31, డిసెంబర్ 2011, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు....

ఆనందం..ఆహ్లాదం..
శాంతి.... సంతోషం...
ప్రేమ ఆప్యాయతలు....
ఈ కొత్త సంవత్సరం లో మీ అందరి జీవితాల్లో వెల్లి  విరియాలని కోరుకుంటూ.....అందరికి అంతా బావుండాలని....
హితులకు...సన్నిహితులకు
మిత్రులకు బ్లాగ్ మిత్రులకు
బంధువులకు శత్రువులకు-:)
శ్రేయోభిలాషులకు...ఆత్మీయులకు
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....

26, డిసెంబర్ 2011, సోమవారం

దూరం దగ్గరైతే...!!

పిలిస్తే పలికేంత దూరమే అయినా వినబడని అడ్డం ఏదో...మన మధ్య
కనుచూపు మేరలో వున్నా కనపడని అంతరమే...మన మధ్య
అహమో అహంకారమో అడ్డుగోడగా ఉందో....!!..ఏమో..!!
అనురాగం ఆప్యాయతా అధిగమించ లేక పోతున్నాయేమో ఆ అడ్డుగోడను....
మమకారపు మెత్తని పొత్తిళ్ళలో ఒత్తిగిల్లే అరుదైన అవకాశం
అందని అంబరమైతే....ఆ అరుదైన క్షణాల కోసం
నిరీక్షించే నిరీక్షణ అపురూపం....!!!

19, డిసెంబర్ 2011, సోమవారం

ధన్యవాదాలు


మంచో చెడో నాకు అనిపించింది, నేను చూసింది రాసాను కాని ఇక్కడ భార్యభర్తల మద్యలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. పంతాలకు పొతే ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో చెప్పాను. ఏ పాపం ఎరుగని పిల్లలు బలి అవుతున్నారు. తప్పు అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు కాని ఆత్మగౌరవానికి అహంకారానికి వున్న చిన్న తేడా తెలుసుకుంటే కుటుంబం చక్కని ఆదర్శ కుటుంబంగా వుంటుంది. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ప్రతి చోట వుంటారు వినే మనకే వుండాలి విచక్షణా జ్ఞానం . ప్రేమించినప్పుడు గుర్తు రాని గొప్పగుణాలు విడిపోవడానికి మాత్రం పెద్ద పెద్ద కారణాలుగా కనిపిస్తాయి. తప్పులు ఒప్ప్పులు ఇద్దరిలో వుంటాయి కాక పొతే మనం ఒప్పుకోవడంలోనే వుంటుంది. మీ ఇగోలకు పిల్లల్లని పావులుగా వాడుకోకండి.. అదే నేను చెప్పాలనుకున్నది. నా టపాకు స్పందించిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

17, డిసెంబర్ 2011, శనివారం

అమ్మానాన్నలు - పిల్లలు మాత్రం అనాధలు.....!!

ఇద్దరు ఇష్టపడాలంటే ఆ ఇద్దరి ఇవ్టం, అంగీకారం సరిపోతుంది.....అదే ఆ ఇద్దరే విడిపోవాలంటే మాత్రం పంచాయితీలు, పెద్దలు, పోలీసులు ఇలా ఎంతో మంది కావాలి. కలిసి ఉండటానికి ఒక్క కారణము వెదుక్కోకుండా విడిపోవడానికి సవాలక్ష కారణాలు వెదుక్కునే ఆ జంట వాళ్ళ ఒకప్పటి ప్రేమకు ప్రతిరూపాలయిన పిల్లలని మాత్రం వీళ్ళ పంతాలకు పట్టుదలలకు బలి చేస్తూ ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. మరి వీళ్ళని శిక్షించడానికి ఏ చట్టం ఉంది? పసి వయసులో అమ్మానాన్నల ప్రేమలో పెరగాల్సిన సమయంలో రోజు పోట్లాటల మద్యన ఎప్పుడూ ఏమౌతుందో తెలియని అయోమయంలో భయం భయంగా గడిపే ఆ పసిమనసులకు ఆసరా ఎక్కడ?
ఒక్కసారి ఆలోచించండి విడిపోవడాని వంద కారణాలు వెదుక్కునే ముందు కలిసి ఉండటానికి ఒక్క కారణం వెదుక్కోండి....అది చాలు ఎంతోమంది పసి వాళ్ళు అమ్మానాన్నలు వుండి కూడా అనాధలు కాకుండా వుంటారు......

26, నవంబర్ 2011, శనివారం

అందరి ఆశిస్సులు.....కావాలి


మౌర్య ఇప్పుడిప్పుడే హాకి స్కేటింగ్ లో అడుగులు వేస్తున్నాడు. ఇంతకు ముందు రోలర్ స్కేటింగ్ లో మూడు నాలుగు సార్లు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాడు. చదువు ఆటలు కుదరటం లేదని మానిపించేసాము కాని మళ్ళి వాళ్ళ స్కూలులో హాకి స్కేటింగ్ కోచ్ వీడిని వదల లేదు. ముందు నుంచి వీడి స్కేటింగ్ చూసారు....సబ్ జూనియర్స్ లో రెండు వారాల క్రిందట స్టేట్ కి సెలక్ట్ ఐయ్యాడు. డిసెంబర్లో హైదరాబాద్ లో పోటీలు వున్నాయి. మీ అందరి ఆశిస్సులు వాడికి అందజేయండి.....ఆంధ్రజ్యోతి లో లింక్ క్రింద వుంది చూడండి ప్రిన్సిపాల్కి ఎడమ (లెఫ్ట్) పక్కన

https://www.andhrajyothy.com/pdffiles/2011/nov/18/kri/krishna16.pdf

22, నవంబర్ 2011, మంగళవారం

మనసు భాష...!!


మాటాడలేని మనసులో ఎన్నెన్ని ఊసులో...!!
మనసు భాష తెలియని మౌన ఋషులెందరో..!!
వెదుకులాటలో కొందరిదే అదృష్టం..!!
మనసు మూగ భాష అందరికి తెలిస్తే..!!
మౌనానికర్ధం తేటతెల్లమే కదా!!

18, నవంబర్ 2011, శుక్రవారం

స్తబ్ధత


ఎన్నో రాయాలని వున్నా రాద్దామంటే రావడం లేదు...
ఎందుకో తెలియడం లేదు కారణం ఏమిటో.....
స్థబ్దుగా వున్న మనసో...ఏది పట్టించుకోని తనమో..!!
ఏమో మరి ..!! ఎన్నాళ్ళో ఇలా..!!
కొన్ని పరిచయాలు గుర్తు వస్తే మనసుకు ఆహ్లాదం...మరి కొన్ని గుర్తు వస్తే చెప్పలేని కోపం..!! మనం ఏమి వాళ్లకు చేయక పోయినా మనకోసం ప్రాణం పెడతారు కొందరు. మరికొందరేమో అన్ని చేయించుకొని కనీసం నాలుగడుగుల దూరం లోనికి వచ్చి కూడా రాకపోతే పోయారు కనీసం పెళ్ళికి రమ్మని కూడా పిలవని మంచి వాళ్ళు. ఇక ఇంకొందరేమో దొరికినంతా తినేసి నీది ఏమి తినలేదు ఏమి ఇవ్వనక్కరలేదు అనే రకాలు అది ఒక్కటైతే పర్లేదు వాళ్ళ స్వార్ధం కోసం కాపురాలు కూల్చడానికి కూడా వెనుకాడరు. వీళ్ళకు డబ్బు తప్ప ఇక ఏ బంధం అక్కరలేదు.....

29, అక్టోబర్ 2011, శనివారం

శ్రీ కోటిలింగ మహా శైవ క్షేత్రం గురించి చెప్పటానికి మాటలు చాలవు....ప్రతి ఒక్కరు చూసి తరించాల్సిన అరుదైన శైవ క్షేత్రం.
నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకంగా ఒక్కో గుడి ఆధిస్థాన దేవతలు, శాంతిగ్రహాలూ, ఇష్ట దైవం, ఇష్టమైన వృక్షం ఇలా అన్ని ప్రతి గ్రహానికి వుంటాయి. నక్షత్రాలకు వాటికి సరిపడే చెట్లు, వినాయక, సరస్వతి, పార్వతి, లక్ష్మి ఇంకా చాలా మంది అమ్మవార్ల గుడులు...అన్నపూర్ణాదేవినీ చూస్తూ వుంటే ఇంక ఏమి అక్కరలేదు అనిపిస్తుంది ముందు జాతి పచ్చతో చేసిన నంది వెనుక స్పటిక శివలింగము ఇలా అన్నిరకాల శివ లింగాలు రత్న, పాదరస, చలువరాయి, గోమేధిక, ముత్య ...ఇలా అన్ని రకాలతో వున్న శివుని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి.
ప్రతి పౌర్ణమికి సరస్వతి హోమం జరుగుతుంది.
చాలారకాలైన హోమాలు యజ్ఞాలు జరుగుతాయి.
బాగా డబ్బులు తిసుకున్తారేమో అనుకుంటే మాత్రం అది అపోహ మాత్రమే అవుతుంది. అతితక్కువ ఖర్చుతో అన్ని జరిపించే పవిత్ర స్థలం ఇది ఒక్కటి మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను. ముందు ఈ శైవ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించి చూడండి మీకే తెలుస్తుంది.

17, అక్టోబర్ 2011, సోమవారం

కోటిలింగాల క్షేత్రం

వచ్చేది కార్తీకమాసం కదా శివుడికి ఎంతో ఇష్టమైన మాసం కూడా....అందుకే శివుదంటే ఇష్టమైన మీ అందరికి ఓ మంచి శైవ క్షేత్రాన్ని పరిచయం చేయబోతున్నాను.....కొద్ది రోజులలో....

17, సెప్టెంబర్ 2011, శనివారం

అంతర్మధనం...!!

కనుల నీరు జారనీయకు
కనుదోయి కలవర పడేను
కలత నిదుర కానియకు
కలలు కల్లలయ్యేను

మదిలోనికి చొరబడనీయకు వేదనను
మానసికోల్లాసం దూరమయ్యేను
మనసుతో మాటాడు మౌనంగా
మౌనభాష్యాలు సాక్షులుగా

మనసుకి తగిలిన ప్రతి గాయం
రాబోయే మరో గెలుపుకి పునాది
ఓటమి నుంచి నేర్చుకునే మెళకువలు
గెలుపు అందలానికి బాటలు వేయాలి

పడిపోయామని లేవడం మర్చిపోతే
పరుగునే కాదు నడకనే మర్చిపోతాము..
జీవిత సత్యాన్ని తమలో ఇముడ్చుకున్న
ఎగసిపడి లేచే కడలి తరంగాలే అందుకు సాక్ష్యం...!!

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

వినమ్ర వినతి....

కల్లోల కడలి తరంగం అంతరంగం
కలహంస నడకల నాట్యమయూరం
ఉప్పొంగే వరద ఉదృతం కోపావేశం
గల గల పారే సెలఏటి సరిగమల
గమకాలు వినసొంపైన సంగీతం
కన్నెర చేసి కరుణ చూపే కృష్ణమ్మ
ఉరవళ్ళ పరవళ్ళ వరద వెన్నెలగోదారి
ఒంపుల వయ్యారాల కన్నెకిన్నెరసాని
అందాల సోయగాల వయ్యారి యమున
కలువ కన్నియబాల కావేరి
మకరందాల మధుర మందాకినీ
సకల పాపాలు హరించు గంగమ్మ
పొంగులెత్తే వాగువంకలతో....గుండాల సుడిగుండాలతో...
జన జీవనాన్ని అతలాకుతలం అస్తవ్యస్తం చేయకుండా...
సొగసు సోయగాలతో...చల్ల చల్లని చూపులతో...
ప్రకృతి అందాలు పాడిపంటలు పుష్కలంగా....
ప్రశాంత జీవితం అందించాలని వినతి.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అపాత్రదానం..!!

ఏదైనా చేయాలంటే కాస్త భయంగానే ఉంటోంది...ఎందుకంటారా!! చెప్పేస్తున్నా  ఫాలో అయిపోండి మరి...
మా ట్రస్టు తరపున అమ్మానాన్న లేని ఒక అబ్బాయిని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాము గత నాలుగు ఏళ్లుగా....మొన్నీమద్య ఒకసారి ఫ్రెండ్ సిస్టర్ పెళ్లికి వచ్చి ఇంటికి వస్తే ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బులు కాకుండా చిన్న మొత్తమే అనుకోండి ఓ ఐదు వందలు ఇచ్చి పంపాను. క్రిందటి నెలలో ఇంటికి వచ్చి మళ్ళి ఇంకో ఇయర్ డబ్బులు కావాలి అని అడిగాడు. కాంపస్ సెలక్షన్స్ లో జాబ్ రాలేదా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం... వచ్చినది కాదనుకున్నాడంట. ఎన్ని ఇయర్స్ డబ్బులు తీసుకున్నాడో కూడా గుర్తు లేని ఆ అబ్బాయికి అపాత్ర దానం చేసామేమో అని అనిపించింది. ఇంజనీరింగ్ అయిపోయి కుడా ఇంకా డబ్బులు అడగడానికి మరి ఏమి అనిపించలేదో లేక మాకు ఊరికినే డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకొవాలో తెలియక ఇస్తున్నాము అనుకుంటున్నాడో అర్ధం కాలేదు....ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి కి ఇంజనీరింగ్ లోనే డబ్బులు ఇస్తే లాప్ టాప్ కొనుక్కోవాలి ఇరవై వేలు ఇవ్వండి అంది....మొదటి ఇయర్ అయ్యి రెండో ఇయర్ కి రాగానే....మనమేమో ఒకరు అయినా బావుంటారు అని మనకు వున్న దానిలోనే వాళ్లకు ఇస్తూ వుంటే వీళ్ళు ఇలా వున్నారు....జనాలు ఇలా వున్నంత కాలం స్విస్స్ బాంక్ ఎకౌంట్లు కాని ఇంకా ఏమైనా పెద్దవి వుంటే అవి కూడా చాలవు...ఊరికినే డబ్బులు కష్టపడకుండా రావాలంటే ఎలా కుదురుతుంది....?? ఇవ్వడం తీసుకోవడం తప్పు కాదు...ఇదిగో ఇలాంటివి కాకుండా వుండాలి......ఇచ్చే ముందు ఓసారి అలోచించి ఇవ్వండి....-:)

28, ఆగస్టు 2011, ఆదివారం

లాంగ్ లాంగ్ ఎగో అని.....మన క్రికెట్ చరిత్ర గత చరిత్ర గానే మిగలనుందా!!

మన వాళ్ళ సత్తా ఏంటో టెస్ట్ క్రికెట్లో బాగా చూసేసాము. కనీసం ఒక మాచ్ అయినా డ్రా చేస్తారేమో అనుకున్న అభిమానుల ఆశలు అడియాశలు చేసేసారు మన క్రికెట్ దేవుళ్ళు, రాజులు, రారాజులు. ఎన్నో అవార్డులు రివార్డులు మరింకెన్నో రికార్డులు సాధించిన మన టెస్ట్ క్రికెట్ చరిత్ర ఇంగ్లాండ్ ఆటతో తుడిచిపెట్టుకు పోయింది.
ఆటలో గెలుపు ఓటములు సహజమే. ఆడిన ప్రతి ఆట గెలవలేము కాని కనీసం క్రికెట్ ఆట రానట్టుగా ఆడి ఓడిపోవటమెంత సిగ్గు చేటొ ఇప్పటికయినా అర్ధం అయితే చాలు మన వాళ్లకు. అందరూ గెలవడానికి కారణాలు వెదుక్కుంటే మన టీం ఇండియా మాత్రం టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ రాంక్ కోల్పోవడానికి సవాలక్ష కారణాలు వెదికింది.
ఆట చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది ఎంతబాగా ఓడిపోవడానికి ఆడారో మన టీం ఇండియా. ప్రతి ఒక్కరు దేశం కోసం ఆడితే గెలవాలన్న తపన, కాంక్ష వుంటుంది. డబ్బుల కోసం వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇలానే ఓటమి తప్పదు.
నెంబర్ ఒన్ టీం ఆడే ఆటలా ఆడలేదు కనీసం ప్రతిఘటించలేదు. ఆటను ఆస్వాదిన్చలేనప్పుడు క్రీజులో ఉండలేనప్పుడు టీం నుంచి స్వచ్చందంగా తప్పుకోండి...అంతే కాని పరువు తీయకండి. మీరు ఆడిన ఆటను మీరే ఒక్కసారి రీప్లే లో చూసుకుని ఆత్మవంచన చేసుకోకుండా నిజాన్ని ఒప్పుకుని నిజాయితీగా ఆడండి......టెస్ట్ క్రికెట్ లో ఆడలేరు సరే కనీసం ట్వంటి ట్వంటి లానో....లేదా ఒన్ డే లానో ఆడితే కాస్త అయినా పరువు దక్కేది...మనవాళ్ళకు కుడా క్రికెట్ ఆడటం వచ్చు అని. ఆడలేనప్పుడు తప్పుకోండి స్వచ్ఛందంగా అంతే కాని గత చరిత్ర ఘన చరిత్ర వున్న భారతీయ క్రికెట్ నీ నవ్వులపాలు చేయకండి.....ఒన్డే సిరీస్ అయినా గెలిచి కాస్త క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందం నింపండి.

27, ఆగస్టు 2011, శనివారం

నీలో నేనున్నానని....!!




ఒంటరిగా నువ్వున్నప్పుడు కాకుండా...
ఎంతమందిలో ఉన్నా కుడా...
నా జ్ఞాపకం నిన్ను పదే పదే తడుముతూ ఉంటే...
అప్పుడు ఒప్పుకుంటాను నీలో నేనున్నానని....!!

26, ఆగస్టు 2011, శుక్రవారం

ఎన్నో...ఎన్నెన్నో....జ్ఞాపకాల గురుతులు...మళ్ళి ఓసారి కలిస్తే..!!

ఇంజినీరింగ్ కాలేజ్ లో అడుగు పెట్టిన ఆ....మొదటి క్షణాలు అందరికి గుర్తు వుండే వుంటాయి....కొత్త ఊరు, అంతగా పరిచయం లేని భాష ఒకటి, అస్సలు తెలియని భాష మరొకటి...ఇంట్లో అందరిని వదిలి ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆ మధురక్షణాలు మరపురానివే ఎప్పటికీ...ఎవ్వరికి...!! మనని చేసిన చేసిన రాగింగ్ లు...మనమూ చేసిన రాగింగ్ లు, ఆకతాయి పనులు...క్లాసులు ఎగ్గొట్టి చూసిన సినిమాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో....జ్ఞాపకాల గురుతులు...

మొదటి రోజు కాలేజ్ లోకి నాన్న తీసుకువెళ్ళి క్లాసులో కుర్చోపెడితే కాసేపటికి ఓపెనింగ్ మీటింగ్ మొదలయ్యి...నా పక్కన కూర్చున్న అమ్మాయిని నీ పేరేంటి అని అడిగితే నా మొహాన్ని బ్లాంక్ గా చూసి ఏమి మాట్లాడలేదు. మనకా తెలుగు తప్ప మరో భాష రాదాయే...తను తమిళ్ అమ్మాయి. తెలుగు అప్పుడే వినడమంట. తరువాత తనకు తెలుగు నేర్పేసాను అనుకోండి అది వేరే సంగతి. క్లాసులో ఎవరినైనా ముందుగా అడిగేది " నీకు తెలుగు వచ్చా ?" అని....నాకు తెలుగు పండితురాలని పేరు పెట్టేసారు ఆ భాగ్యానికే. మా సెక్షన్ లో వున్న నలుగురు అమ్మాయిల్లో ముగ్గురికి తెలుగు అస్సలు తెలియదు. ఒకమ్మాయికి కొద్దిగా తెలుసు. ప్రాక్టికల్స్ లో కుడా సివిల్ లో అయితే భలే బావుండేది. జామకాయలు కొనుక్కుని తినడం సార్ వచ్చి తిట్టడం....ఏమ్మా కనీసం ఒక యారో అయినా పట్టుకుంటావా!! అని నన్ను ఆట పట్టించడం....ఎలక్ట్రికల్ లో అయితే అస్సలు ఏమి అంటుకునేదాన్ని కాదు. రీడింగ్స్ మాత్రం వేసుకుని గబా గబా చేసేసి అబ్జర్వేషన్ బుక్ లో సైన్ చేయించుకోవడం.ఒకసారి మెయిన్ స్విచ్ వేయమంటే వేయలేదు ..ఏంటి వేయలేదు నీకు దగ్గరగా వుంది కదా అంటే వెంటనే " మా అమ్మకు నేను ఒక్కదాన్నే" అన్నా ఓ క్షణం వాళ్లకు అర్ధం కాలేదు తరువాత అందరూ నవ్వేసారు...ఇక కెమిస్ట్రి లో అయితే మా బాచ్ లో ఒక జీనియస్ వున్నాడులెండి అస్సలు పేరు చెప్పను...మేమిద్దరం చేయాలి ప్రాక్టికల్స్ . పిపెట్ తో యాసిడ్స్ తీసి బ్యురేట్ లో పోయాలి. పెద్ద అన్ని నాకే వచ్చు అని మొదలు పెట్టాడు....నోట్లోకి పోయింది....పోనిలే పాపం అని నేను తీస్తాను అని తీసాను ఇక మొత్తం ఇయర్ అంతా నేనే అన్నమాట. ఫిట్టింగ్ లాబ్ లో నా తంటాలు....మోడల్స్ చేయలేక అవస్తలు పడుతుంటే చూసి నవ్వే వాళ్ళే కాని హెల్ప్ చేసేవాళ్ళు కాదు పాపం అని వేరే సెక్షన్ అమ్మాయి చేసిపెట్టిందిలెండి. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్ని కబుర్లో......
అందుకే..
ఎప్పుడో 89 -90 నుంచి 93/94 వరకు చేసిన అల్లరి జ్ఞాపకాలను మళ్ళి గుర్తు చేసుకోవాలని మా వాళ్ళు అందరూ అనుకుని నెక్ట్స్ మంత్ లో అంటే sept 24th అందరూ హైదరాబాద్లో కలవాలని అనుకుంటున్నారు..... కాబట్టి అందరూ తప్పక రావాలని.....

ఒంటరితనం...



నువ్వు కావాలనుకునే వారు నిన్ను దూరం చేసుకుంటే....??
నిన్ను కావాలనుకునే వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటూ ఉంటే...??
అంత కన్నా దౌర్భాగ్యం లేదు జీవితంలో....

9, ఆగస్టు 2011, మంగళవారం

పరిచయాల పరిమళాల సుమాల ఈ జీవితం...!!

పరిచయం ఓ పరిమళం
పరిమళం ఓ ఆస్వాదన
ఆస్వాదన ఓ అనుభూతి
అనుభూతి ఓ జీవితకాలం
జీవితకాలం ఓ గెలుపు ఓటమి
గెలుపు ఓటమి ఆట చివరి దశ
ఆట చివరి దశ
జీవిత చరమాంకం
జీవిత చరమాంకం లో

పరిచయాల పరిమళాల ఆస్వాదనానుభూతి
అనంతమైన ఆనందానికి నిలయం!!

ఇష్టపడేంత ప్రేమ...!!


ఇష్టపడేంత ప్రేముంటే.....
ఆ ప్రేమని గెలిపించుకునే ధైర్యం కూడా వుంటే....
ఇష్టపడిన ఇష్టమైన ప్రేమ మనదౌతుంది....!!

7, ఆగస్టు 2011, ఆదివారం

స్నేహసుమాల సుగంథాల......




హితులకు....సన్నిహితులకు...స్నేహితులకు....అందరికి స్నేహసుమాలు వికసించినరోజు.... ఆ సుమపరిమళాలు అందరూ ఆస్వాదించాలని....అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు....

5, ఆగస్టు 2011, శుక్రవారం

కార్పోరేట్ స్కూల్లో పిల్లల పరిస్థితి.....

ఈ రోజుల్లో పిల్లలను స్కూలుకి పంపాలన్నా....హాస్టల్లో పెట్టాలన్నా చాలా భయంగా ఉంటోంది...ఎంత పేరున్న స్కూలయినా...ఎన్ని డబ్బులు పోసినా పిల్లలు అక్కడ ఎలా ఉంటారో అని చాలా బెంగగానే ఉంటోంది...మొన్న మా పెద్దబాబు కి ఫోన్ చేస్తే వాడు చెప్పినది వింటే అప్పటికప్పుడు చదువు వద్దు...పాడు వద్దు తీసుకు వచ్చేద్దామని పించింది. వాడిని ఈ ఇయర్ గుడివాడ కే కే ఆర్ గౌతమ్ స్కూల్ లో సెవెంత్ లో జాయిన్ చేసాములెండి. ఏదో బాగా చెప్పేస్తారు...మరి ఈ పోటి ప్రపంచంలో వాడు కాస్త నెట్టుకు రావాలి కదా అని....హాస్టల్ అంత నీట్ గా ఏమి లేదు. వర్షం వస్తే చాలు మిడతలు పురుగులు పిల్లలకన్నా మూడువంతులు ఎక్కువగా రూముల్లొ వుంటాయి. ఎంత చల్లగా వున్నా చన్నీళ్ళే....వర్షాకాలంలో. బట్టలు ఐరన్ చేయిస్తాము అంటారు కాని అదీ లేదు...పాకెట్ మని అని కట్టించుకుంటారు కాని దానికి లెక్కలు భలే చెప్తారు....ఇన్ని వున్నా ఏదో పోనిలే చదువు బావుంటుందని అందరూ అంటున్నారు కదా!! వీడు కుడా కాస్త బయట ఎలా ఉండాలో అలవాటు పడతాడు అని అనుకున్నాము....మొన్న క్లాసులో సార్ ని బాత్రూం కి వెళ్ళాలి అని వీడు ఇంకో బాబు అడిగారంట. వెంటనే ఆ సార్ వీడిని గుండెల మీద చెయ్యి వేసి తోసేసాడంట..వీడేమో పడిపోయాడంట... వెంటనే.... వీడికి ఊపిరి కుడా ఆడలేదంట ఒక పది నిమిషాలు. మోకాలికి దెబ్బ కుడా తగిలిందంట అయినా కుడా ఆ మహానుభావుడు పట్టించుకోలేదంట . మనము గొప్ప స్కూలు బాగా చదువు చెప్తారు డబ్బులు బోలెడు కడుతున్నాము కదా...బాగా చూసుకుంటారు అనుకుంటాము కాని వాళ్ళేమో డబ్బులు మాత్రమే తీసుకుంటారు కాని పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదు...కనీసం మంచి టీచర్స్ ని కుడా పెట్టకుండా ట్రయినీలను పెడుతున్నారు....మా వాడు బాగానే చదువుతాడు ఇంతకు ముందు ఎప్పుడూ స్కూలులొ దెబ్బలు కుడా తినలేదు అందులో వాడికి మాట అంటే చాలా కోపం... బాగా సెన్సిటివ్. పడిపోగానే కాస్త తెలియగానే బాగా ఏడ్చేసాడంట....మరీ బాగా నిర్లక్ష్యంగా వుంటున్నారు యాజమాన్యం, ఉపాధ్యాయులు కుడా.....ఏమి కాలేదు కాబట్టి సరి పోయింది కాని ఆ పది నిమిషాలలో ఏమైనా జరిగినా కుడా అంతే కదా!! ఈ విష్యం కుడా మేము ఆ రోజు రాత్రి ఫోన్ చేస్తే ఎప్పటికో చెప్పాడు.....పిల్లలు చాలామంది స్కూలులో విషయాలు ఇంట్లో చెప్పరు....వీడు కుడా అస్సలు ఏమి చెప్పడు....చిన్న చిన్న గొడవలు అందరికి ఉండేవే కాని ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ఈ కార్పోరేట్ స్కూళ్ళు.....మనమేమో బాగా చెప్తారు బాగా కేర్ తీసుకుంటారు హాస్టల్ లో ఉంచితే అని బోల్డు బోల్డు డబ్బులు పోసి పెడుతున్నాము కాని ఈ కార్పోరేట్ స్కూళ్ళ పరిస్థితి ఇదండీ....మీ పిల్లలు కుడా ఇలాంటి స్కూళ్ళలో వుంటే కాస్త కాదు...కాదు...బాగానే జాగ్రత్త అండి....

3, ఆగస్టు 2011, బుధవారం

అరిషడ్వర్గాలు ప్రేమాభిమానాలు ఒక్క చోట కలిస్తే....!!

ఆనందం ఆహ్లాదం
కోపం ఆవేశం
చిరాకు విసురు
ప్రేమ అభిమానం
బాధ దుఃఖం
ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!
సమాధానం ఇక్కడ పక్కన వుంది చూడండి.......ఇది మా కుటుంబ కలయిక......ఒక పదిమందికి మాత్రమే రావడానికి వీలుకాలేదు...భలే బావుంది కదు..!! మీరు కుడా ఒకసారి కలిసి చూడండి ఎంతబావుంటుందో తెలుస్తుంది...!!!

23, జులై 2011, శనివారం

ఊహా నిజమైతే.....!!

ఆనందం ఆహ్లాదం
కోపం ఆవేశం
చిరాకు విసురు
ప్రేమ అభిమానం
బాధ దుఃఖం
ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!
మీ ఉహలకు అందిన ఊహాసృష్టిని అందంగా అక్షరాల అమరికలో పరిస్తే ఎలా వుంటుందో!!
శ్రమ అనుకోకుండా మీ ఊహాక్షరాలను ఇక్కడ రాయండి......
నేను ఆస్వాదించిన అనుభూతిని తరువాత పంచుకుంటాను మరొక టపాలో....

13, జులై 2011, బుధవారం

దేవుడు-డబ్బు-మానవుడు....??

అనంత పద్మనాభుడి ఆస్థులు అనంతానంతమేమో..!! అందరిలో డబ్బులు ఎక్కువగా ఉన్న దేవుడని జనాలు.... ఇన్నాళ్ళు కొలిచిన తిరుపతి వెంకన్నను మర్చిపోతారేమో!! ఎంతయినా డబ్బులకున్న మహిమ అదే కదా మరి. ఇన్ని రోజులు గుర్తుకు రాని పద్మనాభుని ఆస్థులతో పాటుగా జగన్నాధుని సొమ్ములకు లెక్కలు చెప్పమనే ధైర్యం మన నాయకులకు వచ్చిందోచ్..!! ఆఖరుకి ఏమి తేల్చుతారో కానీ మంచి రసదాయకంలో పడింది బడా నాయకుల పని ఇప్పుడు. దేవుని సొమ్ములు దేవుని సొంతం కాని మరి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎవరికీ చెందుతున్దనేది ప్రశ్నార్ధకమే?? జగన్ ఒక్కడేనా అక్రమంగా సంపాదించింది? అందరి ఆస్థులకు లెక్కలు తేల్చాలి కదా...ఇప్పుడు వారికి ఎదురు తిరిగాడని లెక్కలు చూడాలా!! అమ్మగారికి సలాములు కొట్టే నాయకుల లెక్కల పద్దులు అక్కరలేదా!! చట్టం అందరికి సమానమైతే అందరి లెక్కలు తేల్చండి.....జనాల సొమ్ము తినేస్తున్నారు అంటున్నారు కాని జనాలని కుడా తినేస్తున్నారు ఈ నాటి మన ప్రజాస్వామ్య నాయకులు.....ఇదేనండి మన ప్రజాస్వామ్యం!!

12, జులై 2011, మంగళవారం

నిదురించే మదిలో....

మాట మౌనమై మనసు మూగదై....
రెప్ప చాటున దాగిన స్వప్నం..!!
కనురెప్ప తెరిస్తే చెదిరిపోతుందేమో...!!
కలవర పాటున కనుమరుగౌతుందేమో..!!
ఉహల ఉసులలో నిదురించే క్షణంలో
కనిపించే కల కనుమాయమైతే..!!
తట్టుకోలేని మది ఆరాటంతో
కన్ను తెరిస్తే ఓ క్షణం...!!
రెప్ప మాటున ఒదిగిన స్వప్నం
నిశ్శబ్దంగా మరలిపోయింది....!!

5, జులై 2011, మంగళవారం

రాజీనామాలా...!!!!

జనానికి పంగనామాలా...!! లేక రాజీనామాలా..!! ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తారు? ఎన్ని సార్లు ఎన్నికలలో పోటి చేస్తారు? రాజకీయపు రాక్షస ఆటలో బలిపశువులు ఎందఱో.....?? సామాన్యుని జీవితంలో రోజు రోజుకి పెరుగుతున్న పన్నుల భారం...నిత్య జీవిత కృత్యమై పోయింది. ఏ పన్ను భారం ఎప్పుడూ పడుతుందో తెలియదు....ఏ బంద్ ఎప్పుడూ మొదలవుతుందో ఎరుక లేదు....పండిన పంటకు సగటు ధర లేదు, నిత్యావసరాలు నీలాకాశంలో చుక్కల్లా అందకుండా ఊరిస్తున్నాయి....నాయకుల వాగ్ధానాలు ఎడారి ఒయాసిస్సులను తలపిస్తుంటే మింగమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం... చందాన ఎప్పుడూ ఏమౌతుందో తెలియని అయోమయం లో పడవేసిన అమ్మగారు మరి ఏ పరిష్కారం చూపుతారో వేచి చూద్దాం..!!

ఈ జన్మకు సార్ధకత..!!

అష్టపదిలా అలరించలేను ఇష్టసఖిలా ఇమడలేను
రాధలా లాలించలేను సత్యభామలా ఆలుగనూ లేను
యశోదమ్మలా ప్రేమను పంచలేను
భక్తిలో రుక్మిణిని కాలేను
అనురక్తిలో గోపికలను మించలేను
అల్లరి ఆటల్లో....తుంటరి చేష్టల్లో....
ప్రేమను పంచడంలో....చెలిమిని పెంచడంలో....
మాయల్లో ముంచడంలో....జీవితార్ధాన్ని చెప్పడంలో....
నిను మించిన ఘనుడెవ్వరు ఆర్తరక్షకా.....
అందుకే అందరూ నీ దాసానుదాసులు....
నీ అనంత భక్త జన కోటిలో ఓ నీటి బిందువును....
ఈ అక్షర కుసుమాంజలితో......అంజలి ఘటించడం....
అనంత విశ్వంలో ఓ రేణువులా నిను చేరితే.....ఈ జన్మకు సార్ధకత..!!

1, జులై 2011, శుక్రవారం

ఏం చేయను..???

నిశిరాతిరి నిద్ర ముంచుకొస్తుంటే....
కరిగిపోయిన కాలంలో నుంచి
చెరిగిపోని ఓ జ్ఞాపకం కవితలా అల్లుకుంటుంటే...
నిద్రదేవత వడిలో సేద తీరాలా!! ...లేక....
కలలోకొచ్చిన జ్ఞాపకంలో కరిగిపోవాలా!!
మదిలో పొంగే కవితావేశాన్ని ముత్యాలాక్షరాల్లో
నింపడానికి కాలమనే కాన్వాసుపై పొందుపరుద్దామంటే.... !!
నిద్రాదేవత కరుణించి నిశిధి ఒడిలో సేదదిర్చుకోమని అక్కున జేర్చుకుంది........
( ఇది నా ఫ్రెండ్ రాసిన కవిత......)

30, జూన్ 2011, గురువారం

నీకు తెలిస్తే....!!

నీకు తెలుసా!!
నీ తలపుల వలపుల్లో నేనున్నట్లే.....
నువ్వు నాతోనే వున్నావని...!!
ఎందుకో ఏమో!! నీకోసం వెదుకుతూ వుంటే
ఒక్కసారైనా కనిపిస్తావేమో అని ఆశ!!
ఒకవేళ కనిపిస్తే గుర్తు పడతావో లేదో అని సంశయం!!
గుర్తు పట్టినా....పలకరిస్తే మాట్లాడతావో లేదో తెలియదు....
మొత్తానికి కనిపించి కనిపించకుండానే వున్నావు కదూ..!!

27, జూన్ 2011, సోమవారం

ఓ మానవత్వమా ఎక్కడ నీ చిరునామా!!

మౌనాక్షరాలు.....సాక్షులుగా....
శిలాక్షరాలు....శాశ్వతంగా....
నీటిమీది రాతలుగా కాకుండా.....
నుదుటిపై భగవంతుని గీతలా....
జీవిత గగనంలో మరలిరాని....
కాలమే మరణశాసనంగా మారితే..??
నమ్మకమే కాలయముడై కాటేస్తే...??
ఓ మానవత్వమా ఎక్కడ నీ చిరునామా!!

డబ్బు,అధికార దాహం...ఎంత వరకు??

రాయలసీమలో ఫ్యాక్షనిజం నాటుబాంబులు తుపాకులతో జరుగుతుంటే....ఏనాడో మర్చిపోయిన కత్తుల, కొడవళ్ళ హత్యోదంతాలు మళ్ళి కృష్ణాజిల్లా దివితాలుకాలో భయోత్పాతాలు సృష్టిస్తున్నాయి.
ఈ మద్య తరచుగా మనం విన్న అన్ని హత్యలు పక్కనే వున్న నమ్మకమైన అనుచరగణం చేతిలోనే డబ్బు జబ్బు పట్టి న మానవ మృగాలకే సాధ్యమైంది. ఆనాటి చరిత్ర తీసుకున్నా ఇదే ఈనాటి చరిత్ర చూసినా ఒక్కటే కారణం డబ్బు, అధికారం కోసమే జరుగుతున్నాయి ఈ హత్యారాజకీయాలు అన్ని....ఆనాడు ఝాన్సిలక్ష్మిబాయి, అల్లురిసీతారామరాజు, మహాత్మాగాంధి, ఇందిరాగాంధి.. ఈనాడు పరిటాలరవి, మద్దెలచెరువు సూరి, చలసాని పండు, తాతినేని రామకృష్ణ( బలరాం) వరకు అందరూ నమ్మకంగా తమతో వున్న వారి చేతులలోనే బలికావడం నిజంగా శోచనీయం. మానవ విలువలపై నమ్మకాన్ని కోల్పోతున్న క్షణాలు మరింతగా కలవర పరుస్తున్నాయి....ఎవరిని కదిలించినా గుండెలు పిండే నిజాలు వినిపిస్తున్నాయి.
అతి చిన్న వయసులో తన కళ్ళెదుటే అన్నం పళ్ళెం దగ్గర కూర్చున్న నాన్నని ప్రత్యర్ధులు కొట్టుకుంటూ లాకెళ్ళి చంపితే ఆడి పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని పగతో, ప్రతీకారంతో నింపుకున్న ఆ పసివాడి తనువు రగిలిపొకుండా ఉంటుందా!! ఏం చేసినా ఆ ముక్కుపచ్చలారని బాల్యాన్ని తిరిగి ఇవ్వగలమా!! అందరికన్నా చిన్నవాడయినా అన్ని తానే అయినా...చిన్నప్పటి కసిని తనతోనే పెంచుకున్నా, ఎన్నో మరణాల తరువాత ఇరుపక్షాలు వారి వారి హితులను సన్నిహితులను కోల్పోయిన తరువాత రాజి పడి తమ ఊరిని ఎంతో ఉన్నతంగా అందరికి ఆదర్శ ప్రాయంగా తిర్చిదిద్దుకున్నారు. కాలక్రమంలో ఇరువర్గాలు రాజకీయాల పరంగా వేరైనా అందరూ ప్రశాంతంగా వున్నట్లు వున్నారు మొన్నటి బలరాం హత్యోదంతం జరిగే వరకు.....ఎన్నో భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి కాని మూలకారణం డబ్బు, అధికారం కోసమే జరిగినట్లు నమ్మక తప్పదు.
స్క్రిప్టు ఓ పోలీస్ అధికారిది అయితే డబ్బు ఎర చూపి హత్యను జరిపించింది కొందరు బడా బాబులు. హత్య చేసిన వాడికి దొరికి పొతే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అని మొత్తం కధ, మాటలు, దర్సకత్వం పొలిసు అధికారిది, కొంత మంది నాయకుల అండ తో వున్న వారిది....తమకో జీవితాన్ని ఇచ్చి, తమ గూడేనికి ఎన్నో మంచి పనులు చేసిన మనిషిని, తన పెళ్ళాం పురిటికి, తరువాత ఇంట్లో శుభకార్యానికి డబ్బులు ఇస్తే వాడే కాలయముడై కాటేసాడు. ఇప్పటి వరకు ఆ ఊరిలో జరిగిన హత్యలలో అందరూ రెండు వర్గాలలోని వారే కాని గుడెపు వాళ్ళు కాదు మహా అయితే ఒక్కరో ఇద్దరో పొరపాటుగా చనిపోయి వుంటారు. అందరి దగ్గరా డబ్బులు తింటూ నమ్మకంగా వున్నట్లు నటిస్తూ ఇలా గొంతులు కోస్తున్నారు ఆ నరరూప రాక్షసులు...పెట్టి పోషించే వాళ్ళు వున్నంతకాలం ఇలా నమ్మక ద్రోహం చేస్తూనే వుంటారు..... తనకంటూ ఏమి ఉంచుకోకుండా, తన కుటుంబాన్ని అర్ధాంతరంగా అన్యాయం చేసి వెళ్ళి పోయిన బలరాం జీవితం ఎంత మందికి కనువిప్పు అవుతుంది? ఎప్పటినుంచో పాతుకు పోయిన పార్టీని నామరుపాల్లేని పార్టీగా చేసి కొత్త ఉరవడిని సృష్టించి గెలుపు బావుటా ఎగురవేసి తన ఊరిని ప్రగతి పదంలో ముందుకు నడిపించి అందరి మన్ననలు చూరగొన్న బలరాం ఈనాడు తనను వెన్నంటి నమ్మకంగా వున్న నమ్మకస్తుల చేతిలోనే హతమవ్వడం అందరికి తీరని లోటు.....
ఇప్పుడు చంపడానికి పెద్దగా ఎవరు కష్టపడనక్కర లేదు డబ్బులు వుంటే చాలు చాలా సింపుల్ గా స్పాట్ పెట్టించేయోచ్చు.......

10, జూన్ 2011, శుక్రవారం

అందని తీరాలలో....!!

అనుక్షణం కాలం పరుగెత్తి పోతూనే వుంది
నేను మాత్రం నువ్వు వదలి వెళ్ళిన చోటే ఉన్నాను....ఇప్పటికీ....
అందుకే నువ్వు నాతొ లేవు అన్న నిజం కుడా....
నాకు తెలియనంతగా నీతో మమేకమైన నేను....
నేనుగా లేక నువ్వు గానే మిగిలాను...
నీ జ్ఞాపకాలే ఊపిరిగా....నీ తలపులే ప్రాణవాయువులుగా...
నిరంతరం నను వెంటాడే నాలోని నువ్వే... నా శ్వాస!
నీతో వున్న ప్రతిక్షణమూ...పదిలమే నాకు....!!
దూరంగా ఉన్నా...చేరువుగా ఉన్నా... నా దగ్గరే నువ్వు.!!
కాని నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ అందనంత దూరమే!!
భలే విచిత్రం కదూ...!!

9, జూన్ 2011, గురువారం

ఓటమి అంటే భయం ఎందుకు???

ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయితో అన్నాడు "ఎనిమిది ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా?? " అని... కాని ఆ అమ్మాయికి అప్పటివరకు ఆ విష్యం తెలియదు. ఇక్కడ అర్ధం కాని విష్యం ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు ఆ విష్యం చెప్పకుండా ఎదుటివాళ్ళని అనడం ఎంతవరకు సబబు? అయినా మనం ప్రేమించినంత మాత్రాన వాళ్ళు కుడా మనని ఇష్టపడాలని లేదుకదా!! ఇంత చిన్న విష్యం అర్ధంకాక ఎన్నో చావులు, విరోదాలు....ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా!! కోరుకున్నవాళ్ళు దొరకలేదని మనకోసం ఉన్నవాళ్ళని ఏడిపిస్తూ, అడ్డదారులు తొక్కుతూ నీ మూలంగానే నేను ఇలా ఐపోయాను అనడం ఎంత వరకు కరక్ట్??
మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు. మనకు నచ్చిన దారిలో ముందు మనం ఒక్కరమే ఉంటాము... అయ్యో ఒక్కళ్ళమే కదా ఏమి చెయ్యలేమేమో అని అనుకుంటే ఈ రోజు ఓ మదర్ తెరీసానీ గాని, ఓ మాహాత్ముని గాని... ఇలా ఎంతోమంది గొప్పవారిని చూసి వుండేవాళ్ళము కాదు. ఎన్నో ప్రయోగాలు ఫలించక పోయినా నిరంతరం సాధన చేసి ఈ రోజు మన నిత్యావసరాలలో భాగమైన కరంట్ బల్బు, గ్రామ్ ఫోన్ లాంటివి ఎడిసన్ కనుక్కొగలిగేవారా!! పడిపోయామని అలానే వుండి పొతే అక్కడే ఉంటాము లేచి నిలబడి ఎందుకు పడిపోయామో చూసుకుని మళ్ళి మన పని మొదలు పెట్టడమే!! ప్రయత్నించకుండా ఏది మన దగ్గరకు రాదు. చేతనైతే దగ్గరకు తెచ్చుకోవాలి లేదా మనమే దాని దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. సాధన, సంకల్పబలం వుంటే అసాధ్యం కుడా సుసాధ్యం అవుతుంది . ఎందుకు విఫలమయ్యామని కాకుండా ఎందుకు సఫలం కాలేమని అనుక్కుంటే అన్ని మనవే....మొన్నటి ప్రపంచకప్ లా!! కలలు కనడం తప్పు కాదు వాటిని నిజం చేసుకోడానికి ప్రయత్నించక పోవడమే జీవితంలో మనం చేసే మొదటి తప్పు అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఓటమికి భయపడకుండా గెలవాలని తపన వుంటే అదే మన గెలుపుకి మొదటిమెట్టు అవుతుంది....విజయసోపానానికి బాటలు వేస్తుంది.

8, జూన్ 2011, బుధవారం

కల్పన నిజమైతే...!!

ఎప్పుడో దూరమైనా...నీ గురించిన తలపులే అనుక్షణం
నువ్వెక్కడ కనిపిస్తావా అని వెదుకులాటే నిరంతరం
నీకు ఒక్క సారైనా అనిపించిందా... 
నీకోసమే పరితపిస్తున్నానని...
అడుగులు ఎటు పడుతున్నా
 నీ దర్శనం అవుతుందేమో అని....
ఎంతమందిలోనైనా నువ్వు కనిపిస్తావేమో
అని ఆశగా చూసే కళ్ళకి....
నీ రూపం అపురూపంగా కనిపించి
ఈ నిరీక్షణ ఫలించి కల్పన నిజమైతే !!

3, జూన్ 2011, శుక్రవారం

ఓ అక్షర కుసుమాంజలి

అక్షరాలతో అందంగా పదాలు కూర్చి
సంధులు సమాసాలతో వాక్యాలు నింపి
శబ్దాలంకారాల శ్రావ్యతతోఅర్దాలంకారాల అర్ధాలతో అలంకరణ చేసి
గురులఘువుల గమకాలతో
ఉత్పలమాల చెంపకమాలల మాలలతో అంజలి ఘటించి
శార్దూల సింహాసనంపై మత్తకోకిల మంద గమనంలో
మత్తేభాల సంరక్షణలో సీస కంద వృక్షాల నీడలో
కొలువు దీరిన తెలుగుతల్లి కి ఓ అక్షర కుసుమాంజలి

31, మే 2011, మంగళవారం

ఓ చేదు నిజం!!

స్నేహితులైనా చుట్టాలైనా ఎవరైనా కానివ్వండి మనని నమ్మిన వారిని మోసం చేయడం, అన్యాయం చేయడం మాత్రం సమంజసం కాదు. మన స్వార్ధం కోసం ఎదుటివాళ్ళకు ఏదో ఒక మాట చెప్పి మన పబ్బం గడుపుకోవడం, మన అవసరాల కోసం ఎదుటి వాళ్ళను వాడుకోవడం సరియైన పద్దతి కాదు. మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మాటలు చెప్పడం కాదు నిలబెట్టుకోవడం కూడా తెలియాలి. స్నేహితుడు సన్నిహితుడు అని నమ్మి తన వాళ్ళను కాదని తన పరువు, ప్రతిష్ఠని స్నేహితునికి అప్పచెప్తే ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో పడవేసిన ఆ స్నేహితుని ఏ పేరుతొ పిలవాలి? పై పై మెరుగులుకానివ్వండి, వేరే ఏదైనా కానివ్వండి..నమ్మక ద్రోహం చేసిన ఆ స్వార్ధం మానవ విలువల మీద నమ్మకాన్ని కోల్పోయేటట్లు చేస్తోంది. తళుకు బెళుకులకు మోసపోయి మత్తు కమ్మిన మాయలో పడి మంచి చెడు లేకుండా ప్రాణ హితుడిని వంచన చేసిన పాపం ఊరికినే పోదు. నమ్మకంగా నమ్మినందుకు ఇంత విలువైన బహుమతిని కానుకగా ఇచ్చిన ఆ పెద్ద మనిషి అంటుంటాడు నేను చాలా చేసాను కాని... నన్ను పక్కన పెట్టారు అని ఇంకా చాలా చాలా రకరకాల అబద్దాలతో ఆ నమ్మిన స్నేహితుని ఇంట్లో కూడా చిచ్చు పెట్టడంలో సఫలీకృతుడు అయ్యాడేమో మరి?? నిజానిజాలు తెలిసి కూడా గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్న సామెత నిజం ఐంది కూడా!! ఓ వయ్యారిభామ కూడా తన వంతుగా చేతనైన సాయం చేసింది.....!! తన అకుంఠిత దీక్షతో తను అనుకున్నది సాధించింది. మొత్తానికి మరో పలనాటి చరిత్ర పునరావృతమైంది. నిజం కూడా మౌనంగానే ఉండిపోయింది ఏమి చేయలేక!!

29, మే 2011, ఆదివారం

మత్తు మాయ

ఆనందమైనా తాగుతాం!! బాధైనా తాగుతాం!!
తాగడానికో కారణం కావాలి ?? అంతే కదా!!
దానికి పగలు రాత్రి కుడా అవసరం లేదు.....
తాగితే మర్చిపోగలను కాని తాగలేను అని కొందరంటే
తాగితే మరచిపోగలను కాని తాగలేను అని కొందరంటారు....
ఊరికే సరదాగా రాయాలనిపించింది.....ఎవరినైనా బాధ పెడితే క్షమించండి...

26, మే 2011, గురువారం

ఆనాటి రోజులు....ఈనాటి విలువైన జ్ఞాపకాల దొంతరలు...

కొద్దిగా ఆలస్యంగా ఈ టపా రాస్తున్నందుకు అందరూ మన్నించాలి.....మే పదిహేనో తారిఖున అవనిగడ్డలోని మా శిశువిద్యామందిరం లో 1976 - 1983 ( 1st - 7 th) వరకు చదువుకున్న అందరమూ కలుసుకోవడం అస్సలు ఆ రోజు తలచుకుంటే చెప్పడానికి మాటలు కరువైపోతున్నాయి.
ఎపుడు తెల్లవారుతుందా అందరిని చూస్తామా అని ప్రతి ఒక్కరికి వుండే వుంటుంది. మరి ఎప్పుడో ముప్పై ఏళ్ల నాడు చూసుకున్న, చెప్పుకున్న కబుర్లు, చేసిన అల్లరి, చదివిన పాఠాలు ఇలా ఎన్నో చిన్ననాటి అనుభూతులు, మంచి నడవడి నేర్పిన మా గురువులను, బాల్య స్నేహితులను కలుసుకునే అదృష్టం జీవితంలో మాకు దక్కింది.
ఎలా వున్నావు? నువ్వు నువ్వేనా !! అస్సలు గుర్తు పట్టలేదు...నువ్వు కొద్దిగా కుడా మారలేదు.....ఏంటిరా హెడ్ మాస్టారితో ఇంగ్లీష్ టెన్సులు, లీవ్ లెటర్లు రాక తిన్న తన్నులు గుర్తు ఉన్నాయా!! పాఠం అప్ప చెప్పలేదని అమ్మాయిలతో కొట్టించిన చెంప దెబ్బలు గుర్తు ఉన్నాయా!! ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఎన్నో..ఎన్నెన్నో...!!
చిన్నప్పుడు ఆచారి మాస్టారు చెప్పిన సుమతి, వేమన పద్యాలు, పెద్దబాలశిక్ష, రాసిన అక్షరాలూ, విష్వక్సేనుడు లాంటి కష్టమైన పదాల డిక్టేషను పిరాట్ల గారు చెప్పిన శివలింగాష్టకం, దేశభక్తి గేయాలు, పెట్టిన క్విజ్జులు, నాగలక్ష్మి గారు చెప్పిన వెంకటేశ్వర సుప్రభాతం, మూడులోనే హిందీ అక్షరాలూ నేర్పిన ప్రమీలారాణి గారు, అందంగా బొమ్మలు వేయడమే కాకుండా పెద్ద జడతో అందంగా వుండే కమలా టీచర్ గారు నాకు గుర్తు వున్నంత వరకు అప్పట్లో ముందుగా డ్రాయింగ్ లో వెరిగుడ్ తరువాత మొదటి ఫైన్ పెట్టించుకున్నది నేనే(సీతాకోకచిలుక కి వచ్చింది లెండి). భూగోళము, ఆర్ధిక శాస్త్రమే కాకుండా పాటలు, డాన్సులు నేర్పిన శ్రీలత గారు, కూడికలు, తీసివేతలు, భాగహారాలు చెప్పిన రామలక్ష్మి గారు, ఎక్స్ వై లతో ఆల్జీబ్రా లో ఓనమాలు నేర్పిన ప్రసాద్ గారు, తరువాత మిగిలినవి చెప్పిన రత్తయ్య గారు ఈయన పి యస్ కుడా చెప్పినట్లు గుర్తు. గజేంద్ర మోక్షం తో పాటు, కృష్ణ శతకం, పంచంతంత్రం, సంస్కృతం, తెలుగు పాఠాలు చెప్పిన తెలుగు మాస్టారు....నాకు బాగా గుర్తు అందరూ హెడ్ మాస్టారితో బాగా దెబ్బలు తినే వాళ్ళు ఇంగ్లిష్ రాక. ఒకసారి జనవరి ఫస్ట్ న ప్రైవేట్ క్లాసు పెట్టి అందరిని కొట్టారు....నేను కుడా ఆ రోజు మాత్రమే దెబ్బలు తిన్నాను తొందరగా చదవలేదని కొట్టారు. తరువాత మేము అందరమూ అనుకున్నాము ఆయనకు ఆపిల్ ఇవ్వలేదని కొట్టారని....బాగా కోపంగా వుండే వారు. నాకు ఒక్క మార్కు తగ్గినా బాగా తిట్టేవారు మీకోసం వుండి చదివిస్తుంటే ఎందుకు తక్కువ వచ్చాయి అని. మీసాల మాస్టారి డ్రిల్ ఆయన హడావిడి అందరికి గుర్తు వుంటుంది. వసంతరావు గారు ఎన్ ఎస్ కి వచ్చేవారు ఒకసారి ఊపిరితిత్తుల బొమ్మ బోర్డ్ పై ఆయన వేస్తుంటే నేను బుక్ లో వేసాను నా బొమ్మ చాలా బాగా వచ్చింది ఆయన వేసినదానికన్నా... నువ్వే వేసావా!! మళ్ళి వెయ్యి అని వేయించారు. ఆయన తరువాత ప్రసాద్ గారు ఎన్ ఎస్ కి వచ్చేవారు. నాకు రింగ్ ఎడమ చేతితో ఆడటం వచ్చు కుడిచేతితో రాదు. మల్లీశ్వరి గారు ఆటకి నన్ను తీసుకోక పొతే రెండు రోజులలో కుడిచేతితో ఆడటం నేర్చుకున్నాను. వేరే స్కూలుకి వెళ్ళిపోయినా నాలుగూ ఐదు ఏళ్ళు రింగ్ లో నాదే మొదటి లేదా రెండో స్థానం. హెడ్ మాస్టారు సాయంత్రం పూట రోజు హనుమాంచాలిసా , భగవగ్దీత ఇంకా ఎన్నో నీతి పద్యాలు చదివించేవారు.
స్కూలు వార్షికోత్సవం చేయలేదని మా వీధిలో పిల్లలందరితో కలిసి అందరిని పిలిచి నాటకాలు, డాన్సులు, పాటలు వేయించి ఏదో భోజనాలు కుడా పెట్టించాము. ముందు భారతమాత నన్ను అని మళ్ళి వేరే అమ్మాయిని పెడతాము అంటే ఏడ్చాను కుడా!! మా వీధిలో పెద్దవాళ్ళు అందరూ వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని భలే పొగిడారు. మరి ఆరోజుల్లో కొరియోగ్రఫీ అంటే మాటలు కాదు. రెండు దాన్సులకి నేనే కొరియోగ్రఫీ చేసింది కుడా. మొత్తం ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసింది కుడా నేనే. మా టీచర్లని కుడా పిలిచాము....
అప్పట్లోనే ఆరువందలమంది పిల్లలు వుండేవారు మా స్కూలులో....గురువులు మనకు గుర్తు వుండటం గొప్ప కాదు.వారికి మనం గుర్తు వుండటం అనేది మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో!! మాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, సంఘం లో ఓ మంచి స్థానాన్ని కల్పించిన మా ఆచార్య దేవుళ్ళను ఏదో ఉడతాభక్తిగా సన్మానించుకునే అపురూప క్షణాలు, అందరికి నేను గుర్తు వున్నాను అని తెలిసిన ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ మరపురాని వెలకట్టలేని సంపదే!!
ఆ అనుభూతిని అనుభవించాలే కాని మాటలలో చెప్పడం నాకు రావడం లేదు ఇప్పటికీ.....నా మాట మన్నించి వచ్చిన అందరికి నా కృతజ్ఞతలు....మాకు ఈ మధురమైన అనుభూతిని మిగల్చడానికి ఈ ప్రోగ్రాం బాగా జరగడానికి ఎంతో కృషి చేసిన వారికి, దీనికోసం కొన్నిటిని వదులుకుని వచ్చిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

7, మే 2011, శనివారం

నాతొ నీవున్నా నీతో నేనున్నా...!!

కన్నుల్లో నీ రూపం....మాటల్లో నీ మౌనం....
పదే పదే పలకరించే నీ జ్ఞాపకం....!!!
వేడి గాలుపు వడగాలైనా...
చల్ల గాలి పిల్లతెమ్మెరైనా...
నీ తలపుల్లో మునిగిన నన్ను
సేదతీర్చేమలయమారుతమే!!
ప్రాణం పోతున్న చివరి క్షణం కుడా....
నీ ధ్యానమే స్వర్గ సోపానం!!
నింగిలో ఉన్నా నేల పై ఉన్నా
నీతో నేనున్నానన్న తలపే
పచ్చని సుతిమెత్తని పచ్చిక తిన్నెలపై
పారాడుతున్న అనుభూతి.....
నాతొ నీవున్నా నీతో నేనున్నా...
ప్రతిక్షణము మధురానందమే!!

5, మే 2011, గురువారం

కొత్త పెళ్లి కొడుకు అశోక్.....



ఈ రోజు పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకంలోని మొదటి పేజి లోనికి అడుగిడుతున్న అశోక్ జంట కి అభినందనలు....శుభాకాంక్షలు....
(బుజ్జి భ్రమరం బ్లాగరు అశోక్)

3, మే 2011, మంగళవారం

గమ్యం....ఎక్కడికో....??

ఏదో జరుగుతోంది.....అది ఏంటో మరి??
ఈ క్షణం నాది...మరుక్షణం ఎవరిదో....??
ఆనందమైనా...ఆహ్లాదమైనా....
కోపమైనా....దుఃఖమైనా....
అలుకైనా...అలసిపోవడమైనా...
గెలుపైనా...ఓటమైనా....
నిజమైనా...అబద్దమైనా...
ఏ బంధమైనా....ఏ బందుత్వమైనా...
జీవితం వున్న చివరి క్షణం వరకే....
ఆ తరువాత మజిలి ఎక్కడికో......!!

28, ఏప్రిల్ 2011, గురువారం

సత్యం సమాధి.....చేస్తారా???

మనిషిని సమాధి చేస్తారు...మంచినీ సమాధి చేస్తున్నారు....ఇప్పుడు సత్యాన్ని కూడ సమాధి చేసారు. ఎప్పటికీ ఎవ్వరు తెలుసుకోలేని ఒక గొప్ప సత్యాన్నిసమాధి చేశారు. ప్రపంచంలో ప్రతి జబ్బుకి మందు ఉంది ఒక్క డబ్బు అనే జబ్బుకి తప్ప!! అందుకే సాయి మరణించారు... ప్రేమతత్వం, సత్యం, శాంతి, శివమయం అనే నీతిభోధలు చేసే బాబా తన చుట్టూ పెరుగుతున్న డబ్బుజబ్బు, అధికారదాహం, వారసత్వం, కుళ్ళు, కుతంత్రాల గురించి తెలుసుకో లేక పోయారా?????
అవును అనాలో...కాదు అనాలో...లేక తెలిసినా ఏమి చేయలేక పోయారు అనుకోవాలో...అర్ధం కాని అయోమయస్థితిలో అయన భక్త కోటి ఉన్నారు.....
అసలు ఏంటి ఆ...సత్యం? ఎవరు సమాధి చేసారు? ఎవరి ప్రేమేయం ఎంత? మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, దేశాధినేతలు ఇంత మంది వచ్చారు....చూసారు....వెళ్లారు.
నిజ నిర్ధారణ చేయాల్సిన పని మాది కాదు అన్నట్లు ఉంది వారి పని తీరు..
మీడియా ప్రశ్నిస్తున్నా ఎవరు వినపడనట్లు ఉంటున్నారు, అన్ని సందేహాలు ప్రజలకే కానీ....ప్రభుత్వానికి కాదు అన్నట్లు ఉంది చూస్తుంటే.
మన రాష్ట్ర నాయకులకి ఉపఎన్నికల మీద ఉన్న శ్రద్ధ కోట్ల మంది భక్తుల దైవం ఐన సాయి మరణం పై ఉన్న సందేహాల మీద లేకుండా పోయిందా?
ఏమి జరిగింది అసలు?
ఎవరు చేశారు?
ఎలా చేశారు?
ఎందుకు చేశారు?
ఇవి సగటు ప్రజానీకానికి వస్తున్న ధర్మ నిలయంలో. ప్రశాంతి నిలయంలో ప్రశాంతి నిలయంలో సమాది చేసారు, అంతే ఇవి ఇంక ఎప్పటికీ సమాధానం లేని, దొరకని సందేహలేనా....?? అంటే అవును అనే చెప్పాలి.
దైవం అని చెప్పుకునే ఆశ్రమ పెద్దలే ఇలా శ్రీకాంత్ సాయంతో అసలు ఈ దైవత్వానికి ఉన్న శక్తి ఎంత? అసలు బాబా దేవుడే నా?? అయితే తనని తను కాపాడుకోలేక పోయరా? అసలు ఆ ఆశ్రమం లో ఉన్నది దైవత్వమ లేక ధనతత్వమా?
ఇవి మనసులో ఉన్నా...మాట ద్వారా బయటకి రాలేకపోతున్న ప్రశ్నలు.
ఒక మనిషి అదుపు చేయలేనంత సంపద ఆ మనిషి(దేవుడిని ఐన) నీ మరణశయ్య మీదకి తీసుకువెళుతుంది అని నిరూపించిన యుగం మన కలియుగం.

తరతరాలుగా
జరుగుతున్న సహజ ప్రక్రియే అయినా విన్న ప్రతిసారి ఏదో తెలియని కలత,కలవరం. ఒక మనిషికి అనుభవించలేనంత పేరుప్రతిష్టలు, ఆస్థిఅంతస్థులు వస్తే ఆఖరికి ఏమౌతుందో?? అందుకు నిదర్శనమే సత్యన్నారాయణరాజు అలియాస్ సత్యసాయిబాబా జీవితం. మహిమలు, ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యాలయాలు....ఇలా పలురకాలుగా జనంలోకి చొచ్చుకుని పోయిన సత్యసాయి తన ఉపన్యాసాలతో దేశీయులనే కాక విదేశీయులను సైతం తన వాక్చాతుర్యంతో తన భక్తులుగా చేసుకున్నారు, ఎనలేని సంపదలను గడించారు. ఆఖరికి అవసాన దశలో తన చుట్టూ ఉన్న వారి చేతిలో కీలుబొమ్మగా మారారు. బతికి ఉండగానే శవపేఠికను సిద్ధం చేసి సాయిని గురించి, ఆయన ఆరోగ్యాన్ని గురించి పలురకాల అనుమానాలకు తావిచ్చిన ట్రస్టు సభ్యులు, కుటుంబసభ్యులు, అధికార ప్రముఖులు ఎందుకు పారదర్శకంగా లేరు అన్నదానికి సమాధానం లేదు ఇప్పటికీ...!!
దైవ సమానుడని, దివ్య మహిమలు వున్నవాడని నమ్మిన ఎంతోమంది భక్తులకు చివరి దశలో ఏమి జరిగింది?? అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది. ఆస్థులకోసమే ఆనాడు చిన్నారి వైష్ణవి కాలి బూడిద అయింది. ఈనాడు దైవస్వరూపుడు కీలుబొమ్మైనాడు. సత్యసాయి సత్యం సమాధైంది....మరొక్కసారి చరిత్ర పునరావృతమైంది.....ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల్లో నిజమెంతో ఈపాటికి మనకి అర్ధమైవుండాలి....
ప్రశాంతి నిలయంలో అశాంతి పాలైన మహా మనీషి ఆత్మకి మనశ్శాంతి సిద్దించాలని దైవాత్మ శివైఖ్యం కావాలని కోరుకుంటూ.....
(శ్రీకాంత్ సాయంతో.....)
అన్నట్టు చెప్పడం మరిచానండోయ్ ఇది నా రెండువందల టపా!! రాతలను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికి కృతజ్ఞతాపూర్వక వందనాలు......
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner