26, అక్టోబర్ 2017, గురువారం

ఎటూ పోలేక...!!

తరతరాలుగా తరలి వస్తోంది
ఆకలి కేకల అరణ్యరోదన

నరనరాన వ్యాపిస్తోంది
నడతలేని సంప్రదాయం

దిగంతాలుగా వెలుగుతోంది
దుర్మార్గపు దురాచారం

మారుతున్న వ్యవస్థ మూగబోయింది
రంగుల రాజకీయ క్రీడల నడుమ

తడబడి తబ్బిబ్బవుతోంది
మార్పు కోరే మెుదటి అడుగు

అనుబంధాలు ఆవిరౌతున్నాయి
అలవికాని ధన దాహానికి

సర్దుబాటుకు సామాన్యుడు  తలవంచక తప్పడం లేదు
అవినీతి అందల మెక్కాక

సగటుజీవి బ్రతుకులు కన్నీటిలో కొట్టుకపోతున్నాయి
కార్పోరేట్ ఖజానాకి వైద్యం తాకట్టు పెట్టాక

బాబాలు పరమాత్ములయ్యాక
సంస్కృతి ధనం ముసుగుకప్పుకుంది

సాధించిన ప్రగతి కూడా
కులాల కంపు కొడుతూనే ఉంది

ఆధునికత దేశం నుదుట దిష్టిచుక్కయ్యింది
పేదరికం మూఢనమ్మకాలకు తలవంచుకుంటోంది

తలరాత మారని దైన్యం రైతుదయ్యాక
వాగ్దానాల ముండ్లకిరీటాలు మోస్తూనే ఉంటాడు

ఎదుగుతూనే ఉన్న దేశంలో
ఓట్లవరకే పరితమౌతుంది ప్రజాస్వామ్యం

బలిపశువులౌతున్న బడుగుజీవులు
ఆశలను రేపటికి వాయిదా వేసుకుంటూ

ఎటుపోలేక నిస్సహాయతలో నలగుతూ
కొత్తదనం కోసం కాస్త సంతృప్తి కోసం వేచి చూస్తూనే ఉన్నారు...!!

ఇద్దరి మనసు చప్పుడు ఈ కవిత... ఎలా ఉందో చదివి చెప్పండి...
మంజువాణి

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఏముందమ్మా ఇంకో బుచికి తవిక. అంతే.

అజ్ఞాత చెప్పారు...

ఏదో ఆ బుచికీ రాయి చూద్దాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner