24, అక్టోబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...నాలుగవ భాగం....!!

మన సాహితీ ముచ్చట్లలో వృత్త పద్యాల అంద చందాల గురించి కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ ఉన్నాము కదా... మా తెలుగు మాష్టారు నా మీద కోపంతో ఎప్పుడు తెలుగులో నాకు ఎక్కువ మార్కులు వేసేవారు కాదు.. ఆడుతూ పాడుతూ మిగిలిన వాటిలో ఎక్కువ తెచ్చుకున్నా తెలుగులో కాసిన్ని తక్కువే వచ్చేవి... ఆ కోపంతోనే ఎందుకో తెలుగంటే బోలెడు ఇష్టం పెరిగి ఛందస్సు బాగా నేర్చుకోవడం మొదలు పెట్టి అప్పట్లో ఉన్న వృత్తాలను బాగా పద్య వివరణతో చెప్పేదాన్ని... ఓ రకంగా ఈ రోజు ఇలా మీ అందరి ముందుకు రావడానికి ప్రత్యక్షంగా తెలుగంటే ఉన్న బోలెడు ఇష్టంతో పాటు.... పరోక్షంగా మా తెలుగు మాష్టారే కారణం... తెలుగు సరిగా పలకలేవంటు ఎద్దేవా చేసేవారు... ఒక్క తప్పు లేకుండా పద్యాలే కాకుండా పాఠాలు కూడా బాగా చదివేయడంతో మీకు ఎంచక్కా సాహితీ ముచ్చట్లు చెప్పేస్తున్నా... పదవ తరగతిలో నాకు వచ్చిన తెలుగు మార్కులు చూసి అందరు ఏం రాసేసావు ఇన్ని మార్కులు వచ్చేసాయి అని అంటూ ఉంటే... చెప్పొద్దూ నాకూ భలే సంతోషం వేసేసింది అప్పుడు... నాకు పురాణాలు, ఇతిహాసాలు చదివిన జ్ఞాపకం లేదు... ఏదో నాకు తెలిసిన కొన్ని సాహిత్యాలను మీతో పంచుకోవాలని ఇలా...
పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. మనం వృత్తాల లక్షణాల గురించిన వివరణలు చెప్పుకుంటూ ఉన్నాము కదా.... క్రిందటి సారి ఉత్పలమాల గురంచి....  ఇక చంపకమాల విషయానికి వస్తే కావ్యాలలో చంపకమాలది ప్రత్యేకమైన స్థానం... న జ భ జ జ జ ర ఎందుకో ఈ గణాలు భలే కొత్తగా అనిపించేవి అప్పుడు... తరువాత తరువాత మన సినిమా సాహిత్యంలో ఎక్కువగా చోటు చేసుకున్న పేరు కూడా చంపకమాల.....
చంపకమాల గురించి.....

నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.  

లక్షణములు

  • పాదాలు: నాలుగు
  • ఈ పద్య ఛందస్సుకే సరసీ అనే ఇతర నామము కూడా కలదు.
  • వృత్తం రకానికి చెందినది
  • ప్రకృతి ఛందమునకు చెందిన 711600 వ వృత్తము
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
  • ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
  • యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గణ విభజన

చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన
I I I I U I U I I I U I I U I I U I U I U
దము లబట్టి నందల కుబా టొ కయింత యులెక శూరతన్

ఉదాహరణ 1

పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.
దముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్


వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.
ఉదాహరణ 2
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
                                  - పెద్దన మనుచరిత్రము నుండి.

చూసారా ఎంత చక్కని తెలుగు సాహిత్యమో....  ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు ఇలా ఈ శీర్షిక ద్వారా సాహితీసేవ సమూహములో మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది... 

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sridevi చెప్పారు...

Nenu (inkaa naalanti vaallu undochu) entho shradha ga meeru vraasthunna vivaraalu chaduvuthunnaanu. Telugentha madhuram! Inkonchem pedda tapaa unte bavundanipinchindi. Taruvai tapaa kosam eduruchusthunnaanu.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శ్రీదేవి గారు మీ అభిమానానికి .... పెద్దగా రాస్తే చదవడానికి ఇబ్బంది పడతారని ఇలా రాశాను ... తప్పకుండా వివరాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner