11, మార్చి 2020, బుధవారం

వెన్నెల పుష్పాలు సమీక్ష..!!

సమాజంలో చాలా కొద్దిమందే భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందులో అతి అరుదైన లక్షణం అవయవదానం. దీని మీద సరైన అవగాహన లేని మన సమాజంలో..ఎంతోమందికి తన రాతల ద్వారా, చేత ద్వారా సరైన అవగాహన కల్పిస్తూ, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడిన నేటి మహిళ భారతి కాట్రగడ్డ. ఈమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తీరికలేని ఇంటి బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో సతమతమౌతూనే, తనవంతుగా నలుగురికి శరీర, అవయవదానాల గురించి చెప్తూ, ఎందరో పెద్దల నుండి ఆశీస్సులు,  పురస్కారాలు అందుకుంటున్న భారతి కాట్రగడ్డ అభినందనీయులు. చక్కని కవిత్వాన్ని అందిస్తూ, అది కూడా అవయవదానానికే ప్రాధాన్యతనిస్తూ ఓ కవితా సంపుటి " వెన్నెల పుష్పాలు " తేవడం ముదావహం. 
      
     ప్రాణం పోయాక మట్టిలా మారకుండా, మాణిక్యమై మరొకరిలో జీవాన్ని నింపుతుందని, గుప్పెడు బూడిద కాకుండా నలుగురికి ప్రాణం పోయమని, ఇలా ఓ అరవై చిరు కవితల్లో అవయవదానం గొప్పదనాన్ని చెప్తారు. మృత్యువును సవాల్ చేస్తూ, నేను మరణించిన బూడిదగా మారను, మరి కొందరిలో జీవిస్తాను అవయవదానంతో అంటారు. కవితలుగానే కాకుండా దానాల్లోకెల్లా అవయవదానం శ్రేష్ఠమంటారు చక్కని సీస పద్యంలో.  పండుటాకులా రాలిపోతున్నా పదుగురిలో జీవించే ఉంటానన్న ఆత్మవిశ్వాసం, పరోకారాయమిదం శరీరం అన్న లోకోక్తిని గుర్తు చేస్తారు మరోచోట. మూడేళ్ళ చిన్నారికి నూరేళ్ళు బ్రెయిన్ డెడ్ తో నిండితే, ఆ తల్లిదండ్రులు బాధను బాధ్యతగా మార్చుకుని, కొందరు తలిదండ్రులకు కడుపుకోతను దూరం చేసిన మహోన్నత అవయవదానం యజ్ఞాన్ని అక్షరబద్దం చేసారు హృద్యంగా. ఒక్కసారి అవయవదాతగా మారి చూడు, జీవితపు అంతర్ముఖం తెలుస్తుందంటారు. ఎందరో స్పూర్తిప్రధాతలు ప్రభోదించి, అవలంబించిన మార్గం ఈ అవయవదానం, శరీరదానం అంటూ కొందరని గుర్తు చేస్తారు. మనిషి అహంతో ఎంత విర్రవీగినా ఆఖరి క్షణాల్లోనైనా అవయవదానం ఆవశ్యకతను గుర్తెరిగి తమ జీవితానికి అర్థాన్ని గుర్తించాలంటారు. ఎందరో తల్లుల త్యాగాలను తెలుపుతూ, మరణం మన అతిథే ఆహ్వానించు తప్పదు కాని, మరణించీ జీవించడమే జీవిత పరమార్ధం అంటారు. వెన్నెల ఆకాశంలోనే కాదు, ఈ భువిపై కూడా అవయవదానం " వెన్నెల పుష్పాలు " గా విరాజిల్లుతుందన్న ఆశాభావంతో అవయవదానం కోసం ఎదురుచూస్తున్న ఎందరికో చేయూతనివ్వమంటూ, సమాజంలో చైతన్యాన్ని కలిగించమని ప్రతి ఒక్కరికి వినమ్రంగా నివేదిస్తూ, ఈ క్రతువులో పాలుపంచుకుంటున్న మనసివ్వు మహనీయులందరికి అక్షరాంజలి ఘటిస్తున్నారు. 
          మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరే అని గుర్తు చేస్తూ, ఆశయ సాధన ధ్యేయంగా, మానవజన్మకు సార్థకత కల్పిస్తూ, యువత ముందడుగు వేయాలని కోరుకుంటూ, మనమే మరి కొందరికి ప్రేరణగా మారాలని ఆకాంక్షిస్తూ, సమాజానికి అవయవదానంలో ఉన్న అపోహలు తొలగించి, ప్రతి ఒక్కరిలో దేహ, అవయవదానం గురించి అవగాహన కల్పిస్తూ, మానవజన్మకు అవయవదానంతో పరిపూర్ణత అని చెప్తూ చక్కని సందేశాత్మక కవితలు ఈ పుస్తకం నిండా చోటు చేసుకున్నాయి. అందరూ చదివి ఆచరించదగ్గ ఆచరణ ఇది. ఇంత అద్భుతమైన సందేశాత్మక కవితా సంపుటి  " వెన్నెల పుష్పాలు " రచించిన భారతి కాట్రగడ్డకు హృదయపూర్వక అభినందనలు. 
     

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మెచ్చుకోదగిన, పాటించవలసిన అంశం. మీ పోస్ట్ కొంత మందికైనా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తాను.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి.. అచ్చు తప్పులు సరిచేసానండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner