1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
సాహిత్య పోషణ
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా
తిరుమలవెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు
ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము
కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
కులము
శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
సమకాలీన సంస్కృతిలో
శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369
ప్రబంధ యుగము
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.
పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
లక్షణాలు
ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.
ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.
రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.
మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.
నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.
వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.
చరిత్ర రచనలో
తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంద యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.
ఉదాహరణలు
మనుచరిత్ర
సంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము
ఆముక్త మాల్యద
నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
ముకుందవిలాసము
వీరభద్ర విజయము
ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....
సేకరణ : వికీపీడియా నుండి
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....