1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఘనీభవించిన మనసు...!!

ఏ రాతిరి రాసిన రాగమో
ఏ  వెన్నెల విసిరిన వేదనో
ఇలా చేరి గతాన్ని మరచిన జ్ఞాపకమైంది

కాసారం కాని కలగా నిలిచి  
సాక్షాత్కారం కాలేని వరమై మిగిలి
నిషిద్దాక్షరమై మది ముంగిట ఉండి పోయింది

మూసిన కనుల ముందర
మురిపించిన మనసు కోరిక తారాడిన తావి
వెదుకలేక వేసారిన ఈ జన్మ అలసింది

రాహుకేతువులు  రెప్పపాటున కబళించి
వామపాదంతో కదం తొక్కుతూ
జీవితాన్ని రాబందుల్లా ఏలుతున్నారు

గుండె గురుతులు గుచ్చుతున్నా
ఇంకిన నెత్తుటి రంగులో అగుపగుతూనే
తడి ఆరడం లేదు ఈ ఘనీభవించిన మది చిత్రాలు...!!

21, మార్చి 2016, సోమవారం

సాంద్ర భావుకతాక్షరాల కవిత్వం....!!

ఈ రోజు ఆంద్ర ప్రభ  వార్తా పత్రిక సాహితి పేజ్ లో నా అక్షరాల సాక్షిగా పై డా . పి . సుబ్బారావు గారు  రాసిన సమీక్ష ... వారికి , పత్రిక వారికి నా కృతజ్ఞతలు ... 
http://epaper.prabhanews.com/index.aspx?eid=31928#

5, మార్చి 2016, శనివారం

ఒకే ఒక్కరు...!!

ఎన్నో ముఖాముఖిలు సాహితి సేవ సమూహం ద్వారా ఎందరో అతిరధ మహారధులను పరిచయం చేసాను కాని ఒకే ఒక్కరు గుర్తు పెట్టుకుని మరీ ఈరోజుకి నాతో ముఖాముఖికి ఒక సంవత్సరం పూర్తి అయింది అని అభినందించిన వ్యక్తి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు ... ఇంత పెద్ద మనసున్న గుప్త గారికి, వారిని పరిచయం చేసిన సుబ్బానాయుడు గారికి , అవకాశాన్ని ఇచ్చిన సాహితీ సేవకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ..

3, మార్చి 2016, గురువారం

సాటి బంధాలనేమో...!!

అస్పృశ్యత ఆపాదించలేని
మనసాక్షరాలను వెదుకుతూ
అమ్మదనపు మమకారపు
చెమ్మదనంలో చేరుతున్న
గుండె సడికి గుప్పెడు పదాలతో
నమ్మకాల నజరానాకి పహారా కాస్తూ
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలుకుతూ
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ
చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక ఆపుతోంది
మనతో ముడేసుకున్న సాటి బంధాలనేమో...!!

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

నా మాతృ భూమి... !!

రోజూ నన్ను నేను మోసం చేసుకుంటునే ఉన్నా
కన్నతల్లిని మరిచా పురిటి గడ్డను వదిలేసా
డాలర్ల బరువుతో రూపాయిని బేరీజు వేసా
చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన దేశభక్తిని వదిలేసా
అమ్మ భాష కూడు బెట్టలేదని అరకొరగా వచ్చిన
ఆంగ్ల భాషను అందలమెక్కించా అదే జీవితమనుకొన్నా
అనుక్షణం భయంతో చస్తూ బతుకుతున్నా
అదే స్వర్గమని మాయలో పడి అమృతమయిని
నిరాదరణకు గురి చేసిన నా నిర్లక్ష్యపు విలువ
కట్టలు తెంచుకున్న ఓ కన్నపేగు ఆక్రోశం చేసిన ఆర్తనాదం
వేల గొంతుకలుగా గుచ్చుతుంటే...
సప్త సముద్రాలను దాటిన మాతృప్రేమలో కలసిన
దేశాభిమానం మదిని తాకుతూనిదురలేపగా
కలో గంజో అయినవాళ్ళ మద్యన తాగుతూ
జన్మనిచ్చిన అమ్మ ఋణం కన్నా ఆ అమ్మకు
ప్రాణం పోసిన గడ్డ పవిత్రతే ముఖ్యమని
అసహనం, అసమానత, జాత్యహంకారాలు దరిజేరనీయక
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం పెంచుతూ
మంచి మానవత్వం మనదని చాటుతూ
సాటివారి కష్టానికి చేయి అందిస్తూ
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే  మనుషులోయ్ అన్న
గురజాడ మాటని అక్షరాలా నిజం చేసిన మనసున్న
మనుష్యులున్న భరతభూమి నా మాతృ భూమిపై 
పెంచుకుకున్నా అనుబంధం తెంచుకోలేక
ఉండి పోతా తుది శ్వాస వరకు ఈ గడ్డ పైనే..!! 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner