2, డిసెంబర్ 2013, సోమవారం

నీ రాకతో....!!

స్వరాల జతలు జత కలువలేదు
పద లయల సవ్వడులు వినిపించలేదు
ఎక్కడో జారిపోయిన మువ్వల మాటలు
హంసధ్వనిలా అనిపించాయేమో....!!

స్వర రాగాలు సప్త స్వర నాదాలుగా
వినిపించిన మనో వీచిక అల్లరి
చక్రవాకాల గమకాల శృతిలో
ఇంకా నను తాకుతూనే ఉన్నట్టుంది...!!

ఆరోహణావరోహణాల మధ్యమంలో
గాంధారంలా గంభీరంగా అనిపించినా
హిందోళంలో హిమపాతాల చల్లదనం
ఆనందభైరవి అంచులను అందుకున్న ఆనందమో...!!

సావేరి జతుల గతుల అరుణోదయం
వర్ణ రాగాల వక్ర రాగాల విషాదాంత్య రాగాల
విరచిత కవనం ఈ జీవిత రాగం మేళవించిన
మోహన రాగం నీ పరిచయ స్నేహ రాగం...!!

సప్త వర్ణాల సప్త స్వరాల ఆటల అలల
ఊహల కలల రేఖా చిత్రం నా మనో గవాక్షాన
అంబరాన్ని కాన్వాసుగా మేఘాల రంగుల్లో
మెరిసిన అలజడి మేఘన రాగమైనదేమో...నీ రాకతో....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

ఎక్కడో జారిన మువ్వల సవ్వడుల హంసధ్వనులు అనిపించి,
చక్రవాకాల గమకాల శృతి నను తాకుతూ
హిందోళంలో హిమపాతాల చల్లదనం ఆనందభైరవి అంచుల్ని అందుకుని

ఒక పరిచయ స్నేహ రాగం .... సప్త వర్ణాల సప్త స్వరాల ఆటల అలల ఊహల కలల రేఖా చిత్రం లా నా మనో గవాక్షాన .... నీ రాకతో,

భావనల ఉత్తుంగ తరంగాల ఆటుపోటులు అక్షరాల్లో చదివేవారికి అర్ధం కాని భయోత్పాతాన్ని కలిగిస్తూ,
హృదయపూర్వక అభినందనలు మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అభిమాన స్పందనకు పాదాభివందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner