6, జులై 2024, శనివారం

కాస్త ఆలోచించండి..!!

 నేస్తం,

         లక్షలు లక్షలు పోసి వస్తువులు కొనడం ఒక ఎత్తైతే వాటికి వచ్చే రిపేర్లతో తల ప్రాణం తోకకి వస్తోంది. కొనేటప్పుడు 10 ఏళ్ళు వారంటీ అంటారు. కనీసం సంవత్సరం కాకుండానే రిపేర్లు వస్తే వేలకు వేలు తీసుకుంటున్నారు. L G  కంపెనీ డబల్ డోర్ ఫ్రిజ్ లక్ష రూపాయలు పోసి తీసుకుని సంవత్సం పైన నాలుగు రోజులు అయ్యింది. సరిగ్గా సంవత్సరానికి వెనుక మోత వస్తుంటే డోర్ తీసి పట్టుకుంటే పోతోంది. డోర్ వేస్తే వస్తోంది. కాసేపటి ఓసారి ఇలా వస్తోంది. కంప్లయింట్ చేస్తే ఇద్దరు వచ్చి కాసేపు అది ఇది చూసి పైన బోర్డ్ తీసుకువెళ్లి, 2650 అవుతుంది అని ఫోన్లు. కంపెనీ వాడేమో 10 ఇయర్స్ వారంటీ అంటాడు. L G ఫ్రిజ్ లు కొత్తగా కొనేవారు కొనకండి. లోపల ఫాన్ల ప్రోబ్లం అని మధ్యన అవి మార్చారు. ఇప్పుడేమో బోర్డులు కంప్లయింట్లు వస్తున్నాయట. ఆలోచించి కొనుక్కోండి

      ఈమధ్యన ఆక్వాగార్డ్ నీళ్ళ చుక్కలు పడుతోందని కంప్లయింట్ ఇస్తే రిపేర్ ఎంత బాగా చేసారో. అంతకు ముందు చుక్కా చుక్కా పడే నీళ్ళు, ఇప్పుడు బోలెడు కారుతున్నాయన్న మాట. రెండు మూడు రోజులు లచ్చి చేసారు కాని ప్రోబ్లం పోలేదు.

       గత రెండు దశాబ్దాలుగా మాకు మహీంద్రా కంపెనీతో అనుబంధం ఉంది. స్కార్పియో నుండి XUV500, XUV700 వరకు వారితోనే. అంతకు ముందు రెండు వెహికల్స్ తో ఇబ్బందీ రాలేదు కాని XUV700 విజయవాడలో మెుదటిది మాది. కాకపోతే డెలివరీ మేము కాస్త లేట్ గా తీసుకున్నాము. తీసుకున్న రోజు రైట్ సైడ్ లైట్ పై గీతలు ఉంటే ఈసారి సర్వీస్ కి వచ్చినప్పుడు మార్చి ఇస్తామన్నారు. వెహికల్ తీసుకున్న రోజు నుండి స్టీరింగ్ కంప్లయింట్ ఉంది. లోపల మోతలు వస్తూ ఉన్నాయి. స్టీరింగ్ వదిలితే లెఫ్టికి వెళిపోతోంది వెహికల్. మధ్యన నెల రోజులు షోరూమ్ లోనే వదిలేసాము కంప్లయింట్స్ క్లియర్ చేసి ఇమ్మని. వాళ్ళు వెహికల్ బయటికి వేసుకెళ్లి యాక్సిడెంట్ చేసి కూడా మనకి చెప్పలేదు. డబ్బులు మాత్రం బోలెడు తీసుకుంటున్నారు. కంప్లయింట్స్ మాత్రం క్లియర్ చేయడం లేదు. మరి వాళ్ళకు రిపేరు చేయడం రానప్పుడు ఎందుకు రాదని చెప్పరో మనకు తెలియదు. ఇక మహీంద్రా వారి వెహికల్ మాత్రం తీసుకోము. సారీ ఆనంద్ మహీంద్రాగారు ఇలా చెబుతున్నందుకు. పనితనం తెలిసిన వారిని పెట్టుకోండి. ప్రోబ్లం రిజాల్వ్ చేయనివారిని మీరు పోషించడం ఎంత వరకు కరక్ట్. కనీసం రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మాకు స్టీరింగ్ ప్రోబ్లం, సౌండ్స్ ప్రోబ్లం క్లియర్ చేయలేదు. అదేమని అడిగితే XUV700 హైవేలకు మాత్రమే అని ఇప్పుడు చెప్తున్నారు. 30 లక్లల వెహికల్ హైవేలకు మాత్రమేనట

  

       లక్షలు లక్షలు పోసి ఏదైనా కొనే ముందు కాస్త ఆలోచించి కొనుక్కోండి


1, జులై 2024, సోమవారం

జీవన మంజూష సమీక్ష

 ప్రముఖ కవయిత్రి, రచయిత్రి మంజూ  యనమదల గారి                "జీవన మంజూష" 

పుస్తకం చదివితే ఏనాడో ఆంధ్రప్రభ వార పత్రికలో ధారవాహికంగా ప్రచురితమైన తెన్నేటి హేమలత గారి"ఊహా గానం" చటుక్కున గుర్తుకు వస్తుంది. ఈ నాడు నవమల్లెతీగ లో వచ్చే జీవన మంజూష వ్యాసాల కోసం ఎదురు చూసినట్లు గానే ఆ రోజుల్లో టీనేజ్ లోనే వారం వారం ఊహాగానం కోసం ఎదురు చూసేవాడిని. లత గారి వ్యాసాలలో భావుకత, మంజూ గారి వ్యాసాల లో వాస్తవికత కొట్టొచ్చినట్లు కనబడతాయి.

కుల మత వర్గ  రాజకీయ పరంగా నేటి సమాజంలో (కుటుంబాల తో సహా) జరుగుతున్న కుసంస్కార, వికృత పోకడలను  ఆమె నిర్మోహమాటంగా , నిర్బీతిగా  ఎండగట్టారు....చీకొట్టారు... ఘాటుగా సుద్దులు చెప్పారు.

అలా చేయకుండా ఆమె చూస్తూ ఊరుకోలేదు. అది ఆమె నైజం (అదంతా 

లోపల దాచుకోకుండా ప్రతిస్పందించక పోతే ఆమెకు నిదుర పట్టదు. లావై పోతాననే భయంకూడా నేమో!!! )  ఏ రంగంలో నైనా సరే చెడును సహించ లేదు... అక్షరాయుధలతో విరుచుకు పడుతుంది.   ఆరోగ్యం సహకరించక పోయినా తన రచనల ద్వారా సామాజిక బాధ్యతను నూటికి నూరుపాళ్లు ఆదర్శ ప్రాయంగా నిర్వహిస్తున్న  రచయిత  మంజూకు అభినందనలు.

....... డా. డి. ప్రసాద్.


30, జూన్ 2024, ఆదివారం

గాలివాటం సమీక్ష..!!


 "గాలి వాటం "

 ఈ అక్షర సహవాసం 

మంజు యనమదల గారి" రెక్కల" కవితలు పైకి సులభంగా కనిపించే సంక్లిష్ట కవితా ప్రక్రియ. వాస్తవానికి ఈ చిన్న చిన్న రెక్కల్లో అగాధమంత వర్తమాన జీవిత సత్యాలు ఇమిడి యున్నాయి. కవితకు "కీ" తెలిస్తే ఒక్కో కవిత ఒక్కో గ్రంథం. గ్రంథమంత విషయాన్ని ఒక చిన్న గుళికలో ఇమిడ్చటం ఒక యజ్ఞం.

 అక్షరాలే ఆలంబనగా మొదలైన రచనలు చివరకు శరాఘాతాలుగా  మారి వర్తమాన సాంఘిక, రాజకీయ వికృత పోకడలను చీల్చి చెండాడే దశకు చేరుకోవడం రచయిత పరిణితికి నిదర్శనం. కాక పోతే ఈ రెక్కల కవితలను పూర్తిగా ఆస్వాదించాలంటే చదివే వారికి వర్తమాన సాంఘిక రాజకీయ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఆమె ఒక్క మాట రాస్తే వంద మాటలు రాసినట్లే  . అదీ ఈ రచనా ప్రక్రియ. వేదనంతా తను అనుభవించి మనకు మాత్రం పంచదార గుళిక లాంటి రెండు మాటలు రెక్కల్లో పొదిగి పంపిస్తుంది. "గాలి వాటాన్ని" అక్షరాల సహవాసంతో తనకు వాలుగా మార్చుకున్న రచయిత్రి మంజు కు ఆత్మీయ అభినందనలు.

...... డా. డి. ప్రసాద్.

మారాలి..!!

https://www.andhrapravasi.com/news.php?news=42516&category=c5380

      ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలకు, లోక్ సభలకు వెరసి చట్టసభలకు గైర్హాజరు కావడం సబబేనా? వీరికి కూడా హాజరు శాతం లెక్క వేయాలి. సరిపడా హాజరు లేని నాయకులు తరువాత ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి. 

      ప్రజల సొమ్ముతో కట్టిన చట్టసభల్లోనికి ప్రజలకు ప్రవేశం ఉండదు. కనీసం వారు ఎన్నుకున్న నాయకులైనా సక్రమంగా సభలకు వెళ్ళాలి కదా. సభలకు వెళ్ళనప్పుడు వారిని ఎన్నుకోవడంలో అర్థమేముంది? ప్రజల సమస్యలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? గెలిచిన నాయకులు వారి వారి అభివృద్ధి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి రాబట్టుకోవడంలో చూపే నిబద్దత, తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలు తీర్చడంలో చూపకపోవడానికి కారణాలేంటి? 

        అధికారం వచ్చింది కదాని ప్రజల సొమ్ముని తమ సొంత అవసరాలకు వాడుకునే నాయకులకు శిక్షలేమి ఉండవా? ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడాన్ని అరికట్టే చట్టాలు లేవా! ఐదేళ్ళ పాలనలో రాబడి, పోబడి లెక్కలు అప్పజెప్పాల్సిన అవసరం లేదా! ఎంత అధికారంలో ఉంటే మాత్రం మన సొంత తిరుగుళ్ళకి కూడా ప్రజల సొమ్ము వాడుకోవడంలో జవాబుదారీతనం ఎక్కడుంది? మన నాయకులకు రాజ్యాంగం, చట్టంలో లొసుగులను ఎలా వాడుకోవాలో తెలిసినంత బాగా, తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడంలో లేదు. 

         ఏ నాయకుడైనా భవిష్యత్ తరాల పురోభివృద్ధికి బాటలు వేయాలి కాని, కులమత, ప్రాంతీయ, వ్యక్తిగత కక్షలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే, ప్రజల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందో అందరు బాగా చూసారు. ఇది గుర్తుంచుకుని అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించిన నాయకుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి, చరిత్రలో తనకంటూ ఓ పేజీని పదిలపర్చుకుంటాడు. చరిత్రహీనుడు ఏమౌతాడన్నది మనకు తెలిసినదే కదా..!!

27, జూన్ 2024, గురువారం

హైకూలు

 1.  ఎన్నో వ్యథలు

రాయని అక్షరాలు

కాగితంపై..!!

2.  తన మానసం

మూగబోయింది

మాటల తూటాలతో..!!

3.  మానసానికా

మమతల బంధానికా

అడ్డుగోడలు..!!

4.  తుంటరితనమే

ఒంటరి పయనంలో

తుషారమై..!!

5.  తన ద్వేషమూ

మర్చిపోని తనమే

మది అరల్లో..!!

6.  భరించలేని

బాధ కల్గినప్పుడే

రాతకి రూపం..!!

7.  ఆత్మాభిమానమే

ఆమె ఐశ్వర్యమైంది

అలంకారం..!!

8.  రేపటి ఆశ

నిన్నల గమనింపు

జీవితపాఠం..!!

9.  మనసులను

కుదిపేసిన మాట

శిలాక్షరాలై..!!

10.  మది పొరల్లో

తచ్చాడే జ్ఞాపకాలు

నెమలీకలు..!!

11.  మలిపొద్దులో

మబ్బుల మాటున

రాతిరి తాయిలం..!!

12.  ఎన్నో బంధాలు

కొన్నే అనుబంధాలు

కాలం కొసలు..!!

13.  కలనైపోయా

కలత నిదురలో

వెన్నెలగువ్వ..!!

14.  మనసుపడ్డ 

బంధాలే కొన్ని ఇలా

గాయపడ్డాయి..!!

15.  ఎంత ఆనందం

కాగితాల నడుమ

అక్షరయానం..!!

16. ఎంత విధ్వంసం 

వాస్తవ ప్రపంచంలో

రుధిర వర్ణం..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner