కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్
లక్షణములు
మ | స | జ | స | త | త | గ |
U U U | I I U | I U I | I I U | U U I | U U I | U |
తా టం కా | చ ల నం | భు తో, భు | జ న ట | ద్ద మ్మి ల్ల | బం డం బు | తో |
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19
- ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ
- యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
- ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలు
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,
భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.
వైదిక ఛందస్సులో పద్యములు పండ్రెండు అక్షరములకు పరిమితములు. రామాయణ భారతములలో ఇంకను కొన్ని ఎక్కువ నిడివి గల వృత్తములు గలవు. బహుశా అశ్వఘోషుని బుద్ధ చరితలో, భాసుని నాటకములలో కష్టతరమైన, దీర్ఘమైన వృత్తములు కవులు వ్రాయుటకు ఆరంభించిరి.
అతి పురాతనమైన వృత్తములలో శార్దూలవిక్రీడితము అత్యంత ప్రసిద్ధమైనది. భారతీయ సారస్వత చరిత్రలో రెండు వేల సంవత్సరాలుగ అన్ని భాషలలో ప్రధాన పాత్ర వహించిన ఘనత ఈ వృత్తమునకు గలదు. అందులో పూర్వార్ధము పఠించుటకు సుందరమైనది. బహుశా అందువలన నేమో ఈ వృత్తమునకు విరామము మ-స-జ-స గణములకు పిదప ఉంచబడినది. ఈ ఉపోద్ఘాతము ఎందుకు అనగా ఈ పూర్వార్ధముతో ఈ ఒక్క వృత్తము మాత్రమే కాదు, ఇంకను మూడు వృత్తములు గలవు. అవి- శార్దూలము, రెండు భిన్న లక్షణములు గల వాయువేగ అను వృత్తము. శార్దూలవిక్రీడితమును శార్దూలము అనుట వాడుక. శార్దూలము మఱొక వృత్తము, అది శార్దూల విక్రీడితము కాదు. శార్దూలము పింగల ఛందస్సులో చెప్పబడినది. వాయువేగ హేమచంద్రుని ఛందోనుశాసనములో, జానాశ్రయిలో నున్నవి. ఈ మూడు వృత్తములకు, శార్దూల విక్రీడితమునకు గల భేదము రెండవ భాగములో, అనగా త-త-గ స్థానములో. శార్దూలములో త-త-గ కు బదులు ర-మ, హేమచంద్రుని వాయువేగకు త-త-గ కు బదులు న-జ-గ, జానాశ్రయి వాయువేగకు త-త-గ కు బదులు న-న-గ. యతి స్థానము ఈ వృత్తములన్నిటికి ఒక్కటే.
క్రింది ఉదాహరణలలో పూర్వార్ధము అన్నిటికి ఒకటే. ఉత్తరార్ధమును మార్చి వ్రాశారు .
శార్దూలవిక్రీడితము- మ-స-జ-స-త-త-గ, యతి (1, 13)
19 అతిధృతి 149337
పారావారముగాదె సత్కరుణకున్, పాలించు ప్రాణేశునిన్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, శ్రీలింక నీకేలనే,
యారామమ్ము విలోల మానసము, నీవందుండు పుష్పాలతో
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నా దైవ పూజార్థమై
శార్దూలము- మ-స-జ-స-ర-మ, యతి (1, 13)
18 ధృతి 10073
పారావారముగాదె సత్కరుణకున్, పాల ముంచున్ దేల్చున్,
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, శ్రీలవే, వేఱేలా,
యారామమ్ము విలోల మానసము, నీ వా జపా పుష్పాలన్
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నా పదా లందుంచన్
వాయువేగ (జా) - మ-స-జ-స-న-న-గ, యతి (1, 13)
19 అతిధృతి 259929
పారావారముగాదె సత్కరుణకున్, వరముల తరువున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, సిరు లనవసర-,
మ్మారామమ్ము విలోల మానసము, నీవట గల విరులన్
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నతనిని గొలువన్
వాయువేగ (హే) - మ-స-జ-స-న-జ-గ, యతి (1, 13)
19 అతిధృతి 194393
పారావారముగాదె సత్కరుణకున్, వరముల భూజమున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, సిరు లిక నేలనే,
యారామమ్ము విలోల మానసము, నీ వలరు సుమాలతో
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నమలుని పూజకై
వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సహకారంతో .....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....