14, డిసెంబర్ 2013, శనివారం

మీ దృష్టిలో మనిషి విలువ....!!

ఏటో ఎర్ర బస్సెక్కి ఎలిపొచ్చిసినానని నానంటే అందరికి ఎగతాలై పోనాది...ఏదో మా ఊర్లొ ఉన్న బస్సెక్కిసినాను కాని నాకేటి తెల్దా ఏటి నానెక్కడికెల్లాలో...ఏ  బస్సెక్కాలో..!! ఏడిపించినా... ఎకసెక్కాలాడినా..నానూరికే భయపడిపోయి మా ఊరికి ఎలిపోతానేటి...?? నాకేటి కావాలో అది తీసుకునే పోతాను...భయపడి ఒట్టి సేతుల్తో ఉపేసుకుంటూ తల వొంచేసుకుని ఎలిపోను...ఏటో ఎర్ర బస్సు ఎక్కోచ్చేసినాది ఇదేటి సేత్తదిలే మహా మహా పోటుగాళ్ళే పారిపోనారు ఇదెంత అనుకుంటే అది నా తప్పు కాదు....భాష రాక పోయినా, యాస బాలేక పోయినా, పద్దతి తెలిస్తే సాలదేటి..?? నాను ఇలాగే ఉంటాను... నాలానే ఉంటాను....!!
ఈ మనసు మాటల్లో ఎంత నిజాయితీ ఉంది.. దానిలోనే ఎంత నిక్కచ్చితనము కనపడుతోంది...!! దేనికి భయపడని పోరాట పఠిమ తను అనుకున్నది సాధించడానికి...!! ఓ మారుమూల పల్లె మనసు అందరు గుర్తించే విధంగా ఎదగడానికి ఈ ఆవేశం చాలదూ..!!
ఈ పద్దతి, కల్మషంలేని మాటలతోనే అందరి మనసులు గెలుచుకోవచ్చని మనలో ఎంత మందికి తెలుసు...!! పల్లెటూరి వాళ్ళు మట్టి ముద్దలు, పట్టణపు పాలరాతి శిల్పాలతో పోటి పడలేరు అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది...నాగరికతకు సరైన అర్ధం తెలుసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో..ఎలా బతుకుతున్నామో తెలుసుకోగలం...!! ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ మేధావులు కాదు...రాని వాళ్ళందరూ చవటలు కాదు...భాష రావడం అవసరమే కాని అది ఎదుటి వారిని కించపరచడానికి కాదు...మన సంబంధ భాంధవ్యాలను పెంచుకోవడానికి...బాగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న విజ్ఞులు ఎందరో తమ చదువుని, తమ హోదాని కూడా మరిచి పోయి తమ కింది ఉద్యోగులను, తోటి వారిని చాలా హేళనగా మాట్లాడటం ఎంత అవమానకరం..!! డబ్బు, హోదా, పరపతి ఒకదానితో ఒకటి పోటి పడుతూ ఉంటాయి...వాటితో పాటు తమ హోదాను నిలుపుకోవాలన్న కాంక్ష కూడా అంతే బలంగా పోటి పడుతూ...ఎక్కడ తన  లోపాలు ఇతరులకు తెలిసి పోతాయో అని భయంతో ఎదుటి వారిని తక్కువచేసి మాట్లాడటం, నలుగురిలో కించపరచడం.. ఇలాంటివి చేస్తూ మనని మనమే బయట పెట్టేసుకుంటాం...!! ఒక మనిషికి ఆ మనిషిలోని విజ్ఞతకు, వ్యక్తిత్వానికి,మంచి మనసుకు విలువ ఇవ్వండి...డబ్బుకు, హోదాకు,భాషకు కాదు....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner