11, మార్చి 2015, బుధవారం

చిద్విలాసాలు చిందిస్తాడో....!!

నేస్తం....
           కోపమనేది మనకి వస్తే నష్టం కూడా మనకే కదా... మనమేమయినా గొప్ప వ్యక్తిత్వమున్న వాళ్ళమయితే
ఎదుటి వారిని చీదరించుకున్నా కాస్తయినా అర్ధం ఉంటుంది...మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని పట్టించుకొనక పోయినా దాన్ని మనమే పట్టించుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాము.... ఒక్కోసారి ఆ కష్టాలకు కూడా విసుగు వచ్చి మనల్ని ఆనందానికి అరువుగా ఇచ్చేస్తూ ఉంటాయి .... కొన్ని సంతోషాలేమో మనకి చెప్పా పెట్టకుండానే మూసిన తలుపు తోసుకుని మరీ వచ్చేస్తుంటాయి... ఏదో సామెత చెప్పినట్టు " కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్టుగా..." మన జీవితంలో బాధలు సంతోషాలు ఒకదానికొకటి చుట్టాలైనట్టుగానే మన చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు మరొక ఎత్తు... కొన్ని బందాలేమో మనం వద్దన్నా మన వెంట పడుతూనే ఉంటాయి... మరికొన్నేమో మనం కావాలన్నా మన దగ్గరగా రాలేవు...ఎన్నో ఏళ్ళ పరిచయమున్నా అన్ని చెప్పలేము, అలా అని మనకు కావాల్సింది అడగనూ లేము.... కనీసం ఒకసారి పలకరించి వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే మళ్ళి పలకరించే సాహసం కూడా చేయడానికి ముందు వెనుక చూస్తాము... మరి కొందరితో చాలా కొద్ది పరిచయమయినా జన్మ జన్మల పరిచయమున్నట్టు కలసిపోతాం... అదేనేమో మనుష్యులతోను మనసులతోను స్నేహంలో ఉన్న తేడా... మన జీవితాలతో ఆడుకునే జగన్నాటక సూత్రధారి చిరునవ్వు వెనుక మర్మం ఇదేనేమో... చూద్దాం ఇలా ఎన్ని కాలాలు ఈ జీవితాలను చూస్తూ తను రాయాలనుకున్న రాతలు రాసేస్తూ చిద్విలాసాలు చిందిస్తాడో....!!
ఎందుకో ఇలా రాయాలనిపించింది నేస్తం....
నీ నెచ్చెలి

9, మార్చి 2015, సోమవారం

అదో అద్భుతాల నిలయం...!!

http://www.manatelugutimes.com/archives/1051

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నేను రాసిన చిరు కవిత మన తెలుగు టైమ్స్ లో .....


కాసింత ఓదార్పుకే ఆకాశమంత ప్రేమను పంచే
ముదిత మనసు అందమైన జలపాతమై
చూపరుల సంతోషమే తన జీవిత ధ్యేయమంటూ
కడగండ్ల కల్లోలాన్ని కనుపాపలలో దాచేసి
జారుతున్న కన్నీటి సహవాసాన్ని స్వీకరిస్తూ
మోసపోయిన బతుకులో మోదాన్ని మరచి
రాలుతున్న మనసు పూల రాగాలను
చిరునవ్వు చాటుగా దాచేస్తూ
అల్లుకున్న బంధాలను అందాల అల్లికగా అమర్చి
బాధ్యతల భారాన్ని బహు ఇష్టంగా మలచుకొని
కడలి అలల పాఠాన్ని కంఠతా పట్టి
తీరాన్ని తాకాలన్న ఉబలాటాన్ని
బతుకుబాటలో అన్వయించి
మది మధనాన్ని అక్షరాలలో రంగరించి
పదాల చెలిమితో పంచదార పలుకులను అందిస్తూ
జీవన పరమపద సోపానంలో పాములకు చిక్కుతూ
గెలుపు మెట్లను ఎక్కాలని నిరంతరం యత్నిస్తూ
అన్ని మరచే అతివ అంతరంగం అవగతమైతే
అదో అద్భుతాల నిలయం...!!

7, మార్చి 2015, శనివారం

మహోన్నత తెలుగు తేజం....!!

ఈనాటి యువతలో పేరుకు పోతున్న అసహనానికి కారణాలు అనేకం... కాని మీ సమస్యను నాకివ్వండి దానికి
పరిష్కారం నేను చూస్తాను అన్న ఈ అపర మేధావి గురించి మనలో ఎంత మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు... పుట్టింది పెరిగింది సామాన్య కుటుంబంలో .... చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతూ కొన్ని రోజులు మన దేశంలో తన సేవలను అందించి .... తన ప్రతిభకు తగిన అవకాశాలను కల్పించలేని మాతృదేశాన్ని వదలలేక వదలి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒమన్ దేశంలో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ సోహార్ ఇన్ ప్రాస్ట్రక్చర్ కంపెనీలో రోడ్స్ ఇంజనీరుగా పనిచేస్తూ కూడా భారత దేశం పై ఉన్న మమకారంతో తన దేశం సూపర్ పవర్ గా రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి అన్న అంశంపై దాదాపు ఐదు ఏళ్ళు కష్టపడి వేల జర్నల్స్ రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి చాలా కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తున్నారు...
'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ ఎ లాట్' అనే సూత్రంపై ఏకంగా ప్రత్యేక టెక్నాలజీని రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.ఈ గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వడం లేదని తన ఆవేదనను చాలా వేదికలపై వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న ఆర్యోక్తిని అక్షరాలా పాటిస్తూ తెలుగు వారికి తనదైన చేయూతను అందిస్తూ... తన మాటల చాతుర్యంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ... లెక్కలేనన్ని సత్కారాలను, దేశ విదేశాల్లో అత్యన్నత గౌరవ పురస్కారాలను అందుకున్నా.... తెలుగు'వాడి' వేడిని ప్రపంచానికి చూపించిన ఈ భీమవరం మద్దుల నాగభూషణ రావు గుప్త తన మాతృ భూమికి తన సేవలు వినియోగించాలన్న తపనను వీడలేక... సరైన అవకాశం కోసం నిరీక్షిస్తున్న ఈ అపర మేధావి మేధను అభినందిస్తూ... 
భారత దేశం సూపర్ పవర్ గా నిలవాలన్న తన కోరికలో మనమూ భాగస్వాములం అవుదామని... 
ప్రభుత్వం సత్వర సహకారాన్ని అందిస్తూ గుప్త గారి సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ.... 
ఇంతటి మహోన్నత తెలుగు తేజం మనదైనందుకు తెలుగు వారిగా మనమూ గర్వపడదాము....

6, మార్చి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది రెండవ భాగం....!!

వారం వారం నిరంతరాయంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం ఇప్పటిదైన ఆధునిక యుగ ప్రారంభం... దానిలోని విశేషాలు తెలుసుకుందాం...

1875 తరువాత - ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి , కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదము నకు దారితీసింది.

  • తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
  • ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.

తెలుగు సాహిత్యంలో 1875 తరువాతి కాలాన్ని ఆధునిక యుగము అంటారు.

రాజకీయ, సామాజిక నేపథ్యం

ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి కొత్త ప్రక్రియలను అభివృద్ధి చేసేందుకు ఉపకరించింది. గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి వ్యవహార భాషావాదులు వివిధ కష్టనిష్టూరాలకు ఓర్చి వ్యవహారభాషను విద్యాభ్యాసం, సాహిత్యసృష్టి వంటివాటికి ఉపయోగించేలా కృషిచేశారు. వస్తువు విషయంలో అభ్యుదయ వాదులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిజం వంటి రాజకీయ ఉద్యమాలు, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం తదితర సామాజిక ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని లోతుగానూ, విస్తృతంగానూ ప్రభావితం చేశాయి. ఆంగ్ల సాహిత్యాధ్యయనం వల్ల ప్రక్రియ, వస్తువు, శైలి వంటి విషయాల్లో పాశ్చాత్య సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యం ప్రభావితమైంది.

ముఖ్య పోషకులు

ఈ యుగంలో తొలినాళ్లలో జమీందారులు, సంపన్నులు, అనంతర కాలంలో పత్రికలు, రేడియోలు, వాటి ద్వారా విద్యావంతులు సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ది ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. పద్యకవులకు కీర్తి, ధనం దక్కిన ఈ కాలంలో కవిత్వరచనపైన, కవుల పాండిత్యం, ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వాజ్యాలు కూడా నడిచాయి. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమైన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చుయంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తకప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవి రచయితలకు ధనసంపాదన మార్గమైంది. రేడియో రంగంలో నాటకరచన, కథారచన, గీతరచన వంటివి ఉద్యోగాలు ఉండడంతో ఆకాశవాణి కృష్ణశాస్త్రి వంటీ ప్రముఖ కవి, రచయితలకు సంస్థలో చోటుకల్పించింది. సినిమా రంగంలో శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి పలువురు సాహితీవేత్తలు సినీకవులు, రచయితలుగా స్థిరపడ్డారు.
ఈ ఆధునిక యుగంలో మనకు తెలిసిన కొన్ని ... 
ఉద్యమాలు:  వ్యవహారిక భాషోద్యమం, గ్రంధాలయోద్యమం, హరిజనోద్దరణోద్యమం,తెలంగాణోద్యమం... 
కవితా రీతులు : దేశభక్తి కవిత్వం , భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, అవధానం, వచన కవిత్వం, మినీ కవిత్వం, సినిమా కవిత్వం, ఆశు కవిత్వం.... 
వచన రీతులు, ప్రక్రియలు: తెలుగు నవల, కథ, పద్యం, నాటకం, పత్రికారంగం, వ్యాకరణం, నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం, సాహితీ విమర్శ, తెలుగులో చరిత్ర రచనలు, యాత్రా రచనలు, విద్యా బోధన, అధికార భాషగా తెలుగు, తెలుగులో అనువాద సాహిత్యం ... మొదలైనవి. 
ఈ ఆధునిక యుగంలో యువ కవులు కొత్తగా తెర తీసిన భావ కవిత్వం గురించి వివరాలు చూద్దాము 

భావ కవిత్వం

భావ కవిత్వము (Lyrical poetry) నకు తత్త్వదృష్టిలో మాతృక కాల్పనిక కవిత్వం (Romantic poetry). దీనిని ఆంగ్లములో "లిరికల్ పోయిట్రీ" అన్నారు. లైర్ (Lyre) అనే వాద్య విశేషముతో పాడే కవిత కావున దీనికి "లిరిక్ పోయిట్రీ" (Lyric poetry) అనే పేరు వచ్చినది.
భావ కవిత్వము అనుపదము శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారిచే ప్రప్రధమమున వాడబడినదని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారు రాజమహేంద్రవరము (రాజమండ్రి) న జరిగిన ద్వితీయ అభినవాంధ్ర కవిపండిత సమావేశమందు చెప్పియున్నారు. ఆసమావేశమునే మాట్లాడుచు శ్రీశివశంకరశాస్త్రిగారు 'ఆత్మగౌరవము' అనుపదమునందువలనే 'భావకవిత్వం' అనుపదమునందున తమకు అభిమానము లేదనియు, ఆ పదమును ఈనాటి కవితకు వాడరాదనియు చెప్పియున్నారు.
భావకవిత్వమనుదానిని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారే ప్రారంభించిరి. అటుపై శ్రీకృష్ణ శాస్త్రిగారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ కవిత్వము ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు కలవు. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందర్భము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదాని వలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును అర్ధము చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేదా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నారు.
భావం అనగా అభిప్రాయము అని అర్ధము. అనగా ఒక కధా సందర్భములో చెప్పబడిన భావమేమి అని ప్రశ్నించుకొనినచో ఆ సందర్భమున ఆపద్యమునకు కల స్ఠానము మనకు సమాధానమగును. “భావ కవిత్వము” అను పదమునందలి “భావము” అనుపదమునకు అర్ధము “అభిప్రాయము” అనికాదు. రసమునకు అంగమయిన “భావము” అని అర్ధము. రసములు తొమ్మిది. ప్రతీ రసమును స్థాయిత్వమును పొందవలెనన్నచో విభావానుభావసాత్వికవ్యభిచారి భావములు అంగములుగ ఆయా సందర్భములలో వర్ఞింపబడవలెను. అప్పుడు అవి అన్నియు ఆనీయమానస్వాదువులై  ఏ రసమునకు అంగములుగా వర్ఞింపబడినవో దానికి స్థాయిత్వమును సిద్ధింప జేయును. ఇట్లు విభావాది భావములు సమగ్రముగా వర్ఞించబడిన కృతి అఖందకృతి (ప్రబంధము) అనబడును. అట్లుగాక రసమునకు అంగములయిన భావములలో ఏ ఒక్కదానినో వర్ణించి అది ఏ రసమునకు ఏ భావమో చెప్పబడక, స్వభావమును మాత్రమే వర్ణింపబడి అంతటితో వదిలివేయబడినచో స్థాయిత్వమును చెందక భావ ప్రధానమయిన ఏ రచన ఖండకృతీను పేరుతో భావ కవిత్వముగా పరిగణింప బడుచున్నది. దీనిని బట్టి చూచినచో పూర్వుల కవితను రసకవిత్వమనియు, ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనియు చెప్పుకోవచ్చును.

భావ కవులు

  • దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • రాయప్రోలు సుబ్బారావు
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

1, మార్చి 2015, ఆదివారం

నమ్మకమే పునాదిగా...!!

నేస్తం....
           ఆగిపోయింది అనుకున్న జీవితం మళ్ళి మొదలైంది ఎందుకంటావు...? చాలా రోజులు మోసాలు ద్వేషాలు తట్టుకున్న మనసు పాపం ఇక తట్టుకోలేనంటు విశ్రాంతి కోరుకుంటే... దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టు మళ్ళి  బతికి బట్ట కట్టింది ఏదో ప్రయోజనం కోసమేనేమో...స్నేహం, అభిమానం అంటూ పై పై మాటలు చెప్పే చాలామంది స్నేహానికి అవసరం వస్తే ఎంత వరకు మొండి చేయి చూపించకుండా ఉంటున్నారు ఈ రోజుల్లో...? మన అవసరానికి అదే స్నేహాన్ని వాడుకుంటూ.... కనీసం ఓ చిన్న పలకరింపుకి కూడా మనకి సమయం లేనంతగా మన జీవితం సాగుతోందా... పలకరిస్తే ఎక్కడ ఏమి చేయాల్సి వస్తుందో అని మన భయం.... ఇది మనిషి అన్న వాడికి సహజమే... అవసరానికి చాతనయితే కాస్త సాయం చేయడంలో మన సొమ్మేం పోదుగా... మహా అయితే వాళ్ళు కాస్త బావుంటారు అంతే కదా... నా చుట్టూ ఉన్న స్నేహాల్లో కొన్నేమో ఇలా అవసరానికి మనల్ని వాడుకునేవే...  దీనిలో బంధువులకు కూడా మినహాయింపేం లేదు... చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు కొద్ది మంది... మరి కొందరేమో మనం అడగకుండానే మనలను ఆదుకునే వాళ్ళు... అందుకేనేమో ఎందరితో ఎన్ని దెబ్బలు తిన్నా కాస్తయినా మిగిలి ఉన్న ఆ మంచితనానికి దాసోహం అనక తప్పడం లేదు...
అడగకుండానే అవసరానికి నా దగ్గర ఇంత ఉంది ఎవరికీ ఇచ్చి పంపను అన్న ఆత్మీయురాలిని ఎన్నటికి మరువలేను... అలానే అడగకుండానే నన్ను ఆదుకున్న నేస్తాలను... నా అవసరాన్ని గుర్తించి నాకు ధైర్యాన్ని అందించి, నాకంటూ ఓ ఆసరా ఇచ్చి నా పునర్జన్మకు ఓ అర్ధాన్ని అందించిన ఆత్మీయుడికి ఎప్పటికి కృతజ్ఞురాలినే...
మాటలు అందరమూ చెప్తాము కాని ... మాటల్లో కాదు చేతల్లో చూపించడం అంటే ఇదేనేమో... ఇప్పటి వరకు నా నమ్మకం మీద దెబ్బలు పడటమే చూసాను... కాని

రేపటి నుంచి మొదలవబోయే నా జీవితపు ద్వితీయ అంకానికి ఆ నమ్మకమే పునాదిగా చేసుకుని వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తాను...దానికి నీ సహృదయం తోడుగా ఉంటుంది కదూ....!!
ఉండనా మరి
నీ నెచ్చెలి
 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner