29, ఆగస్టు 2020, శనివారం
భూతల స్వర్గమేనా.. 23
మూడు వారాలు అన్న ప్రాజెక్ట్ అలా అలా గడిచిపోతూ ఉంది. శాండి మెాబైల్ హౌస్ లో రోనెక్ సిటీ జీవితం బాగానే జరుగుతోంది. అమ్మానాన్నకు, మౌర్యకు అమెరికా రావడానికి పేపర్స్ పంపాను. ఆ పేపర్స్ నోటరి చేయించి పంపడంలో శాండి చాలా హెల్ప్ చేసింది. శాండి ఇంట్లో ఉండగానే మా చిన్న ఆడపడుచుకి పెళ్ళి సంబంధం అనుకోకుండా AMSOLరవి మూలంగా కుదిరింది. నేను ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్దాడపడుచు వాళ్ళాయన కాస్త సూటిపోటి మాటలన్నారు. ఏదో మాటల మీద రవి ఈ సంబంధం గురించి చెప్తే, ఆ పిల్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఫోటో పంపించి, చదువు, మిగతా వివరాలు చెప్పి నీకు నచ్చితేనే మాట్లాడతాను అని చెప్పాను. వాళ్ళ అక్కాబావ ఇష్టం అంది. అమ్మానాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత వాళ్ళతో మాట్లాడితే సంబంధం మాట్లాడమన్నారు. అబ్బాయి జీతం గురించి అడిగితే 4000, 5000 నాకు తెలియదు అని ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకేం అనుమానాలున్నా మాట్లాడండి అని నెంబర్ ఇచ్చాను. నాకుగా వాళ్ళు మాట్లాడిన వివరాలేం చెప్పలేదు. మా ఆయన అప్పుడు ఇండియాలోనే ఉన్నారుగా. మెుత్తానికి మాట్లాడి సంబంధం కుదిర్చారు. పెళ్ళికొడుకు..మరి పెళ్ళి ఖర్చులు ఇవ్వరా అంటే వాళ్ళేం ఇవ్వలేరండి. నేనే ఇవ్వాలి అంటే నవ్వేసి ఊరుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఓ రోజు మా మరిది ఫోన్ చేసి పిల్లకి ఇష్టం లేదని చెప్పాడు. ఆయన అప్పుడు అక్కాబావతో మాట్లాడడు. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఆమెకు ఇష్టం లేకపోతే మానేయండి, ఆవిడ సంగతి మీకు బాగా తెలుసు కదా, చదువు ఏం చేసిందో గుర్తు చేసుకోండి. వాళ్ళకి నేను ఏదోకటి చెప్పుకుంటాను అని అంటే, మేం మాట్లాడతాం అని చెప్పారు.
ఇదంతా శాండి వింటూనే ఉంది. విషయం ఏంటని అడిగితే ఇలా ఇలా అని వివరంగా చెప్పాను. మీకు ఇంత ప్రాసెస్ ఉంటుందా పెళ్ళికి అని ఆశ్చర్యపోయింది. ఈలోపల మా టెస్టింగ్ టీమ్ పుణ్యమా అని, నేను ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నానన్న కంప్లైంట్ తో, మా టీనాకి ఎగైనెస్ట్ గా, నా జాబ్ తీసేయించారు. టీనాకి తన పనిలో కూడా చాలా హెల్ప్ చేసేదాన్ని. టెస్టింగ్ చేయమంటే, బగ్స్ తో పాటు, కోడింగ్ ఏం చేయాలో, ఎక్కడ ఛేంజ్ చేయాలో చెప్తుండేదాన్ని. టీనానేమెా మంజూ మనం బగ్స్ ఐడెంటిఫై చేయాలంతే అని నవ్వేది. రామస్వామి నన్ను బెదిరిస్తే ఆ విషయం కూడా టీనాకి తెలుసు. చాలా సపోర్టివ్ గా ఉండేది నాతో. అది మిగతావాళ్ళకి కంటగింపు. నాకు పని లేకపోతే ఏం చోష్యం ఫోన్ మాట్లాడేదాన్ని జలం వదినతో, చికాగోలో కొందరితో. ఆఫీస్ వాళ్ళు నేను ఫోన్ మాట్లాడిన అవర్స్ లెక్కబెట్టుకున్నారు కాని నేను పని చేసిన టైమింగ్స్ గుర్తుంచుకోలేదు. అవి అన్ని మా టీమ్ లో అందరికి తెలుసు. ఎక్స్ట్రా అవర్స్ పే చేయరు. అయినా వర్క్ చేసేదాన్ని. ఎప్పుడైనా స్నో పడి లేట్ అవుతుంది రావడానికంటే, టీనా లీవ్ తీసుకోమనేది. తర్వాత టైమ్ షీట్ ఫిల్ చేసేటప్పుడు లీవ్ ది కూడా టైమ్ వేసుకో, నీకెలాగు మేం ఎక్స్ట్రా అవర్స్ పే చేయడం లేదు. నువ్వు లంచ్ టైమ్ కూడా తీసుకోవు అనేది. ఎంతయినా అందరు అమెరికన్స్ మధ్యన టీనా నాకు ఫేవర్ గా ఉండటం వారికి నచ్చలేదు. మెుత్తానికి నా మూడు వారాల ప్రాజెక్ట్ మూడు నెలలతో ఇలా ముగిసిందన్న మాట. అన్నట్టు చెప్పడం మరిచా మా శాండి వాళ్ళ ఫాదర్ మంచి కార్ రేసర్ అంట. నాకు శాండి డ్రైవింగ్ చూసి అనుమానమెుచ్చి అడిగితే ఆ విషయం చెప్పింది. అక్కడే ఓ రెండు రోజులుండి తర్వాత నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఏదైనా జాబ్ చూద్దాం, డెట్రాయిట్ వచ్చేయమంటే డెట్రాయిట్ బయలుదేరాను.
వర్గము
ప్రయాణం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం...
28, ఆగస్టు 2020, శుక్రవారం
మనసాక్షరాలు..!!
ఎందరిలో తానున్నా
మౌనం మాటాడితే
మనసు విన్నదట
గుండె గుబులుగా బదులిస్తే
గుప్పెడు జ్ఞాపకాలను పంచి
గువ్వలా ఒదిగిందట
అమ్మ పరిచయం చేసినా
ఆ తల్లినే మరిపించే
ప్రేమ మురిపెం తనకుందట
ఆర్తిగా అక్కున చేర్చుకుని
సుఖదుఃఖాలను పంచుకునే
ఆత్మీయ నేస్తమైందట
శరాన్ని కరముతో కలిపి
ఆయుధమై అన్యాయాన్ని ఎదిరించే
అరుదైన లక్షణమే తనదట
అందుకేనేమెా..జీవిత పుస్తకాన్ని
అనుభవాల పుటలతో నింపే
మనసాక్షరాలు కొన్నైనా కావాలనిపిస్తాయట..!!
వర్గము
కవితలు
24, ఆగస్టు 2020, సోమవారం
కాలం వెంబడి కలం..16
కాలం వెంబడి కలం..16
మా యశోదా వాళ్ళ లీలక్క మాకు సీనియర్. అక్క పెళ్ళికి కర్నూల్ వెళ్ళాము. నేను, పొడుగు మాతో లడ్డు(శ్రీనివాసరెడ్డి, తిరుపతి). పెళ్ళి బాగా జరిగింది. అంజయ్య చౌదరి కూడా వచ్చాడు. ఓ రోజు వెంకట్రావు మా బస్ దగ్గరకి వచ్చి మాట్లాడాలంటే నేను మాట్లాడను అన్నా. సరదాగా ఏడిపించాం అదేం గుర్తు పెట్టుకోవద్దు. కోపం తెచ్చుకోకు అని, మామూలుగా మాట్లాడాడు. మా నీలిమ మేం థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే హెచ్ ఎం టి బాబాయ్ ని పెళ్ళి చేసుకుంది. ఆ టైమ్ లో నేను ఇంట్లో ఉన్నాను. నీలిమ వాళ్ళ ఇంట్లోవాళ్ళు ముందు ఒప్పుకోలేదు. తర్వాత బానే ఉన్నారు. ఇప్పుడంతా హాపినే. మా జూనియర్స్ కూడా మాతో ఫైనలియర్ చదివేటప్పుడే వెళిపోయి పెళ్ళి చేసుకున్నారు. ఆ అమ్మాయి బాగా చదివేది. హాస్టల్ బాచ్ అందరం కలిసి మంత్రాలయం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అందరు పూజలు చేస్తున్నారని నేను, అను విగ్రహాల చుట్టూ పదకొండు రోజులు తిరిగి పూజ చేయించడము, రామకృష్ణ మఠానికి వెళ్ళడము ఇలా బోలెడు జ్ఞాపకాలు.
మా షర్మిల ఎం టెక్ కోయంబత్తూర్ లో చదువుతోంది అప్పుడు. ఓ రోజు మా క్లాస్ పిల్లలు ఎవరో చెప్పారు. షర్మిల వాళ్ళ అమ్మగారు చనిపోయారు. పేపర్ లో కూడా వేసారని. అందరికి తెలుసు షర్మిల నాకు బాగా క్లోజ్ అని. వెంటనే నేను,
ఉమారాణి షర్మిల వాళ్ళింటికి వెళ్ళాము. ఆంటీ బెస్ట్ టీచర్. చాలా బాగా మాట్లాడేవారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా. మెుదటిసారి షర్మిల వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆంటీ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, కాని షర్మిల వాళ్ళ అక్క కనిపించలేదు. ఏంటి అక్క లేదా అని అడిగితే ఉందని చెప్పింది. ఇంటికి వచ్చిన వారిని పలకరించరా, మీ ఇంట్లో ఎవరి ఫ్రెండ్స్ వారికేనా అని అడిగాను. ఆ తర్వాత నుండి ఎప్పుడు వెళ్ళినా అక్క చాలా బాగా మాట్లాడేది. పాపం వాళ్ళే ఉన్నారింట్లో. వాళ్ళ అమ్మానాన్నగారిది ఆ రోజుల్లోనే ప్రేమపెళ్ళి. శాఖలు మాత్రమే వేరైనా ఇంట్లో ఒప్పుకోలేదట. చుట్టాలెవరూ పెద్దగా రారట. మైల అని అందరు దూరంగా ఉంటున్నారు. ఎవరు రావడం లేదు. మా ఇంట్లో భోజనం చేస్తావా అని నా ప్రియ నెచ్చెలి అడిగితే చాలా బాధనిపించింది. నాకేం పట్టింపు లేదు, తింటానని చెప్పాను. కాకపోతే ఆంటీని చివరిసారిగా చూడలేకపోయానని చాలా బాధనిపించింది. చిన్నప్పటి నుండి చనిపోయిన వారిని చూడటానికి మాత్రం వెళ్ళేదాన్ని. మళ్లీ కనబడరని. అంటుకోవడాలు, స్నానాలు అలాంటివేం పట్టవు నాకు. షర్మిల ఉన్నన్ని రోజులు తనకోసం వెళ్ళేదాన్ని. తనకి మల్లెమెుగ్గలు పెట్టుకుంటారని కూడా తెలియదు. మా కాలేజ్ లో లెక్చెరర్ గా చేసినప్పుడు అక్క చీర కట్టి, పూలు మాలకట్టి తలలో పెట్టేదట. వాళ్ళింట్లో పెద్ద మల్లెపొద భలే గుబురుగా ఉండి, బోలెడు పూలు పూసేది. ఏంటి మెుగ్గలు కోయలేదంటే మెుగ్గలు పెట్టుకుంటారా అని ఆశ్చర్యపోయిన అమాయకత్వం నా నెచ్చెలిది.
మా కాలేజ్ డే ఫంక్షన్ ఉందని ఎనౌన్స్ చేసారు. చాలా గేమ్స్ కూడా ఉన్నాయన్నారు. మనకేం పెద్దగా రావు కాని టెన్నీకాయిట్ ఆడతామని పేర్లు ఇచ్చాము. మేం చేసిన తప్పేంటంటే నేను, అను రెండు టీమ్ లు గా అయ్యాము. నాతో లత, అనుతో మరొకరు పేరు గుర్తులేదిప్పుడు. ఐదువేళ్ళు కలిస్తేనే గుప్పిడి అన్న మాట మరిచాము అప్పుడు. అను కూడా బాగా ఆడుతుంది. కాని మా రెండు టీమ్ లు ఓడిపోయాయి. మరో రీజన్ జడ్జ్ కి రూల్స్ కూడా సరిగా తెలియకపోవడము. ఏదైతేనేం కాలేజ్ డే బాగా సరదాగా జరిగింది. మాకు సెండాఫ్ పార్టీ కూడా జూనియర్స్ బాగా ఇచ్చారు.
నాకు ఇంటికి వెళ్ళడానికి కుదరలేదని అమ్మానాన్న, పిన్ని, బాబాయ్, వాళ్ళ అబ్బాయి తేజ అందరు నా దగ్గరకి వచ్చారు. ఓ రోజు హోటల్ లో నా ఫ్రెండ్స్ అందరికి లంచ్ ఏర్పాటు చేసారు నాన్న. మా సీనయ్య పెదనాన్న కళ్యాణదుర్గం దగ్గరలో ఉండేవారు. మా పెదనాన్న కూతురు కూడ అక్కడికి దగ్గరలోనే ఉండేది. రాజా అన్నయ్య అక్క దగ్గరకి వచ్చినప్పుడు నేను, నీలిమ వెళ్ళాం. మా అజాత, అపర్ణ ఉన్నప్పుడు పెదనాన్న వాళ్ళింటికి వెళ్ళాను. అమ్మావాళ్ళు వచ్చినప్పుడు అపర్ణ నా దగ్గర కొన్ని రోజులుండి వెళ్ళింది.
మాకు ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మెుదలయ్యాయి. ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ అంతా నీలిమ చూసుకుంది. మాటర్ సేకరించి, టైప్ చేయించడము, పుస్తకాలు బైండ్ చేయించడము అంతా నీలిమనే చూసుకుంది. టూర్ డిటెయిల్సు సబ్మిట్ చేయడం, సెమినార్ పేపర్స్ ఎవరివి వారు చేసుకున్నాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందు రికార్డ్ సబ్మిషన్ ఓ పెద్ద ప్రహసనం. మెుత్తానికి ప్రాక్టికల్స్ అన్ని బానే జరిగాయి. ఎందుకో తెలియదు కాని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయ్యాక నా హెల్త్ పాడయ్యింది.కిడ్నీలో స్టోన్స్ అని సెలైన్ లు మూడు రోజులు పెట్టారు. తర్వాత బాగా ఫీవర్ వచ్చి బాగా వీక్ అయ్యేసరికి ఇంటికి ఫోన్ చేసి చెప్పారు పొడుగు వాళ్ళు. అమ్మానాన్న వచ్చారు. నన్ను అలా చూసి అమ్మ చదువు వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళిపోదాం పదా.. అని ఒకటే గొడవ. థియరీ పరీక్షలు ఉన్నాయి కదమ్మా మళ్లీ రాయడమంటే కష్టం. ప్రాక్టికల్స్ అయిపోయాయి కదా. ఓ నెల ఓపిక పడితే అయిపోతాయి అని అమ్మకు నచ్చజెప్తే, ఓ పది రోజులు అమ్మను నా దగ్గర ఉండమని నాన్న వెళిపోయారు. పాపం అమ్మకు బోర్ కొట్టేసింది నాలుగు రోజులకే. సరేనని అమ్మను బస్ ఎక్కించేసాం. మా పొట్టి, పొడుగు నా హెల్త్ బాలేనప్పుడు చాలా హెల్ప్ చేసారు. ఎగ్జామ్స్ ముందు అయితే పొట్టి నేను పడుకుని ఉంటే అది నోట్స్ లో రాస్తూ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసేది. మూడు గంటలు కూర్చుని ఎగ్జామ్ రాసే ఓపిక కూడా లేదప్పుడు. మావాళ్ళందరికి చాలా బుుణపడిపోయాను ఇప్పటికి కూడా.
ఆటోగ్రాఫ్ మా వెంకటస్వామి చిన్న చిన్న అక్షరాలతో శ్రీ శ్రీ మహాప్రస్థానం లో కవితల్లా ఓ నాలుగు పేజీలు రాశాడు. థియరీ ఎగ్జామ్స్ ఆఖరి పరీక్ష అయినరోజే నేను, అను ఇంటికి బయలుదేరడానికి బస్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఎగ్జామ్ రాసేసి, మురుగన్ సర్ దగ్గరకి వెళుతున్నామని చెప్పడానికి వెళ్ళి, సర్ కి ఆటోగ్రాఫ్ బుక్ ఇచ్చాను రాయమని. ఇప్పటికిప్పుడు ఇస్తే ఎలా రాస్తాను అన్నారు. బయట ఆటో ఉంది సర్, బస్ కి టైమ్ అయిపోతోంది రాసివ్వండి అంటే... నీ ఎఫెక్షనేట్ వర్డ్స్ ఎప్పటికి గుర్తుండిపోతాయి అని రాసిచ్చారు. అలా బోలెడు తీపి జ్ఞాపకాలతో ఇంజనీరింగ్ విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్, బళ్ళారి, కర్నాటకలో ముగిసింది.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
ఎంత సంతోషమెా...!!
నేస్తం,
నాకెంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మనకు చదువు నేర్పిన గురువులు మన రాతలను మెచ్చుకుంటుంటే ఎంత బావుంటుందో. నా చిన్నప్పటి గురువులు శిశు విద్యామందిరం అవనిగడ్డ హెడ్ మాస్టారు ఆకుల వెంకట రత్నారావు గారు, విజయనగరం జొన్నవలస హైస్కూల్ హింది టీచర్ రత్నకుమారి గారు నా రాతలు చదివి మెచ్చుకోవడం బోలెడు సంతోషాన్ని ఇస్తే, ఈ మధ్యన మా బళ్ళారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ మురుగన్ సర్ నా పుస్తకాలు అమెరికాలో నాలుగు లైబ్రరీలలో ఇచ్చారు. మరో సీనియర్ పూర్ణచంద్ కూడా నా ముచ్చట్లు చదివి తనూ అదే కాలేజ్ అని చెప్పారు.
మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మా కాలేజ్ అని ఒకాయన పరిచయం చేసుకున్నారు మెసెంజర్ లో. నేను మా సీనియర్ అనుకున్నాను, కాని గుర్తు పట్టలేదు. ఈ రోజు మెసెంజర్ లో మాకు తెలిసిన షార్ట్ నేమ్ తో చెప్పారు. మా ఎలక్ట్రికల్ ఎచోడి సర్ ఎమ్ ఆర్ రెడ్డి గారు. ఆయన పెట్టిన మెసేజ్...
"Wish you can recognise me if I say myself as M.R.REDDY, HOD- E&E DEPT & not as RAVINDRANADHA REDDY. MANDAPATI. Where & how long you were in USA ? Today, I have spent almost an hr in going thro your great Telugu quotes."
ఇది చూసాక ఇక నా ఆనందాన్ని మాటల్లో చెప్పతరమా..చెప్పండి. కలలో కూడా ఊహించని బహుమతి ఇది.
నాతో అమెరికా ముచ్చట్లు రాయిస్తున్న ఆంంధ్రాప్రవాసి వెబ్ సైట్ రాజశేఖర్ చప్పిడి గారికి, నా జీవితాన్ని రాయిస్తున్న కవితాలయం పవన్ తమ్ముడికి, ఆదరిస్తున్న మీ అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
