో, ఆటలో అల్లరి, పాటల సందడిని గుర్తు చేస్తూ ఆధునిక సంక్రాంతిని పోల్చుతూ..కోల్పోతున్న ఆనందాలను తిరిగి తెమ్మని కోరుతూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన అక్షర తోరణం శ్రీ షేక్ మహమద్ రఫీ గారికి అభినందనలు.
సంక్రాంతి సొగసులను సొగసైన వర్ణనలతో వివరిస్తూ, తాయిలాల తీపిని రుచి చూపిస్తూ, పాడిపంటల పల్లె జీవితాలను వల్లెవేస్తూ, కలసి ఉండే కలదు సుఖమని గుర్తుచేస్తూ, రైతన్న గొప్పదనాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాల విలువను తెలిపిన అందమైన కవితాఝరిని మన మనసులపై అందంగా ముద్రించిన శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమళ్ళ గారి సొగసైన సంతకం సంక్రాంతికి అభినందనలు.
హేమంతపు అందాలను కనుక ముందు నిలుపుతూ, చక్కని పదాల అమరికతో, సంక్రాంతి సంబరాలను అక్షర రంగవల్లులతో అలంకరించి, మానవత్వపు మమకారాలను రుచి చూపిస్తూ, ఎప్పటెప్పటి జ్ఞాపకాలకో...మళ్ళీ తన అక్షరాలతో జీవం నింపి, అందమైన బొమ్మల కొలువుగా మన ముందుకు వచ్చిన వెలుగు తోరణం వెన్నెల కాంతి ఈ సంక్రాంతిని అందించిన ఘాలి లలిత ప్రవల్లిక గారికి అభినందనలు.
ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. చదివిన ప్రతి కవితా బోలెడు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అందమైన అమాయకమైన బాల్యాన్ని మరోసారి అందించింది. నాకు ఈ అవకాశానిచ్చిన కంచర్ల సుబ్బానాయుడు గారికి ధన్యవాదాలు.
వర్గము
కబుర్లు
ఆత్మీయులు పుస్తక సమీక్ష..!!
" అనుబంధాలకు వారధి ఆత్మీయత "
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తుల్లో డాక్టర్ లక్ష్మీ రాఘవ ఒకరు. ఈవిడ కథలు నేల విడిచి సాము చేయవు. మన చుట్టూ ఉండే సమస్యలనే కథా వస్తువులుగా తీసుకుని ఏక బిగిన చదివించే శైలి ఈమె సొంతం. ఎన్నో పురస్కారాలు అందుకున్న కథలు మరో కథా సంపుటి "ఆత్మీయులు" గా రావడం ముదావహం.
అవయువదానం గొప్పదనం తెలిపే కథ ఆత్మీయులు. ఎదుగుదల ఉన్న ప్రతిచోట మార్పు అవసరమంటూ ఆధునికను అందిపుచ్చుకోవాలని చెప్పే కథ ఆచరణ. అందరూ ఉండి అనాథల్లా మిగిలిపోతున్న ఎందరో తల్లీబిడ్డల కథ ఒక అమ్మ కథ. ఆపదలో ఉన్నప్పుడు మానవత్వం, మంచితనంతో చేసే సాయం విలువ తెలిపే కథ సహాయం. కొత్తవారి మాటలు నమ్మి ఎలా మెాసపోతామెా తెలిపే కథ చీరలు. అమ్మ అవసరమైతే దుష్ట శిక్షణకు అపరకాళిగా మారుతుందని కన్న కొడుకును కూడా క్షమించదని ఆమె ఒక శక్తి కథ బుుజువు చేస్తుంది. ఒకరి సాహిత్యం గురించి విమర్శ చేసేటప్పుడు, వారు ఆ విమర్శకు సమాధానం చెప్పే విధం అభిప్రాయం కథలో చదువుతున్నప్పుడు నాకు ఎదురైన విమర్శలు గుర్తులు వచ్చాయి. చాలీచాలని బతుకుల్లో కష్టాలు చెప్పకుండా వస్తే ఆదుకునే అనుబంధాలను చూపించి కథ ఆటో. నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మలకు ఎదురయ్యే సమస్యే అమ్మ ప్రేమలో తేడా కథ. పుస్తకం మనసు తెలిపిన కథ నేను. రైలు పట్టాలు చెప్పిన జీవిత సత్యాలు విప్పి చెప్పిన కథ ఇదేమి న్యాయం. తోటలో ఒక రోజుంటే పూల మనసు తెలుస్తుంది. కన్నవారి మీదే కాకుండా పుట్టిన గడ్డ మీద మమకారంతో ఓ ఆడపిల్ల చెప్పిన మాటల ముత్యాలే ఆడపిల్ల ఆలోచన కథ. అమాయకులతో ఆడుకున్న అవయువదానాల బడాబాబుల కత దానం. ముక్కుపుడక మనసు తెలిపే కథ ముక్కుపుడక. మన ఇష్టాలు, అభిప్రాయాలు బలవంతంగా ఎదుటివారిపై రుద్దకూడదని సున్నితంగా చెప్పిన కథ బోధన. పెద్దావిడను మలి వయసులో బాగా చూసుకోవాలన్న కొడుకు, కోడలు, మనుమరాలికి ఎదురైన చేదు అనుభవం ఏమిటో నానమ్మ కథలో తెలుస్తుంది. అవసరానికి వాడుకొనే మనుషులు కొందరైతే అడగకుండానే సాయం చేసే మానవతామూర్తులు మరికొందరని చెప్పే కథే టెంపరరీ. ఇల్లాలు కథలో ఇంటి ఇల్లాలి ఉద్యోగ బాధ్యతలు, జీత బత్యాల గురించి ఇంటాయన చెప్పడం చాలా బావుంది. కొన్ని సమస్యలకు దేవుడు చూపించే పరిష్కారాలు మానవ మేధస్సుకు అందవని దేవుడిచ్చిన తోడు కథ బుుజువు చేస్తుంది. డబ్బు మాయలో బతుకుతున్న ఈరోజుల్లో రక్త సంబంధానికి, బాధ్యతలకు విలువనిచ్చిన అన్నదమ్ముల కథ ఆలోచన. కూటి కోసం కోటి తిప్పలన్నట్టు జానెడు పొట్టకు ముద్ద కోసం వేసే వేషాలు, చేసే వ్యాపారాల గురించి తెలిపే కథ గాంధీగారు గాయపడ్డారు. ఓ అమ్మ బిడ్డల మధ్యే వయసు తారతమ్యం ఎన్ని చిక్కులను తెస్తుందో తెలిపే కథ ఎడం.
తేలిక పదాలతో, వర్ణన అవసరం లేని ఇతివృత్తాలతో సూటిగా చదువరుల మనసును తాకేటట్లుగా కథలు రాయడం డాక్టర్ లక్ష్మీ రాఘవ ప్రత్యేకత. సమాజంలో సమస్యలను సున్నితంగా చెప్తూ, తనదైన రీతిలో పరిష్కారం చూపిస్తూ ఎన్నో సమస్యలను తన కోణంలో విశ్లేషిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మనసు పెట్టి వింటే పూలు, పక్షులు, జంతువులు, చెట్లు చేమలు కూడా కథలు చెప్తాయని డాక్టర్ లక్ష్మీ రాఘవ నిరూపించారు తన కథా సంపుటాలతో. చక్కని కథలను అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవకు హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
22, జనవరి 2020, బుధవారం
మీ బాధేంటి తమ్ముళ్ళు...!!
అక్కయ్యా అంటూ ఎంత పద్ధతిగా చెప్పారు తమ్ముళ్ళు. కృతజ్ఞతలు మీ ఓర్పుకి, సహనానికి. స్త్రీల పట్ల మీకూ, మీ నాయకులకు ఉన్న గౌరవాన్ని ప్రపంచం యావత్తు చూశారు, చూస్తున్నారు. హుందాతనం అనేది జాతి లక్షణం. వెకిలితనం అనేది పెరిగిన పరిసరాల, వ్యక్తుల ప్రభావం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ప్రపంచమంతా చూసారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మునుముందుకి దూసుకుపోతోందని యావత్ ప్రపంచం గుర్తించేసింది. మన పొరుగు దొర రాష్ట్రం పాకిస్తాన్ మన పురోగమనానికి అసూయతో కుళ్ళి పోతోంది. వ్యక్తిపూజలు, పార్టీ పూజలు వ్యక్తిగతాలు. వాటిని కాదనే హక్కు ఎవరికి లేదు. కానీ కళ్ళ ముందు కనబడుతున్న నిజాలను దాయడం ఎంతో కష్టం. మీరు నిజంగా ఆంధ్రులే అయితే వాస్తవాన్ని ఒప్పుకోండి.
ఒకే ఒక్క నిజాన్ని ఫార్వర్డ్ చేసినందుకు సమస్త స్త్రీ జాతి మీద మీకున్న గౌరవాన్ని ప్రత్యక్షంగా అనుభవించినదాన్ని. మీ మాట తీసేయగలనా వై చీప్ తమ్ముళ్ళు. నేను మీలాగా కోడికత్తి బాచ్ కాదు... మీ బెదిరింపులకు భయపడటానికి. ఏం చేస్తారు మహా అయితే నాలుగు చెత్త వీడియెాలు, బూతులు ఇంతేగా మీ పేటియం బతుకులు. నాలుగు ముక్కలు రాస్తేనే తట్టుకోలేకపోతున్నారు, మరి మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోండి తమ్ముళ్ళు.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
